Friday, April 18, 2025

పుస్తక విక్రేతల్లో "హిగ్గిన్ బాథంస్" చరిత్ర ప్రత్యేకమైనది

పుస్తక విక్రేతల్లో "హిగ్గిన్ బాథంస్" చరిత్ర ప్రత్యేకమైనది

-----------------------------------------------------------------------

 ఒకానొక సమయం లో రైల్వేస్టేషన్ లో ఉన్న హిగ్గిన్ బాథంస్ లో పుస్తకం కొనడం అనేది మరిచిపోలేని అనుభూతి. ఎన్నో దేశ,విదేశ పత్రికలు ఇంకా రకరకాల పుస్తకాలు పాఠకుల్ని రారమ్మని పిలుస్తుండేవి. ఇంచుమించు ప్రతి ప్రముఖ రైల్వే స్టేషన్ లో హిగ్గిన్ బాథంస్ వారికి షాపు ఉండేది. ఆ అక్షరాల్ని చదవడం లోనే ఓ ఆనందం ఉండేది. నిజానికి హిగ్గిన్ బాథంస్ అనేది ఓ బ్రిటీష్ వ్యాపారి పేరు. ఆయన అసలు ఎప్పుడు,ఏ పరిస్థితుల్లో ఆ బుక్ స్టోర్స్ ని స్థాపించి దాన్ని అంచెలంచెలుగా విస్తరించాడు అనేది తెలుసుకుందాం.

హిగ్గిన్ బాథంస్ అసలు పేరు ఏబుల్ జాషువ హిగ్గిన్ బాథంస్. లండన్ లో బయలు దేరి చెన్నయ్ వచ్చే ఒక ఓడ లో దాక్కుని భారత దేశం లో దిగాడు. ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామని ప్రయత్నించగా మిషనరీస్ నడిపే ఓ పుస్తకాల షాపు లో పని దొరికింది.అది 1840 వ సంవత్సరం. భారత దేశం లో అతి పాత బుక్ స్టోర్ అది. దాన్ని ప్రీమియర్ బుక్ షాప్ ఆఫ్ మెడ్రాస్ అని పిలిచేవారు. ఆ పుస్తకాల షాపు కి నష్టాలు వచ్చి మూసివేసే స్థితి లో హిగ్గిన్ బాథంస్ దాన్ని 1844 లో తక్కువ ధర కి కొన్నాడు. ఆ తర్వాత పుస్తకాల్ని ముద్రించి అమ్మడం, స్టేషనరీ సామాను అమ్మడం లాంటివి చేయడం తో ఆ షాపు లాభాల బాట పట్టింది.

పుస్తకాల షాపు కి ప్రముఖుల్ని ఆహ్వానించేవాడు. బ్రిటీష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ, మైసూర్ మహారాజా,ఇంకా ఇతర ప్రముఖులు వచ్చి యూరప్ లో రిలీజ్ అయిన పుస్తకాల్ని వెంటనే ఇక్కడ కొనే ఏర్పాటు చేసేవాడు. తన షాపు కి అలా మంచి పబ్లిసిటీ వచ్చేలా చూసుకునేవాడు.దానితో భారతీయ ఉన్నత వర్గాల వారు కూడా మౌంట్ రోడ్ (చెన్నై) లో ఉన్న ఆ షాపు లో పుస్తకాలు కొనడం ఓ ప్రిస్టేజ్ గా భావించేవారు. 1858 లో భారతదేశ పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ రాణి చేతిలోకి వెళ్ళింది. దానికి సంబందించిన అధికారపత్రాన్ని ఇంగ్లీష్ లోనూ, తమిళ్ లోనూ ముద్రించి పాఠకులందరికీ హిగ్గిన్ బాథంస్ ఉచితంగా పంచిపెట్టాడు. 

   దానితో ఆనాటి అధికార వర్గాల్లో మంచి పేరు సంపాదించుకున్న హిగ్గిన్ బాథంస్ బ్రిటీష్ రాచ కుటుంబాల వారికి అఫీషియల్ బుక్ సెల్లర్ గా ప్రకటించబడ్డాడు. అంతేగాక ప్రసిద్ది చెందిన కన్నెమెర లైబ్రరీ కి బుక్ సప్లయర్ గా మారిపోయాడు. ఆ తర్వాత మొట్టమొదటి బుక్ స్టోర్స్ చైన్ ని స్థాపించాలనే ఉద్దేశ్యం తో దక్షిణ భారత దేశం లోని చాలా ప్రముఖ రైల్వే స్టేషన్ లలో హిగ్గిన్ బాథంస్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతని కుమారుడు వాటిని ఇంకా అభివృద్ది లోకి తీసుకురావడం జరిగింది. బెంగళూరు లోని మొదటి పుస్తకాల షాపు ని కూడా ఈ సంస్థ వారే స్థాపించారు. 1929 కల్లా మొత్తం 400 మంది ఉద్యోగులు పనిచేస్తుండేవారు.

లార్డ్ మెకాలే కి ఒక బ్రిటీష్ మిత్రుడు ఇలా రాశాడు." మౌంట్ రోడ్ లో ఉన్న హిగ్గిన్ బాథంస్ బుక్ షాప్ కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం.మన యూరప్ లో విడుదల అయిన ప్రతి ప్రముఖ పుస్తకాన్ని ఇక్కడకి వెంటనే తెప్పిస్తారు.సోక్రటీస్,ప్లేటో,షిల్లర్,గేథే లాంటి తత్వవేత్తల రచనలు ఎన్నో లభ్యమవుతాయి. అంతేకాదు, విక్టర్ హ్యూగో రచించిన తాజా పుస్తకాన్ని నేను ఇక్కడే కొన్నాను." అంటూ ప్రస్తుతించాడు.

అయితే 1925 లో ఈ హిగ్గిన్ బాథంస్ గ్రూప్ ని స్పెన్సర్ గ్రూప్ కొనుగోలు చేసింది. మళ్ళీ చేతులు మారి అనంత కృష్ణన్ కి చెందిన అమాల్గమేషన్ గ్రూప్ కి సొంతమయింది. 1990 దాకా కూడా హిగ్గిన్ బాథంస్ పెద్ద బుక్ స్టోర్స్ చైన్ గానే ఉండింది. ప్రస్తుతం కేవలం 22 బుక్ షాప్ లు మాత్రమే దక్షిణ భారతదేశం లో నడుస్తున్నాయి. అమేజాన్ లాంటి దిగ్గజాలు కోరుకున్న పుస్తకాన్ని ఇంటివద్దకే చేరుస్తున్న ఈ తరుణం లో హిగ్గిన్ బాథంస్ ఒకప్పటి ప్రతిష్ఠ కొంత మసక బారిందనే చెప్పాలి. పుస్తకాల విక్రయం గురించి ఎవరు రాసినా హిగ్గిన్ బాథంస్ కి ఉన్న చరిత్ర కొన్ని పేజీల్లో తప్పక రాయవలసిందే!

----- మూర్తి కెవివిఎస్      



In Nirbhaya Vaarta Daily (18-4-2025)


        


No comments:

Post a Comment