Thursday, July 24, 2025

షింటో మతం యొక్క ప్రత్యేకతలు ఎన్నెన్నో !


షింటో మతం యొక్క ప్రత్యేకతలు ఎన్నెన్నో !

-----------------------------------------------------------

 జపాన్ లో చాలామంది అనుసరించే మతం ఏమిటి అంటే చటుక్కున షింటో మతం అని చెబుతారు. నిజమే దాదాపు 70 శాతం పైగా జపనీయులు ఆ విశ్వాసులే కానీ ఆ మతం యొక్క స్వరూపం మనకి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ప్రత్యేకించి ఆ మతాన్ని స్థాపించిన వారు అంటూ ఎవరూ లేరు. అలాగే ప్రత్యేక గ్రంథం అంటూ ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఆ మతం అక్కడ ఎలా మనగలిగింది అనే సందేహం రాక మానదు. అయితే దానిలో పూజలు ఉన్నాయి. రకరకాల తంతులు ఉన్నాయి.పండుగలు ఉన్నాయి.నిజానికి జపాన్ యొక్క సాంస్కృతిక,నైతిక జీవన విలువలు అన్నీ కూడా షింటో మతమే ప్రభావితం చేసింది అంటే అతిశయోక్తి కాదు.

ఇంతా చేసీ ప్రధాన దైవం అంటూ చెప్పడానికి ఎవరూ లేరు. ప్రకృతి లోని ప్రతి చెట్టు,నది,పర్వతం ఇలా ప్రతి దానిలోనూ మనిషి లో ఉన్నట్లే ఆత్మ ఉన్నది.మనిషి పోయిన తర్వాత శరీరం లోని సూక్ష్మశక్తి పై లోకాలకి చేరినట్లే , విశ్వం లోని ప్రతిది ఇక్కడ నాశనమైనప్పటికి వాటిలో ఉన్నది కూడా ఆ లోకాలకి చేరుతుంది. ఆ లోకాన్నే "కామి" (Kami) అంటారు.అదే జపనీయుల ఆరాధ్య దైవం. తమ పూర్వికులు కూడా అక్కడే ఉంటారని భావిస్తారు. ఈ కామి అనే పదాన్ని వారు బహువచనం లో కూడా వాడతారు. ఈ ఆత్మ లోకం లో స్వర్గం,నరకం అంటూ ఏమీ ఉండవు. ప్రతి మనిషి స్వతహాగా మంచివాడే అయినప్పటికీ కొన్ని దుష్ట ఆత్మలు అతడిని  చెడ్డవాడు అయ్యేలా ప్రేరేపిస్తాయని నమ్ముతారు.

జింజా అనేది షింటో మతం లో ఆలయం. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. ఇంటిలో నిర్మించుకునేదాన్ని కామిడన అంటారు. అలాగే కుటుంబం మొత్తానికి కలిపి ఒకటి ఇంకా సామూహికంగా అందరకీ కలిపి జింజా అనేది ఉంటుంది. జనాలు ఎవరైనా మూడవ ఆలయానికి వెళ్ళవచ్చు. లోపలికి వెళ్ళి దక్షిణ వేసి,గంట కొట్టాలి. ఆ తర్వాత గౌరవంగా వంగి కాసేపు ప్రార్థిస్తారు.కామి విశ్వాసం ప్రకారం శుభ్రత,నిజాయితీ,కష్టపడి పనిచేయడం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. షింటో మత నమ్మకాలన్నీ కాలక్రమం లో ఒక్కొక్కటిగా చేరి రాయబడని శాసనాలుగా మిగిలిపోయాయి. క్రీ.పూ.300 ఏళ్ళ నుంచి ఈ షింటో మతం జపాన్ లో ఉన్నది.

అయితే విచిత్రం గా బౌద్ధ మతం క్రీ.శ.6 శతాబ్దం లో జపాన్ లోకి ప్రవేశించి షింటోమతం తో పడుగూ పేక లా కలిసిపోయింది. తనదైన తాత్విక విచారణ ను ప్రసరింపజేసి దానిలోని కొన్ని లోటుపాట్లను తీర్చింది. చాలా షింటో ఆలయాల్లో బుద్ధుని విగ్రహం కూడా ఓ చోట ఉంటుంది.1868 నుంచి 1912 దాకా జపాన్ ని పాలించిన మైజీ వంశానికి చెందిన చక్రవర్తి తమ దేశం లోని ఆలయాల్లో బుద్ధుని విగ్రహాలు ఎందుకు అని తొలగించాడు. అయితే ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించలేదు. మళ్ళీ ఆయన విగ్రహాలు పెట్టడం ప్రారభించారు. షింటో మతాన్ని ఆచరించే ప్రతివారు మరణాంతరం చేసే కార్యక్రమాల్ని బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ చేయాలని నిర్ణయించారు. అందుకే జపాన్ లో ఒక సామెత పుట్టింది, షింటో మతం లో పుట్టిన ప్రతివ్యక్తి బౌద్ధ మతం లో కన్నుమూస్తాడని..!          

      "కామి" విశ్వాసం ప్రకారం మూడు రకాల పూజ్యులు ఉన్నారు.పై లోకం లో ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళు, ఇంకా అసంఖ్యాక పూర్వికుల ఆత్మలు. బాన్ అనేది పెద్ద పండుగ.ఆ రోజు పూర్వికుల ఆత్మలు భూమి పైకి వస్తాయని నమ్ముతారు. అప్పుడు రకరకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. షింటో ఆలయాల్లో పూజలు నిర్వహించే వారిని కనూషి అని పిలుస్తారు. జపాన్ లో ఉన్న రమారమి లక్షకి పైగా జింజా లు (ఆలయాలు) వారసత్వం గా వారి చేతి లోనే ఉండేవి. దాదాపు వంద తరాల నుంచి స్వంత జింజా లు ఉన్న కుటుంబాలు ఈనాటికి జపాన్ లో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వారసత్వ హక్కుల్ని రద్దు పరిచారు.

 షింటో మతం అనేక ఉప వర్గాలుగా కాలక్రమేణా విడిపోయినప్పటికీ దాని ప్రధాన సిద్ధాంతం మటుకు ప్రకృతి లోని, పూర్వికుల లోని ఆత్మ శక్తిని పూజించడమే! జపాన్ లో ఒక సగటు షింటో విశ్వాసిని,మీదే మతం అంటే నాది షింటో మతం అని చెప్పకపోవచ్చు. అసలు తాను ఓ మతాన్ని అనుసరిస్తున్నానే స్పృహ కూడా లేకుండా తమ పూజలు తాము చేసుకుంటూ పోతారు. అందుకే మనకి జపాన్ గణాంకాల్లో మతం ని వెల్లడించని వారి సంఖ్య కూడా బాగా కనబడుతుంది.


----- మూర్తి కెవివిఎస్ (7893541003) 




2 comments:

  1. బాగుంది . ఒక మతం గురించి కొత్త సంగతులు తెలిశా యి .

    ReplyDelete