అలనాటి బెంగాలీ, ఒరియా సమాజాల దర్పణం ఈ ఆత్మకథ
-------------------------------------------------------------------------------
గోపీనాథ్ మొహంతి. ఈ పేరు వినగానే చాలామంది సాహితీపిపాసులు ఆయన ఒక గొప్ప నవలాకారుడని చెబుతారు. మౌలికంగా ఆయన ఒరియా భాష లో రాసినప్పటికీ అమృత సంతానం,పరజ వంటి నవలలు తెలుగు లోకి కూడా అనువాదం కావడం తో వాటికి ఎనలేని ఖ్యాతి కలిగింది. ముఖ్యంగా ఆయన కోంధ ఆదివాసి తెగ ఆలంబనగా రాసిన అమృత సంతానం భారతీయ సాహిత్య చరిత్ర లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
1955 లో ఆ నవలకి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఆ తర్వాత అది ఇంగ్లీష్ లోకి ఇంకా ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడింది. అలాగే మటి మటాల అనే ఒరియా నవల కి జ్ఞానపీఠ పురస్కారం వరించింది. నవలలు, కథలు,వ్యాసాలు విరివిగా రాశారు. తన చివరి దినాల్లో అమెరికా లోని సాన్ జోస్ యూనివర్శిటీ లో ఆంథ్రోపాలజీ పాఠాలు చెబుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు.
అయన 1914 లో కటక్ ప్రక్కనే ఉన్న నాగావళి అనే గ్రామం లో జన్మించి 1991 లో అమెరికా లోని సాన్ జోస్ లో మరణించారు. గోపీనాథ్ మొహంతి తన జీవిత కాలం లో ఇంచుమించు విద్యార్థి దశనుంచి తాను మరణించే వరకు డైరీ రాసుకున్నారు. వాటన్నిటినీ కలిపి ఆయన ఆత్మకథ గా ఒరియా భాష లో గ్రంథ రూపం లో తీసుకొచ్చారు. ఆ తరువాత విస్తృతం గా ఇతర భాషల్లో కూడా ఉన్న ఆయన అభిమానుల కోసం ఇంగ్లీష్ లో కూడా అనువాదం చేశారు.
మొదటి భాగం పేరు srotaswati (The Flowing stream) అనువాదకురాలి పేరు సుధేష్ణ మొహంతి. గోపీనాథ్ మొహంతి తను బతికిఉన్న రోజుల్లో తన ఆత్మ కథ కి సంబంధించి వారసులకి కొన్ని కండీషన్లు పెట్టారుట. ఒకటి తను పోయిన తర్వాతనే దాన్ని ప్రచురించాలి, అలాగే టైటిల్ ని స్రోతస్వతి అని ఉంచాలి, అలాగే అట్ట మీద తాను వేణువు వాయిస్తున్న ఫోటో ని ముద్రించాలి అంటూ ఆయన పెట్టిన షరతులన్నిటినీ వారసులు తుచ తప్పకుండా పాటించారు.
ఈ గోపీనాథ్ మొహంతి గారి ఆత్మ కథ వల్ల మనకి చాలా విషయాలు, ముఖ్యంగా , దేశం స్వేఛ్చా వాయువులు పీల్చక ముందు తూర్పు దిశలో ఉన్న భారతీయ సమాజం ఎలా ఉండేది అనేది చక్కగా తెలుస్తుంది. తాను రచయిత గా, ఆలోచనాపరునిగా ఎదగడం లో తన చుట్టు పక్కన ఉన్న ప్రజలు ఎలా సహకరించారు అనేది చెబుతూనే తాను ఎదుర్కున్న విభిన్న సాంఘిక సంఘర్షణల్ని మన కళ్ళ ముందు ఉంచుతారు. కటక్ ప్రక్కనే గల నాగావళి అనే గ్రామం లో జన్మించిన గోపీనాథ్ ఆరేడు ఏళ్ళ వరకు పాఠశాల కి వెళ్ళలేదు. ఇంటిదగ్గరే అక్షరాలు నేర్చుకున్నాడు.
అప్పట్లో బీహార్ ,ఒరిస్సా,బెంగాల్ అంటూ ప్రత్యేకం గా లేవు. సంస్థానాలు ఉండేవి. తనతండ్రి సోనే పూర్ మహారాజా ఆస్థానం లో పనిచేస్తు అనారోగ్యం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామానికి వచ్చేయడం తో చాలా బాధలు పడతారు. కుటుంబ దీనస్థితి చూసి మళ్ళీ ఆయన ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవడం తో 58 వ యేట సర్వేయర్ గా ఉద్యోగం వస్తుంది.
నాగాబళి నుంచి సోనే పూర్ అక్కడ నుంచి ప్రస్తుత పాట్నా కి మకాం మారుతుంది. పాట్నా లో గోపీనాథ్ యొక్క పెద్దన్నయ్య చిరుద్యోగి. తండ్రి మరణించిన తరువాత పాట్నా లోనే ఎక్కువ కాలం ఉంటాడు. అప్పటి పాట్నా విశాలమైన రోడ్లతో,ప్రణాళికాబద్ధమైన నివాసాలతో , మంచి విద్యాలయాలతో ఉండేదని వివరిస్తాడాయన. కటక్ నుంచి పాట్నా వెళ్ళడానికి మూడు రైళ్ళు మారవలసి ఉండేదని చెబుతారు.
బెంగాలీ వాళ్ళు ఎక్కువ గా ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా ఉంటూ వారి ప్రత్యేకతని చూపించేవారు. వాళ్ళలో ప్రతి కుటుంబం లోనూ కలకత్తా నుంచి వచ్చే సాహిత్య, సామాజిక పత్రికలు కనిపించేవి. పెద్దలూ పిన్నలూ వాటిని చదువుతూ ముచ్చటించుకునేవారు. మరి తమ ఒరియా ప్రజలు ఎందుకని పాట్నా లో ఇంతమంది ఉన్నా అలాంటి పత్రికల్ని తెప్పించరు అని గోపీ నాథ్ కి ఆలోచన వచ్చేది.
రబీంద్ర నాథ్ ఠాగోర్, శరత్ చంద్ర, బంకీం బాబు ఇలా ఎంతోమంది ప్రసిద్ధ రచయితలు ఒక డజన్ పైగా బెంగాలీ లో ఉన్నారు. మరి ఆ విధంగా ఒరియా లో ఎవరైనా ఉన్నారా అని తన బెంగాలీ క్లాస్ మేట్ యొక్క తల్లి అడిగినప్పుడు గోపీ నాథ్ తనకి తెలిసిన సరళా దాస్, బలరాం దాస్ వంటి పూర్వ కాలం కవుల పేర్లు చెబుతాడు. వాళ్ళందరూ రామాయణ,మహా భారతాల్ని అనువదించిన పూర్వ కాలం వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రతి భాష లోనూ ఉన్నారు.
నేను అడిగేది సమకాలీన రచయితల గురించి అని ఆమె అనడం తో గోపీనాథ్ మిన్నకుండి పోతాడు. ఇలాంటి కొన్ని సన్నివేశాలు అతని లో ఒరియా సాహిత్యం పట్ల అనురక్తిని పుట్టిస్తాయి. తమ భాష ని, రచయితలని గర్వంగా చెప్పలేని ఏ సమాజానికి గౌరవం ఉండదు. ప్రపంచం లోని ప్రతి గొప్ప జాతి చరిత్ర లో గొప్ప సాహిత్యకారులున్నారు అనేది నాకు క్రమేపి అర్థమయింది అని గోపీనాథ్ అంటారు.
పాట్నా లోని ఆయన స్కూల్ జీవితం నాటి విద్యా వ్యవస్థ యొక్క తీరు తెన్నుల్ని తెలియపరుస్థుంది. ఒక వైపు ఒరియా సాహిత్యాన్ని, మరో వైపు ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుతూ ఉపాధ్యాయులకి ప్రీతిపాత్రుడవుతాడు. విద్యాధికారి గా ఉన్న ఓ బ్రిటీష్ జాతీయుడు వీరి స్కూల్ ని సందర్శించినప్పుడు గోపీనాథ్, షేక్స్ పియర్ నాటకాల్ని వర్ణించిన తీరు ని చూసి ప్రత్యేకంగా రెండు రోజులు సెలవు మంజూరు చేస్తాడు.
పాట్నా నుంచి కటక్ తిరిగివచ్చిన తరువాత ఆ ప్రాంతానికి, ఒరియా సమాజానికి ఉన్న తేడాల్ని గమనించిన విధానం ఎంతో లోతు గా ఉంటుంది. బెంగాలీ లు తమ ఆధిపత్య వైఖరి తో ఒరియా ప్రాంతానికి చెందిన జయదేవుడిని, చైతన్య మహా ప్రభువుని ఇంకా ఇతరుల్ని తమ వారిగా ప్రచారం చేసుకోవడాన్ని దీనిలో తీవ్రంగా ఖండించాడు. అలనాటి ఎన్నో సామాజిక,సాంస్కృతిక విషయాల్ని మనం తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.
--- మూర్తి కె.వి.వి.ఎస్ (78935 41003)
No comments:
Post a Comment