ఆత్మాన్వేషణ లో ఓ భాగం - హెర్మన్ హెస్సి నవల సిద్ధార్థ
--------------------------------------------------------------------------
జర్మన్ రచయిత హెర్మన్ హెస్సి 1922 ప్రాంతం లో వెలువరించిన "సిద్ధార్థ" నవల అదే పేరు తో ఆంగ్లం లో కూడా అనువదింపబడటం తో చదివే అవకాశం దొరికింది. హెర్మన్ హెస్సి ని జర్మన్ స్విస్ రచయిత గా తరచూ ఉటంకిస్తుంటారు. తను జర్మనీ లో పుట్టినప్పటికి తల్లి వైపు మూలాలు స్విజర్ లాండ్ లో ఉండటం, చివరి దశలో అదే దేశం లో చనిపోవడం వల్ల అలా భావించడం లో తప్పులేదు. కానీ ఆయన రచనా వ్యాసంగం అంతా జర్మన్ భాష లోనే సాగింది. ఏ యూరోపియన్ భాష లో ఎన్నదగిన రచన వచ్చినా అది శరవేగం తో ఇంగ్లీష్ లోకి ఇతర ప్రపంచ భాషల్లోకి అనువాదమైపోతుంది.
సిద్ధార్థ అనే ఈ నవల పేరు చూసి ఇది బుద్ధుని గురించి రాసింది అనుకుంటే పొరబాటు. పైగా కవర్ మీద బుద్ధుని బొమ్మ కూడా ఉంది గదా. అయితే బుద్ధుని పాత్ర ఉంటుంది. కథానాయకుడైన సిద్ధార్థ తన పరివ్రాజక జీవితం లో ఒకసారి బుద్ధుడిని చూస్తాడు. అతని అనుయాయులతో కూడా మాట్లాడుతాడు. అంతే. ఈ నవల లో మరెక్కడా బుద్ధుడు మనకి కనిపించడు. కాని ఆయన బోధనలు ఆనాటి ప్రజల్లో కలిగించిన ప్రభావాన్ని మనం అనుభూతి పొందుతాము. అదీ వివిధ పాత్రల ద్వారా మాత్రమే.
సిద్ధార్థ ఒక బ్రాహ్మణ యువకుడు. చిన్నతనం నుంచి పూజాదికాలు ఇతర వైదిక కార్యక్రమాల్లో కాలం గడుపుతుంటాడు. తన జీవితం లో ఏదో వెలితి. అసలైన జ్ఞానకాంతి తన లో ప్రవేశించలేదని , ఇంకా ఏదో నేర్చుకోవాలి అని అరణ్యం లో కి వెళ్ళి సమానులతో కలిసిపోతాడు. సమానులు అనే మాటకి భౌతిక జీవితాన్ని నిర్జించి అన్వేషణ లో సన్యాసి గా మారినవారు అని ఈ పుస్తకం లోని అర్థం. Samana అని ఇంగ్లీష్ లో రాశారు. కొన్ని ఏళ్ళు ఉన్న తర్వాత సిద్ధార్థ కి ఇంకా అసంతృప్తి పెరుగుతుంది. ఇది తన దారి కాదు అనిపిస్తుంది. అయితే వాళ్ళతో ఉన్నప్పుడు కొన్ని విద్యలు నేర్చుకుంటాడు.
తనతో పాటు గోవింద అనే మిత్రుడు కూడా ఉంటాడు. ఓసారి గౌతముడి ని (అంటే బుద్ధుడిని) ఇద్దరూ చూస్తారు. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు,ఈ ఇద్దరూ గొప్ప గౌరవం తో ఆయన ని ఆలకిస్తారు. గోవింద ఆ బౌద్ధ సన్యాసులతో ఉండిపోతాడు. కాని సిద్ధార్థ మాత్రం లేదు లేదు నేను ముందుకి సాగిపోతాను. నేను తెలుసుకోవలసింది ఇంకా ఏదో ఉంది అని వెళ్ళిపోతాడు. అలా తను నడిచి నడిచి ఓ పట్టణానికి చేరుకుంటాడు. అక్కడ కమల అనే వేశ్య ని చూస్తాడు. ఆమె చాలా ధనవంతురాలు.రాజాస్థానం లో ఉంటుంది. సిద్ధార్థ తనకి ప్రేమ విద్య ని నేర్పించమని కోరుతాడు.
ఆమె నవ్వి నీ లాంటి సన్యాసుల్ని నా ఇంటి లోకి కూడా రానివ్వను. అయినా నీలో ఏదో ఉంది. నేర్పించుతాను గాని ముందు నువ్వు ధనం సంపాదించడం నేర్చుకో. మంచి వస్త్రాలతో దర్జాగా నా వద్దకి రా,అప్పుడు చూస్తాను అంటుంది కమల. కామస్వామి అనే వర్తకుడి దగ్గర సహాయకుని గా నియమిస్తుంది. వ్యాపారం జరిగే పద్దతి ని , మనుషుల ప్రవర్తన ని గమనిస్తూ మనుషులకి వయసు పెరిగినా మనసు లో పెద్దగా పరిణామం జరగట్లేదని చిన్నపిల్ల ల చేష్టలే అని భావిస్తుంటాడు.నష్టానికి విపరీతంగా కుంగి పోవడం,లాభానికి విపరీతంగా పొంగిపోవడం వింత గా అనిపిస్తుంది.తను సమానులతో ఉండి అన్ని పరిస్థితుల్లోనూ మధ్యేమార్గంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు.
కామస్వామి తో ఇదే అంటాడు. మనిషి అలా అనుభూతి చెందకపోతే ఎలా బ్రతకగలడు..అని ఆ కామస్వామి ఒక మాటంటాడు. నీకు నా ఆస్తి లో పావు భాగం ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించు .. నీ తెలివి తో లాభాలు తెస్తావా ..లేదా పోగొడతావా .. నీ ఇష్టం ..అని ఆ విధంగానే రాసిస్తాడు. మొదట్లో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా వ్యాపారం చేసినా పోను పోనూ ఒక అసలు సిసలు వ్యాపారి లా మారిపోతాడు సిద్ధార్థ. నష్టం వచ్చినపుడు కసి గా లాభాలు సంపాదించడం,లాభాలు రాగానే బాగా ఆనందించడం మొదలవుతుంది. కమల దగ్గర కి వెళతాడు. ఆమె కూడా ఇతనికి ప్రియురాలిగా మారిపోతుంది. ప్రేమ లో పట్లు అన్నీ నేర్పిస్తుంది.
ఇవన్నీ చేస్తూనే తన మనసు ని , దాని మార్పుల్ని వేరే మనిషి లా గమనిస్తుంటాడు. తాగుడు, జూదం కూడా మొదలవుతుంది. చివరకి ఉన్న ఆస్తి అంతా పోయి బికారి అవుతాడు. మిత్రులు అనుకున్న వాళ్ళు కూడా ఎవరూ అప్పు కూడా ఇవ్వరు. అసలు తన మొదటి స్థితి ఇదేగా ..ఎందుకు అనుకోవడం అని ఎంత సముదాయించుకున్నా బాధ ఆగదు. ఆత్మహత్య చేసుకోవాలని నది దగ్గర కి వెళతాడు. అక్కడ పడవ నడిపే వాసుదేవ అనే వ్యక్తి రక్షించి చేరదీస్తాడు. అతను నది ఒడ్డున ఒంటరిగా చిన్న గుడిసె లో నివసిస్తుంటాడు.
తనూ అక్కడే కాలం గడుపుతూ , వాసుదేవ సాంగత్యం లో , ప్రకృతి ని, ముఖ్యంగా ఆ నది ని ఆస్వాదిస్తూ ,మాట్లాడుతూ ఏ విధంగా తను ఇన్నాళ్ళ నుంచి వెతుకులాడుతున్నాడో ఆ జ్ఞానాన్ని పొందుతాడు. నవల లోని చాలా పేరాలు సింబాలిక్ గా , ఒక్కొక్క జీవితపు పొర ని రకరకాల సంఘటనల ద్వారా చూపిస్తూ లోతైన అర్ధాన్ని ఈ నవల ద్వారా రచయిత నర్మగర్భంగా వివరించాడు. బౌద్ధ ధర్మాన్ని, వేదాంత ధోరణుల్ని హెర్మన్ హెస్సి బాగా చదివేడనే ఆలోచన మనకి స్ఫురిస్తుంది. కమల ద్వారా కలిగిన కొడుకు సిద్ధార్థ ని కలవడం ఆ తర్వాత జరిగే సన్నివేశాలు మెలోడ్రామా ని తలపిస్తాయి.
ఈ నవల ఆధారంగా 1973 లో హిందీ లో శశి కపూర్ హీరో గా ఓ సినిమా తీశారు. ఇండో అమెరికన్ టెక్నీషియన్స్ పని చేసిన ఈ సినిమా కి కాన్రాడ్ రూక్స్ దర్శకత్వం వహించాడు. రిషికేష్ లోనూ,భరత్ పూర్ ప్యాలస్ లోనూ చిత్రీకరణ జరిగిన దీనిలో న్యూడ్ సీన్ లు ఉన్నాయని కొన్ని సీన్లని కత్తిరించారు. ఆ తర్వాత పంపిణీలో తేడాలొచ్చి కొన్నాళ్ళు రిలీజ్ కాకుండా ఆగిపోయింది.
నిజానికి ఈ పుస్తకం గురించి ఇంకా చాలా రాయవచ్చు. కాని రచయిత చేసిన తాత్విక ఆలోచనలు ఎలాంటి పదాల్లో చెప్పాలో సంధిగ్ధం లో పడి ఆపుజేస్తున్నాను. ఎవరికి వాళ్ళు చదివి అర్థం చేసుకోవాలి. అదే మంచిది. ఈ చిన్న పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించి ఒకదాన్ని రోమై రోలా కి ఇంకోదాన్ని మరో మిత్రునికి అంకితం ఇచ్చాడు. నాకు నచ్చిన కొన్ని లైన్లను ఇక్కడ ఉటంకిస్తాను.
" The world, my friend, is not imperfect, or on a slow path towards perfection. No, it's perfect in every moment, all sin already carries the divine forgiveness in itself, all small children already have the old person in themselves, all infants already have death, all dying people the eternal life. It is not possible for any person to see how far another one has already progressed on his path: in the robber and dice-gambler , the Buddha is waiting."
--- మూర్తి కెవివిఎస్ (78935 41003)