Sunday, October 14, 2018

నా శ్రీలంక ప్రయాణం(కాండీ-దంత మందిరం)

నా శ్రీలంక ప్రయాణం(కాండీ-దంత మందిరం)




ప్రస్తుతం కాండీ నగరం లో కి వద్దాము.ఉత్తరాన ఉన్న అనురాధపుర నుంచి సిగిరియా  మీదు గా  కాండీ లోకి అడుగుపెట్టాము.ఈ కాండీ నగరం బహు పురాతనమైనది.కొలంబో తో పోలిస్తే ఇరుకు గానూ ఉంది.ఇళ్ళు,ఇతర నిర్మాణాలు పీఠభూమి పై కట్టబడినట్లు మనకు అగుపిస్తూనే ఉంటాయి.శ్రీలంక ని పాలించిన పురాతన రాజవంశాలు ఈ కాండీ నే రాజధాని గా చేసుకునే పాలించారు.స్థానిక రాజులు అవిచ్చిన్నంగా ఇంచుమించు రెండు వేల ఏళ్ళు పాలించిన తర్వాత బ్రిటీష్ వారు ఈ కాండీ ని ఆక్రమించారు.అదీ పోర్చుగీస్,డచ్ వారిని పక్కకి నెట్టి..! సరే..1948 లో స్వాతంత్ర్యం ఇచ్చారనుకొండి.




ఈ కాండీ లో ప్రముఖంగా చెప్పవలసినది...బుద్ధుని ఆలయం గూర్చి..!బుద్ధుని యొక్క దంతం ఈ ఆలయం లో భద్రపరచబడి ఉన్నది.కనుక ఇది ప్రపంచం లోని బౌద్ధులందరకీ పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి వారూ ఇక్కడికి వస్తుంటారు.కొరియా,థాయ్ లాండ్,జపాన్,చైనా వంటి దేశాలనుంచే కాకుండా యూరప్ ఖండం నుంచి కూడా యాత్రికులు బాగా వస్తున్నారు.ఈ ఆలయం రాయల్ ప్యాలస్ లో ఒక భాగం గా ఉన్నది.చాలా విశాలం గా ఉన్నది ప్రాంగణం.ఈ ఆలయాన్ని శ్రీ దలద మలిగవ అని పిలుస్తారు.ఈ బుద్ధుని దంతం గురించి ఇంకొక విషయం ఏమిటంటే కళింగ రాజ్యాన్ని ఏలుతున్న గుహసీవ అనేరాజు క్రీ.శ.4 లో తన కుమార్తె హేమ మాలి,అల్లుడు దంతసేన ద్వారా శ్రీలంక కి దీనిని పంపించాడట.ఆరోజుల్లో అనురాధపుర నుంచి పాలిస్తున్న రాజు వద్ద కి ఆ విధంగా చేరి చివరకి కాండీ చేరింది. 



ఆలయం నిర్మాణ శైలి ప్రాచీన శ్రీలంక ఆలయ పద్ధతులను అధ్యయనం చేసేవారికి మంచి పాఠం వంటిది.ఆలయం లోపల బలమైన టేకు కర్రని ఇంకా ఇతర కలప ని ధారళం గా వాడారు.రాతి తోనూ కట్టారు వీటితో బాటు.ఆధునిక ప్రాచీనతలు రెండూ అల్లుకుపోయి ఉన్నాయి.లోపలకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు టికెట్.అదీ శ్రీ లంక రూపాయల్లో..!ఇక్కడ ఒకటి చెప్పాలి.మన కరెన్సీ తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ వేల్యూ తక్కువే.మనం వెయ్యి రూపాయలిస్తే వాళ్ళ రూపాయల్ని రెండు వేలు ఇస్తారు.కాని ఇక్కడ ఇచ్చే వారేరి...?



నేను కటునాయకే విమానాశ్రయం లో దిగినప్పుడు ఫారిన్ ఎక్స్చెంజ్ మార్చుకుందామని ఆ లోపలే అడిగితే ఇండియన్ రుపీస్ ని తీసుకోమని చెప్పారు.మరిప్పుడు ఎలా అని యోచిస్తుండగా ...ఇక్కడ ఇవ్వరులే గాని విమానాశ్రయం బయట ప్రయత్నించండి అన్నాడు ఒకాయన.విచిత్రం గా జపాన్,థాయ్,చైనా ఇంకా కెనడా కరెన్సీ ల్ని తీసుకొని శ్రీలంక కరెన్సీ ని ఇస్తూనే ఉన్నారు ఈ లోపల.సరే..డాలర్ల గురించి చెప్పేదేముంది..!మరి ఇండియా కరెన్సీ అంటే అంత చులకన ఏమిటో..?




బెంగుళూరు కి చెందిన మిత్రులు సి.ఎన్.ఎన్.రాజు గారు నా ఆవేదన అర్ధం చేసుకొని కొంత శ్రీలంక కరెన్సీ ని సదిరారు.హమ్మయ్యా అనుకొని ఆ తర్వాత తీరిగ్గా నా ఖాళీ సమయం లో ఇంకొంత కరెన్సీ ని దొరకబుచ్చుకున్నాను.ఇక కనీస అవసరాలకి ఢోకా లేదులే అని నిట్టూర్చాను.అలా ఆ దేశ డబ్బుల సమస్య తీరింది.మన కరెన్సీ కన్నా వాళ్ళది తక్కువే అయినా ధరలు మాత్రం తక్కువ లేవు.ఒక స్ప్రైట్ తాగితే వంద రూపాయలు.మామూలు భోజనం చేస్తే ఆరువందలు.ఇక ఆ లెక్కన చూసుకుంటే మీకు అర్ధమైపోతుంది కధ..!



సరే..బుద్దుని ఆలయం దగ్గరకి వద్దాము.లోపలకి వెళ్ళేప్పుడు వస్త్రాలు అరకొర ఉంటే ఆపివేస్తున్నారు.కనుక ఏ డ్రెస్ అయినా నిండుగా అసభ్యత లేకుండా ఉండాలని వారి సారాంశం.తామర పువ్వులు,ఇంకా తెల్లని ఎర్రని పువ్వులు గిన్నెల్లో పట్టుకెళ్ళి లోపల సమర్పిస్తున్నారు.బుద్దునికి తామర పూలకి ఉన్న సంబంధం గురించి చాలా మందికి తెలిసినదే.ఇక్కడి బౌద్ధుల ఇళ్ళలో,శుభకార్యాల్లో ఈ తామర పుష్పాల్ని తూడులతో తెంపుకు వచ్చి అలంకరిస్తుంటారు.మనం ఇక్కడ అరటి మొక్కల్ని తెంపి కట్టినట్లుగా..!



ప్రతి రోజు మూడు పూటలా పూజా కార్యక్రమాలు జరుగుతాయి.లోపల దర్శనం చేసుకున్న వాళ్ళు కాసేపు కూర్చొని ధ్యానించడం కనిపించింది.సిమ్హళ స్త్రీలు ఇక్కడ కూర్చొని శ్రద్ధగా ఏవో పఠిస్తున్నారు.లోపల గోడల మీద బుద్ధుని జీవితం ని చిత్రించే బొమ్మలు ఉన్నాయి.ఒక తెల్లని స్తూపం ఇంకా విగ్రహాలు ఉన్నాయి.లోపల కొబ్బరి కాయలు కొడుతున్నట్లుగా ఏం లేదు.అయితే ఆలయం బయట ఎర్ర కొబ్బరి కాయలు కనిపించాయి.అవి ఇక్కడకి ఎవరూ తెచ్చినట్లు లేదు.



ఆలయం పక్కనే పెద్ద చెరువు ఉంది.ఇక్కడ నుంచి కాండీ నగరం ని చూస్తే చాలా అందం గా అనిపించింది.బయటకి రాగానే ముందు క్వీన్ హోటల్ అని ఒక నిర్మాణం ఉంది.బహుశా అది బ్రిటీష్ వారి టైం లో కట్టిందనుకుంటా.అప్పటి తరహా లో ఉంది.ఈ యూరోపియన్ లు ఎక్కడికి వెళ్ళినా తమ గుర్తులు వదలకుండా వెళ్ళరు గదా..!అన్నట్లు ఈ దేశం లో డిసౌజా,డిసిల్వ,డి కోస్టా,ఫెర్నాండో లాంటి పోర్చుగీస్ ఇంటి పేర్లు కూడా ఎక్కువ తగులుతుంటాయి.నేను ఒక స్థానికుని అడిగా ఇదే విషయం.పోర్చుగీస్ వారు పాలించే సమయం లో కొంత జనాభా కేథలిక్ లు గా మారారు.ఆ సమయం లో మారిన వారికి రకరకాల ఇంటి పేర్లు ఇచ్చారు.అలా అవి ఇప్పటి జనరేషన్ లో కూడా కంటిన్యూ అవుతున్నాయి..అయితే ఇప్పుడు బౌద్ధులలో కూడా కనిపిస్తాయి అన్నాడు.అంత దాకా ఎందుకు మన గోవా లోనూ,మంగుళూరు ప్రాంతాల్లోనూ ఈ పేర్ల అవశేషాలు ఉన్నాయి.అయితే మన దగ్గర కధనాలు ఏమిటంటే అప్పటి పోర్చుగీస్ సైనికులు స్థానిక కన్యల్ని పెళ్ళి చేసుకోవడాన్ని వారి ప్రభుత్వాలు ప్రోత్సహించేవి.. దానికి గాను ఇన్సెంటివ్ గా ప్రత్యేక అలవెన్స్ లు కూడా ఇచ్చేవారు.అలా లోకల్ గా కూడా బేస్ ఏర్పాటు చేసుకున్నారు...! కాండీ కి సంబందించిన కొన్ని ఫోటోల్ని ఇక్కడ ఇస్తున్నాను.



(ఇంకా ఉంది...)  

No comments:

Post a Comment