Friday, October 19, 2018

నా శ్రీలంక ప్రయాణం (కాండీ నుంచి నువార ఏలియా)



శ్రీలంక పేరెత్తితే మనకి గుర్తు వచ్చే అనేక అంశాల్లో టీ తోటలు ఒకటి.దేశం లోని మధ్య ప్రాంతం లో కాండీ నుంచి నువార ఏలియా కి వచ్చే ప్రదేశాలన్నీ బహు సుందరం గా ఉంటాయి.ఎత్తైన పర్వతాలు,ఆ వాలుల్లోని టీ తోటలు,ఇంకా అరణ్యాలు,టీ ఫేక్టరీలు,జలపాతాలు, హోటళ్ళు ,వాలు గా ఉండే ఇళ్ళు ,తేమ గా ఉండే నేలలు మనసు ని మరో లోకానికి తీసుకు వెళతాయి.ఉన్నట్లుండి అనేక జలపాతాలు కొద్ది దూరం లోనే కనబడతాయి.మబ్బులు పర్వతాల మీద నడిచిపోతున్నట్లుగా ఉన్నాయి.

టీ ఉత్పత్తి లో ప్రపంచ స్థాయి లో మూడవది గా ఉన్నది ఈ దేశం.విదేశీ ద్రవ్యం ఎక్కువ గా వచ్చే రంగాల్లో ఇది ఒకటి.మొత్తం మీద పది లక్షల మంది దాకా ఉపాధి ని ఈ రంగాల్లో పొందుతున్నారు.అలాగే దాల్చిన చెక్క కూడా విస్తారం గా ఉన్నది.1867 లో జేంస్ టేలర్ అనే ఆంగ్లేయుడు టీ తోటల్ని విరివిగా పెంచడం ప్రారంభించి అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ కి మంచి లాభాల్ని రప్పించాడు.ఆ తర్వాత ప్రైవేట్,ప్రభుత్వ పెట్టుబడులతో ఇప్పటి దాకా సాగిపోతూనే ఉన్నది.

అసలు శ్రీలంక ని సిలోన్ అనే వాళ్ళు.1970 దాకా..!అది పోర్చ్ గీస్ వాళ్ళు పెట్టిన పేరు.ఆ తర్వాత శ్రీలంక గా మార్చుకున్నారు.వేవెన్ డెన్ హిల్స్ మీద చిన్మయ మిషన్ వాళ్ళు ఒక టెంపుల్ కట్టారు.మంచి ప్రకృతి శోభ నడుమ బాగా ఉన్నది.ఇక్కడి ఊర్లలో పెద్దగా కోతులు కనబడటం లేదు.మధ్య మధ్య లో అడవుల్లో మాత్రం కనబడ్డాయి.వీధి కుక్కలు షరా మామూలే.మరీ ఎక్కువ లేవు గాని అడపా దడపా కనిపిస్తూనే ఉన్నాయి.

చిన్న చిన్న షాపులు ఈ మార్గం లో కనబడ్డాయి.వస్త్రాలు,చెప్పులు వంటివి అమ్మే షాపులు.వీటిల్లో స్త్రీలే ఉన్నారు.రోడ్లు పరిశుభ్రంగా ఉంచడం లో మంచి శ్రద్ధ ఉన్నది.రోడ్డు పక్కన మల మూత్రాదులు పూర్తి గా నిషిద్ధం.అయితే చిన్న హోటల్స్ లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి కనక పెద్ద ఇబ్బంది లేదు.టీ ఇన్ అనే ఓ హోటల్ ఇక్కడ గుట్టల్లో ఉన్నది.అక్కడ భోజనం చేస్తూ అద్దాల లో నుంచి చక్కగా తిలకించవచ్చు.చిన్న సైజు స్విస్ లాగానే ఉన్నది ఈ ఏరియా అయితే.కాకపోతే మంచు ని కలిగియున్న ఆల్ప్స్ పర్వతాలు లేవు...అంతే.


1 comment:

  1. శ్రీలంక వెళ్ళాలని ఎప్పటినుండో అనుకుంటున్నా కానీ కుదర్లేదు. ఇది చదివాకా ఇంకా ఆసక్తి పెరిగింది.

    ReplyDelete