Wednesday, May 12, 2021

తెలుగువాళ్ళంటే మరీ ఇంత అదా..!

 మనం ఇతరుల గురుంచి రకరకాలుగా అనుకుంటూంటాం. దాంట్లో కొన్ని నిజాలు ఉండొచ్చు.పాక్షిక నిజాలు ఉండవచ్చు.మళయాళీలు అనగానే బ్లూ ఫిలింస్ తీస్తారని.ఆ సినిమాల్లో హాట్ సీన్లు ఉంటాయని ఇలా.(సరే...ఇప్పుడు ఈ నెట్ పుణ్యమా అని OTT ల్లో ఆయా సినిమాల్లో ని వైవిధ్యాన్ని గుర్తిస్తున్నాం..అది వేరే).


మరయితే తెలుగు వాళ్ళ గురించి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏమి అనుకుంటుంటారు జనాంతికంగా...అనే ఆలోచన కూడా మనకి వస్తుంది.కొన్ని సందర్భాల్లో అది బయటపడుతుంది.కాని కొద్దిమంది మాత్రమే దాన్ని పట్టించుకున్నట్లు అర్ధమవుతుంది.


నేను గమనించిన కొన్నివాటిని చెబుతాను.కొన్ని ఏళ్ళ క్రితం హన్స్డా సౌవెంద్రశేఖర్ అనే జార్ఖండ్ రచయిత ఒక ఆంగ్ల కధా సంకలనం వేశాడు దానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ కూడా వచ్చిందనుకొండి. దానిలోని రెండు కధల్లో తెలుగు వారి ప్రస్తావన వస్తుంది.జార్ఖండ్ రాష్ట్రం లో వివిధ కాంట్రాక్టులు చేస్తూ చిన్న సైజు మాఫియా డాన్ లాంటి వాడి పాత్ర ఒకటి. అతను స్థానిక ఆదివాసీ యువతుల్ని తన స్వార్ధం కోసం ఎలా ఉపయోగించుకుంటాడు అనేది దానిలోని ఇతివృత్తం.


అలాగే ఇంకో కథ లో ఓ తెలుగు కుటుంబం గుజరాత్ లో ఉంటుంది.ఈ కథ లో కాస్త నయం.వాళ్ళు ఉండే ఏరియా మొత్తం నాన్ వెజ్ నిషిద్ధం.మాంసాహారం తినే కుటుంబాలు ఉండటానికి వీలు లేదు.అంటే కులపరం గా అందరూ ఉంటారులే గాని మాంసం మషాళా వాసన వస్తే అక్కడ ఉండనివ్వరు అద్దె కి కూడా..! అలాంటి ఏరియా లో ఓ తెలుగు కుటుంబం ఇల్లు కట్టుకొని దిగ్విజయం గా ఉంటూంటారు.తమ తెలివి తేటల తో..!ఏమీ లేదు,గుడ్డు వండేప్పుడు వాసన రాకుండా కిటికీలు వేసేసుకుని ,ఇంకా బయటకి వెళ్ళినప్పుడు లాగించేసి రావడం.  


అదే విధంగా ఏషియానెట్ అనే మళయాళ చానెల్ ఉంది.దానిలో సినిమా పాటల కార్యక్రమం...దానికి జడ్జ్ లు గా కొంతమంది మళయాళ గాయకులు,మ్యూజిక్ డైరెక్టర్ లు శ్రీకుమార్,జాన్సన్ ఇంకా అలాంటి వారు వచ్చారు...విచిత్రం గా ఆ కార్యక్రమం లో మన తెలుగు గాయని శైలజ కూడా ఓ జడ్జ్.సరే..అని చూస్తున్నా.ఏదో ఓ గాయని పాడిన పాట మీద కామెంట్ చేస్తూ ఓ మళయాళ జడ్జ్ తెలుగు లో మాదిరిగా టప్పాంగుచ్చి పాటలు మా దగ్గర సినిమాల్లో తక్కువ అన్నాడు.అంటే మాస్ ,ఊర మాస్ అనుకునే పాటల్లాంటివి.శైలజ గారు మాత్రం పాపం ఏమి అంటుంది.అంతా అక్కడ వాళ్ళేనాయే.ఒక నవ్వు నవ్వి ఇతర విషయం మాటాడింది.


పేరు గుర్తుకు రావడం లేదు గాని సూర్య ది డబ్బింగ్ సినిమా అది. దానిలో ఒక విలన్ ఇతర రాష్ట్రానికి చెందినవాడు.తమిళ అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేస్తూ బతికే ఓ విలన్.డబ్బింగ్ మూవీ చూసిన తర్వాత తేడా కొడుతుంది ఏమిటబ్బా అని...దాని తమిళ మాతృక చూస్తే దాంట్లో స్పష్టం గా వాడు ఓ తెలుగు పాత్ర. అది మాత్రమేనా...ఇక కమల్ హాసన్ తీసిన విశ్వరూపం.దాని తమిళ మాతృక లో బలరామ నాయుడు అనే తెలుగు పాత్రని రూడ్ గా,మాటాడితే వాడూ వీడూ అని చూడకుండా బూతులు మాట్లాడే వ్యక్తి గా చిత్రించారు. అమెరికా నుంచి వచ్చిన సైంటిస్ట్ ని కూడా ఏంట్రా సైంటిస్ట్ నా కొడకా అంటూ తిడతాడు.ఆ కష్టంస్ ఆఫీసర్ పాత్రకి తెలుగు పాత్ర ని పెట్టాలనే థాట్ కమల్ కి ఎందుకు వచ్చిందో.    

ఇంకా ప్రస్తావించడానికి కొన్ని ఉన్నాయిలే గాని మరెప్పుడైనా..!

No comments:

Post a Comment