Monday, May 31, 2021

లెస్ మిజరబుల్స్ - విక్టర్ హ్యూగో నవల

ప్రపంచ నవలా చరిత్ర లో ఇప్పటిదాకా వచ్చిన గొప్ప నవలలు ఏవి అని ప్రశ్నించుకుంటే దానిలో తప్పకుండా విక్టర్ హ్యూగో రాసిన "లెస్ మిజరబుల్స్" ఉండి తీరుతుంది.దాని ప్రాశస్త్యం బహుముఖీనమైనది.ఇంతకీ ఈ విక్టర్ హ్యూగో ఎవరు..?  ఈయన ఫ్రెంచ్ సాహిత్యాన్ని పరిపుష్ఠం చేసిన మహా రచయితల్లో ఒకడు.కథకునిగా,నవలాకారుని గా,కవి గా,వ్యాసకారుని గా,నాటకరచయిత గా హ్యూగో అనేక రచనలు చేశాడు.అంతటితో ఆగలేదు చారిత్రక , రాజకీయ ,సాహిత్య విమర్శకుని గా కూడా పేరుతెచ్చుకున్నాడు.తన జీవిత చరమాంకం లో ఫ్రాన్స్ దేశపు చట్ట సభ కి సెనేటర్ గా ఎన్నిక కాబడి అక్కడా తన ముద్ర వేశాడు.తొలి రోజుల్లో తమ కుటుంబం యొక్క ప్రేరణ వల్ల లూయి చక్రవర్తి కి అభిమానిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత డెమొక్రాట్ గా మారాడు. కేథలిక్ గా ఉన్న తను క్రమేపి మంత్ర విద్య వైపు,ఆధ్యాత్మికత వేపు పయనించాడు.విక్టర్ హ్యూగో అనేక విచిత్రమైన పోకడల్ని కలిగిఉండేవాడు. 

"లెస్ మిజరబుల్స్" నవల మొట్టమొదట 1862 లో ప్రచురింపబడింది. తన మాతృ భాష ఫ్రెంచ్ లో రాసిన ఈ రచన తరువాత ఆంగ్లం లోకి అనువాదమైంది.యూరపు ఖండానికి చెందిన ఏ భాష లో ఏ మాత్రం పేరు వచ్చినా మిగతా అన్ని భాషల్లోకి చక చకా అనువాదాలు జరిగిపోయి ప్రపంచం లోని మిగతా పాఠకుల చేతుల్లోకి పుస్తకాలు వచ్చేస్తాయి.అదో గొప్ప సౌలభ్యం వాళ్ళకి.అనువాదకులకి కూడా మంచి డిమాండ్ ఉంటుంది.


ఇంగ్లీష్ లోకి అనువాదం అయినపుడు The wretched,The poor ones,The victims and the dispossessed  అనే రకరకాల పేర్లతో ఈ నవల వచ్చింది.అయితే ఆ తర్వాత Les Miserables అనే పేరు దీనికి స్థిరపడిపోయి ఇక ఆ పేరు తోనే ప్రచురితమవుతూ వస్తూన్నది. నేను చదివిన అనువాదం నార్మన్ డెన్ని చేసినటువంటిది.స్థూలంగా చెప్పాలంటే 1815 నుంచి 1832 వరకు గల మధ్య కాలం లో ఈ కథ నడుస్తుంది. పారిస్ లో వచ్చిన ప్రజా తిరుగుబాటు ని ఆధారంగా చేసుకొని వివిధ పాత్రలతో రచయిత దీనిని అల్లడం జరిగింది. జీన్ వల్జీన్ అనేది ప్రధాన పాత్ర అని చెప్పాలి.ఇతని చుట్టూరా మరికొన్ని పాత్రలు ఉంటాయి.223 పేజీలు గల ఈ నవల కొన్ని ఉపకథల్ని కలిగిఉంటుంది.అయితే అన్నీ ఒకదానికి ఒకటి పందిరి మీద లత లా అల్లుకుని ఉంటాయి.     


  సూక్ష్మం లో మోక్షం లా కథ ని చెప్పుకుందాము.అది బిషప్ బైన్ వెను మయ్రియేల్ ఇల్లు. ఆయన అవివాహితుడు,క్రీస్తు చెప్పిన దయా క్షమా గుణాలకి మారుపేరు.ఆ యింట్లో అతనితో బాటు ఆయన చెల్లెలు బాప్టిస్టైన్ కూడా నివసిస్తూంటుంది.ఆయనకి కేటాయించబడిన ప్రాసాదం వంటి ఇంటిని ఆసుపత్రి కి విరాళం ఇచ్చి తాము మాత్రం పక్కనే ఉన్న చిన్న ఇంటిలో ఉంటారు.ఆ యింటిలో వారసత్వం గా వచ్చిన వెండి దీపపుసెమ్మెలు ఇంకా కొన్ని విలువైన సామాన్లు ఉంటాయి. ఓ రోజు రాత్రి ఒక దొంగ వీళ్ళ ఇంటికి వచ్చి ఆశ్రయం అడుగుతాడు.తాను జైలు నుంచి పారిపోయివచ్చానని,ఇంకా ఎవరి ఇంటికి వెళ్ళినా పోలిస్ కి అప్పగిస్తారని,దయచేసి ఈ ఒక్కపూటకి మీ యింట్లో పడుకోనిస్తే తెల్లారి పొద్దుటే వెళ్ళిపోతానని అంటాడు.సరే...అని చెప్పి బిషప్ కుటుంబం భోజనం కూడా పెడతారు. దొంగ గా ఎందుకు మారావు అది తప్పు కదా అంటాడు బిషప్. ఇక అప్పుడు ఈ దొంగ తన కథ చెబుతాడు.


తాను చిన్నవయసు లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారని,తన చెల్లెలు ఇంకా ఆమె కి ఉన్న పిల్లలు అందర్నీ తానే పోషించాలని ...ఆ క్రమం లో ఒకసారి దుఖాణం లో ఉన్న బ్రెడ్ ని దొంగిలించగా తనని జైలు కి పంపించారని చెబుతాడు.ఆ విధంగా మొదటిసారి జైలు కి వెళ్ళిన నాకు ఆ తర్వాత అదే జీవిత విధానం గా మారిపోయిందని,తమ కుటుంబ పోషణకి అదే అనువుగా ఉందని అంటూ తన గాధ ని వివరిస్తాడు.తెల్లవారి లేచి చూస్తే ఈ దొంగ ఉండడు. అదే విధం గా బిషప్ ఇంటిలోని వెండి దీపపుసెమ్మెలు ,విలువైన సామాన్లు కూడా ఉండవు. ఇంతకీ ఆ దొంగ ఎవరూ ...జీన్ వల్జీన్.మన ప్రధాన పాత్ర.అయితే ఆ దీపపుసెమ్మెల్ని తన జీవిత చరమాంకం లో మాత్రం చేరవలసినచోటుకి చేర్చుతాడు.      


ఇదిలా ఉండగా Fantine అనే పేద యువతి యొక్క ఉపకథ వస్తుంది. ఈమె కి ఓ చిన్న బిడ్డ ఉంటుంది.భర్త తో విడిపోతుంది.తల్లిదండ్రుల వద్దకి గాని,బంధువుల వద్దకి గాని వెళ్ళడం ఇష్టం లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తూంటుంది.కొద్దిగా ఎక్కువ డబ్బులు సంపాదించి తాను,తన కూతురు మంచిగా జీవించాలంటే పక్క ఊరిలోకి వెళ్ళి ఓ ఫేక్టరీ లో పనిచేయడం మంచిదని అక్కడకి వెళితే, అవివాహితులకి మాత్రమే ఉద్యోగం ఇస్తామంటారు. Fantine తన కూతురు ని Montifermeil కి పక్కనే ఉన్న ఓ పూటకూళ్ళమ్మ కుటుంబం లో విడిచిపెడుతుంది.నెలకి ఇన్ని ఫ్రాంక్ లు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని కొంత డబ్బు ని అడ్వాన్స్ గా కూడా ఇస్తుంది. వెళ్ళేటప్పుడు కూతురు కి తాను కొన్న అందమైన గౌన్లు,బొమ్మలు కూడా ఇచ్చి ముద్దాడి త్వరలోనే వస్తానని వెళుతుంది. ఆ పూటకూళ్ళమ్మ భర్త పేరు Thenardier. చాలా స్వార్ధం నిండిన కుటుంబం. తల్లి అలా వెళ్ళిపోగానే ఈ చిన్న అమ్మాయిని ఈసడించుకుంటుంది.ఇచ్చిన గౌన్లు,బొమ్మలు అన్నీ తన కూతుర్లు కి ఇచ్చుకుంటుంది. ఈ అమ్మాయికి మసి గుడ్డ పేలికల్లాంటి బట్టలు ఇస్తుంది.దొరికింది ఏదో తింటూ అలా పెరుగుతుంటుంది ఈ అమ్మాయి.ఈమె పేరు Cosset.


Fantine పనిచేసే ఆ పరిశ్రమ ని స్థాపించినది Monsier Madeleine. ఎక్కడినుంచో ఆ ఊరికి వచ్చి,చిన్న పెట్టుబడి తో దాన్ని స్థాపించి బాగా అభివృద్ధి చేస్తాడు.అనేకమందికి ఉపాధి కల్పిస్తాడు.కథ ఇంకొంచెం నడిచిన తర్వాత సస్పెన్స్ విడిపోతుంది.ఆ Madeleine మరెవరో కాదు ఆ రోజున బిషప్ ఇంట్లో దొంగతనం చేసిన జీన్ వల్జీన్ నే..!పేరు మార్చుకొని అలా చలామణీ అవుతుంటాడు.వ్యాపారం లో డబ్బు సంపాదించిన తర్వాత అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు.ఆ రకంగా బాగా పేరు సంపాదించి ఆ ఊరి కి మేయర్ అవుతాడు.అయితే Javert అనే పోలీస్ అధికారి ఇతని కోసం గాలిస్తూంటాడు.జైలు నుంచి పారిపోయి మారు వేషం లో మారు పేరు తో పెద్ద మనిషి గా చలామణి అవుతున్న ఈ జీన్ వల్జీన్ ని అరెస్ట్ చేయాలని ప్రయత్నించగా తనకి ఉన్న పలుకుబడి,లీగల్ నాలెడ్జ్ తో దాన్ని వమ్ము చేస్తాడు. అయితే అమాయకుడైన ఓ వ్యక్తి,తన రూపు రేఖలతో ఉన్న పాపానికి ఉరికంబం ఎక్కబోతున్నాడని తెలిసి తాను అరెస్ట్ కావడానికి సిద్ధం అని పోలీస్ అధికారికి తెలుపుతాడు.


ఇక అక్కడ ఆ చిన్నపాప Cosset ని కాల్చుకుతింటూంటారు ఆ Thenardiers దంపతులు.ఆ అమ్మాయికి తొమ్మిదేళ్ళు వస్తాయి.ఇంటి పని మొత్తం చేపిస్తుంటారు.అలాగే వచ్చే కష్టమర్ల కి సంబందించిన అన్ని సేవలు చేయిస్తుంటారు.గుర్రాలకి నీళ్ళు పెట్టడానికి గాను ఎంతో దూరం వెళ్ళి బకెట్ తో మోసుకురావాలి. ఆ తల్లి Fantine, ఎంతో కష్టబడి పనిచేస్తూ ఆ డబ్బుల్ని వీళ్ళకి నెల నెలా తన కూతురు కోసం పంపినా అవి వీళ్ళే వాడుకుంటూంటారు.ఖర్చులు పెరిగాయి ఎక్కువ పంపమని రాసినప్పుడల్లా రాత్రి పగలు అని చూడకుండా పనిజేసి ఆ డబ్బుల్ని పంపిస్తూంటుంది.


వేశ్యా వృత్తి ద్వారా కొంత సంపాదించి పంపుతుంది.అయితే ఓ పోలీస్ కేసు జరిగినప్పుడు Fantine ని జీన్ వల్జీన్ కాపాడుతాడు.ఆమె కూతురు విషయం తెలుసుకుని ఆ దంపతుల బారినుంచి Cosset ని కాపాడాలని అనుకుంటాడు.ఈ లోగా Fantine అనారోగ్యం తో మరణిస్తుంది.పులి మీద పుట్ర లా అదే సమయం లో జీన్ వల్జీన్ ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అయితే జైలు నుంచి పారిపోయి చాకచక్యం గా ఒక ఓడ కింద భాగం లో దాక్కుని వేరే ఊరికి పారిపోతాడు.   


మెల్లగా Cosset ఉన్న ఊరికి వస్తాడు. Thenardier  దంపతుల ఇంటికి వచ్చి ఆ రాత్రికి తనకి బస కావాలని ,తాను బాటసారిని అని చెబుతాడు. సరే అని బస కల్పిస్తారు.ఆ రాత్రి పూట Cosset యొక్క పరిస్థితి ని గమనిస్తాడు.మాసిపోయిన బట్టలతో ఉంటుంది.వయసుకి తొమ్మిదేళ్ళ పిల్ల అయినా ఆ ఇంటికి సంబందించిన అన్ని పనులు ఊడవడం,ఉతకడం,నీళ్ళు తేవడం ఇలా అన్ని పనులు చేస్తూంటుంది.ఆ Thenardier దంపతుల పిల్లలు మాత్రం మంచి బట్టల్లో నీటు గా ఉంటారు.వాళ్ళ చేతుల్లో ఉన్న బొమ్మల్ని Cosset ఎంతో ఆశ గా చూస్తున్నా ఎవరూ ఆ పిల్ల ని ముద్దు చేసేవారుండరు.చూసి జీన్ వాల్జిన్ ఇదంతా గమనిస్తూంటాడు.


తన సంచి లో ఉన్న ఒక బొమ్మ ని తీసి Cosset కి ఇస్తాడు.మురిసిపోతుంది ఆ అమ్మాయి. తెల్లారినతర్వాత Cosset ని తనతో పంపిస్తే పెంచుకుంటానని ఆ దంపతులతో చెప్పగా మంచి గిరాకీ దొరికింది అని చెప్పి పెద్ద మొత్తాన్ని అడుగుతారు.సరే...అని చెప్పి వాళ్ళు అడిగినంత ఇచ్చి బయలుదేరగా ,మార్గ మధ్యం లో Thenardien కలిసి ఇంకా కొంత మొత్తం కావాలని డిమాండ్ చేస్తాడు.అప్పుడు Fantine కి సంబందించిన రుజువు ని చూపి తన కి ఎదురువస్తే బాగోదని హెచ్చరిస్తాడు.   


ఇక అక్కడినుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది.Cosset జీన్ వాల్జీన్ ని నాన్న అని పిలుస్తూంటుంది.తన తల్లి గూర్చి గాని తన గతం గూర్చి గాని పెద్దగా ఆ అమ్మాయికి చెప్పడు. పారిస్ లోనూ,లక్జెంబర్గ్ లోనూ ,స్పెయిన్ లోనూ ఇలా తిరుగుతుంటారు.ఎందుకంటే తన గురించి పోలీస్ లు గాలిస్తుంటారు.కొన్నాళ్ళు ఫ్రాన్స్ లోని ఓ కాన్వెంట్ లో పాత మిత్రుని సాయం తో దాక్కుని జీవిస్తారు.ఇక్కడ ఉండే క్రైస్తవ నన్ ల ని చూసి Cosset ప్రభావితం అవడం చూసి జీన్ వాల్జీన్ కలత చెందుతాడు.ఎందుకంటే జీవితం అంటే ఏమిటో బయట ప్రపంచం లో రుచి చూసి ఆ తర్వాత సన్యాసిని కావడం వేరు, కాని అభం శుభం తెలియని అమ్మాయిని నేరుగా నన్ గా మార్చే హక్కు తనకి లేదని తలపోస్తాడు.దానితో అక్కడ నుంచి లక్జెంబర్గ్ కి మకాం మారుస్తారు.


అక్కడ మారియస్ అనే యువకుని తో ప్రేమ లో పడుతుంది Cosset.అతను ఒక లాయర్.లక్జెంబర్గ్ నుంచి పారిస్ కి వచ్చేస్తారు జీన్ వల్జీన్ ఇంకా కోజెట్ లు..!ఆ సమయం లో పారిస్ లో పెద్ద ఎత్తున పౌర యుద్ధం చెలరేగుతుంది. దానిలో గాయపడిన మారియస్ ని జీన్ వల్జీన్ రక్షిస్తాడు.Thenardier కుమార్తె ఇపోనియన్ కూడా ఇతడిని ప్రేమిస్తుంది.ఆ కుటుంబం కూడా కాలక్రమం లో పారిస్ కి వచ్చేసి ఉంటుంది.ఆ తరువాత ఈ పౌరయుద్ధం గురించి చాలా పేజీలు సాగుతుంది.ఫ్రాన్స్ రాజకీయ పటాన్ని రచయిత మన ముందు పెడతాడు.   ఎలాగైతేనేమి చివరకి కోజెట్,మారియస్ ల పెళ్ళి అవుతుంది.వీరిద్దరకి కలిపి ఒక పెద్ద మొత్తాన్ని జీన్ వాల్జీన్ కానుక గా ఇస్తాడు.అయితే దాన్ని ఖర్చుపెట్టడానికి మారియస్ సందేహించి అలాగే ఉంచేస్తాడు.అది అక్రమ మార్గం లో వచ్చినదైతే తాను దోషి అవుతాడని అతని భావన.


తాను చేసిన తప్పులకి ఏ రోజుకైనా తాను జైలు కి వెళ్ళవలసిందే కనక క్రమేపి కుమార్తె Cosset ని అల్లుడిని కలవడం తగ్గిస్తూంటాడు జీన్ వల్జీన్.ఆ విధం గా ఆమె తాను లేని లోటు ని భవిష్యత్ లో ఫీలవ్వకూడదని చేస్తుంటాడు.అయితే ఇవేమీ తెలియని Cosset అతడిని పదే పదే ప్రశ్నిస్తూంటుంది.మరి చివరకి జీన్ వల్జీన్ అరెస్ట్ అయ్యాడా,లేక మరణించాడా అనేది తెలుసుకోవాలంటే ఈ నవలని చదవవలసిందే.చివరి భాగం లో అనేక నాటకీయ మలుపులు తిరుగుతుంది కథ.


ఈ నవల చదవడం వల్ల మనకి ఫ్రాన్స్ లోని చారిత్రక పరిణామాలు ఇంకా దానిపక్క దేశాలతో ఫ్రాన్స్ కి గల సంబంధాలు తెలుస్తాయి.అంతేగాక వివిధ భవంతుల వాస్తు నిర్మాణ పద్ధతులు,మతపరమైన,రాజకీయ పరమైన వైరుధ్యాలు బాగా అర్ధమవుతాయి.ఈ నవల రాసిన తర్వాత విక్టర్ హ్యూగో ఒక మాట అన్నాడు."ఈ రచనని ఎంతమంది చదువుతారో నాకు తెలియదు.అయితే యూరపు లోని అనేక సమస్యల్ని దీనిలో ప్రస్తావించాను.బానిసత్వం ఉన్నంతవరకు,స్త్రీ తన మనుగడ కోసం శ్రమిస్తున్నంతవరకు,చదువుకోవాలనే పిల్లలకి చదువు అందనంతవరకు నా యీ రచన ప్రాసంగికతను కోల్పోదు" అని చెప్పి రాసుకున్నాడు హ్యూగో.

                    ---- మూర్తి కెవివిఎస్

(Published in Nava Telengana Daily on 31-5-21)

No comments:

Post a Comment