Friday, June 4, 2021

ద వర్జిన్ అండ్ ద జిప్సీ (తెలుగు అనువాదం)-POST NO:27

 ఆంగ్లమూలం: డి.హెచ్.లారెన్స్

తెలుగు అనువాదం: మూర్తి కెవివిఎస్


ఆ యూదు స్త్రీ ఈస్ట్ వుడ్ ని పిలిచిన విధానం Yvette కి గమ్మత్తు గా అనిపించింది.విడాకులు అవీ సెటిల్ కావడానికి ఇంకో మూడు నెలలు పడుతుంది.స్కోర్స్ బై దగ్గర లో ఈ ప్రేమికులు ఇద్దరూ ఓ కాటెజ్ లో అద్దెకి ఉంటున్నారు.ఆ గుట్టలకి మరీ దూరం ఏమీ కాదది.చలి ప్రస్తుతం విపరీతం గా ఉంది.వాళ్ళ కాటేజ్ లో పని మనిషి కూడా లేదు.అందరి నుంచి విసిరేసినట్లుగా ఉన్నారు.ఆర్మీ నుంచి ఈస్ట్ వుడ్ బయటకి వచ్చేశాడు,అందుకనే మిస్టర్ అనే చెపుతున్నాడు.మేజర్ అని కాకుండా..!బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళు ఇప్పటికే మిస్టర్ అండ్ మిసెస్ ఈస్ట్ వుడ్ ..!


ఈ చిన్నారి యూదు ఆవిడ కి ముప్ఫై ఆరేళ్ళు ఉంటాయి. ఆమె ఇద్దరు పిల్లలు పన్నెండేళ్ళు పైబడిన వారే.ఆ ఇద్దరూ వీరి తోనే ఉంటారు,వీళ్ళ కి పెళ్ళయిన తరువాత. మొదటి భర్త ఆమోదించాడు కూడా ఈ కండిషన్ కి..! 


మొత్తానికి ఈ వింత దంపతులు ...అతిశయం నిండిన పెద్ద  అందాల కళ్ళతో,వంకీలు తిరిగిన నల్లని జుట్టుతో  ఉన్న ఈ యూదు చిన్నారి ఇంకా ఓ రకమైన బూడిద రంగు కళ్ళతో, శక్తిమంతమైన డేనిష్ కుటుంబం నుంచి వచ్చిన ఈస్ట్ వుడ్ ...వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఈ చిన్న ఆధునిక గృహం లో ఉంటున్నారు.వాళ్ళ పనులు వారే చేసుకుంటూ ఈ గుట్ట కి దగ్గరగా ఉన్న ఈ నివాసం లో..! 


ఆ ఇల్లు గమ్మత్తు గా ఉంది. అద్దెకి తీసుకున్న కాటేజ్ నే అది. దానిలో అప్పటికే ఉన్న సామాన్లు కాకుండా ఈ యూదు చిన్నారి తనకి బాగా నచ్చిన ఫర్నీచర్ కూడా తెచ్చుకు పెట్టుకుంది.పద్దెనిమిద శతాబ్ది కి సంబందించిన ఆకృతులు ఉన్నవి అవి.  ఎబోనీ తో చేసిన ఆ ఫర్నీచర్ లో ముత్యాలు,తాబేలు గవ్వలు ఇంకా విలువైనవి పొదిగిఉన్నాయి.ఇంకా ఏమేమో ఉన్నాయి,ఆ దేవుడికే తెలియాలి.ఇటలీ నుంచి వచ్చిన ఎత్తైన వింతైన కుర్చీలు ఉన్నాయి.సముద్రపు రంగు లో ఉండే ఓ రకపు పచ్చదనం లో ఉన్నాయి.


ఖరీదైన ఇటాలియన్ పింగాణీ తో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి.అవన్నీ రకరకాల క్రైస్తవ మహాత్ములవి.పంధొమ్మిదో శతాబ్దపు ముందురోజుల్లో గాని లేదా పద్దెనిమిదో శతాబ్దపు చివరినాళ్ళ లో గాని అవి చేసి ఉండాలి. అద్దాలు ఉన్న ఫర్నీచర్ మీద కూడా వింత చిత్రాలు వేసి ఉన్నాయి. 

అలాంటి అసాధారణమైన ఇంటిలోనికి Yvette వచ్చింది.అనుకోకుండా రప్పించబడింది అనాలి.ఆ కాటేజ్ లో ఎక్కడ ఉండాల్సిన స్టవ్ లు అక్కడ ఉన్నాయి.ప్రతి మూల కూడా వెచ్చగా ఉంది.చక్కటి చిన్న ఫ్రాక్,అప్రాన్ ధరించిన ఆ యూదు చిన్నారి హాం ని ముక్కలుగా తరుగుతూ వంట చేస్తూంది. తెల్ల స్వెటర్,గ్రే ట్రవుజర్స్ వేసుకున్న ఆ మేజర్  ఆమె కి సహకరిస్తూంటాడు.బ్రెడ్ ని కట్ చేస్తూ,మస్టార్డ్ మిక్స్ చేస్తూ..! అది మాత్రమేనా కాఫీ చేస్తాడు,కుందేలు మాంసం కూర చేస్తాడు, ఇంకా వాటి తర్వాత వివిధ రకాల కూరలు,చేపల పచ్చడి...అన్నీ చేస్తాడతను.

ఆ వెండి సామాన్లు,చీనా పింగాణీ వంటివి నిజంగా చాలా విలువైనవనే చెప్పాలి.వధువు కి ఇచ్చే బహుమతి సముదాయం లా ఉన్నాయి. ఇంతలో మేజర్ వెండి మగ్ లో బీర్ పోసుకొని తాగాడు.యూదు చిన్నారి ఇంకా Yvette లు ఇద్దరూ తలా కొద్దిగా షాంపేన్ సేవించారు అక్కడున్న చక్కని గ్లాసుల్లో..!అంతలో మేజర్ కాఫీ చేసి తీసుకొచ్చాడు.


మొదటి భర్త అంటే మహా చిరాకు గా ఉంది యూదు చిన్నారి.అందునా ప్రస్తుతం ఆమె విడాకులు తీసుకున్నట్లే గదా.నైతికం గా నాదేమి తప్పు లేదు అన్నట్లు ఉంది.మేజర్ చూడటానికి అందంగా,బలం గా ఉంటాడు..అదో వింతదనం ఉన్న మనిషి.జీవితం మీద అతనికీ ఏదో తెలియని కోపం. క్రీడాకారుని వంటి అతని దేహం తన కోపాన్ని కనిపించనివ్వదు,ఆ యూదు చిన్నారి పట్ల తనకి ఉన్న మృదుభావం అతను తెచ్చుకున్నదే.ఉత్తరాది ప్రాంతం నుంచి వచ్చే వారిలో ఉండే నైతికత తో కూడిన వింత గాలి అతడిని ఏకాంతం లోకి నెడుతోంది.

మధ్యానం అయింది. వాళ్ళిద్దరూ కిచెన్ లోకి వెళ్ళారు.మేజర్  తన బలమైన చేతుల తో జాగ్రత్త గా కిచెన్ లోని పాత్రలన్నిటినీ కడిగాడు.ఆ కడిగిన వాటిని ఆ యూదు చిన్నారి శుభ్రంగా తుడిచింది. ఇలాంటి పని చేయడానికి మేజర్ కి పెద్ద శిక్షణ తీసుకోవలసిన అవసరం ఏముందని..!ఆ పని అయిపోయిన తరువాత మేజర్ స్టవ్ ల పనితనాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు.ప్రతిరోజు ఎంతోకొంత సమయం వెచ్చించాలి గదా ఇలాటి పని కోసం..!


ఇదంతా అయినతర్వాత మేజర్ తాము వచ్చిన కార్ ని బయటకి తీసి Yvette ని ఎక్కించుకున్నాడు.సరాసరి తీసుకెళ్ళి Yvette వాళ్ళ ఇంటి వెనుక భాగం లో దించాడు.ఆ వెనకున్న చెట్ల వరుస కి మధ్య లోనుంచి వెళితే ,మట్టి మెట్లు వస్తాయి.అవి దాటితే ఇక వాళ్ళ ఇల్లే అది.


ఆ దంపతుల వ్యవహారం Yvette కి గమ్మత్తు గా అనిపించింది.


"నేను ఈ మధ్య చాలా అసాధారణమైన మనుషుల్ని కలిశాను " అంటూ జరిగిన విషయాన్ని Lucille తో చెప్పిందామె.


"ఆ మేజర్ ఇంటి పని చేయడం,అలా తోకాడించుకుంటూ తిరగడం భలే ఉంది.ఇక వాళ్ళ పెళ్ళయినతర్వాత ఎలా ఉంటారో అది తెలుసుకుంటే గనక మరీ గమ్మత్తుగా ఉంటుంది" అంది Lucille.


"ఔనౌను..." అంది Yvette.


(సశేషం)  

No comments:

Post a Comment