Thursday, June 10, 2021

The dream of a Ridiculous man- దోస్తోవిస్కీ యొక్క కథ-విశ్లేషణ


 దోస్తోవిస్కీ రాసిన కథ ఒకదాన్ని గూర్చి మననం చేసుకోవాలి అనిపించింది.దాని పేరు Story of a Ridiculous man.ఇంచు మించు నూట నలభై ఏళ్ళ కిందట రాయబడింది.ఎన్ని ఏళ్ళు గడిచినా మనిషి దానితో మమేకమయ్యే కథ.13 పేజీలు ఉంటుంది.చివరి దాకా ఓపిక తో చదివే వారికి దోస్తోవిస్కీ చాలా అద్భుతమైన అనుభూతిని ఇచ్చే రచయిత.ఒకసారి అలవాటు పడితే అది అలా కొనసాగుతుంది. ఇది తెలుగు లోకి అనువాదం కాలేదనుకుంటాను.


పీటర్స్ బర్గ్ లోని ఒక మామూలు వ్యక్తి. తను ఈ కథని మనకి చెబుతుంటాడు. అతను రివాల్వర్ తో తలని పేల్చుకుని చనిపోవాలని నిర్ణయించుకుంటాడు.దాని కోసం ఓ రివాల్వర్ ని కూడా కొని బుల్లెట్ లు లోడ్ చేసి ఉంచుకుంటాడు.రెండు నెలలు అలా గడుస్తూంటాయి.ఇంటికి వెళ్ళే ప్రతిసారి ఈరోజు రాత్రి సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు గాని వాయిదా పడుతూంటుంది.అయితే ఒక రోజు రాత్రి వీధి లోనుంచి వస్తూ...ఆకాశం లోకి చూస్తాడు.


మబ్బులు గమ్మత్తుగా..కనిపిస్తూంటాయి...వాటి లో ఓ నక్షత్రం మిణుకు మిణుకు మటూ కనిపిస్తూంది.ఎందుకో గాని దాన్ని చూసిన వెంటనే ఈ రాత్రికే తాను ఎట్టి పరిస్థితి లో చనిపోవాల్సిందే అని నిర్ణయించుకుంటాడు. దోస్తోవిస్కీ యొక్క మార్మికమైన ఆలోచనలు మనిషి అంతర్లోకాలలో దోబూచులాడే వివిధ భావాల్ని తెలియజేస్తాయి.సరే...అలా వస్తూండగా అతనికి ఒక ఎనిమిదేళ్ళ అమ్మాయి తారసపడుతుంది.అర్ధమయి కానట్లుగా సహాయమందించమన్నట్లుగా అడుగుతుంది.కాని తను పట్టించుకోకుండా ఇంటికి వచ్చేస్తాడు. నేను ఎందుకు అలా పట్టించుకోకుండా వచ్చేశాను అని తర్వాత బాధ పడతాడు. 


అలా ఆలోచించుకుంటూ బాగా రాత్రి అయిపోతుంది.తనకి తెలియకుండానే నిద్ర లోకి జారుకుంటాడు.అప్పుడు తనకి ఒక కల వస్తుంది.ఆ కల లో తను రివాల్వర్ తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.అయితే విచిత్రం గా తల కి కాకుండా ,హృదయానికి గురి పెట్టి రివాల్వర్ తో కాల్చుకుంటాడు.అది వింత గా అనిపిస్తుంది.కల లో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే ఆర్గ్యుమెంట్లు ఏమీ ఉండవు,వచ్చినదాన్ని ఆమోదించడమే.అని సమాధానపరుచుకుంటాడు.కాని కల లో ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది.   

చనిపోయిన తర్వాత కాఫిన్ లో పెడతారు అతని శవాన్ని.ఆ తతంగం మొత్తాన్ని గమనిస్తూంటాడు.మట్టి లో కప్పెట్టిన తర్వాత ఎడమకంటి లోకి ఏదో పడి చికాకు అవుతుంటాడు.అలా ...అయిన కాసేపటికి ఎవరో తనని పై లోకాలకి తీసుకెళుతుంటారు. అంతరిక్షం లో అనేక గ్రహాలు అవీ ...వెలుగులీనుతూ కనిపిస్తుంటాయి.ఇంతకీ మా భూమి ఎక్కడా...అని అడిగితే అదిగో అని చూపిస్తారు గాని ఎక్కడో అతి చిన్నగా బూడిద రంగు లో ఆ కొసన కనిపిస్తుంది.అలా వెళ్ళీ వెళ్ళీ మొత్తానికి ఓ గ్రహం లోకి వస్తాడు. 


అదీ మానవ లోకం లాగే ఉంటుంది.కాని అక్కడి వాళ్ళు ఎప్పుడూ సంతోషం గా,సంతృప్తి గా ఉంటారు.వారి లో అసూయ అనేది లేదు.అక్కడ ఎవరి పిల్లలయినా అందరి పిల్లలే,అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ తో మసలుకుంటుంటారు.అబద్ధం ఆడటం వారికి తెలీదు.అక్కడ వారికి ఎలాంటి ప్రార్ధనా స్థలాలు లేవు.ఎలాంటి రక్తపాతాలు లేవు.ఎలాంటి తరతమ బేధాలూ లేవు.వారికి తెలిసింది ఒకటే అందరూ కలిసి సంతోషం గా జీవించడం.అంతే.


ఇదంతా చూసిన మన కథానాయకుని కి అసూయ కలుగుతుంది.వాళ్ళలో వాళ్ళకి అసూయ కలిగేలా కొన్ని మాటలు చెబుతాడు.మొక్క చెట్టు అయినట్లుగా అది ఫలించి ...ఆ ప్రదేశమంతటా కొన్ని రోజుల్లోనే మానవ లోకం లో ఉన్న అన్ని దుర్గుణాలు అక్కడా పెల్లుబికి కొట్టుకు చస్తుంటారు.ఇదంతా చూసి బాధ అనిపించి...చివరకి తనే వాళ్ళకి చెబుతాడు.నేను మీ మధ్య చిచ్చు పెట్టాను,మీ అసలు జీవిత విధానమే సరైనది అని చెప్పగా ఇతగాణ్ణి నువ్వు చెప్పేది అబద్ధం అని ఆ గ్రహం నుంచి బహిష్కరిస్తారు. మంచి గా ఉన్న గ్రహాన్ని నేను వచ్చి పాడు చేసేనే అని బాధపడతాడు.


ఇలా చాలా సంగతులతో...కథ నడుస్తుంది.మనిషి విజ్ఞానం అనే పేరు తో ఏ విధం గా ద్వేష భావాల్ని సృష్టించుకుంటున్నాడు అనేది దీనిలోని సారం. నిజానికి నేను చెప్పినది చాలా తక్కువ. జీవితానికి సంబందించి చాలా మంచి చర్చలు ,సమాధానాలు మనకి లభిస్తాయి.అలాగే దోస్తోవిస్కీ యొక్క రచనా విధానం చాలా తీరుబడి గా మనిషి లోని అంతశ్చేతన ని విశ్లేషిస్తుంది.లోపల గూడుకట్టుకున్న భావాలు శరీరం తో లేచి వచ్చినట్టుగా ఉంటాయి దోస్తోవిస్కీ వర్ణనలు.అక్కడ మార్మిక యోచనలు,సింబాలిజం, స్పిరిచ్యులిజం,ద్రష్టత్వం, అంతులేని ఆవేదన, ఆలోచన అన్నీ అల్లుకుపోయి ఉంటాయి.వీలైతే చదవండి నేను చెప్పినదానికంటే ఎక్కువ మీరు పొందగలరు.

 

  


No comments:

Post a Comment