ఒరియా మూలం: గౌరహరి దాస్
తెలుగుసేత : మూర్తి కెవివిఎస్
నకుల నాయక్ నోట్ బుక్ లో నుంచి తలెత్తి చూశాడు.అతని కొడుకు బ్రజకిషోర్ గుమ్మం దగ్గర నిల్చుని ,ఏదో చెప్పబోయి తటపటాయిస్తున్నాడు.భుజం మీద ఉన్న తుండు ని మెలి వేస్తూన్నాడు.
"ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. నీ బతుకంతా ఆ పిలగాళ్ళ తో కోతి లా ఆడటం లోనూ,నీకంటే పెద్దవాళ్ళయిన అమ్మాయిల తో దొంగాట ఆడటం లోనూ సరిపోతున్నది.నా కొడుకు గా నిన్ను ఆ దేవుడు ఎలా పుట్టించాడో ఏమో...ఏదో చెప్పలనుకుంటావు...చెప్పలేవు.ఏమి లేకపోతే అవతలికి పో...నాకు చాలా పని ఉంది ఇక్కడ" అరిచాడు నకుల నాయక్.
"అది...ఆ గోపాల మేస్టారు..." బ్రజకిషోర్ నసిగాడు.
"ఒహో...నీ గుండె కరిగిపోతున్నదా...పెద్ద ధర్మరాజు వి మరి...అతగాడి భార్య నీకు బ్రెయిన్ వాష్ చేసి నన్ను బతిమిలాడమని పంపిందా...?ముప్పొద్దులా మెక్కుతున్నావు.నా ముందు అదేనా మాట్లాడేది...?" నకుల నాయక్ కొడుకు ని గద్దించాడు.
బ్రజకిషోర్ వెళ్ళిపోయాడు.సాధుజంతువు లాంటి వాడు తను. అతని తండ్రి అరిస్తే చాలు మహా భయం.తండ్రిని ఒప్పించుదామని ధైర్యం ఎలాగో తెచ్చుకున్నాడు గాని తనవల్ల కాలేదు. తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవడం అనేది ఇప్పటిదాకా చూడలేదు.బ్రజకిషోర్ తల వేలాడేసుకొని నిష్క్రమించాడు. జతగాళ్ళ తో కలిసి కొత్త చెరువు దగ్గర ఆడుకోవడానికి...!
తండ్రి ఇలా కసురుకోవడం తనకి కొత్త కాదు. ఎప్పుడు చూసినా శాపవచనాలే..!తండ్రి ప్రేమ అనేది అతనికి తెలియదు.తల్లి ని,తనని చెత్త లా తీసిపారేస్తుంటాడు.ఇంకోలా ఆశించడం తన వెర్రితనమే అవుతుంది.తండ్రి అలా మాట్లాడినప్పుడు బ్రజకిషోర్ కి చాలా కోపం వస్తుంది. అలాంటప్పుడు ...ఎక్కడికైనా దూరం గా ఏ సూరత్ కో,కోల్కతా కో,హైదరాబాద్ కో,బెంగుళూరు కో పారిపోవాలనిపిస్తుంది. ఏమి జీవితం ఇది ...!
తన కాళ్ళ వైపు చూసుకుంటే తన అవిటితనం కనపడుతుంది. తను ఒక మరుగుజ్జు. ఎక్కడకని పోవడం,ఎవరు ఉద్యోగం ఇస్తారని...? ప్రతి ఒక్కరు వేళాకోళం చేసేవారే.తన వయసు వాళ్ళు అతడిని దూరం పెడతారు,కనుక చిన్న పిల్లల తోనే ఆడినంత సేపు ఆడి ఇంటికి చేరుకుంటాడు.తల్లి పెట్టినదేదో తిని కాళ్ళు బార్లా జాపి పడుకుంటాడు.కొన్నిసార్లు తీపి కలలు వస్తుంటాయి.
బ్రజకిషోర్ కొత్త చెరువు కి ఆడుకుండానికి దారి తీసినప్పుడల్లా,తండ్రి నకుల నాయక్ ఆ వరండా లో కూర్చుని కొడుకు అవిటితనం గూర్చి ఆలోచిస్తూంటాడు.ఆ ఇంట్లోని వరండా యే అతనికి ఆఫీసు కూడా..!ఇరవై రెండేళ్ళ కొడుకు చూడటానికి పది,పన్నెండేళ్ళ కుర్రాడిలా మరుగుజ్జు లా ఉంటాడు. పులి లాంటి నాకు వీడు పుట్టాడేంటి అని చిరాకు తో భార్య ని కూడా తిడుతుంటాడు.అసలు వీడు నా బిడ్డేనా అని కూడా ఆశ్చర్యపడుతుంటాడు.
దాని గురించి ఇపుడు బాధపడితే ప్రయోజనం ఏముంది..? బ్రజకిషోర్ తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారని చూసినా భార్య మళ్ళీ కనలేదు.వాడే తన మొదటి ఇంకా చివరి బిడ్డ.ఇటువంటి ఆరోగ్యకరమైన చెట్టంత మనిషికి పుట్టిన జోకర్ లాంటి కొడుకు వాడు అని నకుల నాయక్ వాపోతుంటాడు.
సర్బేశ్వర్ ప్రధాన్ ఆలయం నుంచి వస్తూ కనబడ్డాడు.నకుల నాయక్ ని చూసి గౌరవం గా నమస్కరించి ఇలా అన్నాడు."ఈ రోజు కూడా పోలీసులు గోపాల మేస్టర్ ని వదల్లేదు. కొర్ట్ కి ఇవాళే తీసుకువెళతారని విన్నాను"
ఆ మాట విన్న నకుల నాయక్ మోము మబ్బుల్లోనుంచి తొంగి చూసిన చంద్రుడి లా ప్రకాశించింది. "నిజమా.." అంటూ నములుతున్న పాన్ ని పక్కన ఊశాడు.
ఇంత చక్కని వార్త చెప్పిన సర్బేశ్వర్ ప్రధాన్ కి ఏదో బహుమతి ఇవ్వాలనిపించింది." ఇందా...ఈ పాన్ తీసుకో...దీంట్లో పొగాకు ఏమీ ఉండదు.నీ సంగతి నాకు తెలుసు గదా..." అన్నాడు నకుల నాయక్.తీసుకోకపొతే ఏమి తంటా నో అనిచెప్పి వరండా లో అతని పక్కనే కూర్చున్నాడు ప్రధాన్.
అన్నిరకాల పదార్థాలు వేసి పాన్ ని కట్టి ప్రధాన్ కి ఇస్తూ అన్నాడు నాయక్. " అదేమన్నా మామూలు కేసా..?అడివి లో చెట్లు కొట్టడం,జంతువుల్ని చంపడం...పెద్ద నేరం"
నకుల నాయక్ మాసిపోయి ఉన్న దిండు కి ఆనుకుని,కోట ని జయించినంత ఆనందం గా ఫీలయ్యాడు.ఆ వరండా యే అతని కి ఆఫీసు వంటిది. కోర్ట్ కి గాని,పోలీస్ స్టేషన్ కి గాని పోని సమయం లో ఇక్కడే అతను కూర్చుని ఉంటాడు.అతను తల ఆనిచి కూర్చునే గోడ భాగం మాసి ఉంటుంది. ఎండ తగలకుండా చాప వేలాడి దీసి ఉంటుంది. చెక్క పెట్టె ఒకటి ఉంటుంది,అదే అతని టేబుల్.ఆ చెక్క పెట్టె ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. కారణం దానిలో ప్రధానమైన డాక్యుమెంట్లు ఉంచుతాడు. ఒక బ్యాగ్ కూడా వేలాడుతూ ఉంటుంది.అది తన సంచార కార్యాలయం వంటిది.
భారత రాజ్యాంగం యొక్క పాకెట్ సైజ్ బుక్,ఇండియన్ పీనల్ కోడ్ కి సంబందించిన అనువాద ప్రతి,కొన్ని స్టాంప్ పేపర్లు ఇంకా రెడ్..బ్లూ..బ్లాక్ కలర్ పెన్నులు,రబ్బరు,పిన్నులు,ఇంక్ ప్యాడ్,పాత కేసుల తాలుకు కాగితాలు,కొంతమంది అడ్వకేట్ల ఫోన్ నెంబర్లు ఇలాంటి సరంజామా అంతా ఉంటుంది.వాటి అన్నిటి తో పాటు వక్కపొడి డబ్బా కూడా ఆ బ్యాగ్ లో ఉంటుంది.
నకుల నాయక్ వయసు అరవై ఉంటుంది.సన్నగా,పొడుగ్గా ఉంటాడు.డేగ కళ్ళు అతనివి. బట్టతల ముందు భాగం...మూడు వైపులా నెరిసిన వెంట్రుకలు.ముక్కు మీద పడుతుండే కళ్ళజోడు...లూజు గా ఉండే వెయిస్ట్ కోటు వేసుకుంటాడు. అప్పుడప్పుడు వెలిసిపోయిన నెహ్రూ జాకెట్ దానిపైన వేసుకుంటాడు. పెద్ద నల్లంచు ఉన్న ధోతి ధరిస్తాడు.శీతాకాలం లో పాత శాలువా కప్పుకుంటాడు.కొన్ని వెంట్రుకలు చెవుల్లో నుంచి కనబడుతుంటాయి. స్లిప్పర్లు వేసుకుంటాడు.సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరి,మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి గూటికి చేరుకుంటాడు.అలాగని నకుల నాయక్ ఏమీ ప్రభుత్వోద్యోగి కాదు.కాని దినచర్య అలా ఉంటుంది. గ్రామం లో ఉన్నప్పుడు తన ఆఫీసు (ఇంటి వరండా) లో పని చేసుకుంటూంటాడు. గ్రామస్తులతో పెద్దగా కలవడు.వాళ్ళూ ఇతడిని ఎక్కువగా కలవరు.
నకుల నాయక్ కథ వేరు. ఎదుటివారు బాధపడుతుంటే చూసి ఆనందిస్తుంటాడు. వాళ్ళ బాధలకి తాను కారణమైతే ఆ ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంది.రోడ్డు మీద రాయి వేసి,ఒకడిని దానిమీద పడేలా చేయాలన్నా దానికి చాలా ప్లానింగ్ చేయాలి.
ఇంతకీ ఎవరతను..? ఏం చేస్తుంటాడు..? ఎవరూ ఆ ప్రశ్నలు అతడిని అడగరు.కొన్ని ఏళ్ళ క్రితం ఎవరో అడిగే ధైర్యం చేశారు. వాడికి ఏ గతి పట్టిందో తెలుసా..?అలాంటివి తను అసలు మర్చిపోడు.వాడు ఇప్పుడు బతికి ఉన్నాడో,పోయాడో తనకీ తెలియదు.అప్పుడు నకుల నాయక్ వయసు ఇరవై ఏడు.ప్రతిరోజు కోర్ట్ ప్రాంగణం లో తిరుగుతుంటాడు.
ఏం పనిచేయకుండా,బలాదూర్ తిరుగుతున్నావని తండ్రి కోప్పడితే చెప్పకుండా ఇంట్లోనుంచి వచ్చేశాడు.చేతి లో డబ్బు లేదు.కానీ కటక్ రైలు ఎక్కేశాడంతే. వచ్చేటప్పుడు నీటు గా ఉండే డ్రెస్ లు కొన్ని తెచ్చుకున్నాడు. కోర్ట్ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు ఒక తప్పుడు సాక్ష్యం ఇమ్మని ఓ లాయర్ అడిగాడు.అందుకు గాను పది రూపాయలు ముట్టాయి.ఈ సంఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది.చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.ఆ అడ్వకేట్ ని తన యజమాని గా భావించాడు.తప్పుడు ఎవిడెన్స్ లు ఇచ్చేవాడు.అవసరమైతే స్త్రీల సంతకాల్ని కూడా పెట్టేసేవాడు.మొత్తానికి ఓ ఫోర్జరీ చేసి కొంత భూమిని సంపాదించాడు.ఆ తర్వాత స్యూరిటీ ఇవ్వడం కూడా ప్రారంభించాడు.ఇక్కడ అంతగా సేఫ్టీ లేదని మకాం భద్రక్ పట్టణానికి మార్చాడు.
కటక్ లో ఉన్నప్పుడు సామాజిక కార్యకర్త గా కొంత అనుభవం సంపాదించాడు.సిటీ ఆసుపత్రి లో డబ్బులకి గాను రక్తదానం చేసేవాడు.అంతే కాకుండా ఇంకా కొంతమంది చేత కూడా రక్తదానం చేయించి డబ్బులు బాగానే గడించాడు.అయితే ఈ పని అతనికి అంతగా నచ్చలేదు.జనాలు అదోలా చూసేవాళ్ళు.దీనికంటే కోర్ట్ కి సంబందించిన పని ఎన్నుకుంటే నీటు గా ఉంటుందని భావించాడు.
ఒకరోజున కోర్ట్ ప్రాంగణం లో తనకి తెలిసిన అడ్వకేట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.ఇంతలో ఒకడు వచ్చి "ప్రతి రోజూ ఇక్కడ కనబడుతున్నావు,అసలేం చేస్తుంటావు నువు" అని అడిగాడు. వాడు కావాలనే ఎకసెక్కెం గా అడుగుతున్నాడని నకుల నాయక్ గ్రహించాడు. కోపం నషాళానికి అంటింది.కాని ఏమీ అనకుండా నిశ్శబ్దం గా ఉండి,ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అతగాడి వివరాలు అన్నీ సేకరించి పోలీస్ స్టేషన్ లో ఓ కంప్లైంట్ పెట్టాడు. ఒక పదునైన ఆయుధం తో తనని చంపబోయాడని దాని సారాంశం.ఒక వారం పోయిన తర్వాత ఆ వ్యక్తి కనిపించి అడిగాడు." నిన్ను ఎప్పుడు చంపాలని ప్రయత్నించాను నేను...ఏ ఆయుధం చూపించాను నీకు" అని. అతగాడు వ్యాకులత కి గురయ్యాడు.
"ఏమిటి...ఆ రోజు నువు గొడుగు తెచ్చావా లేదా..?దానికి పైన మొన కత్తి లా ఉంటుందా ...లేదా...దానితో నా పై దాడి చేస్తే నాకు గాయం కాదా ...అదేదో అంతా కోర్ట్ లో తేలుతుందిలే" అన్నాడు నకుల నాయక్.
ఆ వ్యక్తి బెదిరిపోయి నకుల నాయక్ కి రెండువందల రూపాయలు ఇచ్చి కేసు వాపస్ తీసుకోమని అర్ధించాడు. అతను ఒక స్కూల్ టీచర్,కేసు నమోదయితే ఉద్యోగానికి అడ్డంకి అవుతుంది.
"ఈ ప్రపంచం వింతైనది. తులసి ఆకులు కనబడితే కాళ్ళతో నలిపేయడానికి వెనుకాడరు. అదే ముళ్ళ కంప ఎదురైతే తప్పుకొని పోతారు" అనుకుంటూ డబ్బుల్ని జేబులో వేసుకున్నాడు నకుల నాయక్.
ఆ రోజునే నకుల నాయక్ ఇంకో రకమైన పని లోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. తప్పుడు సాక్ష్యాలు,స్యూరిటీలు ఇస్తూ సంతృప్తి పడే అతను ఇపుడు తప్పుడు కేసులు పెట్టడం,ఇతరుల చేత పెట్టించడం చేస్తున్నాడు.ప్రతి రోజు అలాంటి కేసుల్ని కొన్ని పెట్టిస్తున్నాడు.అతనికి చాలామంది అడ్వకేట్లు తెలుసు.తప్పుడు సాక్ష్యాలు ఇస్తూ పది,ఇరవై సంపాదిస్తున్నాడు.భూమి తగాదాలు,కొత్త రిజిస్ట్రేషన్లు ఇంకా ఇతర ముఖ్యమైన కేసుల్లో కొద్దిగా ఎక్కువగా ముడుతున్నాయి.అంటే యాభై రూపాయల దాకా..!గ్యారంటర్ గా ఉన్నప్పుడు అయిదువందల దాకా జేబులో పడతాయి.డీడ్ డాక్యుమెంట్స్,లైసెన్స్ పేపర్స్ లాంటివి ఎప్పుడూ అతని బ్యాగ్ లో ఉంటాయి.ఏ అడ్వకేట్ కి అవసరం పడ్డా వాలిపోతాడు.గత ముప్ఫై ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు.ఒకటి రెండు కేసుల్లో తప్పా తనకి కలిగిన ఇబ్బంది పెద్దగా ఏమీ లేదు.
ప్రస్తుతం అతని ప్రధాన వ్యాపకం ఇతరుల మీద కంప్లైంట్స్ పెట్టడమే.ప్రభుత్వ ఉద్యోగులు గాని,ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు గాని అతనితో ఎందుకు అన్నట్టు పోతుంటారు.స్కూల్ టీచర్ నుంచి వార్డ్ మెంబర్ వరకు,రేషన్ డీలర్ దగ్గరనుంచి గ్రామసేవక్ వరకు నకుల నాయక్ అంటే భయమే.దారిలో కలిసినా తప్పించుకుపోతుంటారు.పతాపూర్ నుంచి వచ్చే చేపల వ్యాపారుల దగ్గరనుంచి పొలిటీషియన్స్ వరకు అందరకి అతను తెలుసు.ఎవరైనా కొత్తమనిషి కలిసి గుర్తుపట్టకపొతే నర్మగర్భం గా వార్నింగ్ ఇస్తాడు. "ఏమిటి...రెడ్ బిల్డింగ్ కి వెళ్ళాలనుకుంటున్నావా..?ఒక్కసారి చిక్కుకుంటే జీవితం అంతా కొట్టుకోవలసి ఉంటుంది.ఆ తర్వాత ఆ యముడు కూడా నిన్ను కనిపెట్టలేడు" అంటాడు.
నకుల నాయక్ ప్రతిదాన్నీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు.అయితే ఒక పరిధి దాటి...ఆ తర్వాత వెళ్ళడు.ఒక కేసు తనని బాగా ఆకర్షిస్తే మాత్రం దాని ఆనుపానులు అన్నీ అధ్యయనం చేసి లోపలికంటా వెళ్ళిపోతాడు.దాంట్లో తనకేమి లేదనుకున్నప్పుడు మాత్రం దాని గురించి అసలు పట్టించుకోడు.ఏ రాజకీయాలతో అతనికి సంబంధం లేదు.అయితే,ఎవరైతే అధికారం లో ఉన్నారో వారి పక్షానికి కొమ్ము కాస్తాడు. అధికారం పోయిన పక్షాన్ని వెంటనే వదిలేస్తాడు.అక్కడ అతనికి ఎలాంటి లాయల్టీ అదీ ఉండదు.ఎప్పుడూ గెలిచే వాడివైపే మొగ్గుతాడు.గెలిచినవారి మీద ఏమైనా కేసులు పెట్టి ఉంటే వాటిని విత్ డ్రా చేసుకొని,అవతల పార్టీ మీద టార్గెట్ పెడతాడు.ఈ ఊసరవెల్లి మనిషిని చూసి పొలిటీషియన్స్ కూడా ఆశ్చర్యపడుతుంటారు."నీ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది" అంటూ అతనికి టీ కూడా ఇప్పిస్తుంటారు.
అప్పుడు నకుల నాయక్ కి చాలా ఆనందం గా అనిపిస్తుంది గాని బయటకి వ్యక్తం చేయడు.వాళ్ళు తననేం ప్రేమించరు,అదీ తనకి తెలుసు...వాళ్ళ ప్రేమ కూడా నిజానికి తనకి అవసరం లేదు. జేబు లో డబ్బులో ఉన్నవాడే పవర్ ఫుల్ ఈ లోకం లో..!తాను ఒక్కడే కావచ్చు గాక పతాపూర్ గ్రామం లో తనని ప్రతి ఒక్కరు ఒక మహా వృక్షం లా చూస్తారు.
ఈరోజు తనకి చాలా ఆనందం గా ఉంది. గోపాల మేష్టరు పిటీషన్ ని రిజెక్ట్ చేశారు.ఆ యువకుడు తనకి వ్యతిరేకం గా కొంతమంది గ్రామస్తుల్ని రెచ్చగొట్టాడు.గ్రామ వ్యవహారాల్లో తనకి ముల్లు లా గుచ్చుకునే ఆ మేష్టరు జైలు కి వెళ్ళబోతున్నాడు. ఇక బయటకు రాడు.
గోపాల మేష్టారు ఆ గ్రామం లోని పాఠశాల లో సైన్స్ బోధిస్తాడు.తన కొడుకు బ్రజకిషోర్ కంటే అయిదేళ్ళు పెద్దవాడు.గతవారం,ఆ మేష్టారు తన మిత్రులతో కలిసి కేంద్రపడ దగ్గరున్న భితర్కనిక వెళ్ళాడు.ఇదే అదను అని చెప్పి,ఆ మేష్టారు ఇంకా అతని మిత్రుని మీద ఓ కంప్లైంట్ ఇచ్చాడు నకుల నాయక్.వాళ్ళిద్దరూ కలిసి వన్య మృగాన్ని వేటాడి దాని మాంసాన్ని విందు చేసుకున్నారని,చెట్లని కూడా నరికి అడివికి నష్టం కలిగించారని దాని సారాంశం.కొంతమంది ఫారెస్ట్ అధికారులతో కుమ్మక్కయ్యి దానికి తగిన సాక్ష్యాల్ని సైతం పుట్టించాడు. ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ లోని సెక్షన్ 27 కింద కేసు పెడితే అంత సులువా బయటకి రావడం..?బెయిల్ దొరకడం కూడా కష్టం.
ఇదంతా ఆ మేష్టారు భార్య ఊహించినదే.ఆమె పురిటి నొప్పులు పడుతున్నదని తెలిసే బ్రజకిషోర్ తన తండ్రిని బతిమిలాడబోయాడు.మేష్టార్ని పోలీస్ కష్టడి నుంచి విడిపించమని. వాళ్ళ ఇంటిలో ముసలిదైన మేష్టారి తల్లి మాత్రమే ఉంది.నకుల నాయక్ భార్య కూడా చెప్పింది ఆ అమ్మాయి వీక్ గా ఉందని,పురుటి నొప్పులని...!నకుల నాయక్ అంతా విని నిశ్శబ్దం గా ఉండిపోయాడు.ఆ తరువాత మొహం అటు తిప్పుకొని నిద్ర లోకి జారుకున్నాడు.నిజం చెప్పాలంటే,ఈ బాధాతప్త సన్నివేశం తనకి మహా ఆనదాన్ని కలిగించింది.
ఏ నేరానికి ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలనే విషయం లో లాయర్ల కంటే,పోలీస్ ల కంటే నకుల నాయక్ కి ఎక్కువ అవగాహన ఉంది. కంప్లైంట్ ఇచ్చామంటే సరిపోదు,దానిలో వాడే భాష కూడా పకడ్బందీ గా ఉండాలి.అప్పుడే కేసు లో బలం పెరుగుతుంది.అలాంటి విషయాలకి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇస్తుంటాడు. "ఫలానా వ్యక్తి నన్ను కొట్టబోయాడు అని రాస్తే సరిపోదు.నన్ను చంపడానికి దూసుకువచ్చాడు అని రాయాలి.అప్పుడు సెక్షన్ 103 కింద కేసు పెట్టచ్చు.ఒక పదునైన ఆయుధాన్ని చూపుతూ బెదిరించాడు అని రాస్తే 319 ఇంకా 320 యాక్ట్ ని కూడా అప్లయ్ చేయడానికి వీలుంటుంది.తలుపు బద్దలు కొట్టి వచ్చి...ఆయుధం తో ఎటాక్ చేసి చంపుతానని బెదిరించాడు అని రాస్తే సెక్షన్ 304 తో పాటు,446 యాక్ట్ ని కూడా పెట్టి బుక్ చేయించవచ్చు.
భద్రక్ కోర్ట్ ప్రాంగణం లో ఉన్న మర్రి చెట్టు ఎంతమందికి తెలుసో,నకుల నాయక్ కూడా అంత మంది కి తెలుసు.మొదటిది పాపులర్ అయితే రెండవది అన్ పాపులర్.అంతే తేడా.అతను అడుగుపెట్టగానే ఆ చోటంతా మాయలూ,మంత్రాంగం తో నిండిపోతుంది.పోలీసులు,అడ్వకేట్లు ఇంకా కోర్ట్ ప్యూన్ లు అంతా అతనికి బాగా తెలుసు. ఏ పాన్ లో ఏ దినుసు ఎంత వేయాలో అతనికి కొట్టినపిండి.మర్రి చెట్టు కింద ఉండే బెంచి మీద తన ఆఫీసు పెట్టుకుంటాడు.కోర్ట్ పనుల మీద వచ్చిన రకరకాల వ్యక్తులు అతడిని కలుస్తుంటారు.భద్రక్ కోర్ట్ దగ్గర అతను ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా.
అతని తండ్రి ఇంకా అతని కొడుకు వీళ్ళిద్దరే నకుల నాయక్ కి ఇష్టం లేనివాళ్ళు.ఒకరకంగా వాళ్ళ విషయం లో అప్ సెట్ అయ్యాడు.తన తండ్రి ఎప్పుడూ చదవమని వేధించేవాడు. ఇటు కొడుకు ని చూస్తే ఎందుకూ పనికిరాని వాడు.ఇంట్లోనుంచి వచ్చేసేటప్పుడు తను తండ్రి తో ఒక మాట అన్నాడు. "గొప్పవాళ్ళయిన పొలిటీషియన్లు గాని,వ్యాపారస్తులు గాని చదువుకొనే గొప్పవాళ్ళు అయ్యారా..?చదువుకున్నోళ్ళంతా క్లర్క్ లు గానే మిగిలిపోయారు.చదివిన ఎనిమిది ,తొమ్మిది తరగతులు చాలు...ఇక నేను నా దోవ చూసుకుంటా" అని బయటకి వచ్చేశాడు.
ఇక కొడుకు సంగతి చూస్తే నిరాశ గా ఉంది.నా దగ్గరుండి ఈ వ్యాపారం లోని టక్కుటమార విద్యలు నేర్చుకోరా అంటే వినడు.పెద్దగా మూటలు మోసేది ఏముంది...బ్రెయిన్ ఉపయోగించాలి అంతే.అంతా నీ చుట్టూ చేరతారు కొద్ది కాలం లోనే..నేను చేసేది కనపడటం లేదూ...అని తిడుతుంటాడు.
తేలు కి విషం తోకలో ఉంటుంది.కాని నాకు విషం బ్రెయిన్ లో ఉంటుంది అంటాడు నకుల నాయక్. మళ్ళీ అంటాడు, తన ప్రతి శరీర భాగం లోనూ అది ఉందని...ఎక్కడ ఎవరు చెయ్యి వేసినా వాళ్ళు అయిపోవాల్సిందేనని...!తన గొప్పతనం కొడుకు కి ఏమీ తెలియదు.ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానో వాడికి తెలుసా..?ఈ వ్యాపార మెళుకువలు అనేకమంది నుంచి నేర్చుకున్నాడు.కొంతమందికి మంచి పెరుగు పోసి,కొంతమందికి మంచి అన్నం పెట్టి,కొంతమందికి దేశవాళీ నెయ్యి ఇచ్చి,ఇంకొంతమందికి కథియా అరటిపళ్ళు ఇచ్చి... ఇలా ఎన్నో లంచాలు ఇచ్చి ఈ కిటుకులన్నీ నేర్చుకున్నాడు.అయితే వాటినన్నిటినీ తన డబ్బులతో ఏమీ కొనలేదు.వాళ్ళనీ వీళ్ళనీ తీయని కబుర్లతో మాయజేసి సంపాదించినదే.ముఖ్యంగా ఎస్.ఐ.ని,కానిస్టేబుళ్ళని ఇంకా కోర్ట్ ప్యూన్ లని,పేష్కార్ లని,వాది ప్రతివాదులని ఇలా పనికి వచ్చేవాళ్ళందరినీ మంచి చేసుకోవాలి.
వీటన్నిటితోబాటు,లాయర్ల తో కూడా మంచి సంబంధాలు నెరుపుతాడు నకుల నాయక్.డాక్టర్ల దగ్గరకి ఎక్కువ మంది పేషేంట్లు వస్తే అతనికి ఆదాయం ఎలా పెరుగుతుందో,లాయర్ల దగ్గరకి కేసులు రావడం పెరిగినా అలాంటి ప్రతిఫలమే ఉంటుంది.డాక్టర్ దగ్గరకి పోయినవాడు బాగయి బయటకి వస్తాడు లేదా పైకి పోతాడు.కాని కోర్ట్ కి వెళ్ళినవాడి వ్యవహారం అలా సాగుతూనే ఉంటుంది.స్టాంప్ వెండర్ నుంచి సీనియర్ లాయర్ వరకు నకుల నాయక్ వాళ్ళని చూసుకుంటూనే ఉంటాడు.ఈ దేశం లో కోర్ట్ ల తీరు ఎలా ఉంటుందంటే...మీరు ఓ కొబ్బరి చెట్టు వేస్తే అది పెరగడం,కాయలు కాయడం ఇంకా ఏదో రోజు అది చనిపోవడం జరుగుతుంది.కానీ కోర్ట్ వ్యవహారాలు అలా సాగుతూనే ఉంటాయి. కోర్ట్ కి వెళ్ళినవారి యొక్క సంతానానికి కూడా ఇవి పెనవేసుకొని సాగిపోతుంటాయి.అంతం లేని చీకటి గుయ్యారాలు వంటివి ఇవి.
ప్లెయింటిఫ్ (వాది) జేబులోనుంచి పైకం పేష్కార్ కి వెళ్ళిపోతుంది.దాన్ని ఎవరూ కనిపెట్టలేరు.ఎక్కడ టైపింగ్ జరుగుతుంది, సంతకాలు పెట్టడానికి ఎక్కడ సాక్షులు ఉంటారు,ఎక్కడ స్టాంపులు అతికించాలి ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి.కొన్నిసార్లు మెరుపు వేగం తో జరిగిపోతాయి.డబ్బులు లేటయినపుడు మాత్రం పనులు నత్తనడక నడుస్తుంటాయి.
అనుమానం రాకుండా ఉండటానికి,నకుల నాయక్ అన్ని కేసుల్లోనూ వాది పాత్ర పోషించడు.అప్రత్యక్ష్య మార్గం లో ప్రవేశిస్తాడు.ఉదాహరణకి ఒక ధనవంతుడి కి,పేదవాడికి ఓ మామిడి చెట్టు విషయం లో గొడవ ఉంది అనుకుందాం.వెంటనే తను ధనవంతుడి వైపు మొగ్గుతాడు.చెట్టు ని ఎట్టి పరిస్థితి లో కాపాడవలసిందే అంటాడు.ఎప్పుడైనా పేదవాడి పక్షం వహిస్తే మాత్రం పొలిటీషియన్ లా రెండు వర్గాలు స్నేహపూర్వక ఒప్పందానికి వచ్చేలా చూస్తాడు.అలా చేసినందుకు బేరమాడి పైకం పుచ్చుకుంటాడు.
తనవల్ల ఓ బంధం నాశనమైనా,అన్నదమ్ములు విడిపోయినా,ఒక అమాయకుడు బాధపడినా అతనికి ఆనందం గా ఉంటుంది.పడి పడి నవ్వుతాడు.పాన్ ఇంకా పొగాకు మాత్రమే కాకుండా సాయంత్రం కొద్దిగా గంజాయి కూడా పుచ్చుకుంటాడు దాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి..!కేసు ఇంకా బిగుసుకుంటూ ఉంటే అతనికి మరీ ఆనందం.ముంగీస,పాము కాట్లాడుకుంటే చూసినట్లుగా ఉంటుంది.రక్తం సర్రున పరుగులెత్తుతుంది.
తనకి ఖాళీ సమయం దొరికినపుడు తను పొందిన విజయాల్ని లెక్కవేసుకుంటూంటాడు.వేటగాడు తను వేటువేసిన జీవుల్ని లెక్క పెట్టినట్లు..!
బాసుదేవ పట్నాయక్ కొడుకు ఫారిన్ వెళ్ళబొయే సమయం లో ఇలాగే ఫాల్స్ సర్టిఫికెట్ పెట్టి కంప్లైంట్ ఇచ్చాడు.దానితో అతగాడి ప్రయాణం చాలా లేటయ్యింది.ఆ తర్వాత కేసు తేలిపోయినా జరగవలసిన నష్టం జరిగిపోయింది.బీరకిషోర్ మంగరాజ్ కూతురు కి వచ్చిన సంబంధం ని కుతంత్రం తో చెడగొట్టాడు.అన్నిటికన్నా మిన్నగా చెప్పాలంటే నిరంజన్ మొహంతి ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టడం గొప్ప విజయం.జాతీయ పతాకాన్ని అవమానించాడని చెప్పి కేసు పెట్టించాడు,దాన్ని పీక్కోవడానికి నిరంజన్ కి నాలుగేళ్ళు పట్టింది.అతగాడి సర్పంచ్ పదవి కూడా ఊడింది.ఇలాంటి జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా భయంకరమైన ఆనందం కలుగుతుంది.
సివిల్ కేసులకి డబ్బులు బాగా అవసరమవుతాయి. కాని క్రిమినల్ కేసులకి అలా కాదు పైగా నిందితుడు అవమానింపబడతాడు. తాను దెబ్బ వేయబోయే వాడి స్టేటస్ ని దృష్టి లో పెట్టుకొని ఆయుధాల్ని దానికి తగినట్లుగా తయారుచేసుకుంటాడు.ఎప్పుడో తప్పా తన పాచికలు బాగానే పారుతుంటాయి.ఎంతమంది తనవల్ల శంకరగిరిమాన్యాలు పట్టిపోయారో తనకొక్కడికే తెలుసు.
దాశరథి మహాకుడ మీద వరకట్న వేధింపుల చట్టానికి సంబందించిన కేసు పెట్టించినపుడు మహదానందం కలిగింది.ఆ ఏరియా లో వాళ్ళ కుటుంబానికి మంచి పేరు ఉంది.ఇద్దరు కొడుకులకి పెళ్ళయింది.చిన్న కోడలికి ,కొడుకు కి గొడవ జరిగి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది.అదేమంత పెద్ద వ్యవహారం కాదు,రెండు రోజుల్లో కుదుటపడేదే.కాని నకుల నాయక్ ఇందూపూర్ లో ఉన్న అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అల్లుడు వేరే పెళ్ళి చేసుకోబోతున్నాడని అమ్మాయి వాళ్ళ తల్లిని రెచ్చగొట్టి వరకట్న వేధింపుల కింద కేసు పెట్టించాడు.
పోలీస్ లు స్టేషన్ కి రమ్మని పిలవగానే దాశరథి కి, ఆ అరవై ఏళ్ళ ఆ ముసలాయనకి గుండె పోటు వచ్చింది. స్టేషన్ నుంచి ఇంటికి రాగానే రెండోసారి స్ట్రోక్ వచ్చి హరీ మన్నాడు.ఈ వార్త విని ఆ రెండో కోడలు పరుగెత్తుకు వచ్చింది.ఆమె భర్త నిజానికి ఎంతో కూల్ గా ఉండే మనిషి బాధ లో ఉండి భార్య ని అందరిముందు కొట్టబోయాడు.దానితో కేసు ఇంకా జటిలమయింది.ఆ రెండు ఫేమిలీలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
ఎవరో నకుల నాయక్ ఇంటి వేపు హడావుడిగా వస్తున్నట్లు అలజడి అయింది.ఎవరి ఆవులైనా తెంపుకొని వచ్చి చొరబడ్డాయా అని అనుమానం వచ్చి "ఏయ్...ఏమిటది...ఎవరి ఆవులు అవి..." ప్రశ్నించాడు.
ఎవరో గోపాల మేష్టారు ఇంటివేపు వెళుతున్నారు.అపుడే చీకటి పడుతోంది.బడి నుంచి పిల్లలూ వస్తున్నారు,మేసి పశువులూ వస్తున్నాయి.ఉక్కపోత గా ఉంది.చెట్టు మీద ఉన్న కాకి గట్టిగా అరిచింది.
పాన్ నోట్లో వేసుకొని వరండా నుంచి బయటకు వచ్చాడు నకుల నాయక్.నిన్నటి నుంచి నడుము ఒకటే నొప్పి.నడిస్తే మరీనూ.తన తండ్రి కి కూడా ఇదే నొప్పి ఉండేది.ఏమిటివాళ...తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు.అదంతా చెత్త.తన కొడుకు బ్రజకిషోర్ పొద్దుట ఇల్లు వదిలి పెట్టి వెళ్ళాడు,ఇంతవరకు జాడ లేడు. ఏ చెట్టు కొమ్మలెక్కి జారిపడ్డాడో,ఆమ్మాయిలతో ఆడుకుంటూ జేరాడో..!
ఇంతకీ గోపాల మేష్టారు సంగతి ఏమయి ఉంటుంది అనుకుంటూ అతగాడి యాతన తల్చుకుని తాచు పాము లా నల్లని పెదాల్ని నాలికతో తడుముకున్నాడు.ఎక్కడికి పోగలడు..?ఈ నకుల నాయక్ పాదాల మీద పడి వేడుకోవలసిందే.అప్పుడే తను రక్షిస్తాడు.ఇంకా కొన్ని సాక్ష్యాల్ని కూడా సేకరించాడు. తన లాయర్ ఇప్పటికే చెప్పాడు,ఒకటి సరిపోదు ఇంకొన్ని విట్నెస్ లు ఉంటే మంచిదని.
సందెవేళ.ఎండాకాలం.గాలి కొద్దిగా వేడిగానే ఉంది. అలా చెరువు దగ్గరకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునే వేళ నకుల నాయక్ కి..!సునా నది అతని ఇంటి వెనుక భాగం గుండా ప్రవహిస్తుంది."ఏది నీళ్ళ జగ్ ఇవ్వు.నా పని ముగించుకు వస్తా" అంటూ అరిచాడు,బీడీ వెలిగించుకుంటూ.
సరిగ్గా అప్పుడే ఒక మోటార్ బైక్ తన ఇంటి ముందు ఆగింది.మధుపూర్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఎస్.ఐ. ఇంకా కానిస్టేబుల్ వచ్చారు.వాళ్ళు ఇద్దరూ నకుల నాయక్ కి తెలిసినవాళ్ళే.ప్రతిరోజు టీ,పాన్ లు సేవిస్తూ పిచ్చాపాటి మాటాడుకుంటూనే ఉంటారు. వాళ్ళని చూసి అతని మొహం వెలిగిపోయింది. "ఆ జగ్ వద్దులే గానీ...మూడు కప్పుల్లో టీ పోసి తీసుకు రా" అంటూ భార్య ని ఉద్దేశించి అరిచాడు.
"అయ్యో స్వైన్ బాబూ...నాకు కబురు పెడితే నేనే ఠాణా కి వచ్చేవాడిని గదా...మీరు ఇంతదూరం రావాలా..? అన్నట్లు...దొంగ సాక్ష్యం ఏమన్నా కావాలా" కొద్దిగా చిన్న స్వరం తో తనే అడిగాడు నాయక్.
"ఏమిటి...నకుల ఏమి చేశావు" అడిగాడు ఎస్.ఐ.స్వైన్ అదోలా మొహం పెట్టి.
"దేని గురించి అడుగుతున్నారు మీరు" నకుల నాయక్ తికమక అయ్యాడు.
"నీ మీద వారంట్ తీసుకొని వచ్చాము. ఐ.పి.సి. లోని సెక్షన్ 120 (B) కింద బుక్ అయ్యావు నువు.బట్టలు వేసుకొని రా..స్టేషన్ కి పోదాం"
ఒక్కసారిగా నకుల నాయక్ కి తాడి చెట్టు పైనుంచి తలకిందులు వేలాడదీసినట్లయింది.చెరువు కి వెళ్ళే ముచ్చట కూడా మరిచిపోయాడు భయం లో.తను ఎంతోమందిని జైలు కి,కోర్ట్ కి పంపించాడు.ఇప్పటి దాకా తను అరెస్ట్ అయింది లేదు.సెక్షన్ 120 (B) అంటే చాలా సీరియస్ యవ్వారం...దేశ ద్రోహానికి చెందిన నేరం.తన చెవుల్ని తాను నమ్మలేకపోయాడు. గుటకలు మింగుతూ దిగాలు పడిపోయాడు.
" ఎవడు వాడు నా మీద కేసు పెట్టింది...పెద్ద అబద్ధం.ఆ గోపాల మేష్టారే కావచ్చు.నేను నిర్దోషిని..మీకు తెలీదా" అన్నాడు నకుల.
"నీకు నేను చెప్పాలా...విట్నెస్ లు సరిగ్గా కుదరాలే గాని అబద్ధం కూడా నిజం అవుతుంది.ఇప్పటికే ఆలశ్యం అయింది.పద.పై అధికారులు స్టేషన్ లో ఉన్నారు.." అన్నాడు ఎస్.ఐ.
"నకుల బాబు మనకి తెలిసిన మనిషే.మరి ఏం చేస్తాం...తప్పదు కదా,ఇది సీరియస్ కేసు.బేడీలు కూడా వెయ్యి" కానిస్టేబుల్ తో అన్నాడు ఎస్.ఐ.
నకుల నాయక్ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లయింది.మాట పెగలట్లేదు.అంతా చీకటయినట్లయింది.మోటారు బైక్ వెనక కూర్చున్నతర్వాత అడిగాడు నకుల నాయక్ "అసలింతకీ నా మీద కేసు పెట్టింది ఎవరు" అని.
"ఇంకెవరు...మీ అబ్బాయి బ్రజకిషోర్ ఇంకా అతని మిత్రులు.చండీపూర్ లోని మిస్సైల్ బ్లూ ప్రింట్స్ ని కేంద్రపడ లోని బంగ్లాదేశీయులకి నువు స్మగ్లింగ్ చేశావుట.ఇంకొకళ్ళయితే సీరియస్ గా తీసుకోకపోదుము కానీ కంప్లైంట్ ఇచ్చింది సాక్షాత్తు మీ కొడుకాయే...తీసేయడానికి ఉండదు గదా...అలాంటి వాటిల్లో ఎందుకు తలదూర్చావు నువు..." అన్నాడు ఎస్.ఐ.
నకుల నాయక్ మతి పోయింది.ఎందుకుపనికిరాని వాడని తను ఈసడించుకునే సొంత కొడుకు ఇంత పని చేశాడా..? తండ్రిని పోలీస్ స్టేషన్ కి లాగాడా..?
రోడ్ మీద గ్రామస్తులు బారుగా నిలబడి చూస్తున్నారు.నకుల నాయక్ చేతికి బేడీలా..?ఏమయిందీ రోజు...సూర్యుడు పడమర న ఉదయించాడా...ప్రతివారు ఏదో గుస గుస లాడుతున్నారు.తన చెవిన ఒక మాట మాత్రం వినబడింది.
"కుక్క కాటుకు కి చెప్పు దెబ్బ అంటే ఇదే.ముల్లు ని ముల్లు తోనే తీయాలి...బాగా అయింది" అలా అనుకుంటున్నారు. ఇక ఆ వైపు చూడలేకపోయాడు నకుల నాయక్.
కొత్త చెరువు సమీపం లో నలుగురైదుగురు ఏదో గొయ్యి తవ్వుతున్నారు.దానికి కొద్ది దూరం లోనే గోపాల మేష్టారి ఇల్లు.ఎవరో స్త్రీలు ఏడుస్తున్నశబ్దం.బహుశా చనిపోయిన ఆ బిడ్డని పూడుస్తున్నారనుకుంటాను. ఇలాంటప్పుడు అతను సంతోషించాలి.చేతులెత్తి డాన్స్ వెయ్యాలి.కాని అతని చేతులకి బేడీలు ఉన్నాయిప్పుడు.విషం లేని పాము లా రగిలిపోయాడు లోలోపల..!
(సమాప్తం)
(Sri Gourahari Das is a renowned journalist, writer and winner of the Orissa Sahitya Avademy Award. I am expressing deep gratitude to let me translate his stories. )
No comments:
Post a Comment