Wednesday, September 15, 2021

జోసఫ్ కాన్రడ్ చిత్రించిన "నల్లని హృదయం" (`Heart of Darkness)

 


 1899 లో బ్లాక్ ఉడ్ మేగజైన్ లో మూడు పార్ట్ లు గా వచ్చిన ప్రధాన కథ లో నుంచి తీసుకోబడింది.  94 పేజీల ఈ నవలిక తెలుగు లోకి అనువాదం చేయబడిందా లేదా అన్నది నాకు సరిగ్గా తెలియదు.కాని ఇంగ్లీష్ సాహిత్యం లో దీనికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్నది.యూరపు ఖండానికి చెందిన మార్లో అనే సాహస నావికుడు ఆఫ్రికా ఖండం లోని కాంగో పరివాహక ప్రాంతానికి  సాగించిన  ప్రయాణ అనుభవాల సమాహారమే ఈ రచన.ఈ మార్లో పాత్ర యే తన కధని ఉత్తమ పురుష లో చెప్పుకుపోతుంటాడు.థేంస్ నది లో నిలిచి ఉన్న ద నెల్లీ అనే స్టీమర్ లో ఈ కధ ని తన సహచర నావికులకి వినిపిస్తూ ఉంటాడు.వాళ్ళు ఆసక్తి గా వింటూ ఉంటారు.


ఈ మార్లో పాత్ర నూటికి నూరు పాళ్ళు రచయిత జీవితం నుంచి వచ్చినది గా చెప్పవచ్చు.ఎందుకంటే Joseph Conrad  కూడా నిజ జీవితం లో నావికుడిగా నే జీవించాడు.చిన్నతనం నుంచీ కూడా అతనికి ఒకటే డ్రీం ,సముద్రం మీద ప్రయాణిస్తూ రకరకాల దేశాలు చుట్టిరావాలనేది..! ఈయన స్వతహగా పోలండ్ దేశానికి చెందినా, తాను 19 వ యేట దాకా ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా,ఆ తర్వాత ఆ భాష  నేర్చుకొని One of the greatest stylists  గా ఆంగ్ల సాహిత్యం లో ముద్రవేశాడు అంటే ఆయన ప్రత్యేకత ని గుర్తించవచ్చు.

అవి కాంగో ని బెల్జియం పాలిస్తున్న రోజులు.అక్కడి నుంచి ఏనుగు  దంతాలు ఇంకా విలువైన వనరులని తమ దేశానికి తరలిస్తుంటారు యూరోపియన్లు.ఆ కాంగో ఫ్రీ స్టేట్ లోకి వెళ్ళాలంటే చాలా దట్టమైన అడవుల గుండా ప్రయాణించాలి.కాంగో నది మీదా పడవ లపై ప్రయాణం చేయాలి.మార్లో తన ఆంటీ యొక్క రీమండేషన్ తో ఒక స్టీమర్ లో ఉద్యోగం సంపాయించి కాంగో లో ఉన్న Kartz ని కలవడానికి బయలుదేరతాడు.ఈ Kartz  కంపెనీ కి సంబందించి కీలకమైన వ్యక్తి.కంపెనీ అని అంటాడు తప్పా అది ఏ దేశానిది అనేది రచయిత దాటవేస్తాడు.మనం బెల్జియం కి చెందినది అని ఊహించవచ్చు.వాస్తవం లో జరిగిందీ అదే గదా.బెల్జియం రాజు లియోపాల్డ్-2 కాంగోని పాలించిన విధానం పరమ కౄరమైనది. అతను చెప్పిన పంటని ఇంటిలో పండించి ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యం గా చేతులు నరికి పారేసేవాడు.

కాంగో లోని జనాభా ని సగానికి పైన ఈ లియోపాల్డ్ -2 మహానుభావుడే సం హరించాడు అంటే ఇక ఊహించుకోండి. సరే..మార్లో కొన్ని రోజులు ప్రయాణించి ఒక ప్రదేశం లోకి వస్తాడు.అదీ కాంగోలోనే. ఆ ఊళ్ళోనూ అంత అడవుల మధ్యా రైల్ రోడ్ వేయడానికి స్థానిక నల్లజాతీయుల్ని ఉపయోగించడం కనిపిస్తుంది.ఆ సందర్భం లో ఒక చోట మార్లో పాత్ర ఇలా అనుకుంటుంది' They were no colonists; their administration was merely a squeeze ,and nothing more, I suspect. They were conquerors, and for that you want only brute force - nothing to boast of, when you have it, since your strength is just an accident arising from the weakness of others."

 ఈ కాంగో లో ఇంకా లోపలికి ప్రయాణించాలి ఆ Kartz ని కలవాలంటే.ఈ లోపులో కంపెనీ కి చెందిన మేనేజర్ ని,అకౌంటెంట్ ని కలుసుకుంటాడు.ఒక రష్యన్ ని కలుసుకుంటాడు.అలాగే ఇక్కడ కి వచ్చి స్థానికుల చేతి లో మరణించిన స్వీడన్ కి చెందిన వ్యక్తుల గురించి రచన లో చెబుతాడు.దీనిని బట్టి మనకి అర్ధం అయ్యేదేమంటే యూరోపియన్ లు ఏ దేశం వారు అయినా సరే,నల్ల వారు లేదా యూరోపియనేతర జాతులని కొల్లగొట్టే విషయం లో  కలిసికట్టుగా నే పనిచేస్తారు.వారిలో తేడాలు వచ్చినపుడే ప్రపంచ యుద్ధాలు జరిగినవి.

Kartz కి ఆ ప్రాంతం లో గొప్ప పలుకుబడి ఉంటుంది.బోట్ లో ఈయన దగ్గరకి మార్లో వస్తున్నపుడు స్థానికులు బాణాలు వేస్తారు.అయితే బోట్  విజిల్ ని గట్టిగా వేసేసరికి పారిపోతారు.తుపాకులు గట్రా ఉన్నాయేమోనని.సరే..ఎలాగో Kartz ని కలుస్తాడు.అదే సమయం లో అతని ఆరోగ్యం చెడిపోతుంది.తన దగ్గర ఉన్న ముఖ్య పత్రాల్ని,ఫోటోల్ని యూరప్ లో ని తన fiancee  కి ఇవ్వవలసింది గా కోరి చనిపోతాడు.మార్లో తన మీద ఎవరు ఎందుకు దాడి చేశారా అని కూపీ లాగితే మేనేజర్ ద్వారా తెలిసింది ఏమంటే ఈ Kartz మహాశయుడే అని తేలుతుంది.సరే..చనిపోయాడుగా ..అని ..అదేం మనసు లో ఉంచుకోకుండా యూరపు చేరిన తర్వాత Kartz యొక్క ఫియాన్సీ కి అందజేస్తాడు. 

ఆమె ఎంతో బాధపడి తన గురించి చివరి నిమిషం లో ఏమైనా చెప్పాడా అని అడగ్గా ..ఆమె పేరునే స్మరించినట్లు చెబుతాడు.నిజానికి అతని చివరి మాటలు వేరే ఉంటాయి.Kartz కి ఆ కాంగో లో ఓ నల్లజాతి ఉంపుడుగత్తె కూడా ఉంటుంది.ఈయన తన ప్రియురాల్ని ఆమె అనుమతి తో పెళ్ళిచేసుకోవాలని ఆ యూరపు లో ఉన్నపుడు భావించగా ఆస్థి పాస్తులు లేవని ఆమె వైపు బంధువులు ఇతడిని నిరాకరిస్తారు.కనక కాంగో పోయి దంతాలు ఇంకా మిగతావి స్మగ్లింగ్ చేసి బాగా సంపాదించాలని ఆఫ్రికా ఖండానికి వస్తాడు.కంపెనీ ఇతను కొట్టే చిలక కొట్టుళ్ళని గమనించి చనిపోయేలా ప్లాన్ చేసి సఫ్లం అవుతుంది.ఇదీ స్థూలం గా కధ.

Joseph Conrad శైలి బిగువు గా ఉండి ఒకటికి రెండుసార్లు చదవాలి కొన్నిచోట్ల.అతని అసలు అంతరార్ధం గ్రహించడానికి.ఆఫ్రికన్ల పైన నాటి యూరోపియన్ ల దోపిడిని చిత్రించిన నవలిక గా చెప్పాలి.అయితే రచయిత రెండు పక్షాల్లో ఎవరిని సమర్దించాడు లేదా వ్యతిరేకించాడు అంటే చెప్పడం అంత సులువు కాదు.ఒక డాక్యుమెంట్ లా నే రాశాడు అంటాను నేనైతే..!అయితే దానిలో ఒకింత హాస్యం ,భయానకం,కారుణ్యం ఇలా కొన్ని రసాలు అగుపిస్తాయి.Colonial ruling లో కింది స్థాయి ఉద్యోగులు ఎలా ఉంటారు,వారు స్థానికుల తో ఎలా వ్యవహరిస్తారు అనేది తెలుస్తుంది.

ఆఫ్రికా అనగానే మన సినిమాల్లోనూ ఇంకా ఇతర మాధ్యమాల్లోనూ వారి నల్లని రూపాన్ని గేలి చేస్తూ వ్యాఖ్యానిస్తుంటారు గాని అక్కడి చరిత్ర చదివితే మనలో లేని కొన్ని గొప్ప లక్షణాలు వారి లో ఉన్నట్లు అనిపించినాయి.ఉదాహరణకి ఇథియోపియా లాంటి దేశం ఏ రోజున యూరపు కి తలవంచలేదు.పైగా ఇటలీ లాంటి యూరోపియన్ శక్తుల్ని యుద్ధం లో ఓడించారు.ఎంతో లోతు కి పోతే తప్పా కొన్ని బయటకి పెద్ద గా ప్రాచుర్యం పొందవు,కొన్ని కారణాల వల్ల..!

ఇలాంటి రచనలు చదివినప్పుడల్లా నాకు ఒక అనుమానం వస్తూ ఉంటుంది.మన దేశం లో క్రీమీ లేయర్ గా చెప్పుకుంటూ తమ చరిత్రల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేసుకునే జాతులు ఎందుకని విదేశీ శక్తుల్ని నిరోధించడం లో విఫలమైనాయి.కేవలం తమ దేశం లో తమకన్నా దిగువ స్థాయి లో ఉన్న సోదరుల పై  దాష్టీకం చేయడం లో తప్పా తమ ప్రతాపాల్ని విదేశీ శక్తులపై చూపలేకపోయాయి.మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోనంతకాలం ప్రత్యక్షం గానో పరోక్షం గానో విదేశీ శక్తులకి బానిసలుగా ఉండవలసిందే. 

------- మూర్తి కెవివిఎస్ (7893541003)

(Published in Nava Telengana Daily)

No comments:

Post a Comment