Sunday, September 26, 2021

ఇల్లు (అనువాద కథ)

 ఒరియా మూలం: గౌరహరి దాస్

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్


"నాన్న అనారోగ్యం తిరగబెట్టింది. ఇంటిలోనే ఉంటున్నాడు.డాక్టర్ రే గారి తో మాట్లాడగలవా..? నాకు ఎందుకనో భయం గా ఉంది" మా తమ్ముడి మాటలు ఫోన్ లో విని వ్యాకుల మనస్కుడినయ్యాను.


లోపల ఎన్నోరకాల అనుమానాలు ...ఎంతో కలతపడ్డాను.అయితే ఇవి ఏవీ లిటు తో చెప్పలేదు.నేనే కలతపడినట్లు గ్రహిస్తే తను మరీ డీలా పడిపోతాడు.


"కంగారు పడకు...నేను డాక్టర్ తో మాట్లాడుతాను" అన్నాను.


ఫోన్ రిసీవర్ అలా పెట్టేసేనో లేదో రంజూ నాకేసి సీరియస్ గా చూడసాగింది. "ఏమిటా ఫోన్...ఏమిటి సంగతి..?" నా మొహం మీది చెమట చూసి అడిగింది.


"ఏమీలేదు...లిటు ఫోన్ చేశాడు రూర్కెలా నుంచి" సాధ్యమైనంత కూల్ గా చెప్పాను.


పొద్దుటే అయిదు లేదా ఆరు గంటల మధ్య  వచ్చే ఫోన్ కాల్స్ అంటే మాకు మహా భయం,అవి ఏదో దుర్వార్తనే మోసుకొస్తాయని. ఈమధ్య అలాగే ఓ కాల్ వచ్చింది.విషయం ...మా అత్తగారికి ఆక్సిడెంట్.బాలూ గావ్ నుంచి వస్తుంటే ఓ వ్యాన్ గుద్దేసింది. ఖుర్దా బైపాస్ దగ్గర.

   తెల్లవారుజామున ఫోన్ మోగిందంటే  ఏదో ప్రమాదపు గంట మోగినట్టే.అందుకనే ఆ సమయం లో ఫోన్ కాల్స్ అంటే తీయబుద్దికాదు.


నేను పెరిగిన ఇన్సెక్యూరిటీ వాతావరణం వల్లనో ఏమో,చిన్నప్పటినుంచి నేను కొద్దిగా పిరికివాడినే. మా ఇంకో తోబుట్టువు ఒకరు పోయిన తర్వాత అది మరింత పెరిగింది తప్పా తగ్గలేదు. మనిషి మృత్యువు,వృద్ధాప్యం,రోగాల విషయమై బాధపడుతుంటాడు... అయితే ఒక్కోసారి ఏదో జరగరానిది జరిగి ఊహించినదంతా తల్లకిందులవుతుంది అనేవాడు రాజూ బాబు.


డాక్టర్ తో మాట్లాడి ఆ విషయం వెంటనే లిటూ తో చెప్పాలి. లేకపోతే తను కంగారు పడతాడు. అయితే మరీ ఇంత పొద్దునే డాక్టర్ కి కాల్ చేయడం బాగోదు.కాసేపు ఆగి చేద్దాం అనుకున్నాడు.

   దాదాపు గా అయిదేళ్ళ క్రితం ఇలాంటి ఉపద్రవమే వచ్చింది తన తండ్రి తో..!ఓ నాటి ఉదయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.ఆయన తో ఎప్పుడూ ఉండే గొడుగు,స్లిప్పర్లు కూడా వదిలేసి వెళ్ళాడు. చేతి కర్ర కూడా తీసుకెళ్ళలేదు.


"మీరు గానీ పొమ్మని చెప్పారా..?" ప్రతి ఒక్కరు నన్ను అడగటమే ఆఫీస్ లోనూ,బస్ స్టాండ్ లోనూ.వినడానికే చికాకు గా అనిపించింది.నాలోనూ ఓ గిల్టీ భావం అంకురించింది.దాంట్లో అనుమానం లేదు. 


ఇప్పుడున్న లక్షణాలు ఆయన లో అప్పుడే పొడసూపాయి. క్రమేణా ఆయన బయటకి వెళ్ళడం,నలుగురి తో మాట్లాడటం తగ్గించాడు.పూలు తీసుకుని మహాదేవుని ఆలయానికి వెళ్ళడం మానేశాడు.తన మనవరాలితోనూ మాట్లాడేవాడు కాదు.తమ గ్రామం గురించి చిన్నా చితకా కబుర్లు ...అవీ మానేశాడు.


ఎవరికో భయపడుతున్నట్లు ఓ మూలన ఉండేవాడు.మిట్ట మధ్యానం కూడా దుప్పటి కప్పుకొని ఉండేవాడు.ఎవరైనా టివి పెడితే,దొంగచాటు గా కట్టేసేవాడు.రేడియో ని అంతే.ఎవరైనా డోర్ బెల్ కొడితే బాత్ రూం లోకి పోయి నక్కేవాడు.


ఏమిటీ ఇంత పెద్దవయసు లో ఈ ప్రవర్తన అని జాలి కలిగేది.అంతలా భయం కలిగించేది ఏముందని ఇక్కడ..?


"మీరు ఆఫీస్ కి వెళ్ళిపోగానే ...మీరు ఎప్పుడొస్తారు అంటూ నన్ను పదే పదే అడుగుతుంటాడు.ఒంటి మీది వెంట్రుకలు పీక్కుంటాడు.మంచం కిందకి చిన్న పిల్లాడిలా పోయి నక్కుతుంటాడు" అని చెప్పింది నా భార్య రంజూ.


"ఐడెంటిటి క్రైసిస్ వల్ల ఇలా చేస్తూండవచ్చు. కొన్ని రోజులు సొంత గ్రామం లో వదిలేసి రండి.అలాగే రాసిచ్చిన మందులు వాడండి.ప్రతి రోజు ఓ పావుగంటో,ఇరవై నిమిషాలో తనతో గడపడం చేస్తే మంచిది." అంటూ చెఫ్ఫాడు డాక్టర్ రే ని కలిసినపుడు.


ఇప్పుడు డాక్టర్ మాటలు గుర్తొచ్చాయి. అవును...తండ్రి తో తను సమయం గడపలేకపోయాడు పని ఒత్తిడి లో పడి.ఎక్కడి ఖాళీ ఉంది...పొద్దుటే పిల్లని స్కూల్ దగ్గర దింపడం, కూరగాయలు కొనడం,ఎవరైనా వచ్చిన వాళ్ళతో మాట్లాడటం తోనే సరిపోతోంది.ఎటు తిరిగి ఇక ఆఫీస్ పని గూర్చి చెప్పేది ఏముంది. బాస్ చాలా స్ట్రిక్ట్. ఇంట్లో పనులు గురించి చెపితే సహించడు.రసం పిండిన చెరుకు గడ లా అయింది జీవితం.ఇన్నిటి మధ్య తండ్రి తో గడపడానికి టైం ఎక్కడిదని..?    


దీనితో బాటుగా నాన్న మానసిక ఆరోగ్యాన్ని కనిపెట్టుకు ఉండాలి.ఈ నగరం లో ఆయనకి ఉన్న గుర్తింపు ఏమిటి అంటే నాకూతురికి తాతాయ్య ఇంకా నాకు నాన్న ఇంకొంతమంది కి అంకుల్.మా ఇంటికి ఎవరు వచ్చినా పెద్ద వయసు లో ఉన్న మనిషి గా ఆయనకి ఓ నమస్కారం పెడతారు.అయితే ఆయనకి ఎవరి మీద ఎలాంటి అధికారమూ లేదు.పనికిరాని చెట్టు లాంటి జీవితం అయిపోయింది. 

అదే ఈ భువనేశ్వర్ కి రెండువందల మైళ్ళ దూరం లో ఉన్న గ్రామం లో అయితే మేము అందరం మనగోబింద మహాపాత్ర గారి కుటుంబ పరివారం లో ఓ భాగం.మేము అంతా ఆ మాహావృక్షం నీడ కింద ఆడుకున్నవాళ్ళమే.


డాక్టర్ రే నిద్రలేచిన తర్వాత వెళ్ళి కలిశాను.  "మా తమ్ముడు ఫోన్ చేశాడు.నాన్న కి అనారోగ్యం తిరగబెట్టిందట,ఇప్పుడు ఏమిటి చేయడం" అడిగాను.


డాక్టర్ తారాపద్ రే చాలా మంచి మనిషి. ఆయన్ని చూస్తేనే సగం జబ్బు తగ్గిపోతుంది. మానసిక రోగుల మద్య గడిపి ఆయన అలా అయిపోయాడు.ఎవరికైనా అదే అభిప్రాయం ఏర్పడుతుంది.

"అసలు ఏమి జరిగింది... విషయం చెప్పండి" అడిగారు డాక్టర్ రే.



"సరిగ్గా గుర్తుకు రావడం లేదు" నసిగాను.


"తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకొండి.పూర్తిగా డయగ్నాసిస్ చేయకుండా మెడిసిన్స్ రాయడం ప్రమాదానికి దారితీస్తుంది. తరవాత ఏదైనా అయితే..." రే గారు వదల్లేదు.


ఏదో కారణం చెబుదామనుకున్నాను. చాతి లో ఏదో మంట. మాట్లాడలేకపోయాను.


"నేను అప్పుడు చెప్పినట్లు ఆయన తో ఉదయం,సాయంత్రం సమయం గడిపారా" 


"హ్మ్...గడిపాను,అయితే తను రూర్కెలా వెళ్ళినప్పటినుంచి...." అబద్ధమాడేశాను.నన్ను అబద్ధాలకోరు అనుకున్నా ఫర్వాలేదు కాని 

 బాధ్యత లేని కొడుకు గా ఎక్స్ పోజ్ కాదలుచుకోలేదు. 

"సరే...భువనేశ్వర్ కి తీసుకు రండి. ఒకవేళ అర్జంట్ అనుకుంటే రూర్కెలా లో ఉన్న డాక్టర్ నంద ని కలిస్తే మంచిది.." అన్నారు డాక్టర్ రే.

నేను వెళ్ళబోతుండగా "పాత ప్రిస్క్రిప్షన్స్ తెచ్చారా" అన్నాడాయన.

"అవి తేలేదు.." మళ్ళీ అబద్ధమాడాను. 

నిజానికి నాన్న కి సంబందించిన ఆ ప్రిస్క్రిప్షన్స్ ఎక్కడ పెట్టానో నాకు జ్ఞాపకం లేదు.అవి మళ్ళీ ఉపయోగపడతాయని కూడా నాకు తెలీదు.అప్పటికి నయమైందిగా అనిపించింది. నా పాస్ బుక్ కి,ల్యాండ్ డాక్యుమెంట్ కి ఇచ్చిన ప్రాధాన్యత వాటికి నేను ఇవ్వలేదు.

ఇంకా కొంత కాలం మాత్రమే ఈ లోకం లో ఉండే ఓ ముసలి వ్యక్తి ఆయన, అలాంటప్పుడు ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి..?

ఈ మాటలు ఎవరో నా చెవి దగ్గర చిన్నగా అన్నట్లు తోచి వెనక్కి తిరిగాను. లేదు,లేదు ...ఎవరూ లేరు.ఎవరైనా తండ్రి గూర్చి అలా అనుకుంటారా..? 

గతం లో,నాన్న ఉత్తరం లో రాసిన కొన్ని సంగతులు అకస్మాత్తు గా గుర్తు కి వచ్చాయి.పని వత్తిడి వల్ల మర్చిపోయాను. దేవుడి కి నైవేద్యం పెట్టడానికి రాతి తో చేసిన పాత్ర ని అడిగాడు.

"ఈ రోజుల్లో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వస్తున్నాయి. ఆ పాత తరం పాత్రలు ఇప్పుడు ఎవరు వాడుతున్నారు..?కింద పడేస్తే ఊరికినే పగులుతాయి" అని చెప్పాను.

అదేవిధం గా మా తమ్ముడి పెళ్ళి అయినతర్వాత ఓ ఉత్తరం లో ఇత్తడి తో చేసిన వక్క పొడి కట్ చేసుకునే కట్టర్ తెమ్మని రాశాడు.పెళ్ళి ఊరేగింపు సమయం లో ఉన్న కట్టర్ కాస్తా ఎక్కడో పోవడం తో అది నాకు కావలిసిందే అంటూ చిన్న పిల్లాడి లా హఠం చేశాడు. 

"ఏవిటో...వయసు పెరుగుతుంటే మరీ ఆశ పెరిగిపోతోంది,ఆ కట్టర్ ఉన్నన్నాళ్ళు వాడకుండా అలా పడి ఉండేది" అంటూ రంజూ విసుక్కుంది.

ఇంటికి ఎన్నో సామాన్లు కొన్నాం గాని ఈ రోజు కీ ఆ కట్టర్ కొనలేకపోయాను.ఈ రెండు వస్తువులు కొందామని మార్కెట్ కి వెళ్ళాను.చూసి ఇప్పుడైనా సంతోషిస్తాడు గదా అనిపించింది.
 
నా మనసు లో ఒక్కసారిగా బాల్యం మెదిలింది. నేను ఏమి అడిగినా నాన్న ఆ డిమాండ్ తీర్చేవాడు.లేదంటే నేను ఇల్లు పీకి పందిరేసేవాడిని.అమ్మ,నాన్న ల తో మాటాడే వాడిని కాను.వాళ్ళు ఏ మాత్రం నా మాట కాదన్నా..!

గత ఆరు మాసాల నుంచి నాన్న ని కలిసింది లేదు.మా తమ్ముడి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నేను రూర్కెలా వెళ్ళింది లేదు.అంత అవసరం లేదనిపించేది.ఒక వేళ వెళ్ళాలనిపించినా,నేను చేయవలిసింది చేశాను,ఎందుకు రూర్కెలా వెళ్ళడం అనిపించేది.

అలా నా బాల్యపు రోజులు మరిచిపోయాను.నేను హాస్టల్ లో ఉన్న రోజుల్లో ప్రతీ పక్షం రోజులకి నన్ను చూడటానికి వచ్చేవాడు.టీచర్ ని కలిసి నా గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పేవాడు.అదంతా మరిచిపోయాను. 

పొలం,పుట్రా వదిలి పది కిలోమీటర్లు నా కోసం హాస్టల్ కి ఎందుకు వచ్చేవాడు.వచ్చేటప్పుడు రకరకాల తింబండారాలు తీసుకొచ్చేవాడు.అవన్నీ ఎందుకని..? నా లో ఓ ఆవేదన కలిగేది.తమ్ముడు లిటూ తను చేయవలిసింది చేశాడు. నేను నా తరపున చేయలిసింది ఉంది అని నాలో నేనే వాదించుకునేవాడిని.

నాన్న కి భువనేశ్వర్ అంటే ఇష్టం. ఇక్కడ మాయింట్లో అన్నిరకాల పుస్తకాలు,న్యూస్ పేపర్లు ఉంటాయి.తన తోటి ఈడు వాళ్ళ తో కలిసి మాట్లాడుతాడు.పాలిటిక్స్ నుంచి మతపరమైన విషయాల దాకా..!

కాని ఇంటికి వచ్చే ఆయన ఫ్రెండ్స్ కి టీ లు గట్రా సరఫరా చేయడం మాత్రం కష్టం.చిన్నపిల్లాడిలా ప్రతిరోజు ఏదో కొత్త వస్తువు కావాలని డిమాండ్ చేస్తుంటాడు. అది అటుంచి తమ స్వ గ్రామం లో ఇల్లు కట్టమని ఒకటే గొడవ.అది అన్నిటి కంటే పాత డిమాండ్.    

ఏమిటి...ఈ మధ్య లో ఏమైనా జరిగిందా అని డాక్టర్ రే అడిగినప్పుడు నేను మాట మళ్ళించాను.మా నాన్న కి ఆ ఇల్లు విషయం గా తప్పనిసరై ఓ అబద్ధం చెప్పాల్సివచ్చిందని , అది ఇద్దరు అన్నదమ్ములం కలిసే చేసిన పని అని ఆయనకి చెప్పలేకపోయాను.

స్వగ్రామం లో ఇల్లు కట్టాలనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న కోరిక.నేను కాలేజ్ లో ఉన్న సమయం నుంచి చెబుతూనే ఉన్నాడు.అది మాకు అంత ఆసక్తికరం గా లేదని గమనించి చిన్నబుచ్చుకునేవాడు.మా అమ్మ కూడా మా పక్షమే వహించేది.అయితే నాన్న తో పెద్దగా వాదించేది కాదు,మహా భయస్తురాలు.

సిటింగ్ రూం తలుపుల మీది ఫ్రేం లు మద్ది చెక్క తో చేయించాలని, తలుపులు పనస చెక్క తో చేయించాలని,వాటి మీద నక్షత్ర ఫలం వంటి డిజైన్ ఉండాలని,కిటికీ ఆర్చ్ లు తీరు గా పెట్టించాలని,డ్రాయింగ్ రూం పక్కనే పూజ గది ఉండాలని,తులసి కోట పెరట్లో ఉండాలని,పూజ గది పక్కనే తన బెడ్ రూం ఉండాలని ఇలా తనకి ఏవేవో కోర్కెలు ఉండేవి. ముగ్గురు కొడుకులకి మూడు రూం లు,గెస్ట్ లు వస్తే ఉండటానికి ఒక రూం ఉండాలని ఆయన కోరిక. ఇక ఆ తర్వాత మా అమ్మ, ఆమె వచ్చి కిచెన్ ఎలా ఉంటే బావుంటుందో చెప్పేది. ఇల్లు అనేది ఒక్కసారే కట్టుకునేది,కట్టుబడి కి అయ్యే ఖర్చుల్లో రాజీ పడకూడదు అనేవాడు.   

ఆయన చెప్పేదాన్ని మేము వినే వాళ్ళం,ఊ..కొట్టేవాళ్ళం.ఆ తర్వాత ఏదో పనిలో పడి మర్చిపోయేవాళ్ళం.

"మీ బాబాయి కి పెళ్ళయినప్పుడు ఇంట్లో రూం లు లేకపోతే మీ నాన్న తన బెడ్ రూం ని ఆయనకి ఇచ్చేశారు.అప్పుడు ఉద్యోగం లో ఉండటం వల్ల బయట ప్రదేశాల్లోనే ఎక్కువ ఉండేవారం.అంత అవసరపడలేదు.అతను ఇల్లు కట్టించుకుంటాడేమో అని చూసి,కట్టించుకోకపోవడం తో ఇక దాన్ని అతనికే వదిలేశాడు మీ నాన్న.." చెప్పింది ఓ సారి అమ్మ.

అమ్మ అబద్ధం చెప్పదు. మా చిన్నప్పటినుంచి సొంత ఇల్లు కట్టించుకోవాలి అనే విషయం లో నాన్న పడే యాతన మాకు తెలుస్తూనే ఉంది.మేము ఉండే ఆ ఇంటికి చక్కటి సీలింగ్,ఆ పైన చిన్న గడ్డి ఇల్లు,ఇంటిముందు మల్లె తోట ...నాన్న ఆ విధంగా ఉండాలని ఊహిస్తూండేవాడు. ఆయన అలా చెప్పినప్పుడల్లా "మీరేం కంగారు పడకండి...నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మన ఈ ఊళ్ళోనే మంచి ఇల్లు నేను కట్టిస్తా.నువు,అమ్మ హాయిగా ఉండొచ్చు" అనే వాడిని.

మాటలు అలాగే మిగిలిపోయాయి. మా చదువులు,ఆ తర్వాత ఉద్యోగాలు వాటితో ఊరికి దూరంగా వెళ్ళిపోయాము. ఇప్పుడు చూస్తే...నలభై లేదా యాభై వేల రూపాయలు ఈ గ్రామం లో ఇల్లు కట్టించడానికి వెచ్చించడం అంత అవసరమా అనిపిస్తున్నది. ఒక సెంటిమెంట్ వ్యవహారం లా కనిపిస్తూన్నది.

"సరే...మీరు ఇక్కడ ఉండనవసరం లేదు.కాని ఎవరూ లేకుండా అందరమూ కట్టకట్టుకొని సిటీ కి వెళ్ళిపోదామా...ఏడు తరాలు నుంచి ఉన్న ఈ పాటి ఇల్లు నీ వదిలేసి వెళ్ళిపోతే ఎలా" అన్నాడు నాన్న నా ఆలోచన ని పసిగడుతూ.

నాన్న మాటలు బాణాల్లా తగిలాయి. భువనేశ్వర్ లో గాని,కటక్ లో గాని అద్దె ఇల్లు దొరకబుచ్చుకోవడం కూడా చాలా కష్టం. అలాంటిది సొంత ఇల్లు కట్టడం అంటే ఇలాంటి నగరాల్లో కట్టాలి గాని పల్లె లో కడితే ఏం ప్రయోజనం..? ఎక్కడో సిటీ కి వంద మైళ్ళ దూరం  లో ఇల్లు  కట్టుకోవడం లో అర్ధం ఉందా..? ఏముందని అక్కడా..?ఒక కాలేజీ యా,ఆసుపత్రి నా...ఏం సదుపాయాలు ఉన్నాయని..? ఈ భువనేశ్వర్ నుంచి పొద్దున బయలు దేరితే అక్కడికి అర్ధరాత్రి కి కూడా చేరం..! ముసలితనం లో ఉన్న తల్లిదండ్రులకి ఏమైనా జరిగినా రావడానికి వీలుండాలా లేదా..? అలాంటి ఆ గ్రామం లో ఇల్లు ఎవరైనా కడతారా..?

నాన్న విషయాన్ని అర్ధం చేసుకున్నట్లు కొంత కాలం నిశ్శబ్దమై పోయాడు. కానీ లోపల ఆయనకి అసంతృప్తి గా నే ఉంది. ఎనిమిది రోజులు గడిచిన తర్వాత ఓ ఉదయం ఆయన ఇలా అన్నాడు. " మీ బాబాయి కొత్త ఇల్లు కట్టడానికి గాను పాత ఇంటిని కూలుస్తున్నాడట.ఆ క్రమం లో మన ఇంటి మధ్య లో గోడ దెబ్బ తినవచ్చునేమో.అసలే అది చాలా పాతది.దెయ్యపు కొంప లా ఉంటుంది,ఏదో ఒకటి చెయ్యాలి.." 

"ఓ పని చెయ్యి..ఊళ్ళో ఉన్న స్కూల్ కి డొనేట్ చేసేయ్ నాన్న,దాని విలువ అటుంచి దానికి పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది. వెళ్ళి ఆ ఇంటిని అమ్మేయ్,నాకిప్పుడు టైం లేదు " అన్నాడు లిటూ కోపంగా.  

నాన్న ఏమీ అనకుండా మౌనం గా ఉండిపోయాడు. లిటూ ప్రవర్తన నాకు షాక్ కలిగించింది.చిన్నప్పుడు ఎంత పిరికి గా ఉండేవాడు.పిల్లి ని చూస్తే భయపడేవాడు.విరుగుడు గా అమ్మ చేతికి తాలిస్మాన్ దారాలు కట్టించేది.బుగ్గన చుక్క ఒకటి అదృష్టం పట్టడానికి...అలాంటి వీడు ఎంత కఠినం గా మాట్లాడాడు అనిపించింది.

నా పొజిషన్ నాన్న కి వివరించాను.పిల్లలకి అయ్యే స్కూల్ ఫీజులు,నా భార్య అనారోగ్యానికి ఖర్చులు,ఇంటికి వచ్చే అతిథుల ఖర్చులు అన్నీ వివరించి ...ఇంటి కోసం నేను ఏమీ చేయాలేనని చెప్పాను.నాకు ఆ ఆస్తి మీద కోరిక కూడా లేదు.ముగ్గురు కొడుకుల్లో ఎలాగు ఒకడు పోయాడు కనక,తమ్ముడిని చూసుకోమను...అలాగే వాడికి దాన్ని రాసిచ్చేయ్ అని కూడా చెప్పాను.

"సరే..ఏదో చేద్దాంలే" అని ముభావం గా అన్నాడాయన. నేను భవనేశ్వర్ లో ఇల్లు నిర్మించాను.తమ్ముడి దగ్గర నాన్న ఉండసాగాడు. ఇల్లు కట్టే విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి నాన్న ఓ ఉత్తరమే రాశాడు.      

"పని అంతా బాగానే సాగుతోంది.మొత్తం కట్టిన తర్వాత నువు చూద్దువులే" లిటూ అర్ధమయ్యేట్టు చెప్పాడు నాన్న కి.

"ఎవరికి తెలుసు,అప్పటికల్లా నేను ఉంటానో పోతానో" అంటూ నాన్న తలూపాడు. 

అలాంటి మాటలు ఎందుకు అన్నాను నేను. ఏదో మాట మారుస్తూ మనవరాలి తో అన్నాడాయన "ఝూనా...ఆ బొమ్మల పుస్తకం తీసుకురామ్మా...ఆ బంగ్లాలు అవీ బొమ్మలుంటాయి చూడు ...అదీ"

రామభక్త హనుమాన్ లా మనవరాలు బండెడు పుస్తకాలు తీసుకొచ్చింది. "తాతాయ్యా...ఇవి చూస్తుండు,నా హోం వర్క్ అయిన తర్వాత వస్తా" అంటూ అది తుర్రుమంది.

"ఎన్ని రోజులని ఇల్లు పూర్తి చెయ్యకుండా ఉంటాం,నాన్న కి భయపడి ...తొందరగా కానిద్దాం" అన్నాడు తమ్ముడు లిటూ.

"మొత్తం పూర్తి అయిన తర్వాత చూస్తే...వద్దులే అది నాన్నకి నచ్చక పోవచ్చు" అన్నాను.

లిటూ ఏమీ మాట్లాడలేదు. ఏమి చేస్తాం..?గ్రామం లో ఇల్లు కట్టడం అంత ఈజీ కాదు. అక్కడ ఎవరుంటారని..? నాన్న బ్రతికి ఉన్నంతవరకే ఆ గ్రామం తో సంబంధం..! ఆ తర్వాత ఏం పని..? అక్కడ మా అన్నదమ్ముల్ని గుర్తుపట్టేవాళ్ళు ఎవరని..?అక్కడ ఇల్లు కడితే గాలికి పోయేవాళ్ళు ఎవరో ఉంటారు. పెట్టిన డబ్బంతా నీట్లో పోయడమేగదా..!

"డాక్టర్ ఏం చెప్పారు..?" రంజూ ప్రశ్నించింది.

"నాన్న ని ఇక్కడికి తీసుకు వస్తే తప్పా పరీక్ష చేయడం కుదరదన్నాడు" చెప్పాను.

రంజూ మొహం మాడిపోయింది. నాన్న భువనేశ్వర్ వస్తే నా భార్య కి పని ఎక్కువ అవుతుంది. ఇంట్లో పనంతా తను ఒక్కతే చేసుకోవాలి,వేరే ఎవరూ లేరు. ఆయన కి ఏది వచ్చినా ఎత్తి పారేయాల్సిన స్థితి. దీని మీదట ఆయన చాదస్తం ఒకటి భరించాలి. 
"ఇదే మీ నాన్న అయితే నువ్వు అలాగే ఫీలవుతావా..?" ఆమె ముఖ కవళికలు గమనించి గట్టిగానే అన్నాను.

"ఏం చెయ్యాలి..?పిల్లకి ఎగ్జాంస్ ఈ పదిహేడు నుంచి మొదలు..దాని పనులు చూసుకోవడానికే సరిపోవడం లేదు.నాకు ఎన్ని చేతులు ఉన్నాయి..?ఎంత మందికి సేవ చేయను..?" అంది రంజూ.

నాలో కోపం కట్టలు తెంచుకుంది.కాని ఏమీ చేయలేనితనం.ఇంకా రంజూ తో ఏం వాదించాలో అర్ధం కాలేదు.నిస్సహాయత ఆవరించింది. 

"ఎలాగో ఒకలా మేనేజ్ చెయ్యి రంజూ.నాన్న ని తీసుకురాక తప్పదు.ఈ బాధ్యత ని తప్పించుకుంటానంటే ఎలా..?" తప్పనిసరై అన్నాను.

అంతే. నా మాటలు ఆమె కి శూలాల్లా గుచ్చుకున్నాయి.ముక్కు ని ఎగబీల్చింది.పెళ్ళయిన పద్నాలుగు ఏళ్ళ నుంచి తాను అనుభవించిన బాధల్ని ఏకరువు పెట్టాసాగింది.

"ఇక్కడ నేనేమన్నా ఊయల్లో కూర్చుని ఊగుతూన్నానా..? పనిమనిషి లా చాకిరీ చేసి చేసి నా అర చేతులు ఎలా అయ్యాయో చూడు. వెన్ను నొప్పి,నడుము నొప్పి.నా బాధల్ని పట్టించుకునే వాళ్ళు లేరు.పైగా ప్రతివాళ్ళు నా మీదపడి ఏడ్చేవాళ్ళే..మీ తమ్ముడు భార్య ని రమ్మను..మీ నాన్న కి సేవ చేయడానికి" అంటూ అరిచింది.

రంజూ కి కోపం వస్తే ఇలాగే ఉంటుంది.ఇదంతా తనకి అనుభవమే. ఎవరి మాటా వినదు.వస్తువులు విసిరేయడం,పిల్ల దగ్గరుంటే రెండు బాదటం,ఆ పూటకి తిండి కూడా హుళక్కి.

నేను ఏం మాట్లాడకుండా బయట కి వచ్చేశాను. బస్ కి టికెట్ బుక్ చేద్దామని. ఇలాంటి సమయం లో నేను నాన్న ని ఆసుపత్రి కి తీసుకువెళ్ళపోతే నలుగురూ ఏమంటారు. అమ్మ కి సరైన వైద్యం సమయానికి అందక చనిపోయింది.అది నాన్న కి జరగకూడదు.

రూర్కెలా బస్ ఎక్కిన తర్వాత నా ఆలోచనలు మా గ్రామం వైపు మళ్ళాయి. మా ఊరు బంగాళాఖాతం కి దగ్గర గా ఉంటుంది.ఇంకోవైపున మాంతేయ్ నది ప్రవహిస్తూంది.ఆ చుట్టుపక్కలా మూడూ,నాలుగు లంక గ్రామాలు ఉంటాయి. మూడు మైళ్ళు దూరం లో చిన్న బజార్ ఉంటుంది.

మేము పిల్లలు గా ఉన్నప్పుడు కదువనాశి అనే ఊరికి తీసుకెళ్ళాడు.నదికి అవతల ఒడ్డున ఓ చిన్న ఇల్లు ఉండేది. కోతల సమయం లో దాని పక్కనే వేసిన పూరి పాకల్లో  కూలీలని ఉంచేవాళ్ళు.ఆ ఇంటి వెనుక అరటి తోట ఉండేది.దాపులోనే ఓ చెరువు...దాని చుట్టూ ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు ఉండేవి.

భ్రమరబర అని ఓ శ్రామికుడు ఉండేవాడు,నాన్న కి నమ్మిన బంటు.చాలా శుభ్రంగా ఉండేవాడు.  నాన్న రావడం తోనే అన్ని పనులు వదిలేసి వచ్చి కావలసిన సేవలు చేసేవాడు.    

ఆ శ్రామికుడు మాకు అన్నం,కూరలు వండి పెట్టేవాడు.ఆకలి తో ఉండి మేము ఆవురావురుమంటూ తినేసేవాళ్ళం. మా నాన్న మాకు అక్కడున్న పంటపొలాల్ని చూపించేవారు. లీలావతి రకం వరి పండిన పొలాన్ని చూపించి దాని గురించి చెప్పేవారు. అలాగే మరో వైపు జతియ వరి వంగడం వేసి ఉంది.అది భాద్రపదం లో చేతికి వస్తుంది.దాని గురించి చెప్పేవారు.సోలా,పతిని అని మరో రెండు రకాలు ఉండేవి.సోలా రకం వరిధాన్యం ఫ్రైడ్ రైస్ కి బాగుంటాయి.

"సన్న రకాలు ఇవి" అంటూ మా తమ్ముడు ఏదో తనకి తెలిసినది చెప్పేవాడు. తలాడించేవాడిని.

సాయంత్రం కాగానే మా నాన్న మమ్మల్ని ఆ దగ్గరే ఉన్న బిజయపట్న అనే గ్రామానికి తీసుకెళ్ళేవారు.అది బాసుదేవ్ పూర్-ధమర రోడ్ కి ఆనుకుని ఉంటుంది.అక్కడ మాకు కొద్దిగా భూమి ఉండేది.నరేంద్ర అని మా దూరపు బంధువు ఒకాయన దాంట్లో కూరగాయలు సాగు చేసేవాడు.

అక్కడ ఇసక భూమి లో ఉన్న బూడిదగుమ్మడి కాయల్ని నాన్న చూపించేవాడు.అవనే కాదు ఇతర అన్ని కూరగాయల మొక్కల్ని చూపిస్తూ ఇది ఒట్టి భూమి కాదురా , దైవం తో సమానం. ఇక్కడ ఒక్క విత్తనం వేస్తే చాలు బంగారం పండుతుంది అనేవాడు. 

నరేంద్ర దోస కాయలు కోసి తెచ్చాడు. వాళ్ళమ్మాయి కొద్దిగా కారం,ఉప్పు తెచ్చింది.ముగ్గురమూ అక్కడున్న పచ్చిక లో కూర్చుని వాటిని ఆరగించాము.

"మీలో ఒకరు మన గ్రామం లో నివసించాలి,మరొకరు కదువనాశి లోనూ,ఇంకొకరు బిజయపట్న లోనూ నివసించాలి.నువ్వు వరి ని,ఒకరు చేపల్ని,ఇంకొకరు కూరగాయలు పండించాలి.." అలా ముగ్గురు సంతానానికి మూడు గ్రామాలు అప్పగించాడు మా నాన్న. మేము తిరిగి వచ్చేటప్పుడు ఈ ముచ్చట్లన్నీ చెప్పాడు.

"మరి నువ్వు,అమ్మ ఎక్కడ ఉంటారు" అడిగాము మేము. నా దగ్గర ఉండాలంటే నా దగ్గరుండాలి అని వాదులాడుకున్నాం అన్నదమ్ములం.

"సరే...ఒక్కొక్కళ్ళ దగ్గర ఆరేసి నెలలు ఉంటాం..." అని నాన్న మమ్మల్ని సముదాయించాడు. మూగురు కొడుకులం,నాన్న వెనుదిరిగాం ఓ బస్తాడు కూరగాయలు కొనుక్కుని.

వచ్చేటప్పుడు చందుడు తన కాంతిని మాంతేయ్ నది పై ప్రసరిస్తున్నాడు. "ప్రవాహం నెమ్మెదించిన సమయాల్లో బురద లోతు గా ఉంటుంది ఇక్కడ.." అన్నాడు నాన్న.

"ఆ మధ్య ఇక్కడే సుడిగుండం లో చిక్కుకుని ఓ మనిషి చనిపోయింది..?" అడిగాను నేను.

"ఔను.." అన్నాడు నాన్న. 

"అదేమిటి...మామయ్య బర్రె తోక పట్టుకొని ఈ ప్రవాహాన్ని దాటాడని అంటారు...నిజమా ?" అడిగాడు లిటూ. ఆ మాట ఎవరో చెప్పగా విని ఉంటాడు తను.

"నది ప్రవాహం కొద్దిగా శాంతించినపుడు మరేం ప్రమాదం ఉండదు. అడ్డంగా ఈదేయవచ్చు" చెప్పాడు నాన్న.

ఏమిటీ లిటూ ఈదడమా అని మేము నవ్వాము.

"ఎక్కువ గా వాడిని ఆటపట్టించకండిరా,వాడు ఏడుపు మొదలుపెడితే అమ్మ కూడా లేదిక్కడ ఓదార్చడానికి.." అని నాన్న మమ్మల్ని సున్నితం గా హెచ్చరించాడు.

నాన్న చెప్పింది నిజమే.లిటూ ఏడుపు మొదలెడితే అంత తొందరగా ఆపడు. అర పూట పడుతుంది ఆపడానికి.

పడవ ఇవతల ఒడ్డు చేరేసరికి చంద్రుడు చింత చెట్టు మీదుగా ప్రకాశిస్తున్నాడు.అవతల ఉన్న గ్రామాలు ఎక్కడో కనిపిస్తున్నాయి,మినుకు మినుకుమంటూ. భలే ఉన్నాయి చూడటానికి. ఎత్తైన కొబ్బరి చెట్ల ఆకుల సందుల్లోంచి వెన్నెల కిరణాలు...మాంతేయ్ నది చేప మొప్పల్లా గా తళుకు తళుకు గా ఉన్నది.   

నా బాల్యానికి నేను క్షమాపణ చెప్పవలసిందే..! నేను చేసింది ఏమిటని...?నాన్న కి నలభై ఏళ్ళు ఉన్నప్పుడు నేను పుట్టింది. రిటైర్ అయ్యేనాటికి పెద్దగా సేవింగ్స్ లేవు.మా తమ్ముళ్ళ చదువులు,పెళ్ళిళ్ళు ,నా పెళ్ళి అన్నీ ఖర్చులు నేనే సంపాదించుకుని పెట్టుకోవలసి వచ్చింది. కాబట్టి నాన్న కలల్ని నిజం చేసే అవకాశం ఎక్కడ దొరికిందని..!

నేను గ్రామానికి తరచూ రావడం లేదని ఆయన అలుగుతూనే ఉన్నాడు.బస్ ప్రయాణం ఇంత దూరం చేసి,కొంత దూరం నడిచి గ్రామం లోకి వచ్చేసరికి ఆ ఆయాసానికి ఎవరికైనా అనారోగ్యం చేస్తుంది. కాబట్టీ ఊరికే వచ్చిపోవాలంటే కుదరడం లేదు.

"ముగ్గురు కొడుకుల పెళిళ్ళు అయినయి. కనీసం ఒక విందు కూడా గ్రామం లో ఇవ్వలేదని నన్ను అంటున్నారు ఊళ్ళోవాళ్ళు.చుంగా కూడా మొన్న ఇదే రాశాడు ఉత్తరం లో.." అన్నాడు నాన్న.

"నాన్నా..వచ్చే వేసవి లో టాక్సీ లో మన ఊరు వెళ్ళి ఆ పని చేద్దాం. రోజంతా కీర్తనల కార్యక్రమం పెట్టిద్దాం,వెజ్ ఇంకా నాన్ వెజ్ రెండు రకాలుగా విందు ఏర్పాటు చేద్దాం..సరేనా" అని అనునయించాను.

నాన్న మొహం కాంతులీనింది. అమ్మ ప్రేమ గా నా తల నిమిరింది.కాని వేసవులు ఎన్నో వెళ్ళిపోయాయి.ఈ మధ్య కాలం లో అమ్మ కాలం చేసింది.అమ్మ అనారోగ్యానికి, మా ఇంకో తమ్ముడి అంత్యక్రియలకి నా సేవింగ్స్ చాలా వరకు అయిపోయాయి,అలాగే లిటూ వి కూడా.    

మధ్యతరగతి కుటుంబాల వ్యవహారమే అంత.మొఖానికి కప్పుకుంటే కాళ్ళ కి సరిపోని దుప్పటి తంతు.బస్ తాల్చేర్ దాటి వెళుతోంది.చల్లగాలి రివ్వుమని వీస్తోంది.

మళ్ళీ లెక్కలేసుకుంటున్నాను.రెండు లేదా మూడు గదుల ఇల్లు కడితే ఎంత అవుతుంది...? బహుశా పాతిక నుంచి ముప్ఫై వేలు కావచ్చు. జిపిఎఫ్ నుంచి నేను పదిహేను వేలు అప్పు తీసుకోగలను,మిగతాది లిటూ ఇవ్వగలడా..?

భువనేశ్వర్ లో ఇల్లు కట్టడం మొదలెట్టకపోయినా బాగుండు,అయితే ఒకటి...ప్లాట్ మళ్ళీ అంత తక్కువ లో రాదుగదా...ఇప్పుడు కొనకపోతే సిటీ లో ఎప్పటికీ కొనలేడు. తన పరిస్థితి త్రిశంకు స్వర్గం లో ఉన్నట్టుంది. ఏదీ కంట్రోల్ లో ఉండటం లేదు.

నేను వెళ్ళేసరికల్లా లిటూ ఇంటి ముందు జనాలు గుమిగూడి ఉన్నారు. నాన్న కి ఏమైనా సీరియస్ గా అయిందా..కాస్త భయం వేసింది. లిటూ వరండా లో పచార్లు చేస్తున్నాడు.

"నాన్న గత రాత్రి ఇంట్లోనుంచి కనిపించకుండా వెళ్ళిపోయాడు" అన్నాడు లిటూ నాతో.

"ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు" నేను కుర్చీలో కూలబడ్డాను.

"రాత్రి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు.కాసేపు అయిన తరవాత భోజనానికి రమ్మని పిలవడానికి వెళితే మనిషి కనబడలేదు" మా తమ్ముడి భార్య చెప్పింది.

"ఆయన మానసికం గా బాధపడుతున్న మనిషి గదా.కొంచెం కనిపెట్టుకుని జాగ్రత్త గా ఉండొద్దా..ఆరోగ్యం కూడా అంతంత మాత్రం.. ఎటు వెళ్ళి ఉంటాడబ్బా .." సీరియస్ అయ్యాను.

"ఇక్కడ చూసీ లాభం లేదు అన్నయ్యా..మన గ్రామం గాని వెళ్ళాడేమోనని నా అనుమానం, రాత్రి నీకు ఫోన్ చేశాను ,అప్పటికే నువ్వు బయటకి వచ్చేశావని వదిన చెప్పింది.లేకుంటే మన ఊరి కే రమ్మని చెప్పి ఉండేవాణ్ణి" అన్నాడు లిటూ. అప్పటికే తను స్కూటర్ వేసుకుని ఆ చుట్టుప్రక్కలా గాలించాడు. 

"తన దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా..?" ప్రశ్నించాను.

"బహుశా ఉండి ఉండవు,ఆ మధ్య నువ్వు మనియార్డర్ చేసిన పైకం కూడా నాకు ఉంచమని ఇచ్చాడు" అన్నాడు లిటూ.

భవనేశ్వర్ లో ఉన్నప్పుడు కూడా నాన్న చెప్పా పెట్టకుండా స్వగ్రామం వెళ్ళేవాడు.ఒకసారి మాత్రం,రూర్కెలా లోని తారిణీ మందిరం వద్ద మధ్యానం దాకా గడిపాడు.బహుశా ఈమారు గ్రామానికే వెళ్ళిపోయి ఉంటాడు.

"నాన్న కి ఏమైనా జరిగి ఉండవచ్చా" భయపడుతూ అన్నాడు లిటూ.

"అలా ఏమీ ఆలోచించకు. ఇప్పుడు బస్ లు కూడా దొరకవుగదా..టాక్సీ పిలువు..వెంటనే మన గ్రామానికి వెళదాం" లిటూ భుజం తట్టి చెప్పాను.

లిటూ టాక్సీ కోసం వెళ్ళాడు.

"నాన్న ఏమైనా చెప్పాడా..?" మా మరదల్ని అడిగాను.

"తనలో తనే ఏదో గొణుక్కునే వాడు.నిద్ర మాత్ర ఇవ్వబోతే బాధపడినట్లు అయ్యాడు.తర్వాత..ఏమీ చెప్పలేదు.." అదీ ఆమె సమాధానం. నా కోసం టీ పెట్టబోయింది..ఇప్పుడు అవి ఏమీ వద్దు అని చెప్పాను.

ఎనభై ఏళ్ళ వృద్ధుడు. కుంగిపోయిన ఆరోగ్యం.సరిగా ఆహారం కూడా ఎప్పుడు తీసుకున్నాడో..ఇంత దూరం నుంచి అక్కడికి ఎలా వెళ్ళి ఉంటాడు.." నాలో నేను తర్కించుకున్నాను.

లిటూ,నేను టాక్సీ లో ఎక్కి ప్రయాణిస్తున్నాం. అంతా నిశ్శబ్దం.నిద్ర,ఆకలి నన్ను బాధిస్తున్నాయి.లిటూ నాకేసి చూసి చిన్న పిల్లాడిలా అడిగాడు "నాన్న అక్కడికి వెళ్ళాడంటావా..?" అని. 

 మేము గంటేశ్వర్ గ్రామం చేరేసరికి సాయంత్రం అయింది.డ్రైవర్ కి ఆ రూట్ కొత్త. లిటూ అప్పటికీ త్వరగా పోనిమ్మని డ్రైవర్ ని తొందరపెడుతున్నాడు. సంత కి వెళ్ళి వస్తున్న గ్రామస్తులు కలిశారు. వాళ్ళ ని అడిగితే కూడా ఏ విషయమూ చెప్పలేకపోయారు. "అయినా మనగోబింద బాబూ..ఇక్కడ కి ఎందుకు వస్తాడు...ఈ గ్రామం లో ఏముందని?" అన్నారు కొందరు.

ఏదో చింతబరికె తో కొట్టినట్లయి,తాబేలు ముడుచుకున్నట్లు గా కారు లోనే కూర్చుండిపోయాను. గ్రామం లోని రహదారి కి చేరేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది. మసక వెన్నెల్లో మా పాడుబడిన ఇల్లు పూర్వ చారిత్రక యుగానికి చెందిన కట్టడం లా అనిపించింది.ఆ పక్కనే ఉన్న ఇంటి లో నుంచి బయటకి వచ్చిన మా బంధువు ఒకామె కి నమస్కరించి మా నాన్న గురించి ఇద్దరం ముక్త కంఠం తో అడిగాం.

"మీ ఇంటి వేపే తిరుగుతూ కనిపించాడు కాసేపటి క్రితం. సాయంత్రం పూజ తర్వాత, టీ పెడతాను అంటే వద్దంటూ వెళ్ళిపోయాడు.." చెప్పిందామె.

తెరిపినపడినట్లయింది ఇద్దరకి..!అయితే అన్నరోగ్యం తో ఉన్న వ్యక్తి ఇంత దూరం ఎలా వచ్చాడబ్బా అని ఆశర్యపోయాము. అయినా ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు..!
 
లిటూ మా పాడుబడిన ఇంటి వైపు వేగం గా వెళ్ళాడు. "నాన్న ఇక్కడ లేడు.." అని అరిచాడు తను.

కొత్తగా గ్రామానికి వచ్చిన కారు చుట్టూ మూగారు పిల్లలు.డ్రైవర్ వాళ్ళని దూరం గా వెళ్ళమని చెబుతున్నాడు.అతని భయం అతనిది.ఏ తుంటరి పిల్లాడో ఏదో పగలగొడితే...లాభం గూబ లోకి వస్తుంది.

మా ఇంటి దగ్గరకి వెళ్ళాను.

మా బాబాయి తన పోర్షన్ తీసేసిన తర్వాత మొత్తం ఇల్లంతా క్రమేణా పడిపోయింది.ఒకానొకప్పుడు మా ఇల్లు ఇది. మా అమ్మ చేపల వేపుడు,రొట్టెలు ఇక్కడ ఈ కిచెన్ లో చేసేది.ఆ వరండా లో నాన్న పుస్తకాలు చదువుతూ కూర్చునేవాడు. ఇవతల ఉన్న మంచం లోనో,అవతల ఉన్న ఖాళీ గది లోనో మేము గోల చేస్తూండేవాళ్ళం.

ఆ కూలిపోయిన గోడ దగ్గర ఎవరో ఆనుకొని కూర్చున్నట్లు తోచింది. చుట్టూతా శాలువా కప్పుకున్నట్లు ఉంది. ఎవరు అది..?

"ఏయ్...లిటూ...టార్చ్ తీసుకు రా" చెప్పాను లిటూ.

అయితే ఆ వ్యక్తిని గుర్తు పట్టడానికి పెద్ద కష్టం కాలేదు. అది మా నాన్న నే..!

ఆయన శరీరం తాకితే చల్లగా ఐస్ లా అనిపించింది. "నాన్న...నాన్న..." అని జీరపోయిన గొంతు తో అరిచాను.

మా బంధువు, ఆమె ని ఆత్తమ్మ అంటాం...ఆమె లాంతరు తీసుకువచ్చింది. కారు దగ్గర ఉన్న పిల్లలంతా పోలోమంటూ వచ్చారు..ఏమిటా అని.

ఆ పాడుబడిన గోడ కి నాన్న శరీరం ఆనుకుని ఉంది. భోజనం చేసి ఎప్పుడూ కూర్చునే ఆ స్థలం లోనే తన ప్రాణాలు వదిలాడు నాన్న.

ఆయన షర్ట్ జేబు లో నుంచి కిందబడిన కాగితాలు చూస్తే వాటిల్లో ప్రత్యేకం గా రాసింది ఏమీ లేదు గాని తాను కట్టలనుకున్న ఇంటి కి సంబందించిన ప్లాన్, డ్రాయింగ్ లు గా వేసుకున్నాడు. ఒకవేపు పెద్ద కొడుకు గది,ఇంకో వైపు చిన్న కొడుకు గది, రెండో కోడలి గది ,పూజా గది ఇలా డ్రాయింగ్ లు వేసి ఉన్నాయి.

అన్ని పేపర్ల లోనూ వాటికి సంబందించిన వివరాలే రాసి ఉన్నాయి. అన్నీ ఇంటి గురించే..!!

(సమాప్తం)      

(Sri Gourahari Das is a renowned journalist and writer belonged to Odisha state. Thanks to him for having translated his stories)

No comments:

Post a Comment