Thursday, November 4, 2021

కసింద చెట్టు (ఒరియా అనువాద కథ)

ఒరియా మూలం: గౌరహరి దాస్

తెలుగు అనువాదం: మూర్తి కెవివిఎస్

-------------------------------------------------

నిజంగా మా లక్ష్మి అమ్మ ఎంత అదృష్టవంతురాలో, ఆ విషయం లో మా గ్రామస్తులు ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. మరి మామూలా,ముగ్గురు మూర్తులు కొలువున్న ఆ శ్రీక్షేత్రాన్ని( పూరీ క్షేత్రాన్ని) ఇంకా ఆ పవిత్ర రథ యాత్ర సన్నివేశాన్ని తన కళ్ళారా చూసి వచ్చింది. మా ఊరి నుంచి కొన్ని వందల మైళ్ళు ఉండే ప్రదేశం అది. ఆమెకి దైవం పట్ల,సాధు సజ్జనుల పట్ల అపారమైన గౌరవం.ఆమె కి ఏమీ కొరత లేదు.కలిగిన కుటుంబమే వారిది,ఆ మాటకొస్తే మా ఊళ్ళో చాలామంది పేద వారే నని చెప్పాలి.

రాష్ట్రం లోని అతి పేద గ్రామాల్లో మాదీ ఒకటి.దానికి కారణాలు అనేకం. సమాజాన్ని,చరిత్ర ని బాగా అధ్యయనం చేసిన వారు బహుశా ఆయా కారణాల్ని బాగా వివరించగలరేమో..! ప్రతి ఏడాదీ వరదలు మా గ్రామాన్ని ఎనిమిది,తొమ్మిది సార్లు ముంచేస్తుంటాయి. గుట్టల మీద పచ్చగడ్డి కూడా మునిగిపోతుంది. ఇకపోతే కరువు వెక్కిరిస్తూనే ఉంటుంది. మేము జీవించాలంటే శ్రమించవలసిందే. అదొక్కటే మార్గం. సగం రోజు బద్ధకించినా నోట్లోకి ముద్ద వెళ్ళదు. నీకు అనారోగ్యమా ,ఎముక విరిగిందా ఇలాంటివేవీ కుదరవు. మరి అలాంటి ఒక గ్రామం లో ఒకరు , వాహనాన్ని బాడుగ కి తీసుకుని ఆ శ్రీక్షేత్రం ని దర్శించి రావడం అంటే కల లో మాట. కొన్ని లక్షల జన్మలకి కూడా జరగని పని. 

 లక్ష్మి అమ్మ వరండా లో చాప పరుచుకుని విశ్రాంతి తీసుకుంటున్నది.కోడలు పక్కనే ఉంది.మనవరాలు ఒళ్ళోకి వచ్చి కూర్చుంది. మలిసంధ్య వేళ. సూర్యుడు అస్తమించబోతున్నాడు. పశువులు మేత కి వెళ్ళి తిరిగి వస్తున్నాయి. వాటి గిట్టల చప్పుళ్ళు గాలిలో కలిసిపోయి లీలగా వినిపిస్తున్నాయి.

లక్ష్మి అమ్మ శ్రీక్షేత్రాన్ని దర్శించి తిరిగి వచ్చిందన్న వార్త గ్రామం లో వ్యాపించింది.అమ్మలక్కలు,పిల్లలు,ముసలివాళ్ళు అంతా ఆమె ఇంటికి వచ్చారు. పనికి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు,నీళ్ళు మోసుకొస్తున్న ఆడవాళ్ళు కూడా అక్కడి కొచ్చి ఆగిపోయారు. వాళ్ళ ఆత్రుత అంతా శ్రీక్షేత్రాన్ని దర్శించుకున్న లక్ష్మి అక్క అనుభవాల్ని విందామనే..!అవన్నీ విన్నాక ఆమె పాదాల్ని తాకి నమస్కరించి,పాదధూళి ని తీసుకుని నుదుట బొట్టు పెట్టుకున్నారు.    

తనకి నమస్కరించిన అందరిని అమె దీవిస్తూ ఉంది. మరో వైపు చెబుతూనే ఉంది. " ఆ శ్రీక్షేత్రం యొక్క గొప్పతనాన్ని ఎంతని చెప్పాలమ్మా...ఇంకా ఎనిమిది మైళ్ళు దూరం ఉందనగానే చైతన్య చెప్పాడు అదిగో చూడమని...ఆ గుడి గోపురం మీద ఎగిరే పవిత్ర ధ్వజాల్ని చూడగానే నా కళ్ళ లో నీళ్ళు తిరిగి,భక్తి భావం తో చేతులెత్తి నమస్కరించాను. ఆ పుణ్య ప్రదేశాన్ని చూడకుండా ఎన్ని జన్మలు గడిచిపోయాయో..! రథ యాత్ర ని తిలకించడానికి ఎంత మంది వచ్చారో...అలాగే నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.అద్భుతం.ఆ బడా దండ లో ఇసక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఒక ఇంటి పై కప్పు ఎక్కి ఆ యాత్రా పర్వాన్ని చూడగలిగాను.అదంతా మా చైతన్య పుణ్యమే.వాడికి ధన్యవాదాలు చెప్పాలి. లేకుంటే నా వల్ల అయ్యేదా..?" 

"నువ్వు పుణ్యాత్మురాలివి లక్ష్మి అమ్మ. మా జీవితాలన్నీ ఇదిగో ఇలా కునారిల్లుతున్నాయి. ఆ అదృష్టం దక్కాలంటే ఎంతో పెట్టి పుట్టాలి" అంటూ వింటున్నవాళ్ళు లక్ష్మి ని పొగడ్తల్లో ముంచెత్తసాగారు.ఆమె కి ఎంతో ఆనందమనిపించింది. ఆమె అంత ప్రయాణం చేసి వచ్చినా మొహం లో అలసట లేదు. ఇంకో తాంబూలం నోట్లో వేసుకుంది చిన్న చెక్కపెట్టి లో నుంచి తీసి..!మళ్ళీ చెప్పసాగింది.      

"బలభద్రుని రథం కొద్దిగా ముందుకు ఉంది.ఆ పక్కనే జగన్నాథ స్వామి రథం. బడా దండ కి చైతన్య నే తీసుకెళ్ళాడు. సుభద్ర అమ్మవారి రథం ని కాసేపు లాగాను.అబ్బా...ఎంత జనాలో...తాడు అలా పట్టుకున్నానో లేదో వెనకనుంచి జనాలు తోసి పారేస్తూనే ఉన్నారు.ఆ జన సముద్రానికి అంతు లేదు. చాలామంది విదేశీయులు ఉన్నారు.ఆ జగన్నాధ ప్రభువు యొక్క రథం చూస్తూ అనుకున్నాను. నన్ను స్త్రీ గా పుట్టించావు. నేను చేసుకున్న పుణ్యమే తప్పా నాకు తోడ్పడేది ఎవరు...నా భర్త గాని,కొడుకు గాని నన్ను ఇక్కడకి తీసుకురాలేదు. మేనల్లుడు చైతన్య తీసుకు వచ్చాడు. నా ఆయుషు కూడా పోసుకుని వాడు చల్లగా జీవించాలి అని కోరుకున్నాను. రథాన్ని లాగిన తర్వాత మళ్ళీ ఇంటి పై భాగానికి చేరుకున్నాను."

కళ్ళకి కట్టినట్లు లక్ష్మి  అమ్మ చెబుతుంటే వినే గ్రామస్తులంతా మైమరిచిపోయారు. పరమానందభరిత వదనులయ్యారు. కొత్తగా ఉద్యోగం లో చేరి తనకి రథ యాత్ర ని చూపించిన మేనల్లుడు చైతన్య కి లక్ష్మి అక్క ధన్యవాదాలు చెప్పుకుంది. 

లక్ష్మి అక్క ని దర్శించి ఆశీర్వాదం పొందడానికి ఇంకా గ్రామస్తులు వస్తూనే ఉన్నారు.పిల్లల్ని చంకన వేసుకువచ్చిన స్త్రీలూ ఉన్నారు. ఆ పిల్లలేమో ఈ జనాల్ని వీళ్ళంతా ఎవరబ్బా అన్నట్లు చూస్తూన్నారు. కొందరేమో వరండా ని ఆనుకుని ఉంటే,మరి కొందరు బయట ఎడ్లబండి ని ఆనుకుని ఉన్నారు.ఏదైతేనేం ఆమె చెప్పే మాటలు వినాలి అని. లక్ష్మి అక్క తప్పా ఈ ఊరి నుంచి పూరి క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు ఎవరూ లేరు.అప్పుడెప్పుడో బెహెరా,సమాల్ కుటుంబీకుల్లోని వృద్ధులు వెళ్ళారట గాని వాళ్ళెవరూ ఇప్పుడూ జీవించి లేరు.  

పక్క ఇంటి లో ఉండే నేత అక్క వచ్చి దర్శనం చేసుకుని "లక్ష్మి అమ్మ...నువ్వు మా పాలిట సుభద్ర అమ్మ వారివి. బడా దండ వెళ్ళావు,తిరిగి వచ్చావు.ఏడేడు జన్మల్లో ని పాపాల్ని కడిగేసుకున్నావు. దయ తో మమ్మల్ని దీవించమ్మా" అంది. ఆమె ఓ వృద్ధురాలు,చీరె ని మెడ చుట్టూ కప్పుకుని ఉంది.మలిసంధ్య వేళ తులసి కోట దగ్గర దీపం పెట్టే సమయం లో అలా కప్పుకుంటారు.

లక్ష్మి అమ్మ సరైన మాటల కోసం తడుముకుంది. తన తీర్థయాత్ర ని వివరించేది గాను,అదే సమయం లో ఎదుటి మనిషి ని ఓదార్చేది గానూ ఉండాలి తను చెప్పేది. అసలు తను జీవితం లో ఎప్పుడూ అనుకోలేదు ఆ శ్రీక్షేత్రం వెళ్ళగలనని,అందునా రథ యాత్ర సమయం లో తీసుకు వెళ్ళేదెవరు..? ఓదార్చుతున్నట్లు గా ఇలా అంది.

"అంతా ఆ దేవుడి కి వదిలెయ్యి అమ్మ..! ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. నీ ప్రమేయం లేకుండానే ఆయన తన దగ్గరకి రప్పించుకుంటాడు.నీకు తెలుసా...ఆ బడా దండ లో ఎంతో మంది కుష్టు రోగులు దొర్లుతూంటారు. వాళ్ళూ ఎంతో దూరం నుంచే వచ్చి ఉంటారు.ఆయన దయ ఉండాలే గాని ఎవరు ఆపగలరు..? ఈ ఇంటి పనులు,రోగాలూ రొష్టులు ఎంత..? ఏమో...ఆయన దయ ఉండాలే గాని వచ్చే ఏడాదే నువ్వు ఆయన దర్శనం చేసుకోగలవు.." 

ఆ నేత అక్క కి వచ్చే ఏడాది అంటే ఆ తరువాత నిముషమే అని తోచింది. ఒకవేళ ఆ వచ్చే ఏడాది అన్నా...దాని కోసం ఆమె ఒక జన్మ అంతా ఎదురు చూస్తుంది. ఎంత కాలమైనా గాని...ఆ అదృష్టం అందరికీ దొరుకుతుందా..!

అలాంటి చిన్న,పెద్ద ఆశలు అవి ఏవైనా గాని అవే మా గ్రామస్తుల జీవితాల్లో దీపాలు వెలిగిస్తుంటాయి. జగన్నాథ ప్రభువు ని ఒక్కసారైనా దర్శించుకోవాలనే కోరిక ప్రతి ఒరియా వ్యక్తి హృదయం లో ఉంటుంది. శ్రీక్షేత్రం వైశిష్ట్యం గురించి లక్ష్మి అక్క చెబుతుంటే ఎవరికైనా మరి తన్మయత్వం ఆవరిస్తుంది.

అందరికీ చెప్పినదే మరల చెప్పి అలసిపోయింది లక్ష్మి అమ్మ . ఇంటికి వచ్చిన తర్వాతనే తప్పా,ఆ శ్రీక్షేత్రం కి వెళ్ళేప్పుడు ఏ మాత్రం అలసట కలగలేదు. అదే చెప్పింది ఆమె సందేహం వ్యక్తపరిచిన వారికి..! " సరే...రేపు నిర్మాల్య (ప్రసాదం అవీ) తెరుస్తాను. అప్పుడు తీసుకుండానికి రండర్రా" అని చెప్పింది చివరకి.   

మలి సందె వేళ అయింది. కోడళ్ళు తులసి కోట దగ్గర దీపాలు వెలిగించారు. సందర్శకులు వెనుదిరుగుతున్నారు. లక్ష్మి అక్క చాప చుట్టేసింది. పోక చెక్కల పెట్టె పట్టుకుని నిలబడింది. సరిగ్గా అదే సమయానికి ఇంటి బయట గుమ్మం దగ్గర ఎవరో నిలబడినట్లు అనిపించింది. చీకటి అవడం తో పోల్చుకోలేకపోయింది.

"ఎవరు అది..?" ప్రశ్నించింది లక్ష్మి అమ్మ.

"నేను..నేను చెమి బవురాని నండి" వినిపించింది ఓ సన్నని గొంతు. బాధ తో అరిచినట్లుగా ఉంది.

ఇంతసేపటి ఆనందమంతా నీరు గారిపోయింది లక్ష్మి అక్క కి..! బక్కెట్టడు చల్లటి నీళ్ళు కుమ్మరించినట్లయింది. ఈ తక్కువ జాతి ది,పిల్లా జెల్లా లేని గొడ్రాలు ఈ బవురాని...ఇది ఇప్పుడు తగలడిందేమిటి. గుమ్మం దగ్గర నిలబడి అపవిత్రం చేస్తున్నట్లు అనిపించింది. జన్మ అంతా కష్టపడి సంపాదించిన అర్జితాన్ని తన్నుకుపోయినట్లు ఫీలయింది లక్ష్మి అమ్మ.

"ఏయ్...అవతలికి పో..! ఈ రాత్రి పూట నీ బాబు వచ్చి కడుగుతాడా ,నువ్వు ఈ వరండా లోకి వచ్చి అపవిత్రం చేస్తే.."   

"మీరు శ్రీక్షేత్రాన్ని దర్శించుకుని వచ్చారని తెలిసి,మిమ్మల్ని కలవాలని వచ్చానమ్మా. నేను పాపాత్మురాలినే. నాకు తెలుసు.అందుకే జనాలు ఉన్నప్పుడు కాకుండా చీకటి పడిన తరవాత వచ్చాను.దయచేసి కొద్దిగా మీ పాదధూళిని తీసుకోనిస్తారా..?" 

"ఏమిటి" 

అదే వేరేవాళ్ళు అయితే లక్ష్మి అక్క అనుమతించేదే.ఆమె మొహం రంగు మారింది.ఈ తక్కువ జాతి మనిషి కి ఎంత ధైర్యం..? దీనికి నా పాదధూళి కావాలా..?

"గొడ్డుబోతు దానా,ఫో అవతలికి..!ఈ గురువారం ఏకాదశి సాయంత్రం పూట నీ వెధవ మొహం చూపించడానికి తగలడ్డావా..? మర్యాదగా పోకపోతే వేడి నీళ్ళు విసురుతా...చెప్తున్నా..!" 

ఆ మాటలు ఏవీ చెమీ బవురాని లక్ష్యపెట్టలేదు. తప్పుగా అనుకోలేదు. గొడ్రాలు అన్నా,వెధ ముండ కానా అన్నా నిజాలేగా.తన భర్త బతికి ఉంటే పిల్లో పీసో కలిగేది.తన విధి అలా ఉంది.లేకపోతే తన భర్త కురుప బవురి ఇంటి ముంగిట ఏడుగురు కొడుకులు,ఒక కూతురు తో హాయిగా ఉండేది.గత జన్మ లో చేసిన ఏ పాప ఫలితమో ఇప్పుడు అనుభవిస్తోంది. లక్ష్మి అక్క తీర్థ యాత్ర చేసి వచ్చింది కనక ఆమె పాద ధూళి తీసుకుంటే కొద్దిగా అయినా నిష్కృతి కలుగుతుందని ఆమె బాధ.అందుకే పరిగెట్టుకు వచ్చింది తను.   

చెమి బవురాని నిజం గానే శాపగ్రస్తురాలు.అన్నీ కోల్పోయిన జీవి.ఎక్కడలేని కష్టాలు ఆమె కి దాపురించాయి. కురుప అనే వ్యక్తి తో పెళ్ళయింది.అతను పెళ్ళి చేసుకున్న మూడో రోజే చనిపోయాడు.అంతకు ముందే తల్లిదండ్రులు పోయారు.ఆమె జీవితం దికు లేని పక్షి లా అయింది. గ్రామస్తులు ఆమె ని దగ్గరకి రానిచ్చేవారు కాదు.దగ్గరికొస్తే ఏదో నాశనం కలుగుతుందని , తమ బిడ్డలకి చెడు కలుగుతుందని భావించేవారు.ఆమె నీడ పడితే మొక్క సైతం ఎండిపోతుందని వాళ్ళ నమ్మకం. మనుషుల్ని తినే మంత్రగత్తె లా చూస్తున్నారు.

అందుకే చెమీ బవురాని సాధ్యమైనంత వరకు పగటి పూట గ్రామస్తులకి కనిపించకుండా మసులుతుంది. ఆమె ఏ పొద్దులో ఎక్కడికి పోతుందో,ఏమి తింటుందో ఎలా జీవిస్తుందో ఎవరూ పట్టించుకోరు.పొద్దున్నే అడవి లోకి పోయి చీకటి పడిన తర్వాత వస్తుంది.అక్కడ ఆమె కందమూలాలు ఏరుకుంటుందో,జంతువులతో మాట్లాడుతుందో ఎవరూ ఆరా తీసేవాళ్ళు లేరు.ఆ స్మశానం చివరన సగం విరిగిపోయిన గుడిసె లో ఆమె నివసిస్తుంది.అదో పెద్ద గుయ్యారం లా ఉంటుంది.అడివి నుంచి వచ్చిన తర్వాత దాంట్లో దూరుతుంది.ఆమె ఉందో,పోయిందో ఎవరూ అడిగేవారు లేరు.

ఆ స్మశానం లో హోరున పెను గాలులు వీస్తుంటాయి.వానలు దంచి కొడుతుంటాయి.కుక్కలు,తోడేళ్ళు భయంకరం గా మొరుగుతుంటాయి.ఆమె చింపిరి చీరె ని అక్కడక్కడ కుట్టుకుని దాన్నే కట్టుకుంటుంది.నిద్ర కూడా రాదు చెమీ బవురాని కి..!ఇలా ఆ స్మశానం లో కుక్క బతుకునీడ్చే బవురాని, శ్రీక్షేత్రాన్ని దర్శించి వచ్చిన లక్ష్మి అక్క పాద ధూళి కోసం వచ్చింది.ఈ జీవితం ఏ కొద్దిగా నైనా మారుతుందేమోనని ఆమె ఆశ.

"ఫో...వెధవకానా..." లక్ష్మి అమ్మ ఏమీ చేయలేని కోపం తో అంది.

చెమి బవురాని బండ లా అలాగే ఉంది.ఆమె చిరిగిపోయిన చీరె పైట కూడా కదిలినట్లు లేదు. పాద ధూళి తీసుకుని తప్పా కదిలేలాలేదు. ఆ బడా దండ ధూళి తీసి వళ్ళంతా పూసుకుని మోక్షం పొందాలని బవురాని కోరిక.ఇక జీవచ్చం లా తాను ఆ కాటి దగ్గర ఉండనవసరం లేదు. ఆమె మళ్ళా అర్ధించింది. 

"మీ కొడుకు కుసుని గారి కోసం అయినా ,కొద్దిగా నన్ను దయ తలచండి.ఇక మిమ్మల్ని ఏమీ అడగను.ఈ జీవితం భరించలేను,విముక్తి కలిగించండమ్మా.."  

లక్ష్మి  అమ్మ ఈ మధ్య కాలం లో పెద్దగా చెమి బవురాని గురించి విన్నది లేదు.పిల్లులు,కుక్కలు,తోడేళ్ళు తిరిగే ఆ స్మశానం దగ్గర ఈమె ఉంటున్న సంగతి అయితే తెలుసు.అలాంటిది ఎకా ఎకి తమ గుమ్మం దగ్గరకి ఇలా వస్తుందని మాత్రం ఊహించలేదు. భగ భగ మండిపోయింది లక్ష్మి అక్క.చెమి బవురాని మళ్ళీ చేసిన విజ్ఞప్తి తన చెవి కి ఎక్కనట్లే ఉంది.

గేటు కి అవతల ఒక రోడ్డు ఉంది.దాన్ని ఆనుకుని రెండు చెట్లు ఉన్నాయి.ఒకటి చింత చెట్టు,మరొకటి కసింద చెట్టు.ఆ కసింద చెట్టు కి పూతా లేదు,కాతా లేదు.దానికింద ఏమీ పెరగట్లేదని కొట్టేయాలనుకుంది. ఎంతోకొంత నీడ ఇస్తుంది కదా మధ్యానం పూట...అలా ఉంటే ఏం పోయింది అన్నాడు తన కొడుకు.ఇది జరిగింది చాన్నాళ్ళ కిందట.

ఈ కసింద చెట్టు లాంటిదే చెమి బవురాని జీవితం.ఎవరికీ పట్టనిది,ఎవరూ కొట్టేయాలని అనుకోనిది. ఆ ఊహా మెదిలింది లక్ష్మి అమ్మ లో..!

ఉన్నట్టుండి ఈ చెమి బవురాని తన కొడుకు పేరెత్తింది. ఇవ్వకపోతే అతనికి ఏమైనా హాని కలుగుతుందా అనే డైలమా లో పడింది లక్ష్మి అమ్మ. సరే...ఏది ఏమైనా తన పాదాల్ని మాత్రం ముట్టుకోనివ్వకూడదు.ఏడు జన్మ లెత్తినా ఆ పాపాన్ని కడుక్కోవడం తన వల్ల కాదు.తన శవాన్ని ఏ అగ్ని కాల్చలేదు,ఏ నీరు తోసుకుపోలేదు.కుక్కలు,గద్దలు పీక్కు తినవలసిందే.అలాంటి పాపం చస్తే చేయదు తను,దీనికి వేరే దారి చూడాలి అనుకుంది.
చివరికి ఓ నిర్ణయానికి వచ్చి ఇలా అంది " చూడు, ఇప్పుడు నేను ఆ కసింద చెట్టు ని తాకుతాను. ఆ తర్వాత నువ్వు కూడా ఆ చెట్టు ని ముట్టుకో.సరేనా..నువ్వు నన్ను ఎలా ముట్టుకుంటావు...అలా నేను పాపం చేస్తే నీకు పుణ్యం వస్తుందా..?నీ కోసం ఈ మాత్రం చేయగలను.ఆ తర్వాత నీ తలరాత.." 

అలా అని లక్ష్మిఅమ్మ  నిస్సత్తువ గా ఆకాశం వైపు చూసింది.తనకి ఆ చెట్టు ని తాకాలని కూడా అనిపించడం లేదు.చెమి బవురాని ఆ తర్వాత దీన్ని తాకితే ఇది కూడా చచ్చిపోతుందేమోనని...అయినా తన పిచ్చి గాని అసలు ఈ చెట్టు ని కొట్టేయాలనే గదా తను మొదట అనుకుంది.ఆ ఆలోచన రాగానే సరే అనుకుంది.

"అలాగే...మంచిది అలాగే చెయ్యండమ్మా, మీ పాదాన్ని ఆ చెట్టు కి తాకించండి " అంది చెమి బవురాని.
లక్ష్మి అమ్మ తన కుడి కాలిని వేగంగా ఆ కసింద చెట్టు కి తాకించింది. కాలితో బవురాని ని తన్నలేక ఆ చెట్టు ని తన్నింది.అంతే తేడా. అలా చేసి ఆమె వెంటనే ఇంటి లోకి వెళ్ళిపోయి గడియ పెట్టుకుంది.

చెమి బవురాని ఆ చెట్టు ని కౌగిలించుకుంది.ఓ పసిదాన్ని పట్టుకుని ముద్దాడినట్లుగా కన్నీళ్ళు కారుతుండగా ఆ చెట్టు ని ముద్దాడింది.ఇంకా ఎన్నో భావాలు.అంతులేని తారల మధ్య చంద్రుడు మెల్లిగా కదులుతున్నాడు. ఆ చల్ల గాలికి కసింద చెట్టు ఆకులు కొన్ని రాలిపడ్డాయి.చెమి బవురాని తన చీరె కొంగు తో ఆ చెట్టు ని తుడిచింది.ఆ క్షణం లో ఆ చెట్టు తన చనిపోయిన భర్త లా అనిపించింది. తల ఆనిచి,ఏదో చిన్న గా మాట్లాడింది.

"దీనికి ఏదో మతే పోయింది" అనుకుంది కిటికీ లోనుంచి చూసిన లక్ష్మి అమ్మ.

చెమి బవురాని వెనక్కి జరిగి మోకాళ్ళ మీద నిల్చుని,నిండుగా నెత్తి మీద చీరె కొంగు వేసుకుని  ప్రార్ధించింది.తలని నేలకి కొట్టుకుంది.వెక్కి వెక్కి ఏడుస్తోంది.ఫాల భాగం రక్తమోడుతోంది.

"నన్ను నీ వద్దకి తీసుకు పో ప్రభూ..ఈ బాధల్ని నేను భరించలేను" అంటూ వేడుకుంది.ఆ దారు బ్రహ్మ చుట్టూ తిరిగింది.  

   లక్ష్మి అమ్మ ఉలిక్కిపడి తటాలున లేచింది,అది అర్ధరాత్రి.కొడుకు,కోడలు పక్క గది లో నిద్ర పోతున్నారు.కుక్క ఇంటి పెరట్లో మొరుగుతోంది.కొడుకు,కోడలు వచ్చారు,చెమటలు కక్కుతూ వణికిపోతున్న ఆమె ని చూశారు. దొంగ ఎవరైనా వచ్చాడా అని గోడ వేపు పరికించారు.అయినా తలుపులు,కిటికీలు చక్కగా వేసి ఉన్నాయి.ఎవరొస్తారు..! 

"నన్ను బయటకి వరండా దగ్గర కి తీసుకు వెళ్ళండి..." అంటున్నది లక్ష్మి అక్క.పదే పదే ఆ మాట నే అంటున్నది.జుట్టు,బట్టలు రేగిపోయి ఉన్నాయి.నోటి పక్కల నుంచి ఉమ్ము కారుతోంది.
 తాంబూలం నమిలింది అంతా కారి ఎర్రగా కనిపిస్తోంది. చూడటానికే అదోలా ఉంది.

"ఈ నడిరాత్రి ఎక్కడికి తీసుకువెళ్ళమంటున్నది.." కోడలు భయం గా అంది.గత పదిహేనేళ్ళ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు ఇంటిలో.
లక్ష్మి అక్క ఎవర్నీ ఖాతరు చేయకుండా బయటకి నడిచింది.ఓ పక్క చీరె ఊడి పొయి ఉంది.కొడుకు,కోడలు ఆమె ని లాంతరు పట్టుకుని అనుసరించారు. వరండా దాటి వీధి లో ఉన్న కసింద చెట్టు దగ్గర తటాలున ఆగింది.

ఆ ముసలామె చెట్టు వేపు చేతులు బార్లా చాచి అన్నది, " చూశావా కుసుని..ఈ చెట్టు కి పూలు ఎంత చక్కగా పూసాయో...గంధపు చెక్క వాసన రావట్లేదూ..ఇదే దారూ బ్రహ్మ...జగన్నాధుని తయారు చేసేది దీని తోనే...నేనెంత పాపం చేశాను.దీన్ని కాలితో తన్నాను.చూడు, తారలన్నీ ఊడిపడి కొమ్మలకి ఎలా ఊగుతున్నాయో...మొక్కుకో...కుసుని.." అలా అంటూ ఆమె తటాలున కిందపడింది.ఈ అర్ధరాత్రి ఇదేమిటి అనుకున్నారు కొడుకు,కోడలు.ఆ చెట్టు కి చూస్తే పూలు లేవు,తారలూ లేవు.ఇక గంధపు వాసన ఎక్కడిది..?

పక్కనే ఉన్న బావి లో నుంచి బకెట్ తో నీళ్ళు తోడి అత్తగారి మీద పోసింది కోడలు. చాలా సేపటికి స్పృహ లో కొచ్చింది." చెమి బవురాని ని పిలవండి..." అంటూ ఆ చెట్టు కేసే చూడసాగింది.అలా పదే పదే అని మళ్ళీ స్పృహ కోల్పోయింది లక్ష్మిఅమ్మ.   

చెమి బవురాని...? కుసుని తన చెవుల్ని నమ్మలేకపోయాడు.అమ్మ ఆమె పేరు ని తల్చుకోవడం ఏమిటి అని విస్తుపోయాడు.అసలు ఆ చెమి బవురాని బతికి ఉందో లేదో తనకైతే తెలియదు.

ఇవతల తల్లి స్పృహ కోల్పోయి ఉంది.ఇంకా సరిగా తెల్లవారలేదు.చీకటి గానే ఉంది.తను చెమి బవురాని ని ఎలా దొరకబుచ్చుకోవడం..?

కుసుని చుట్టుపక్కల వాళ్ళని కొంతమందిని వెంటబెట్టుకుని స్మశానం వైపు వెళ్ళాడు.అంతా ఆబ గా వెదుకుతున్నారు చెమి బవురాని కోసం.పగిలిన కుండ ముక్కలు,పుర్రెలు,చింకిపోయిన చాపలు,చీపుళ్ళు,బొగ్గుముక్కలు దర్శనమిస్తున్నాయి.ఎక్కడ చూసినా అవే...ఇంతకీ చెమి బవురాని ఎక్కడ..?

చెమి బవురాని ఇల్లు...అదే విరిగిపొయి ఉన్న గుడిసె...అది పూర్తి గా నేలకి ఒరిగిపోయి ఉంది.చెమి బవురాని... చూడబోతే....ఈ లేలేత ఉదయపు గాలి లో కరిగిపోయిందేమో..!!!

(సమాప్తం) 

(Sri Gourahari Das is a renowned journalist and writer belonged to Odisha state. Thanks to him for having translated his stories)

No comments:

Post a Comment