Thursday, November 18, 2021

అధునిక మహారచయిత దోస్తోవిస్కీ


 రష్యన్ మహా రచయిత దోస్తోవిస్కీ కి ఈ నెల 11 వ తేదీ కి సరిగ్గా 200 ఏళ్ళు. ద్విశత జయంతి ఉత్సవాలు జరుతున్న ఈ సంవత్సరం ఆయన అభిమాన పాఠకులందరికీ చాలా ప్రత్యేకమైనది. ఒక్క రష్యా దేశమనే కాదు,యావత్తు ప్రపంచం లోనే ఆయన అభిమాన పాఠక గణం లెక్కకు మిక్కిలిగా ఉంటుంది. 170 భాషల్లోకి అనువాదమై,ఒకవైపు మేధావులైన బుద్ధిజీవుల్ని మరో వైపు సామాన్య పాఠకుల్ని అలరించి ప్రభావం చూపిన, చూపిస్తూన్న అసామాన్య రచయిత ఫ్యొదోర్ దోస్తోవిస్కీ, మాస్కో శివారు గ్రామం లో నవంబర్11 వ తేదీన,1821 వ సంవత్సరం లో జన్మించాడు. 

దోస్తోవిస్కీ అనే ఆయన ఇంటి పేరు ప్రస్తుతం బెలారస్ లో ఉన్న దోస్తోజ్ఞిక్ అనే గ్రామం వల్ల వచ్చింది. ఆ ప్రదేశం లోని గ్రామాన్ని ఆయన పూర్వీకులు అప్పటి పాలకుల నుంచి బహుమతి గా పొందారట.అది కొన్ని వందల ఏళ్ళ కిందటి మాట.ఆ తర్వాత ఆయన తండ్రి తరం వచ్చేసరికి మధ్య తరగతి కుటుంబం గానే అవతరించి అన్ని రకాల సాధక బాధకాలు చవి చూశాడు.   ఆయన 12 నవలలు,4 నవలికలు,16 కథా సంపుటులు ఇంకా లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు. 

దోస్తోవిస్కీ వ్యక్తిగత జీవితం ని పరిశీలించినట్లయితే ఆయన ప్రఖ్యాతి వహించిన రచనలు అన్నిటి వెనుక దాని ప్రభావం బలం గా కనబడుతుంది.నిజజీవితం లో ఎపిలెప్సీ అనే వ్యాధి వల్ల చాలా బాధపడ్డాడు.దీనికి తోడు గేంబ్లింగ్ కి అలవాటు పడటం,దానివల్ల అప్పులు కావడం,దానితో ఉపశమనానికి మందు ని ఆశ్రయించడం ఇవన్నీ గొలుసుకట్టు గా జరిగిపోయాయి.అయితే ఆయన వ్యక్తిగత జీవితం అదే సమయం లో ఎంతో మానవీయం గానూ ఉండేది.పేదల పట్ల,దీన జనుల పట్ల ఎంతో కరుణా హృదయం తో మెలిగేవాడు.జార్ చక్రవర్తి కి వ్యతిరేకం గా వ్యాసాలు రాసినందుకు సైబీరియా కి ఖైదీ గా వెళ్ళి చావు ని అతి సన్నిహితంగా చూశాడు. ఆ అనుభవాల్ని The house of the Dead లో రాశాడు.  మనిషి భౌతిక ప్రపంచం లోనూ,ఆంతరంగిక ప్రపంచం లోనూ ఎందుకని అంతులేని కష్టాలు పడుతున్నాడు అని చింతించి తనదైన రీతి లో ఆయన రచనల్లో వాటిని పొందుపరిచాడు.

Crime and Punishment అనే నవలనే తీసుకుంటే దాంట్లోని ప్రతి పాత్ర ఒక ఐకాన్ గా నిలిచిపోయింది. ఒక్కమాట లో దాని కథ ని చెప్పమంటే ఎవరైనా ఏమి చెబుతారు..? రస్కోల్నికోవ్ అనే హీరో ఒక హత్య చేస్తాడు.లేదు రెండు హత్యలు చేస్తాడు.విట్నెస్ గా ఉంటుందని లిజవెట ని కూడా హత్య చేస్తాడు గదా. ఆ తర్వాత అతను అనుభవించే మానసిక చిత్ర హింస మామూలు గా ఉండదు.అది భౌతిక అనారోగ్యానికి దారి తీస్తుంది.భ్రాంతులు కలిగిస్తుంది.నిద్ర నో,మెలకువ నో తెలియని లోకం లో జీవిస్తాడు.ఈ చిత్ర హింస కంటే తప్పు ని ఒప్పుకుని శిక్ష పొందడమే హాయిగా ఉంటుందని భావించి చివరకి ఆ పనే చేసి సైబీరియా కి ఖైదీ గా వెళ్ళిపోతాడు.   

1866 వ సంవత్సరం లో రాసిన ఈ నవల గొప్ప క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయిందీ అంటే దాని వెనుక కారణాలు అనేకం ఉన్నాయి.నవల లో అనేక అంతర్లీనమైన ఉప కథలు కనిపిస్తాయి.ఇవి అన్నీ కూడా సార్వజనీనమై మన ఇంటి పక్కనో,ఇంటి లోనో జరుగుతున్నట్లు గానో ఉంటాయి.ఉదాహరణ కి ప్రధానపాత్ర రస్కొల్నికోవ్ ఒక యూనివర్శిటీ విద్యార్థి.పీటర్స్ బర్గ్ లో కథంతా నడుస్తూంటుంది. తండ్రి లేని కుటుంబం.తల్లి కి 125 రూబుళ్ళు పెన్షన్ వస్తుంది.దానితోనే ఎంతో పొదుపు గా జీవిస్తుంటారు.ఇతని వద్దా సరిగ్గా డబ్బులాడని స్థితి.మిగతా వాళ్ళతో పోలిస్తే పేదరికాన్ని సూచించే దుస్తులు,కాని ఆత్మాభిమానం ఎక్కువ.ఎవర్నీ ఏదీ ఊరికినే అడగడు.

తను పేదరికం లో ఉండటం వల్లనేమో ఏ డబ్బున్నవారిని చూసినా అతనికి ఒక కోపం.న్యూనతా భావం.అప్పటికే తన వద్ద ఉన్న కాసిన్ని వస్తువులు తాకట్టు పెట్టాడు.వాచీ ల్లాంటివి. ఇంటి అద్దె కొన్ని నెలలు బాకీ పడ్డాడు.ఓనరమ్మ ని తప్పించుకు తిరుగుతుంటాడు. ఇంతలో పులి మీద పుట్ర లా తల్లి ఉత్తరం. తమ కష్టాల్ని ఏకరువు పెడుతూ దీనం గా రాస్తుంది.సోదరి దూన్య ,లూజిన్ అనే అతడిని పెళ్ళాడాలని అనుకుంటూందని సారాంశం. రస్కోల్నికోవ్ కి మండి పోతుంది. సోదరి లూజిన్ అనేవాడిని చేసుకోవడం ఇతనికి ఇష్టం ఉండదు.అలాగని ఆమె కి పెళ్ళి చేయగల స్థోమత తనకి ఉందా అంటే లేదు.తన నిస్సహాయత కి తనపైన చికాకు పుడుతుంది.      

ఆ బాధ భరించలేక ఒక పానశాల కి వెళతాడు.అక్కడ మందు సేవిస్తూ పక్క వాళ్ళు మాట్లాడే మాటలు వింటాడు.ఆ ఊళ్ళో వడ్డీకి డబ్బులిచ్చే అల్యోనా ఇవనోవా అనే ఆవిడ గురించి వింటాడు.పరుల్ని జలగలా పీల్చే అలాంటి దోపిడీపరురాల్ని చంపి ఆ డబ్బు తీసుకున్నా ఫర్వాలేదని అది తమ లాంటి పేదలదేనని  నిర్ణయించుకుంటాడు. ఆ ఆలోచన ని ఆచరణ ని అమలు చేస్తాడు.ఇక ఆ తర్వాతనుంచి మొదలవుతుంది అసలు కథ.మనిషి మనసు ఏమిటి...దాని డైమన్షన్లు ఎలా ఉంటాయి అన్నది...గొప్ప మానసికవేత్త లా చెప్పుకుపోతాడు.కలలు,చిత్త భ్రమలు,వేదనలు వీటిని వర్ణించిన పద్ధతి సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాడినే అభిమానిగా మార్చాయి.

అలాగే తాగుబోతు క్లర్క్ మర్మలదోవ్,అతని దీన గాధ మనల్ని ఆలోచింపజేస్తుంది.రస్కోల్నికోవ్ మిత్రుడు రజుమిఖిన్ మనలో భాగమైపోతాడు.స్విద్రిగైలొవ్ ది ఒక గాధ.సోన్యా కుటుంబాన్ని ఆదుకునే తీరు,కేథరిన్ ఇవనోవ్న బతికి చెడ్డ విధానం ఇలా ప్రతి పాత్ర లోతు గా మనోఫలకం పై ముద్ర వేస్తుంది. సంభాషణలు పలికే తీరు లో ప్రతి పాత్ర కి ఒక శైలి ఉంటుంది.కొన్నిసార్లు పఠిత కి కన్నీళ్ళు వస్తాయి.రస్కోల్నికోవ్ తల్లి రాసిన ఉత్తరం చదివితే మనసు ద్రవీభూతమౌతుంది.ఇది నవల మొదటి భాగం లోనే ఓ పదిపేజీలు దాకా ఉంటుంది.ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నవల సైకలాజికల్ థ్రిల్లర్ వంటిది.ప్రతి పేజీని చదివితేనే దాని గొప్పదనం అనుభవం లోకి వస్తుంది.

సరే...దోస్తోవిస్కీ రాసిన ప్రతి నవల ఏదో కోణం నుంచి ఆణిముత్యమే అని చెప్పాలి. ప్రస్తుతానికి దీని గూర్చి చెప్పుకున్నాం.భవిష్యత్ లో మరిన్నిటి గురించి చెప్పుకుందాం.పుష్కిన్,గొగోల్,డికెన్స్,బాల్జక్ వంటి రచయితలంటే ఆయనకి బాగా యిష్టం.తన తమ్ముడి తో కలిసి Epoch అనే పత్రిక ని నడిపి నష్టాలు రావడం తో దాన్ని విరమించుకున్నాడు.

దోస్తోవిస్కీ జీవితం ఒక సినిమా కథ కంటే గమ్మత్తు గా ఉంటుంది.ఆ సన్నివేశాల కూర్పు తో పెరంపడవుం శ్రీధరన్ అనే మళయాళ రచయిత "ఒరు సంకీర్తనం పోలె" అనే పుస్తకాన్ని 24 ఏళ్ళ క్రితం రాయగా అది రెండున్నర లక్షల ప్రతులు అమ్ముడై సంచలనం సృష్టించింది. Like a Psalm అనే పేరు తో అది ఇంగ్లీష్ లో కూడా ప్రచురితమయింది. ఫ్రాంజ్ కాఫ్కా కి దోస్తోవిస్కీ అంటే ఎంత అభిమానమంటే నాకు ఉన్న రక్త సంబంధం ఆయన అని రాశాడు.ఆధునిక వచనం ని పరిపుష్ఠం చేసిన మహా రచయిత గా జేంస్ జాయిస్ అభివర్ణించాడు.

---- మూర్తి కెవివిఎస్     

(ఆధునిక మహా రచయిత ఫ్యోదోర్ దోస్తోవిస్కీ ద్విశత జయంతి సందర్భం గా ఈ వ్యాసం, 15.11.2021 Nava Telangana Daily)

No comments:

Post a Comment