వెనక్కి తిరిగి చూసినపుడు..!
------------------------------
--- మూర్తి కెవివిఎస్ | 15.1.2022
ఎప్పుడో చిన్నప్పుడు
కలిసి చదివిన మిత్రులు
కలిసినపుడు ఎక్కడికో జ్ఞాపకాలు
తీసుకువెళతాయి-
అక్కడ ఎప్పుడూ నేను
పిల్లవాడినే,యవ్వనుడినే,నిత్య ప్రేమికుడినే-
యాభైలు దాటేసి
అప్పుడే అరవైల లోకి వెళుతున్నానా
అనుకున్నపుడు
శరీరం లో మరొకరు ఎవరో నిద్రలేచి
బరి లో నిలిచిన సంక్రాంతి పుంజు లా
ఉరిమి చూస్తుంటారు-
నువు నాకు మొదటి వాడివి కావు
చివరి వాడివి కావు
నేనెవరిని విడిచిపెట్టను రా అబ్బాయ్ అంటూ
కాలం, నెరిసిన గడ్డం లో నుంచి
చిరునవ్వు విరబూయిస్తుంది-
నాతో కలిసి చిగురించిన
కొన్ని ఆకులు అప్పుడే రాలడం మొదలెట్టాయి
పుష్పించిన నక్షత్రాలు తెల్లారేసరికి
మాయమైనట్లు-
వెనక్కి తిరిగి చూసుకుంటే
ఎన్ని ప్రేమలు- ఎన్ని వ్యామోహాలు
ఎన్ని జయాలు- ఎన్ని అపజయాలు
సర్వమూ ఎక్కడో ఓ బిందువు లో
లయించి నర్తిస్తున్నట్లు-
------------------------------
అక్షర సత్యం
ReplyDelete