Monday, June 6, 2022

సరిపోయింది (అనువాద కథ)

ఒరియా మూలం : గౌరహరి దాస్

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్


అనుపమ్ తనచుట్టూ ఇటుకలు ఎక్కడ కనబడినా పరిశీలిస్తుంటాడు. కొన్ని కుప్పలుగా ఉంటాయి,కొన్ని చెల్లా చెదురుగా ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇటుకలే కనిపిస్తున్నాయి. బిల్డింగ్ లు కట్టాలన్నా,పెద్ద గోడలు కట్టాలన్నా ఇటుకలు కావాలిసిందే. మనుషులు కూడా ఇటుకల వంటివారే.ఇటుకలు మనిషి యొక్క ప్రగతి ని తెలియజేస్తాయి.పురోగమిస్తున్న నాగరికత ని తెలియజేస్తాయి.ఎక్కడో గ్రామాల నుంచి ఈ నగరం దాకా సాధించిన నాగరికత కి చిహ్నం లా కనిపిస్తాయి.

ఇటుకలు ఒక జాతి సాధించిన అభివృద్దిని తెలుపుతాయి.అవి ఎంత పాతవైతే అక్కడి నాగరికత అంత గొప్పదని అర్థం.జీవితం లో తనూ ప్రగతి ని సాధించాడు.ఈ ఎత్తైన బిల్డింగ్ లాగే తనూ ఎదిగాడు.ఒక కోట లాంటి గొప్ప కట్టడం లా..!

అనుపమ్ తన ఆఫీస్ లోని గాజుకిటీకీల గుండా బయటకి చూశాడు. శుభ్రంగా ఉన్న లాన్స్,తోట,కొబ్బరి ఇంకా మావిడి చెట్లు కనిపించాయి.ఇంకొద్దిగా ముందుకు చూస్తే సెక్రెటేరియెట్ ఇంకా ఆ తర్వాత ఇందిరా పార్క్,జన్ పథ్ లు కనిపిస్తాయి. తన ఎయిర్ కండీషండ్ ఆఫీస్ రూమ్ ని మరో మారు పరిశీలించాడు.క్లీన్ గా ఉంది.ఇక్కడ తనే బాస్.తన రూమ్ లో నుంచి బయటకి చూస్తే ప్రపంచం మ్యూజియం లో వేలాడే చిత్రపటం లా కనిపిస్తుంది. ఏ దృశ్యానికదే ప్రత్యేకం. రోడ్దు మీద చెమటోడ్చే రిక్షా కార్మికులు,ఎప్పుడూ బిజీ గా పరిగెత్తే క్లర్క్ లు,అలర్ట్ గా ఉండే గార్డ్ లు...అలా! ఎండ నలభై రెండు డిగ్రీలు దాటితే జనాలు పల్చబడతారు.   

అనుపమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో డెప్యూటి సెక్రెటరీ. మంచి పలుకుబడి ఉన్న అధికారి గా పేరు సంపాదించుకున్నాడు. తన క్లాస్ మేట్ మనగోవింద దాస్, హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత తన సుపీరియర్ అధికారి కంటే తను పవర్ ఫుల్ గా మారాడు. సుపీరియర్ కి తనంటే అసూయ.అది తల్చుకుంటే అనుపమ్ కి ఇంకా సంతోషం గా ఉంటుంది.అధికారం అనుభవించే వాళ్ళంటే ఎవరికైనా అసూయ ఉండటం సహజమే గదా..!

గత యేడాది కియోంజర్ జిల్లా కి గాని,అంగూల్ జిల్లా కి గాని కలెక్టర్ గా వెళ్ళాలని ప్రయత్నించాడు. కాని ముఖ్యమత్రి కార్యాలయం నుంచి ఆమోదముద్ర పడకపోవడం తో కుదరలేదు.ఆ వెనకబడ్డ బోలంగీర్ జిల్లా కి వెళ్ళినా టిటిలాగడ్ లాంటి ఏరియా కి నీటి సమస్య తీర్చడానికే తన శక్తి అంతా ధారబోయాలి.

ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ గా ఉంటే,అసలు ఆ దర్జా యే వేరు.ఆ మజా ఈ డెప్యూటి సెక్రెటరీ ఉద్యోగం లో ఉండదు.తన పైన ఉండే సెక్రెటరీ,అడిషనల్ సెక్రెటరీ లు తనని ఇక్కడ ఓ క్లర్క్ లా చూస్తారు.సరే,ఇపుడు నాటకీయం గా పరిస్థితుల్లో మార్పు రావడం తో అధికార క్రీడ లో ముందున్నాడు.

ఎదుటివాళ్ళు తన ప్రాధాన్యత ని గుర్తిస్తేనే గదా ఉద్యోగం లో కిక్కు ఉండేది. సెక్రెటేరియట్ క్లబ్ లోనూ ఇంకా ఇతర అసోసియేషన్ ల లోనూ బిజీ గా ఉంటూ తన వెయిట్ చూపిస్తుంటాడు.తనకి పనికి వచ్చే వాళ్ళు కూడా అక్కడ పరిచయమవుతుంటారు.నిజం చెప్పాలంటే తన అవసరాలకి అనుగుణం గా వాటిని మలుచుకుంటాడు.

బిజినెస్,పాలిటిక్స్,లా,అడ్మినిస్ట్రేషన్ ఇలా అన్ని రంగాల్లోనూ తన భార్య యొక్క బంధువులు మంచి స్థానాల్లో ఉన్నారు.ఇంకా కొంత మంది స్నేహితులు కూడా..!కాబట్టి సునాయసం గా తన పనులు చక్కబెట్టుకుంటాడు.అలా చాలా విషయాల్లో సక్సెస్ ని అందుకున్నాడు.     

 అయితే తండ్రికి మటుకు తన వ్యవహారశైలి నచ్చేది కాదు. కారణం అనుపమ్ తన భార్య ని తానే సెలెక్ట్ చేసుకున్నాడు.తండ్రి పాతకాలపు మనిషి.దేన్నీ అంత త్వరగా ఆమోదించడు.ఎన్నో సంబంధాలు అనుకుని చివరకి మితాలి ని చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు అనుపమ్.తండ్రి కి అది ఒక షాక్ లా అయింది.తనకి మంచి అకడమిక్ రికార్డ్ ఉంది.తను చేసుకోబోయే అమ్మాయి తనని ఇంకా పైకి చేర్చడానికి ఉపయోగపడాలి తప్పా మరోలా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.అనుపమ్ వైఖరి అతని తండ్రికి అంతుబట్టలేదు. 

ఆ తర్వాత తండ్రికి తనకి దూరం పెరగసాగింది.చిన్న విషయాలే పెద్దవి అయ్యాయి.ఆయన తనని ఏమీ అనలేదు గాని మాటలు లేకుండా దూరం గా ఉండిపోయాడు తన గ్రామం లోనే..! భువనేశ్వర్ కి రావడం మానేశాడు.ఏదైనా అవసరం ఉంటే అంతా ఫోన్ ల మీదనే నడిచేది.అంతే.అనుపమ్ జీవితం హాయి గా సాగిపోతోంది.   

ఈ ప్రపంచం లో ఎవరి జీవనశైలి వారికుండాలి. మనిషి సక్సెస్ అయితేనే అలాంటిది కుదిరేది. తండ్రి తో గాని,మిథాలి తో గాని ఎవరితోనైనా సరే తన ధోరణి ఒకటే.తన మాటే పైన ఉండాలి,అంతే.ఎలా చేస్తున్నాం అన్నది కాదు,పని అయిందా లేదా అన్నదే ప్రధానం.

ప్యూన్ ఇంతలో వచ్చి ఎవరో వచ్చినట్లు చీటి ఇచ్చాడు.చికాగ్గా అనిపించింది.పొద్దున పూట తను వేరే ప్రొగ్రాంస్ ఫిక్స్ చేసుకుంటాడు. తను కొత్తగా కట్టబొయే ఇల్లు విషయమై ఆర్కిటెక్ట్ తో మాట్లాడాలి.ఆ వచ్చిందెవరు అంటూ ప్యూన్ ని అడిగి,గోడ గడియారం వేపు చూస్తే పన్నెండున్నర అవుతోంది.

అనుపమ్ ఆఫీస్ సమయం లో మొదటి అర్ధభాగాన్ని తన సొంతపనులు చూసుకోవడానికి,రెండవ అర్ధ భాగం ఆఫీస్ పనులకి కేటాయించుకుంటాడు.టెలిఫోన్ బిల్లులు కట్టడం,కరెంట్ బిల్లులు కట్టడం,బెర్త్ రిజర్వేషన్ లు చేయించడం అన్నీ ఆఫీస్ వేళల్లోనే చేస్తాడు.ఇంట్లో సమయాన్ని ఇలాంటి వాటికి వేస్ట్ చేయడు.ఆఫీస్ ఫోన్ ని,ఆఫీస్ సమయాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిస్తాడు.

ప్యూన్ ఒక స్లిప్ తీసుకొచ్చి ఇచ్చాడు.దాంట్లో అరబింద మొహంతి కేరాఫ్ పుష్పాంజలి అని రాసి ఉంది.అనుపం మోము లో చిరునవ్వు విరిసింది.ఎవరీ పుష్పాంజలి..?నాకు అరబింద మొహంతి ని పరిచయం చేస్తోంది అనుకున్నాడు. ఆ పేరు కింద తాళబంధ అనే ఊరిపేరు చదవడం తో ఒక్క క్షణం స్థాణువైపోయాడు. 

తాళబంధ..! పుష్పాంజలి..!ఇన్నేళ్ళ తర్వాత తాను ఎందుకు గుర్తువచ్చాడో..!ప్యూన్ ని పిలిచి ఆ వ్యక్తిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు.

మే ఐ కమిన్ సార్ అంటూ అడుగుతూ అరబింద లోపలికి వచ్చాడు.ఎత్తుగా,బక్కపల్చగా ఉన్నాడతను.ఎలాంటి శక్తీ లేదు ఆ రూపం లో.అనుపమ్ కి నమస్కరించాడు.

"ప్లీజ్ టేక్ యువర్ సీట్ " అన్నాడు అనుపమ్ మర్యాదగా. ఇతగాడు పుష్పాంజలి భర్త అయి ఉంటాడని ఊహించాడు.

"పుష్పాంజలి మీకు..." ఎందుకైనా మంచిది కంఫాం చేసుకుందామని అడిగాడు అనుపమ్.

"సార్...పుష్పాంజలి నా భార్య.పెళ్ళి చేసుకున్నతర్వాత ఆమె పేరు పుష్పాంజలి మొహంతి అయింది.ఆ రోజుల్లో ఆమె పేరు పుష్పాంజలి దాస్.మీరు నా భార్య కి బాగా తెలుసని చెప్పింది" చెప్పాడు అరబింద.

అనుపమ్ సంతోషించాడు.పుష్పాంజలి కి తాను గుర్తు ఉన్నందుకు.పైగా దాన్ని ఆమె భర్త కి చెప్పినందుకు.ఇప్పుడు ఆమె ఎలా ఉందో..? ఆసక్తి గా అనిపించింది.పాత జ్ఞాపకాలన్నీ ముంచెత్తాయి.బయటకి మాత్రం గంభీరం గా మొహం పెట్టాడు.తాను ప్రస్తుతం ఒక అధికారి.కొత్తవ్యక్తి ముందు బయటపడిపోతే ఎలా..?

"నాతో ఏమైనా పని ఉందా..?" ఉదాసీనం గా అడిగాడు అనుపమ్.   

"సార్...సార్..." అంటూ అరబింద తన బ్యాగ్ లోని కాగితాల దొంతర ని బయటకి తీశాడు.ఆ పేపర్లు మాసిపోయి ఉన్నాయి అరబింద లాగే.వాటి మీద సంతకాలు,రబ్బర్ స్టాంప్ ముద్రలు.తన సక్సెస్ ని,ఎదుటి వారి దైన్యాన్ని గమనించినప్పుడు అనుపమ్ లో ఒక సంతృప్తి కలుగుతుంది.ఎదుటివారి పేదరికం ఇంకా ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. తాను అధికారి.ఎదుటి వ్యక్తి తననుంచి తీసుకునే స్థాయి లో ఉన్నాడు.

పుష్పాంజలి,అనుపమ్ కి ఒకానొకప్పటి ప్రేయసి.చదువుకునే రోజుల్లో.

"అసలేమిటి..మీ ప్రాబ్లం..?" ప్రశ్నించాడు అనుపమ్.

అరబింద తడబడ్డాడు.ఎక్కడినుంచి మొదలుపెట్టాలో అర్ధం కాలేదు.అనుపం ని చూస్తే ఎక్కువ టైం ఇచ్చేలా లేడు.ఏదేమైనా తను లక్కీ. డెప్యూటీ సెక్రెటరీ ని స్వయం గా కలిసే అవకాశం దొరికింది.పని అవుతుందా కాదా అన్నది తర్వాత..!గతం లో భార్య తో తగదా పడినపుడు ఎన్నో తిట్టేవాడు...నా కన్నా గొప్ప ఆఫీసర్ ని చేసుకోకపోయావా అని.ఈ రోజున భార్య వల్లనే ఈ అనుపమ్ ని కలుసుకోగలిగాడు.డెప్యూటీ సెక్రెటరీ ని కలిసే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది..? 

కాఫీలు,జీడిపప్పు,బిస్కెట్లు వచ్చాయి.నిజానికి ఎవరికి కాఫీ ఇవ్వాలి,జీడిపప్పు ఇవ్వాలి,బిస్కెట్లు ఇవ్వాలి అనేదానికి అనుపమ్ మనసు లో ఒక లెక్క ఉంటుంది.దానికి ఓ సీక్రెట్ కోడ్ ఉంటుంది.తన దగ్గర ఉన్న అసిస్టెంట్ తన సైగల్ని బట్టే అర్థం చేసుకుంటాడు.

తనకి లభించిన ఆతిథ్యానికి పొంగిపోయాడు అరబింద.గత పదేళ్ళనుంచి మిగతా తన కొలీగ్స్ అయిన హెడ్ మాస్టర్స్ తో పోల్చుకుంటే పే తక్కువ వస్తోంది.హై కోర్ట్ లో కేసు వేసి గెలిచానని,మినిస్టర్లని,సెక్రెటేరియేట్ అధికారుల్ని ఎన్నిసార్లు కలిసినా పనికావడం లేదని వాపోయాడు అరబింద.ఇరవై వేల దాకా లంచాలు ఇచ్చానని కూడా చెప్పాడు.పేస్కేల్ కనక ఇస్తే ఎరియర్స్ మొత్తం లక్ష దాకా వస్తాయని...తన తండ్రి అనారోగ్యం తోఉన్నాడని...దయతలచి ఈ విషయం లో తనకి హెల్ప్ చేయవలసిందిగా వివరించాడు అరబింద.తన భార్య చెప్పడం వల్ల మిమ్మల్ని కలవడానికి వచ్చానని కూడా చెప్పాడు.    

అనుపమ్ , అరబింద మాటలు వింటున్నాడే గాని మనసు అంతా పుష్పాంజలి వేపు వెళ్ళిపోయింది.ఆమె ఒకప్పుడు తన ప్రియురాలు.తాను పైకి రావడం లో ఆమె ప్రోత్సాహం ఉంది.పైకి వచ్చిన తర్వాత తన దారి తాను చూసుకున్నాడు. ఆమె ఆలోచనల్ని తుడిచేశాడు.

ఆమె గుర్తుకు రాగానే ఒక నిస్పృహ వంటిది కలిగింది. అలా ఎందుకు అనిపిస్తోంది..?తాను ఆమె పట్ల వ్యవహరించిన తీరు వల్లనా..?తాను మిథాలీ ని చేసుకుని హాయిగా ఉన్నాడు. అయితే మరోవేపు పుష్పాంజలి అవివాహిత గా మిగిలిపోయి తనకోసం ఎదురు చూస్తూన్న తలంపు.కానీ తీరా చూస్తే పుష్పాంజలి కూడా పెళ్ళిచేసుకుంది.అయితే తాము ఉన్నంత పై స్థాయి లో అయితే లేదు గదా,అనుకున్నప్పుడు సంతృప్తి గా తోచింది. అరబింద చెప్పవసిందంతా చెప్పేసి మిన్నకున్నాడు. అతను చూడటానికి నిస్సహాయం గా అనిపించాడు.ఇలాంటి వాళ్ళు ఎవరి మీదా తిరగబడలేరు,మహా అయితే తలరాత ని నమ్ముకుని కోర్ట్ లకి వెళతారు.లేదా గుళ్ళూ గోపురాలకి వెళుతూ బాధ నుంచి ఉపశమనం పొందుతారు.

"సరే...ఆ పేపర్లకి సంబందించిన జిరాక్స్ కాపీలు నాకిచ్చి వెళితే,నేను చేయగలిగింది చేస్తాను.వారం తర్వాత మళ్ళీ ఓసారి కనబడండి" అన్నాడు అనుపమ్.

"మీ గురించి ఎంతో విన్నాను సర్.మీరు చదువు కునే రోజుల నుంచి మంచి బ్రిలియంట్ అని,స్పోర్ట్స్ మన్ అని మీ ప్రాంతం వాళ్ళు చెబుతుంటారు.మీ గురించి పుష్పాంజలి కూడా చెప్పింది.ఈ రోజు చూశాను ఎంత మంచివారో..!దయచేసి ఈ పనిని చేసిపెట్టండి" అంటూ చెప్పిన తర్వాత,అరబింద వెళ్ళిపోయాడు.పుష్పాంజలి తన గురించి భర్త దగ్గర చెప్పినందుకు సంతోషమనిపించింది అనుపమ్ కి..!

ఒకమాటకి,తన భార్య తన పాత లవర్ గురించి చెబితే తను సహించగలడా..? నో..నెవర్..!జరగని పని.కాని పుష్పాంజలి మొగుడు పూర్ హెడ్మాస్టర్.భరించక తప్పదు అనుకున్నాడు.

ఆ రోజు...ఆ చివరి రోజు...పుష్పాంజలిని కలిసిన ఆఖరి రోజు,ఎలాంటి వివరణలు లేకుండానే ఆ బంధం తెగిపోయింది.తను అనుకున్నట్లుగానే జరిగింది.ఇతర లవర్స్ మాదిరి గా అరిచి గీపెట్టడం ఏమీ చేయలేదు.ఆమెకి తను రాసిన ఉత్తరాల్ని,దిగిన ఫోటోల్ని,బహుమతుల్ని ఊరి పక్కన పారే నది లో విసిరేసింది.ఎంత మూర్ఖురాలో అనిపించింది.ఏ అనుమానం రాకుండా తన పనుల్ని తాను జాగ్రత్తగా కానిచ్చాడు.తన నిజస్వరూపాన్ని గ్రహించలేకపోయింది. 

ఆఫీసు పని ముగిసిన తర్వాత యథాప్రకారం పాత దారిలోనే వస్తున్నాడు అనుపమ్.కారు లో వస్తుంటే రోడ్డు కి ఇరువేపులా పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి.కళింగ విహార్ సంపన్నవంతమైన ఏరియా గా ఎదుగుతోంది.పొడవైన, ఇటుకల తో కట్టిన గోడలు ..మైళ్ళ పర్యంతం.ఇటుకలు గుట్టలుగా ఉన్నాయి.

ఒకానొకప్పుడు కటక్ నుంచి భువనేశ్వర్ వెళుతుంటే కపూరియా నుంచి రసూల్ గడ్ వరకు పచ్చని వరిపొలాలు అటూ ఇటూ దర్శనమిచ్చేవి.ప్రవహించే నది ఒడ్డున,రెల్లు పొదలు పిల్లగాలికి తలలూపుతూ అగుపించేవి.అక్కడక్కడుండే చెరువుల్లో చక్కని పూలు కనువిందు చేస్తుండేవి.తాళ బంధ గ్రామం లో మాదిరిగానే పిల్లలు స్నానాలు చేస్తుండేవాళ్ళు కెనాల్స్ లో.

కాని ఇపుడు కాలం మారిపోయింది.ఎక్కడ చూసిన ఇటుకల గోడలు.ఈ ప్రదేశం అమ్మబడదు అంటూ బోర్డులు.నదీ గర్భం లో ఇపుడు ఇటుక బట్టీలు వెలిశాయి.మట్టి ముద్దల్ని రకరకాల రంగుల ఇటుకలుగా కాలుస్తున్నారు.ఎరుపు,గోధుమ,నలుపు రంగుల్లో..!కాల్చనంత వరకే మట్టి...ఒక్కసారి దానికి నీటిని కలిపి కాల్చితే అది ఇటుక.దానికి అప్పుడు ఒక ఆకారం వస్తుంది.దాన్ని ఉంచడానికి స్థలం కావాలి.

భద్రక్-చండబలి దారి లో ఉండే తమ గ్రామం తాళబంధ జ్ఞాపకం వచ్చింది.ఖేరంగా నుంచి ఘంటాపూర్ గ్రామం వరకు రోడ్డు ఉండేది. అక్కడ ఉండే మొగలి పొదల నుంచి సువాసన ముక్కుపుటాల్ని తాకేది.నుయ్నాయ్ నది ఒడ్డున ...శరత్ కాలం లో మంచులాంటి రెల్లుపూలు విరగబూసి అలరించేవి.పౌర్ణమి నాటి రాత్రులు...కుమార పూర్ణిమ పండుగ సందర్భం లో అద్భుతం గా అనిపించేవి.మేఘరహితమైన ఆకాశం,కిందన వరిపొలాలు ,రెల్లుపూలు,అంతులేని అడివిపూల సువాసన..! ఆ జ్ఞాపకాలన్నీ అనుపమ్ అణువణువు లో నిండిపోయిఉన్నాయి.

పుష్పాంజలి ఆలోచనలు మళ్ళీ.ఎత్తుగా,చామనచాయగా ఉండేది.ఎపుడూ ఏదో ఒకటి చదువుతుండేది. ఆలోచనల్లో ఉండేది.పుష్పాంజలి అందరిలాంటి అమ్మాయి కాదు.సింపుల్ గా ఉండేది.సంపద మీద అంతులేని వ్యామోహం ఉన్న వ్యక్తి కాదు.భావుకత్వం కవిత్వం లోనూ,పేయింటింగ్ లోనూ బావుంటుంది గాని నిజ జీవితం లో అది ఒక్కటే మనిషికి ఏ విధంగానూ ఉపయోగపడదు అనేది.అర్థవంతంగా జీవించడానికి ఏదో కమిట్మెంట్ ఉండాలి అని కూడా అనేది.పరిస్థితుల ప్రభావం వల్ల మన ప్రయారిటీస్ మార్చుకోవాలా వద్దా..?తను చేసిన దాంట్లో తప్పు ఏమీ లేదనిపించింది.      

ఏ బంధం అయినా ఏదో విధం గా ఉపయోగపడే లా ఉండాలి తప్పా కిందికి లాగేలా ఉండకూడదు.జీవితం అనే క్రాస్ రోడ్స్ లో అనామతు గా ఉండిపోయేలా చేయకూడదు. పుష్పాంజలిని,తాళ బంధ గ్రామాన్ని మర్చిపోయేలా చేశాయి పరిస్థితులు.సీతాకోకచిలుక లా పరిణామం చెందిన తర్వాత మళ్ళీ గొంగళిపురుగు దశ కి వెళ్ళాలనుకోవడం లో ఔచిత్యం ఏముంది..? ఆ జ్ఞాపకాలు ఇక అనవసరం అనిపించాయి.

కాని ఎందుకనో ఈరోజున పుష్పాంజలి పదే పదే జ్ఞాపకం వస్తోంది.తను ఆ రోజున తీసుకున్న నిర్ణయం సిగ్గుపడదగినదా..? తప్పు చేసిన భావన కలిగింది.అంతేకాదు దాన్ని ఎవరో కనిపెట్టిన అనుభూతి కూడా కలిగింది.

అటూ ఇటూ చూస్తే ఎవరూ లేరు.కారు ని తనే డ్రైవ్ చేస్తున్నాడు అనుపమ్. అయినా తను చేసిన దాంట్లో తప్పేముంది...జీవితం లో అనుకున్నవి అనుకున్నట్లుగా నే ఉండిపోవు గదా..?మారిపోతుంటాయి.తూనీగలు పట్టడం బాగుందని ఎప్పుడూ బాల్యం లోనే ఉండిపోతామా...ఉండలేము.యవ్వనదశ లో పుష్పాంజలి తారసపడింది.అంతే.మిథాలి ని చేసుకోవడం వల్ల ఆమె బంధువర్గం నుంచి వచ్చిన ఇంఫ్ల్యుఎన్స్ తనకి ఎంతగానో పనికొచ్చింది.మరి పుష్పాంజలి ని చేసుకుంటే తనకి అలాంటి లాభం కలిగేదా..? 

ఇంటికి సమీపం గా వచ్చాడు అనుపమ్. తనలాంటి సక్సెస్ అయిన మిత్రుడు పుష్పాంజలికి ఉండటం కూడా చిన్న విషయమేమీ కాదు.భర్త తో పోల్చుకుంటే పాత ప్రియుడు మంచి పొజిషన్ లో ఉండటం ఉపయోగపడే విషయమేగదా..!అతని మెదడు లో ఎన్నో ఆలోచనలు.రక్తం వేగం గా ప్రవహిస్తోంది నరాల్లో.పుష్పాంజలి శారీరకం గా చాలా చేరువ లో ఉన్న అనుభూతి కలిగి చెప్పలేని ఒక సుఖానుభవం కలిగింది.పుష్పాంజలి సామీప్యం లో కలిగే థ్రిల్లింగ్ ఎందుకో మిథాలి దగ్గర ఉండదు.మిథాలి ప్రేమ భావన కి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వదు.తను భార్య అంటే భార్య అంతే.

బంగళాలు,ఖరీదైన కార్లు,డైమండ్ నగలు...ఇలా ఖరీదైన వస్తువులే మిథాలి యొక్క ప్రయారిటి.పిలిస్తే పలికే పనివాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటే చాలు,వాళ్ళ నాన్న కి లా..!

ఆ రోజు మాత్రమే కాదు,ఆ తర్వాత అయిదు రోజులు పుష్పాంజలి ట్రాన్స్ లోనే ఉండిపోయాడు అనుపమ్.తన భర్త కి నా గురించి ఏమని చెప్పి ఉండొచ్చు...ఒకటి మాత్రం నిజం...అనుపమ్ నా పాత ప్రియుడు అని మాత్రం చెప్పి ఉండదు.ఏ అమ్మాయి అంత సాహసం చేయదు.అనుపమ్ వాళ్ళ కుటుంబమే తన కోసం అడిగారని,కాని తానే రిజెక్ట్ చేశానని చెప్పి ఉండొచ్చునేమో. ఈ ఆలోచనలకి అనుపమ్ కి నవ్వొచ్చింది.

అమ్మాయిలు తమ ఆత్మ గౌరవం కోసం అలా చెబుతుంటారు.మిథాలీ కూడా అంతే.తనని చూడటానికి గొప్ప సంబంధాలు ఎనిమిది,తొమ్మిది మంది వచ్చారని తానే తిరగగొట్టానని చెబుతుంది.పుష్పాంజలి కూడా అరబింద తో అలానే చెప్పి ఉంటుందా...? 

అందమైన పుష్పాంజలి కళ్ళు మనసు లో మెదిలాయి.లేదు,ఆమె అలా అని ఉండకపోవచ్చు.పుష్పాంజలి తత్వం వేరు.ఆ నిమిషం లో ఆ సంఘటన ని చూడగలిగితే ఎలా ఉండేదో..!? 


అరబింద చెప్పిన విధంగానే బుధవారం వచ్చాడు. మంచి సూటు,బ్లూ టై ధరించాడు.చాలా మర్యాదగా కూర్చున్నాడు.తాను పెద్ద భవనం లాంటి వాడైతే అతను ఒక గుడిసె లాంటి వాడు.ఆ భావాన్ని అతనిలో కలిగించాలనేది అనుపమ్ యొక్క కోరిక.అరబింద ఒట్టి మట్టి ముద్ద అయితే తాను అప్పటికే తయారయిపోయిన ఇటుక లాంటి వాడు.


"అరబింద బాబూ..!మట్టి ముద్ద కి,ఇటుక కి గల తేడాని చెప్పగలరా..?" హుందాగా ప్రశ్నించాడు అనుపమ్.అరబింద చెప్పబోయే జవాబు ని తను ఊహించాడు.ఏ రూపమూ లేని మట్టి ముద్ద కి,అప్పటికే మంచిగా కాలి నీటు గా తయారైన ఇటుక కి పొంతన ఏమిటి..?అతను చెప్పబొయే జవాబు అలాగే ఉంటుందని ఆశించాడు. కానీ అరబింద ఇంకోలా జవాబిచ్చాడు.

"మట్టి ముద్ద ని ఎప్పుడైనా కాల్చి ఇటుక గా తయారు చేయవచ్చు.కాని ఒక్కసారి ఇటుక గా తయారయిపోయిన తర్వాత ముందు ఉన్న రూపం లోకి రావాలంటే కుదరని పని.కట్టెలు,బొగ్గులు...దేనితో కాల్చినా దాని సున్నితత్వాన్ని కోల్పోయి గట్టిపడుతుంది,దేనికీ పనికిరాకుండా..!" 

ఆ సమాధానం విన్న అనుపమ్ వెంటనే గంభీరం గా ,ఆఫీసర్ లా పోజు పెట్టాడు. "ఓహో...మీరు ఆ కోణం లో నుంచి చూశారన్న మాట.స్కూల్ లో లిటరేచర్ బోధిస్తారా..?" అడిగాడు అనుపమ్.

"లేదు సార్. గణితం బోధిస్తాను" జవాబిచ్చాడు అరబింద.

అనుపమ్  సొరుగు లో నుంచి కొన్ని కాగితాలు తీసి అరబింద కి ఇచ్చాడు. "మీ పని అయిపోయింది.ఇదిగో ఆర్డర్ కాపీలు తీసుకొండి.మేము ట్రెజరీ కి కూడా ఓ కాపీ పంపుతాము.నాకు తెలిసి మీకు ఇక ఏ సమస్యా ఉండదు.ఒకవేళ ఎదురైతే నాకు తెలియజేయండి" అన్నాడు అనుపమ్.ఆ మాట వినగానే అరబింద వెంటనే సాగిలపడతాడు అనుకున్నాడు.సరే...వెళ్ళు అనే విధం గా ఓ చూపు చూశాడు.తన గురించి అరబింద,పుష్పాంజలి కి ఎంతో గొప్పగా చెబుతాడు,పదేళ్ళుగా పెండింగ్ లో ఉన్నదాన్ని అనుపమ్ చేయగలిగాడు అని పొగుడుతాడు అనుకుంటూ ఊహల్లో తేలియాడసాగాడు. 

అరబింద ఏదో చెప్పాలని తటపటాయిస్తున్నాడు.పుష్పాంజలి తనగురించి ఏమన్నా గొప్పగా చెప్పిందా...? చెబితే విందామని అనుపమ్ ఎదురుచూశాడు.అదీ అరబింద నోటిగుండా..!

ఆ రూమ్ లో ఇద్దరు మాత్రమే ఉన్నారు.ఎయిర్ కండీషన్,ఫ్యాన్ చప్పుడు మంద్ర స్థాయి లో ఉన్నాయి.అంతలో అరబింద బ్యాగ్ లో నుంచి ఓ కవర్ తీశాడు.దాంట్లోని అయిదు వేల రూపాయల్ని బయటకి తీసి మర్యాదగా ఇవ్వబోయాడు.ఆ కవర్ లో ఉన్నది పుష్పాంజలి రాసిన ఉత్తరమేమో,చదువుదాం అనుకున్నాడు అప్పటిదాకా..!

"ఏయ్...ఏమిటిది..?" గట్టిగా అరిచాడు అనుపమ్.డబ్బుల్ని చేతి లో పెట్టబోతుండగా..! పుష్పాంజలి ఆల్ రెడి, భర్త అరబింద కి చెప్పింది ఇలాంటి పనికి అనుపమ్ కనీసం పదివేల రూపాయలైనా అడుగుతాడని.సమయానికి ఇంకో అయిదు వేలు దొరకలేదు తనకి . 

"పుష్పాంజలి నాకు చెప్పింది సార్. మీకు పనిచేసిపెట్టిన తర్వాత కనీసం పదివేలన్నా ఇమ్మని.ఇంకో అయిదు వేలు తప్పకుండా వచ్చే వారం లో సర్దుతాను" అన్నాడు అరబింద అణకువగా.

"అసలు నా గురించి ఏమనుకుంటున్నారు..? అదేం వద్దు." గట్టిగా అరిచాడు అనుపమ్.

"లేదు సార్. చిన్నప్పటినుంచి కూడా మీరు డబ్బులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పుష్పాంజలి చెప్పింది.నన్ను నమ్మండి,తప్పకుండా వచ్చే వారం లో మిగతాది ఇచేస్తాను" అన్నాడు అరబింద.

అనుపమ్ గందరళపడిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.ఇప్పుడు తను ఏమి చెప్పినా పుష్పంజలి తన భర్త కి చెప్పిన మాటల్ని బలపరిచినట్లవుతుంది.అరబింద ఆర్డర్ కాపీ ని తీసుకుని వెళ్ళిపోయాడు.అనుపమ్ మెదడు మొద్దుబారింది.ఆ ఎయిర్ కండీషండ్ రూం లోని నిశ్శబ్దం ఖరీదైన కార్పెట్ పై పరుచుకున్న పచ్చి ఇటుకల గుట్ట లా అనిపించింది.


(సమాప్తం) 

No comments:

Post a Comment