Wednesday, June 15, 2022

బంగారపు ముక్క (అనువాద కథ)

 బంగారపు ముక్క (అనువాద కథ)


ఒరియా మూలం : గౌరహరి దాస్

తెలుగుసేత : మూర్తి కెవివిఎస్


పొద్దుటే కాకులు గోల పెట్టి అరుస్తుంటే జనాలు పక్కల మీదినుంచి లేవడం సహజం. కాని రఘునాథ్ మాత్రం తల్లి,భార్య వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ భరించలేక నిద్ర నుంచి లేస్తాడు.ఆ గొడవ ఒక్కోసారి చిన్న వాన జల్లుల్లా మొదలయి ముగుస్తాయి.కాస్తా నిద్ర లోకి జారుకుంటాడప్పుడు. అయితే ప్రతిరోజూ అంత అదృష్టం ఉండదు.ఇత్తడి సామన్లని ఎవరో ఒకరు దభేలున ఎత్తి పడేస్తారు. ఇదిగో ఈరోజులాగే.

నిద్రలో నుంచి చచ్చినట్లు మేల్కోవలసిందే.గత అయిదు రోజులనుంచి ఈ శబ్దాలు కిచెన్ లో నుంచే ఎక్కువ గా వస్తున్నాయి. కనక ఆ వేపుగా వెళ్ళాడు.ముందు గది లో కొడుకు టి.వి.చూస్తున్నాడు. పొద్దున్నే ఆ టి.వి. ఏవిట్రా అన్నాడు రఘు."నేను...ఒక్కడ్నే కాదు,అమ్మ కూడా చూస్తోంది" అన్నాడు వాడు.ఏం అనాలో అర్థం కాలేదు రఘు కి.

టి.వి. లో వార్తలు ...ఇజ్రాయెల్ ,లెబనాన్ సిటీల మీద బాంబుల వర్షం కురిపిస్తోంది.వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.విదేశీయులు ఎయిర్ పోర్ట్ ల దిశగా పరుగులు తీస్తున్నారు. అదే సమయం లో కొడుకు ఇప్సిత్ చానల్స్ ని వాడి ఇష్టం వచ్చినట్లుగా మార్చుతున్నాడు.వాడికిష్టమైన కార్టున్ చానల్ కోసం.

"ఎందుకు అలా మారుస్తున్నావు,ఏదో ఓ చానల్ ఉంచరా" అన్నాడు రఘు.   

వాడు ఏ ధ్యాస లో ఉన్నాడో గాని తండ్రి చెప్పిన చానల్ కే మార్చాడు. లెబనాన్ దేశం లోని ఆకాశం అంతా పొగమయం గా ఉంది.నాగసాకి,హిరోషిమా ల మీద బాంబు పడితే ఎలా పొగమయంగా అయిందో..అలా...అదంతా టెక్స్ట్ బుక్స్ లో చూసిందే.ప్రతి చోట రక్తసిక్తం గా ఉంది.అరణ్య రోదనలు.

"బందనా..! ఈరోజు మాణింగ్ న్యూస్ విన్నావా..?" అడిగాడు రఘు.

అంత వరకు అత్త తో ఏదో వాదిస్తున్న బందన ఏవిటి అన్నట్లు ఆ గొడవ ఆపింది.ఆమెలోని టీచర్ అంతర్జాతీయ వార్తల్ని,ఆ విషాదాన్ని పట్టించుకున్నట్లే ఉంది.

"కనుమూసి చూసేలోగా వేలమంది నిరాశ్రయులయ్యారు.చూస్తుంటే అక్కడ బూడిదే మిగిలేలా ఉంది" అంది బందన.

"జంతువుల కంటే మనిషి ఎంతో పురోభివృద్ధి సాధించాడంటారు.ఏవిటో" ఇదంతా వ్యాఖ్యానించాడు రఘు.

"అవతల బాగ్దాద్,ఇక్కడ కాశ్మీర్ ప్రతిరోజు తగలబడుతూనే ఉన్నాయిగా.ఇప్పుడు బీరూట్ కూడా అలానే ఉంది. ప్రశాంతత అనేది లేదు లోకంలో" బందన ప్రశాంతత అనే పదాన్ని వత్తి పలికింది. టి.వి. మీదినుంచి తన చూపుని తల్లి వేపు సారించాడు రఘు. కొడుకు చదువుకోవడానికి టేబుల్ దగ్గరకి వెళ్ళాడు. తల్లి బెడ్ రూం లో ఉంది. నిజానికి ఆమెకంటూ ఓ గది లేదు.స్టోర్ రూం లోనే ఓ పక్కకి పడుకుంటుంది.చుట్టాలెవరైనా వస్తే వాళ్ళ సామాన్లు అక్కడే పెడతారు.ఆ రూం లో పావు వంతు తల్లి, దేవుడి పటాలతోనూ వాటితోనూ నింపేసింది.  

"బియ్యపు మూటలు,బంగాళా దుంపలు ..ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టాలా?" అని సణుగుతుంది తల్లి. ఇదివరకు ఇక్కడ మీ నాన్న ఈ రూం లోనే పడుకునేవాడు.దీన్ని ఇప్పుడు ఇలా చేసేశారా..?అంటుందామె. ఏ చిన్న చప్పుడైనా ఆమె కి పడదు.సణుగుతుంది.

"మీ అమ్మ విషయం లో కొన్ని మార్పులు చేయదల్చుకున్నాను.కాదంటే చెప్పు... ఇప్పుడే పిల్లాడ్ని తీసుకుని బెర్హంపూర్ వెళ్ళిపోతాను" భార్య బందన అల్టిమేటం ఇచ్చింది రఘుకి.నిశ్శబ్దం గా విన్నాడు రఘు.అతని తమ్ముడు జైపూర్ లో ఉంటాడు.తనేమో భువనేశ్వర్ లో.భార్యకీ,తనకీ మంచి ఉద్యోగాలు ఉన్నాయి.తమ్ముడిది ప్రైవేట్ ఉద్యోగం.ఓ కాంట్రాక్టర్ దగ్గర క్లర్క్ గా చేస్తున్నాడు.

          పాపం వాడి భార్య కి అనారోగ్యం. ఇద్దరు పిల్లలు. వచ్చే ఆదాయం అంతంత మాత్రం.గత ఏడాది తండ్రి కి ఆరోగ్యం బాగోలేకపోతే భువనేశ్వర్ కి తీసుకొచ్చారు.ఇక్కడే చనిపోయాడు.అప్పటి నుంచి తల్లి కూడా ఇక్కడే ఉంటోంది.

తల్లికి,భార్య కి ఎప్పుడూ గొడవలే.ఎవరు బాధ్యులో అర్థం కాదు.ఎవర్ని సమర్థించాలో అర్థం కాదు.ఇద్దరూ ఇద్దరే.వాళ్ళేమన్నా కూరగాయలా..?ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేసుకోవడానికి.మిగతా వాటిని పారేయడానికి.

గతకొన్ని రోజుల్నుంచి చూస్తున్నాడు.గొడవలు తగ్గడం లేదు.బందన ప్రవర్తన అత్త ని ఇంట్లోనుంచి పంపించెయ్ అన్నట్లుగా ఉంది.ఇన్నిరోజులు చెప్పకపోయినా,ఈరోజున తన చెవులతో తనే వినవలసివచ్చింది.  

భారతదేశం లో ని సగం కుటుంబాల్లో ఇదే పరిస్థితి. పాశ్చాత్య దేశాల్లో భిన్నమైన వాతావరణం.అక్కడ చాలా చిన్న వయసు నుంచే ఎవరి కాళ్ళ మీద వారు నిలబడటం నేర్చుకుంటారు.వృద్ధాప్యం లో తల్లిదండ్రులు పిల్లలకి దూరం గా నివసించినా ఎవరూ ఏమీ అనుకోరు.అదే మన దేశం లో పెళ్ళయిన కొడుకులు తల్లిదండ్రులతో నివసించాలని కోరుకోరు.ఎంత వసుధైక కుటుంబం అని చెప్పుకున్నా..!

తల్లిదండ్రులు వేరేగా ఉన్నా మన సమాజం ఒప్పుకోదు.వీళ్ళూ అలా ఉండాలని అనుకోరు. ఒక వింతైన బంధం..!ఎన్ని అవమానాలు ఎదురైనా ముసలి వాళ్ళు అలా భరిస్తూనే ఉంటారు. ఒక సోషియాలజి లెక్చరర్ గా బంధన కి ఇదంతా తెలుసు.కానీ అత్త విషయం లో మాత్రం నిర్దయ గా వ్యవహరిస్తుంది. రఘు ఎటూ చెప్పలేని పరిస్థితి లో ఉన్నాడు.

బంధన అన్న మాటల్ని రఘు తల్లి విని కన్నీళ్ళు పెట్టుకుంది. ఆమె తన వస్తువుల్ని అన్నిటిని ఓ పెద్ద సంచి లో పెట్టుకుంటున్నది.ఆ సన్నివేశం చూసి రఘు షాక్ అయ్యాడు.డబ్భై ఏళ్ళ తల్లి ఏ ఆధారమూ లేని వితంతువు లా గోచరించింది. మరి ఇప్పుడు తాను ఏం చేయాలి..?తాము ఉంటున్న ఇంట్లో అయిదు గదులు ఉంటాయి.తాము మరీ పేద కాదు అలాగని పెద్ద ధనిక కుటుంబమూ కాదు.సరే..చిన్నా చితకా అప్పులున్నా తీర్చలేనివి ఏమీ కావు. భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులే..!

ఇప్పటికి చూస్తే తండ్రి మరణించాడు.మరి తల్లి యొక్క ఆయుషు ఎంత వుందో..?ఇటు చూస్తే బంధన ,అత్త తో ఎంతమాత్రం కలిసి ఉండేది లేదని అల్టిమేటం ఇచ్చింది. పోనీ తమ్ముడి దగ్గరకి పంపుదామా అంటే,వాడి భార్య యొక్క ఆరోగ్యం అంతంత మాత్రం.సంకటస్థితి లో పడ్డాడు రఘు.తను ఒక్కడే కొడుకై ఉంటే అలాంటి స్థితి లో ఏమిచేసి ఉండేవాడో..!

తన ఆఫీస్ లో సుపీరియర్ కి ఇలాంటి సమస్యే ఎదురైతే,తల్లిని వేరే ఇంట్లో ఉంచి ఆమె కి సేవ చేయడానికి నెలవారీ జీతం మీద ఓ పనిమనిషిని పెట్టాడు. ఎందుకో అది రఘు కి నచ్చలేదు.తల్లి ఒంటరిగా,పనిమనిషి సాయం తో ఉండటం...ఆయన మాత్రం సిటీ లో అన్ని సౌకర్యాలతో జీవించడం రఘు కి ససేమిరా నచ్చలేదు.

భార్య బంధన,తల్లి చేసే ప్రతిచిన్న పనిని విమర్శిస్తుంది.ఎప్పుడైనా గ్యాస్ కట్టేయకపోయినా,ఫ్రిజ్ డోర్ వేయకపోయినా తిడుతుంది.వీధిలో అమ్ముకునే వాళ్ళని పిలిచి ముచ్చట్లు పెట్టినా,సాధువుల్ని డ్రాయింగ్ రూం లోకి పిలిచి కూర్చోబెట్టినా బంధన కి నచ్చదు.ఈ ముసలామె వల్ల ఎవరో దొంగలు పడి ఇంటిని దోచుకుంటారని కోడలి అభిప్రాయం.

ఎందుకమ్మా అలా చేస్తుంటావు అని తాను అడిగితే "ఏదో చదువు లేనిదాన్ని.మా నాన్న పోయిన తర్వాత నన్ను ఎవరూ చదివించలేదు. మీ నాన్న కలకత్తా లోని ఇటుకలబట్టీ లో పనిచేసేవాడు.అక్కడి భాష నాకు తెలియదు.ఇక్కడ చూస్తే అంతా కొత్త కొత్త గా ఉంది.కొన్నాళ్ళుపోతే తెలుస్తుందేమో ఎలా ఉండాలో" అనేది తను.   

తల్లి చెప్పింది కూడా నిజమే..!ఆమె ఒక పేద కుటుంబం లో పుట్టింది.చిన్నతనం లోనే తల్లిదండ్రుల్ని కోల్పోయింది.ఆమె ఉన్న గ్రామం లో ఏ బడి లేదు.ఉన్నా ఆడపిల్లల్ని పెద్దగా పంపే రోజులు కావు అవి.అలా జరిగిపోయింది. పెళ్ళి కూడా ఏదో అలా జరిగిపోయింది.రఘు తండ్రి యొక్క మొదటి భార్య చనిపోవడం తో,ఏ కట్నం లేకుండా తల్లి మెళ్ళో తాళి కట్టాడు.

బంధన కి ఇవన్నీ బాగా తెలుసు. కానీ అత్త పట్ల ఎలాంటి జాలీ చూపదు.ఎంతమాట పడితే అంత మాట అంటుంది. తల్లి బాల్యం,ఆ తర్వాత దశ కూడా పేదరికం లోనే గడిచింది.చిన్నప్పుడు సంగతి అలా ఉంచితే,పెళ్ళయిన తర్వాత ఉన్న ఉంగరాన్ని కూడా భర్త అమ్మేశాడు.1971 లో వచ్చిన తుఫాన్ దెబ్బకి ఉన్న కొద్ది భూమి,పశువులు కూడా అమ్మివేయడం జరిగింది.

ఒకసారి తనని గోల్డ్ చైన్ చేయించమని అడిగింది తల్లి,ఏమిటో ఈ ఆడవాళ్ళకి ఆ లోహం మీద అంత ప్రేమ..! సరే అన్నాడు తను.ఆ ఆనందం లో ఈ వార్త ని కోడలికి చెప్పింది.ఇక చూడు బంధన మామూలుగా తిట్టలేదు.

"ముసలితనం లో ఈవిడ కి బంగారపు గొలుసు కావలసి వచ్చిందా..? ఆ దరిద్రపు రోజుల్లో ఎలాగూ లేదు..ఇపుడు వేసుకోవాలనిపిస్తోందా..?అయినా ఇంట్లో ఖర్చులకే సరిపోవడం లేదు. ఆమెకి గోల్డ్ చైన్ ఎలా చేయిస్తావు..?ఆఫీస్ లో ఏవైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నావా..?" అంటూ భార్య తనని ఆడిపోసుకుంది.

అయ్యో...అమ్మా..! నీకు గొలుసు చేయిస్తానని అన్న మాట నా భార్య కి ఎందుకు చెప్పావు..? ఎంత లోకం పోకడ తెలియని అమాయకురాలివమ్మా...అని రఘు కి తల్లి మీద జాలీ ఇంకా మరో వైపు కోపమూ పెల్లుబికాయి. తల్లికి బంగారపు గొలుసు చేయించుదాము అనుకోవడానికి మరో కారణమూ ఉంది. తన భార్య,బిడ్డలు ఎప్పుడు బంగారు నగలు పెట్టుకున్నా,ఖరీదైన దుస్తులు వేసుకున్నా తల్లి కళ్ళు ఆశ తో మెరుస్తుండేవి. ఆమె బోడి చేతులు,మెడ,చెవులు ...చూసుకున్నప్పుడల్లా తనకి ఏమీ లేవు అనే ఓ భావం...చిన్నపిల్లల్లో ఉండే ఓ భావం ఆమె లో మెదిలేది. సరే...వితంతువులు అలాంటివి ధరించరాదని ఉన్నా అది వేరే విషయం.       

రఘు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు.కాని ఏం చేయగలడు..?సరే అని ఓసారి సూచాయ గా చెప్పాడు భార్య తో,తల్లికి గొలుసు చేయించే విషయం..! ఇక దానితో ఆమె మామూలుగా శివాలెత్తలేదు." ఇంజనీరింగ్ చదివే కూతురు కి ఏడాదికి లక్షన్నర కట్టాలి.కొడుకు కి ట్యూషన్ ఫీ కట్టాలి.ఇంటిఖర్చులు,మెడికల్ బిల్లులు ...ఇన్నీ పెట్టుకొని మీ అమ్మకి గోల్డ్ చైన్ ఎలా చేయిస్తావు...?" అన్నదామె.

"ఎంతైనా అమ్మగదా...ఆమెకి .."అంటూ గొణిగాడు రఘు.

"పదేళ్ళు మీ నాన్న కి సేవలు చేశాను.అంతకు ముందు మీ తమ్ముడ్ని పోషించాము.ఇప్పుడిక మీ అమ్మ వంతు వచ్చింది.ఇలా చేసుకుంటూ పోతే...ఇక నా సంగతి...నా పిల్లల సంగతి ఏమిటి ?" అంది బంధన.

రఘు గమ్మున ఉండిపోయాడు.అయినా మన పిల్లలు చిన్నగా ఉన్న కాలం లో వాళ్ళకి మా అమ్మ కూడా సేవ చేసింది గదా.ఇద్దరం ఉద్యోగాలకి వెళితే ఆమె ఇంటిని చూసుకుంది.ఇప్పుడంటే పిల్లలు ఎదిగారు,వేరే సంగతి.ఇదంతా బంధన కి గుర్తు చేద్దామనుకున్నాడు గాని దానివల్ల ఏం ప్రయోజనం ఉండదని ఏమి మాటాడకుండా ఉండిపోయాడు.  

రఘు అడకత్తెర లో పోకచెక్క లాయ్యాడు.బంధన కాలేజి కి వెళ్ళిన తర్వాత తల్లిని ఓదార్చుదామనుకున్నాడు.వీళ్ళిదర్నీ సముదాయించడం,అదీ ఒకేసమయంలో,తనవల్ల గానిపని.తానేమీ జరాసంధుడిలా వరం పొందలేదు గదా,ఒకేసమయం లో రెండు చోట్ల కనబడటానికి. ఇద్దరూ ప్రతిరోజు గొడవ పడటం,తాను ఆఫీస్ నుండి టెన్షన్ తో రావడం అలవాటుగా మారిపోయింది.నిజానికి ఆఫీస్ లో ఉంటేనే కాస్త ప్రశాంతం గా ఉంటుంది. బంధన అనే మాటలకి,ఆమె దగ్గరకి వెళ్ళాలంటేనే చిరాకు గా ఉంటున్నది.

"మీకు ఏమిటి..? ఇద్దరూ ఉద్యోగస్తులే...ఏం ఆర్థిక బాధలు ఉంటాయ్" అంటారు ఆఫీస్ లో కొలీగ్స్. వాళ్ళకేం తెలుసు సంపాదించే భార్యతో ఉండే బాధలు.

రఘు తల్లి కళ్ళలో నుంచి కన్నీరు,అదీ ఆమె కళ్ళకి కాటరాక్ట్ ఆపరేషన్ అయింది.మనవడు ఇప్సిత్ వెళ్ళి ఆమె ని ఓదార్చబోతే,బంధన వాడిని కసురుకుంది.వాడు చదువుకోవడానికి వెళ్ళిపోయాడు.రఘు కి తన మీద తనకే జాలి కలిగింది.ఇపుడు తనకి నలభైఆరేళ్ళు.ఇంకా ఎన్ని ఏళ్ళు ఇలా గడపాలో..?!  

" నా మరణానంతరం మీ అమ్మ ని జాగ్రత్త గా చూసుకో.చిన్న దానికే కలత పడిపోతుంది.చిన్నప్పుడే అనాథ కావడం...అన్నదమ్ములు ఆమె ని ఇంట్లోనుంచి పొమ్మని అనడం...పేదరికం..ఇవన్నీ ఆమె అనుభవించింది.ఇంట్లోనుంచి పో అని మీ అమ్మని ఎప్పుడూ అనకు.అలా అంటే ముసలివాళ్ళకి చెప్పలేని బాధ కలుగుతుంది.తల్లిదండ్రుల్ని అలా చేసిన వాళ్ళకి వాళ్ళ వృద్ధాప్యం లో కూడా అలాంటి స్థితే కలుగుతుంది" అంటూ తండ్రి తన చివరిదినాల్లో వాపోయాడు.

ఆయన మొహం గుర్తుకు రాగానే రఘు కి చెప్పలేని బాధ కలిగింది. తను ఉండగానే బంధన కోపం శృతి మించుతున్నది..!తండ్రి బతికి ఉన్న రోజుల్లో బంధన ఏమన్నా పట్టించుకునేవాడు కాదు.ఆయన తన జీవితం లో ఎన్నో కష్టాలు,అవమానాలు చూశాడు.రఘు కి,బంధన కి గొడవ అయినా ఆమె నే సమర్థించేవాడు. 

"ఆ అమ్మాయి కొంచెం కలిగిన కుటుంబం నుంచి వచ్చింది.మీ ఇద్దరకీ ఇష్టం అవడం వల్లగానీ,లేకపోతే ఎవర్నో ఇంకా కలిగినవాడినే చేసుకునేదిగదా.వాళ్ళ అన్నదమ్ములకి సిటీ లో సొంత ఇళ్ళు ఉన్నాయి.మీరు కట్టుకోవాలంటే,ఆమె కూడా బ్యాంక్ లోన్ తీసుకోవాలిగదా. ఇంట్లో వండివార్చడం,మార్కెట్ కి పోయి కూరగాయలు తెచ్చుకోవడం,కాలేజ్ కి వెళ్ళి అక్కడ డ్యూటీ చేయడం...వీటన్నిటి మూలంగా ఆమెకి చిరాకు కలిగి ఏదో అంటుంది.మీ అమ్మ కూడా కొద్దిగా నిశ్శబ్దం గా ఉంటే సరిపోతుంది.గొడవలు పెట్టుకుంటే ఏమొస్తుందిరా" అనే వాడు తండ్రి.

ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అన్ని ఇళ్ళు అని సామెత ఉంది.దాన్ని ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే అన్ని ఇళ్ళు అని మార్చాలి.ఒక ఇంట్లో ఇద్దరు స్త్రీలకి అసలు పడదు గదా.ఎవరి ఆధిపత్యం వారిదేనంటారు.ఎవరి ప్రత్యేకత వారిదేనంటారు.బంధన దృష్టి లో ఇంటికి తానే బాస్.అత్తమామలు ఇంకా ఏ బంధువులైనా అతిథులు గా ఉండి వెళ్ళిపోవాలి,అంతే.అత్తమామలు కొడుకుని,కొడుకు పిల్లల్ని చూసి పోవలసినవారు మాత్రమే.ఒకవేళ ఉన్నా అతిథుల్లా ఉండాలి.

కానీ రఘు తల్లి దృష్టి లో మాత్రం ఇది కొడుకు ఇల్లు.కోడలు బయటి మనిషి.ఆమె తన చెప్పుచేతల్లో ఉండాలి అని భావిస్తుంది.సరిగ్గా అక్కడే వస్తుంది గొడవ.  

ఎవరికి వాళ్ళు ఇంటికి మంచి చేస్తున్నాం అనే భ్రమ లో ఇంటిని నరకం చేస్తున్నారు.బందన ఆరోజు ఏమీ తినకుండానే కాలేజి కి వెళ్ళిపోయింది.రఘు ఆపి అడుగుదామనుకున్నాడు గాని ఇంకా రచ్చ అవుతుంది.తన మాటని ససేమిరా వినదు.ఆమె కూల్ కావడానికి కనీసం రెండు రోజులు పడుతుంది.

తల్లి దగ్గరకి వచ్చాడు.ఎలాగూ బందన లేదు కదా,కనుక్కుందాం అని.తల్లి తనని చూసి రోదించసాగింది. "ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండను.నన్ను మీ తమ్ముడు లోకనాథ్ దగ్గరకి పంపించెయ్.వెంటనే టికెట్ కొనివ్వు" అన్నదామె.

"అమ్మా...కాసేపు ఓపిక పట్టు.ఏం జరిగిందసలు" అంటూ రఘు అడిగాడు తల్లిని.

ఆమె పెద్ద కథ చెప్పసాగింది.ఈరోజు ఉదయం లో వోల్టేజ్ ఉందన్న సంగతి తెలియక నీళ్ళ పంపు మోటారు స్విచ్ వేసిందట.అంతలోనే బందన వచ్చి అరిచిందట.మోటారు డామేజ్ అయితే నాలుగు వేల ఖర్చు.నీదేం పోయింది..చుక్క నీళ్ళు దొరకక మేం పోతాం అంటూ కోపగించుకుందట.

వాళ్ళు ఉండే ఈ జగన్నాథ్ విహార్ ఏరియా లో లోవోల్టేజ్ సమస్య ఉన్నది నిజమే.నీళ్ళపంపు మోటార్ వేయకముందే ట్యూబ్ లైట్లు వేస్తారు.లేకపోతే ఆ తర్వాత గానీ వేస్తే వెలగడానికి చాలా టైం తీసుకుంటాయి.ఈ సమస్య మీదే బందన ఇంట్లో గిన్నెల్ని పొద్దున విసిరికొట్టింది.

"ఇంత చిన్న దానికి ఇల్లు వదిలి పోతానంటున్నావు ఏవిటమ్మా...నిన్ను నేను ఏమైనా అన్నానా చెప్పు..?"  అన్నాడు రఘు.

"నన్ను గనక పంపించకపోతే ఏ నుయ్యి లోనో,చెరువు లోనో దూకుతా" అంది తల్లి మొండిగా.

రఘు సైలెంట్ అయిపోయాడు.

"అసలు చిన్నచిన్న వాటిని నీకు నేను చెప్పనే చెప్పను.ఆఫీసు నుంచి అలిసిపోయివస్తావని..!బందన నన్ను ఇక్కడ ఉండనిచ్చే ఉద్దేశ్యం లో లేదు.నన్ను వెంటనే పంపించు" అంది మళ్ళీ.

రఘు కాసేపు కళ్ళు మూసుకున్నాడు.తనని పెంచడానికి ఆమె కష్టపడింది.ఓసారి తనకి టైఫాయిడ్ వచ్చి ప్రాణం మీదకి వచ్చింది.ఆశ వదిలేసుకున్నారు.తల్లి చేసిన సేవలు,పూజలు వల్ల బతికి బయటపడ్డాడు.ఊళ్ళో అందరు అదే అన్నారు.  

తన సామాన్లు అన్నిటిని చేతిసంచి లో సర్దుకుంది.

"బందనకి కూడా ఓ కొడుకు ఉన్నాడుగా.ఆమెకి కూడా నాకు జరిగిన పరాభవమే జరుగుతుంది.ఆ వచ్చే కోడలు ఇంతకి ఇంతా చేస్తుంది.వచ్చిన తర్వాత నీ భార్య కి చెప్పు" అన్నది తల్లి.

గట్టిగా రోదించాలనిపించిది రఘుకి.కాని ఇది సమయం కాదు అనుకున్నాడు.తల్లిని ఏదో విధంగా ఊరుకోబెట్టాలి.లేకపోతే ఏమన్నా చేసుకున్నా చేసుకుంటుంది.తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జీవితం అంతా అది వేధిస్తుంది.

"సరే..రేపు జైపూర్ వెళుదువులే.." అన్నాడు రఘు.

తల్లికి గోల్డ్ చైన్ చేయించడానికి కావలసిన డబ్బులు ప్రస్తుతం తన వద్ద ఉన్నాయి.కానీ బందన కి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది.అమ్మకి వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు పెరుగుతోంది. తీరా చేయించిన తర్వాత ఎక్కడన్నా పోగొట్టుకుంటుందా అని అనుమానం వచ్చింది రఘుకి.ఇలా పరి పరి విధాలా ఆలోచించాడు.

లోకనాథ్ ఇంట్లో రెండే గదులుంటాయి.అక్కడ ఉండటం తల్లికి కష్టమే.తమ్ముడు కూడా చెప్పాడు అమ్మ దేవుడు బొమ్మలు పెట్టుకుండానికి కూడా స్థలం ఉండదని.తల్లిని ఏదో విధంగా ఆపాలి లేదా సొంత గ్రామమైనా పంపాలి.

సొంత ఊరి లో అయిదు ఎకరాల పొలం ఉంది.కాని రఘు దాన్ని పట్టించుకోవడం లేదు.తండ్రి ఎన్నోసార్లు అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టమని చెప్పేవాడు. రెండు గదులు కట్టినా లక్ష దాకా అవుతుంది.రెండు గదులు చాలడం లేదు,మనవళ్ళ కోసం ఇంకో గది కట్టమంటుంది అమ్మ.సెంటిమెంట్ కి పోయి ఖర్చు చేయడం తనకిష్టం లేదు.మనుషులు ఎంత పెరిగినా చెట్లకి ఉన్న వేళ్ళు లా ఒకేచోట పాతుకుపోవాలని అనుకుంటారు.వాళ్ళ పిల్లలు చూస్తారా లేదా అనేది ఆలోచించరు.ఇలా ఆలోచనల్లో మునిగితేలుతున్నాడు.

తల్లి ఏమైనా చెబుతుందేమో అని వేచి చూస్తే ఆమె సామాను అన్నిటిని సర్దుకుంటోంది.అయినా ఆమెకి ఉన్నవి ఏమిటని..?కొన్ని దుస్తులు,వెలిసిపోయిన అద్దం,రెండు దువ్వెనలు,పూజాసామాగ్రి,తండ్రి రిస్ట్ వాచ్,ఒక చిన్న నోట్ బుక్ ...ఆ నోట్ బుక్ లో తమ్ముడు తన అడ్రస్ రాసి ఉంచాడు. ఆమె సామాన్లని కాసేపు లోపలికి పెడుతూ బయటకి తీస్తూన్నది.

"సరే...నేను ఆఫీస్ నుంచి వచ్చేవరకు ఓపిక పట్టు.జైపూర్ బస్ సాయంత్రం ఉంది.వెళితే వెళుదువులే.ఎటొచ్చి నా గురించి ఆలోచించేవాళ్ళే ఎవరూ లేరు.పోనీ నేనేం చేయాలో అది చెప్పు" అన్నాడు రఘు.  
"ఒరేయ్...ఇప్సిత్, రెడీ అవు...నిన్ను బస్ స్టాప్ దగ్గర దింపుతా" అన్నాడు రఘు కొడుకుతో.ఇప్సిత్ టౌన్ స్కూల్ లో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు.ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర నుంచి వాడి బస్ ఎక్కుతాడు.

ఆ రోజంతా రఘు కి మరో పని మీద ధ్యాస నిలవలేదు.గతం గుర్తుకు వస్తున్నది. బందన కి మొదట్లోనే చెప్పాడు,తన తండ్రి చిన్నకారు రైతు అని,తల్లి ఏమీ చదువుకోలేదని...!అప్పుడు ప్రేమ లో ఉన్న రోజుల్లో ఇవేమీ ఆమెకి పెద్ద విషయాల్లా అనిపించలేదు.ప్రస్తుతం రఘు కి ఏమి చేయాలో అర్థం కాని స్థితి. తల్లిని చివరిదాకా చక్కగా చూసుకొమ్మని,తండ్రి చివరి రోజుల్లో కన్నీళ్ళతో చెప్పినప్పటి దృశ్యాలు తన ముందు కదులుతున్నాయి.

ఏ శక్తీ లేని వృద్దురాల్ని కొడుకు సమ్రక్షణలో వదిలాడు.ఆయన తనమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోగలడా..? అన్నట్లు జైపూర్ లో అమ్మకి ఏమైనా జరిగితే...? వెంటనే బందన గుర్తు కొచ్చింది,వెంటనే ఆ భావం చెరిగిపోయింది.

వడ్డీవ్యాపారి సమాల్ బాబు దగ్గరకెళ్ళి కొంత డబ్బు తీసుకొని బంగారం షాపు కెళ్ళాడు.కొంత కాలం అమ్మ, తమ్ముడు లోకనాథ్ దగ్గర నే ఉండనీ,నెలకి రెండు లేదా మూడు వేల రూపాయలు ఆమె ఖర్చులకోసం తాను పంపిస్తే సరిపోతుంది.ఓ నెల గడిచిన తర్వాత మళ్ళీ తీసుకొస్తే సరి అనుకున్నాడు రఘు.     
రఘు ఈ మధ్య బంగారం కొనలేదు,కనక రేట్ల విషయం లో తన అంచనాలు తప్పాయి.పదివేల రూపాయలకి మంచి గోల్డ్ చైన్ వస్తుందనుకున్నాడు.కానీ,పెరిగిన రేట్ల దృష్ట్యా చిన్నపిల్లకి సరిపోయే చైన్ మాత్రమే వచ్చింది.ఇంటి కొచ్చి చూస్తే అమ్మ అదేమూలన కూర్చుని ఉంది.బందన తలుపువేసుకొని లోపల టి.వి.చూస్తున్నది.అత్తా కోడళ్ళు ఎప్పుడూ కలిసి టి.వి.చూడరు,అక్కడ ఒకరుంటే ఇంకొకరు ఉండరు అంతే.

"అమ్మా...! ఇందా ఈ రెడ్ బాక్స్ తీసి చూడు.దీంట్లో బంగారు గొలుసు ఉంటుంది.ఓసారి మెళ్ళో వేసుకొని ,మళ్ళీ దాన్ని లోపల పెట్టేసుకో.బస్ లో ఏ దొంగ అయినా కొట్టేస్తాడు.జైపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ తీసి పెట్టుకోవచ్చు..." రఘు చెప్పాడు చిన్న బాక్స్ ని చేతికిస్తూ. 

ఆమె తన కళ్ళని తానే నమ్మలేకపోయింది.డబ్భై ఏళ్ళకి తన కొడుకు వల్ల బంగారు గొలుసు అమిరింది ఇన్నాళ్ళకి.ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.ఆమె సంథోషం చూసి రఘుకి కూడా కన్నీళ్ళు వచ్చాయి.

కాసేపు ఆ చిన్ ని చూసి మళ్ళీ దాన్ని వెంటనే బాక్స్ లో పెట్టేసింది.

"బందన చూస్తే కోప్పడుతుంది,నీ దగ్గరే ఉంచు నాయనా" అంది తల్లి.     
"సరే...కోప్పడితే పడిందిలే...నీకు చేయించవలసిన బాధ్యత నాకు లేదా..?" అన్నాడు రఘు.

"ఈ ముసలితనానికి ఇప్పుడెందుకులే నాయనా ఈ నగలూ గట్రా..!తుఫాన్ కి ఇల్లు పాడయితే మళ్ళీ దాన్నీ బాగుచేసుకోవాలి,అలా వదిలేయకూడదు.ఇప్పటికే గొడవలతో అలిసిపోయాను" అన్నదామె.

"పదేళ్ళనుంచి గోల్డ్ చైన్ కావాలని ఒకటే ఇదిగా అడిగావు,తీరా తీసుకొస్తే ఎందుకు వద్దంటున్నావు...అంటే చిన్నగా ఉందనా..?" ప్రశ్నించాడు రఘు.

"ఈ వయసు లో ఈ బంగారపు నగని నా దగ్గర ఉంచుకొని ఏంచేయను...వెళ్ళి బందనకి ఇవ్వు.తన కూతురి కోసం భద్రపరుస్తుంది" ప్రేమగా కొడుకు చెయ్యి పట్టుకొని చెప్పింది తల్లి.

రఘు ఆమె మెడ చుట్టూ చేతులు వేసి చిన్నపిల్లాడిలా ఉండిపోయాడు.మళ్ళీ తాను ఆరేళ్ళ ప్రాయం లోకి వెళ్ళినట్లు అనిపించింది.

"ఏమి జరుగుతోందిక్కడ..?ఏమిటా గోల్డ్ చైన్ ఎవరు కొన్నారు,ఎక్కడ కొన్నారు..?" బందన గుమ్మం దగ్గర నిల్చొని ప్రశ్నలు సంధించింది. 

"నా కొడుకు ,తన కూతురు కోసం కొన్నాడు. నాకు చూపించాడు..అంతే..! చాలా బాగుంది..!!" అన్నది ఆ వృద్దురాలు.

రఘు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. జైపూర్ బస్ కి టైం దగ్గరపడుతోంది.

(సమాప్తం)  

(Sri Gourahari Das is a renowned Journalist and Writer from the land of Orissa. Thanks for letting me translated it into Telugu)

No comments:

Post a Comment