అహల్య పెళ్ళి (అనువాద కథ)
ఒరియా మూలం : గౌరహరి దాస్
తెలుగుసేత : మూర్తి కెవివిఎస్
"ఏమిటి... మొహంతి గారి ఇంట్లో పెళ్ళి గదా..! వెళ్ళడం లేదా..?" కోతి లాగా,హటాత్తు గా వెనక దూకిన బనమాలి అడిగాడు. ఒరుసుకు పోయి దురద పెడుతున్న కాళ్ళ సందుల్లో కొబ్బరినూనె రాసుకుందామని అనుకుంటున్న అహల్య ,ఆ కోతి లాంటి దూకుడు కి ఉలిక్కిపడి "ఏయ్...ఏంటి ...ఆ కోతి చేష్టలు" అని కసురుకుంది.
"నేను చెప్పేది వింటే అసలు నమ్మవు తెలుసా..?" అన్నాడు బనమాలి.
"ఏంటది...చెప్పు..!" అంది అహల్య.
బనమాలి ఏదో చెప్పబోతుండగా,మణిదేవి వాళ్ళ అత్తగారు ఒరే బనమాలి అని పిలవడం తో వాడు అక్కడ నుంచి తుర్రుమన్నాడు. అహల్య కాళ్ళకి కొబ్బరి నూనె పట్టించి రుద్దుకోసాగింది.ఆమె కాలివేళ్ళు జీవరహితంగా ఉన్నాయి.మరి అహల్య చేసేపని అంతా నీళ్ళదగ్గరాయేనాయే.
పొద్దుట లేచింది మొదలు అర్ధరాత్రి పడుకునే దాకా ఇంట్లో బండెడు పని చేయాలి.ఇక కాళ్ళు ఇలా కాక ఎలా ఉంటాయి..? అనుకుందామె మనసులో.మొహంతి గారి ఇంట్లో నుంచి లౌడ్ స్పీకర్ లో పాటలు పెద్ద సౌండ్ తో వినబడుతున్నాయి.పెళ్ళి ఈరోజే,పెళ్ళి కొడుకు బృందం ఈ రాత్రికి వస్తారు. మొహంతి గారి ఇంట్లోనే ఈరోజు భోజనాలన్నీ,వంట చేయవద్దు అని వాళ్ళు మరీ మరీ చెప్పారు.అవసరమైతే,రాలేని ముసలివాళ్ళకి ఇంటికే భోజనం పంపిస్తామని చెప్పారు.
నిన్న కూడా మూడు సార్లు చెప్పారు,భోజనాలకి తప్పకుండా రావాలని..!
"ఆ విధంగా మరీ మరీ ఆహ్వానించకపోతే మన యజమాని కుటుంబం వాళ్ళు వెళతారా..? టౌన్ లో అయితే ఒక్కసారి పిలిస్తే చాలు,కాని గ్రామాల్లో పద్ధతులు వేరు.అవి పాటించాల్సిందే..!" అన్నాడు బనమాలి.
ఈరోజు వంట చేసేది లేదు గదా,కాస్తా ఖాళీ దొరికింది లేకపోతే అసలు ఖాళీ ఉంటుందా తనకి..?అహల్య లేచి మొహంతి గారి ఇంటి వేపు కిటికీ లోనుంచి చూసింది.కొత్తగా రంగులు వేశారుగదా,ఇల్లు చక్కగా ఉంది.గుమ్మాలకి అటూ ఇటూ అరటి చెట్లు కట్టారు.మామిడి తోరణాలు వేలాడుతున్నాయి.ఇంట్లో పిప్లీ నుంచి తెచ్చిన చిత్రపటాలు వేలాడుతున్నాయి.గోడలకి రంగురంగుల బొమ్మలు వేశారు.ఇక్కడే పెళ్ళి జరగబోయేది.
అహ్ల్య పెరట్లోకి వెళ్ళింది.మణిదేవి వాళ్ళ ఇల్లు చాలా పెద్దది.ఇంటికి ముందు భాగం లో వరసగా కొన్ని గదులు ఉంటాయి.కిచెన్ ఓ పక్కగా ఉంటుంది.స్టోర్ రూం లు మాత్రం ఆస్బెస్టాస్ రూఫ్ తో ఉంటాయి.ఇంటి వెనుక రెండు పాకలు పొడుగ్గా ఉంటాయి.ఒకటేమో పశువుల కోసం.మరొక దాంట్లో అహల్య ఉంటుంది.ఆమె అక్కడ గడపడం తక్కువే,కేవలం పడుకోవడానికే వస్తుంది.పగలంతా ఇంట్లో పని చేయడానికే సరిపోతుంది.
ఈ ఇంటి కి కాస్త వెనక భాగం లో మహాపాత్ర గారి పెరడు ఉంటుంది.అక్కడ రకరకాల ఆకుకూరల మొక్కలుంటాయి.ఎండాకాలం లో గుమ్మడి తీగెలకి కాచే లేత ఆకుల్ని తెంపి తింటుంది అహల్య.ఆ కాయల్ని మాత్రం పండేదాకా తెంపరు.వీటన్నిటినీ ఆమె నాటింది.వాటికి నీళ్ళు రోజూ పోస్తుంది.చెరువు కి కొద్ది దూరం లో కూరల్లోకి పనికొచ్చే మరికొన్నిటిని పెంచుతారు.అక్కడే మామిడి తోట,వేరే తోట కూడా ఉంది.ఆ తోటల్లోకి వెళితే బయట శబ్దాలు ఏవీ వినిపించవు.ప్రశాంతం గా ఉంటుంది.
ఆ కొమ్మల్లో ఎక్కడ ఉంటుందో కాని ఓ కోయిల అతి మధురం గా పాడుతుంది.దాన్ని చూడాలని ఎంత ప్రయత్నించినా కనబడదు.దాని పాట మాత్రమే తీయగా వినిపిస్తుంది. చెరువు మీదినుంచి చల్లని గాలి వీస్తోంది.సూర్యతాపం కొద్దిగా తగ్గింది.ఒక చెట్టు మొదలు కి ఆనుకొని కూర్చుంది అహల్య.దక్షిణపు గాలి కి మామిడి కొమ్మలు మెల్లిగా ఊగుతున్నాయి.ముక్కుపుటాలకి ఆ సువాసన ఎంత హాయిగా ఉందో..! ఆ చక్కని గాలి,పచ్చి మామిడికాయల సువాసన ...వాటి ప్రభావం వల్ల అహల్య కి వెంటనే నిద్రపట్టేసింది.
ఈ మహాపాత్ర గారింటికి ఎప్పుడో తను చిన్నప్పుడు పనిమనిషిగా వచ్చింది.ఏ సంవత్సరం లో అంటే...ఏమో తనకి సరిగ్గా గుర్తులేదు.మణిదేవి అమ్మగారి పెళ్ళయినప్పుడు ఆమెతో పాటు కట్నం లో భాగంగా ఎన్నో వస్తువుల్ని పంపించారు.మంచాలు,బీరువాలు ఇంకా రోజువారీ వాడకానికి ఎన్నో వస్తువుల్ని పంపించారు.వాటి అన్నిటితోపాటు తనని కూడా పంపించారు.మణిదేవి కుటుంబానికి పనిమనిషిగా..!
ఆరోజు పొద్దున్నే తన తల్లి ,తనని మణిదేవికి అప్పగించింది.ఆ మణిదేవి వాళ్ళ తల్లి ,తన తల్లికి ఏమి చెప్పిందో ...పెద్ద వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో తనకి తెలియదు.నేను ఎక్కడకి వెళ్ళనని అహల్య ఏడ్చింది.ఆ తర్వాత మణిదేవి వాళ్ళ అమ్మ పెట్టిన అప్పాలు తినుకుంటూ ఉండిపోయింది.అప్పటికే ఆమె తండ్రి చనిపోయాడు.
ఆ విధంగా మణిదేవి వాళ్ళ మెట్టినింట్లోకి వచ్చిపడింది అహల్య. వచ్చిన మొదట్లో తల్లి గుర్తుకు వచ్చేది,కానీ పెద్దగా బాధగా అనిపించలేదు. ఏ చిన్న తప్పు చేసినా ఆమె బాగా తిట్టడం కొట్టడం చేది,ఇప్పుడు ఆ బాధ లేదు.
అహల్య అవన్నీ జ్ఞాపకం తెచ్చుకోదలుచుకోలేదు. ప్రస్తుతం మొహంతి గారింటిలో పెళ్ళి జరుగుతోంది.బనమాలి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.అదంతా ఆలోచిస్తూ నిద్ర తేలిపోయింది. ఆమె కళ్ళ ముందు జరగబోయే పెళ్ళి పనులు కనిపిస్తున్నాయి.ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వరును కుటుంబీకులు,వధువు వైపు వారు,పురోహితులు, కాలిగోళ్ళు తీయడానికి మంగలి వాళ్ళు అందరూ వచ్చారు.పూరీ నుంచి మహాప్రసాదం ,కొబ్బరిబొండాలు తెప్పించారు.నగలు,చీరెలు పెద్ద ఇత్తడి పళ్ళెం లో పెట్టి ఉంచారు.
పెళ్ళి ఇపుడు ఇంకో పక్షం రోజుల్లో జరగనుంచ్ది.ముహుర్తం ఖరారు చేసుకున్నారు.వధువు వైపు వారికి చాలా తక్కువ టైం ఉంది.పనులన్నీ వేగిరం చేయాలి.
ఇపుడు పెళ్ళి ఇంకా దగ్గర పడింది.ఎనిమిది రోజుల్లో జరగనున్నది.నానబెట్టిన వక్కల్ని పంపించే తంతు చేయాలి.గ్రామదేవత కి కూడా వాటిని సమర్పించాలి.ఈరొజు "జైరగడ" లాంటి లఘు తంతులు జరిగాయి.అంతా సక్రమంగా జరగాలని అందరూ కోరుకున్నారు.
పెళ్ళికూతుర్ని బంధుమిత్రులు వాళ్ళ ఇళ్ళకి భోజనాలకి ఆహ్వానించారు.ఆమెకి ఇష్టమైన వంటల్ని చేశారు.ఎంతైనా ఈకాలపు అమ్మాయి గదా,వాళ్ళ టేస్టులే వేరు.
పెళ్ళి ఇంకా దగ్గరికి వచ్చింది.రేపే జరగనున్నది."మంగల్ పాక్" తంతు ఈ రోజు జరుపుతారు.గోళ్ళు తీయడానికి మంగలి,అతని భార్య వస్తారు.పెళ్ళికూతురి యొక్క మరదలు కుండలో అన్నం వండుతుంది.ఆ ప్రాంగణం లో ఉండే ముత్తయిదువులు అంతా నాలికల తో శబ్దం చేస్తూ "హుళహళి" పాడుతారు.ఏడుతరాల పితృదేవతలకి నైవేద్యం పెడతారు.పెళ్ళిపనుల్లో వేగం పెరిగింది.
పెళ్ళి జరిగే రోజున బావమరిది, వరుని ఇంటికి పురోహితుడిని,మంగలిని,శంఖం ఊదే మనిషిని తీసుకుని వెళతాడు. దానితోబాటు పెళ్ళికొడుక్కి పెట్టే నగల్ని తీసుకువెళతారు.ఆ రాత్రికల్లా పెళ్ళికొడుకు బృందాన్ని తీసుకుని పెళ్ళికూతురు ఇంటికి వస్తారు.
ఇల్లంతా పెళ్ళికూతురులా ముస్తాబయింది.అరటి చెట్లు,మామిడి తోరణాలు అంతటా అలంకరింపబడి ఉన్నాయి.ఇంటిముందు శుభసూచకంగా పూర్ణ కుంభం ని పెట్టారు.గోడల్ని,వాకిళ్ళని మంచి ముగ్గులతో నింపారు.పెళ్ళి కూతురికి పసుపు రుద్ది,సుగంధ తైలాలతో మంగళస్నానం చేయించారు. ఆమె జీవితం లో ఇపుడు ఒక అధ్యాయం ముగిసింది.
ఆమె ఇపుడు ఒక సంపూర్ణమైన స్త్రీ. ఒక ఇంటి కోడలు..! ఇంతకాలం అమ్మాయిలతో అమ్మాయిలా ఆడుకుంది.ఇపుడు అలా కుదరదు.కొత్తజీవితం ఆమె కొరకు ఎదురుచూస్తున్నది.స్నానం చేయించేటపుడు ఏడుగురు ముత్తయిదువలు తమ నోళ్ళ తో "హుళహుళి" శబ్దాలు చేశారు.స్నానం చేపించిన చీరెని మంగలి భార్య తీసుకున్నది.పెళ్ళికూతురు చేతికి కంకణం కట్టారు.పీటల మీద కెళ్ళేప్పుడు పసుపు చీరె కడతారు.
బహుశా ఈపాటికి పెళ్ళికొడుకు వచ్చి ఉండవచ్చును.ఊరంతా పెళ్ళి కోసం పెట్టిన లైటింగ్ తో కళకళలాడుతోంది.బ్యాండ్ మేళాలు ఇంపుగా సరికొత్త పాటల్ని వాయిస్తున్నారు.పెళ్ళికొడుకు ని శాస్త్రోక్తంగా ఆహ్వానించాలి,పొరబాటు జరిగితే రసాభాస అవుతుంది.పెద్దలు,పిన్నలు వెళ్ళి ఆ పనిలో ఉన్నారు.ఆడపిల్ల వారివైపు అంతా టెన్షన్ గా ఉంది,ఆకలి మాట అటుంచి.
పెళ్ళిపందిరి లోకి తీసుకొచ్చారు అమ్మాయిని. పెద్దల పట్ల అణకువ తో నడుస్తూ హోమగుండం దగ్గరకి వచ్చింది. ఇక ఇప్పుడు వధూవరుల్ని కిరీటాలతో అలంకరిస్తారు.ఇద్దరి చేతులకి కలిపి ముడి వేసి ఏకం చేస్తారు.అప్పటిదాకా పరాయిగా ఉన్న మనిషితో,ఒక స్పర్శ కలిగి వింత పులకింత కలుగుతుంది. పెళ్ళి తర్వాత జరిగే ఉంగరాలు తీసే తంతు.ఆమె తమ్ముడు ఒక పద్ధతి గా బావగారికి అనుకూలంగా వ్యవహరించడం తనకి సిగ్గు కలిగించింది.
పెళ్ళి కార్యక్రమం ముగిసింది. ఇరువర్గాల వారు ఇపుడు దగ్గర బంధువులయ్యారు. నూతన దంపతులు స్నానాలూ అవీ చేసి ,కొత్త వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఇత్తడి పాత్రలో పెరుగన్నం ఆరగించారు.మెట్టినింటికి అమ్మాయి బయలుదేరే తరుణం ఇది.
పుట్టినింటివారికి అంతులేని దుఃఖం,చెట్టు వేళ్ళతో కూలినట్లుగా అయింది.వాళ్ళ శరీరం లో నుంచి ఒక భాగం వెళ్ళిపోతున్న బాధ.
కొత్త కోడలిగా మెట్టినింటికి వెళుతూ,పల్లకిలోనుంచి చూసింది. వరి పొలాలు,తారు రోడ్లు,మట్టి రోడ్లు అన్నిటిని తనివితీరా చూసింది.గ్రామం లోని చెరువుకి, దానిలోంచిన్న చేపకి,కదంబ వృక్షానికి చివరిసారిగా వీడ్కోలు చెప్పింది.కన్నీళ్ళు తిరిగాయి.దృశ్యాలు మసకబారాయి.ఆమె కోసం ఎదురుచూస్తూన్న కొత్త ఇంటికి తాను పయనమౌతోంది.కనిపిస్తున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మెట్టినింటికి రాగానే పెద్ద మరదలు పల్లకీ తలుపు తెరిచి ఆహ్వానం పలికింది.
కొత్తకోడలు మరదలికి ఇవ్వవలసిన బహుమతి ఇచ్చింది.ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించింది,తల మీద చెంగు వేసుకుని.లక్ష్మి అమ్మవారికి నైవేద్యం పెట్టినతర్వాత,ఇంట్లో ఉన్న బామ్మ కి నవదంపతులు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఏడుగురు ముత్తయిదువులకి తాంబూలం ఇచ్చారు.చుట్టుపక్కల వారికి సారె పంచారు.ఆ తర్వాత నాలుగురోజుల కి "లజ్జాహోమం" జరుగుతుంది.దానితో ఆమె ఆ ఇంట్లో శాశ్వతసభ్యురాలవుతుంది.కొత్త సంసారం మొదలవుతుంది. వంటగది లోకి వెళ్ళేముందు సూర్యుడికి ఆర్ఘ్యం ఆ సమర్పించింది.అదే సమయం లో ఎవరో పిలవడం తో ఆ ఇత్తడిపాత్ర ఆమె లేతపాదాలపై పడింది.చాలా నొప్పి కలిగి,అరిచింది.
తటాలున అహల్య పగటికల చెదిరిపోయింది.సూర్యుడికి పూజ చేసింది ఎవరు,ఎందుకు..?ఆ పెళ్ళికూతురు ఎవరు...ఏమిటి కథ..?కాసేపు నిశ్శబ్దం.ఓహో...ఇదంతా కలేనా..? కలలో కనిపించిన ఆ మనిషేనా ఆ పెళ్ళికూతుర్ని చేసుకోబోయేది..?కాసేపు ఇబ్బంది గా అనిపించింది.
"ఏయ్...అహల్య..! ఈ మధ్యానం ఎవరితో కలలో ఊరేగుతున్నావే...!" అంటూ మణిదేవి అత్తగారు గట్టిగా అరిచింది.
కన్నీళ్ళని చీరె కొంగు తో తుడుచుకుంది అహల్య.సాయంత్రం కావొస్తుంది.తులసి కోట దగ్గర నీళ్ళతో శుభ్రం చేసి ,సాయంత్రం పూజకి సిద్ధం చేయాలి.ఈ ఇంట్లోకి తను వచ్చిన దగ్గరనుంచి ఇదే పని.తెల్లారిలేచిన దగ్గరనుంచి అర్ధరాత్రి పడుకునే దాకా తనకి పనే పని. ఇంతా చేస్తే తనకి ఉన్న ఆస్తి...ఓ పరుపు,రెండు చీరెలు,ఓ అద్దం,ఓ దువ్వెన,రెండు దుప్పట్లు... అలా..!ఇదే తాటాకు గది లో ఇరవై ఏళ్ళ బట్టి ఉంటున్నది.పనిమనిషి గా..!
ఇంటికి ముందూ,వెనకా లంకంత స్థలం.ఆ మొత్తాన్ని కొబ్బరి చీపురు తో ఊడవడం మామూలు పని కాదు.ఇంటి లో ఊడవడానికి మెత్తటి చీపురు ఉపయోగిస్తుంది.ప్రతిదీ చక్కగా చేయాలి,ఏ మాత్రం తేడా వచ్చినా ముసలామె ఊరుకోదు.యంత్రం లా చేసుకుంటూ పోతూనే ఉండాలి.బండెడు గిన్నెలు తోమాలి.పశువుల కొట్టాన్ని శుభ్రం చేయాలి.స్నానం చేసి,దేవుడి పూజకి పూవులు కోసివ్వాలి.ఆ తర్వాత వంటగది లోకి వెళ్ళి టీ పెట్టాలి.ఈ పనులన్నీ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు నిద్రలేస్తారు.మణిదేవి గారి పిల్లలకి టిఫిన్లు అవీ తయారుచేస్తుంది.ఆమె పెద్ద కూతురు కాలేజి కి వెళుతుంది,భర్త కోర్టు కి వెళ్ళిపోతాడు.మళ్ళీ మధ్యానం అవుతుందీ అనగా వంటలు మొదలు పెట్టాలి.ప్రతి రోజు చేపల కూర ఉండవలసిందే,వాటిని శుభ్రం చేయాలి.కూరలు తరగాలి.అన్నిటినీ కిమ్మనకుండా చేస్తుంది అహల్య.
ఈ ఇంటికి వచ్చిన కొత్తలో తను చిన్నగా,బొద్దుగా ఉండేది.ఈ పిల్ల ఏం పని చేస్తుంది అనుకుంది మణిదేవి అత్తగారు.కాని ఆమె అంచనాలు తారుమారు చేస్తూ అన్ని పనులు చేయడం మొదలుపెట్టింది తను.బావి దగ్గర ఉన్న బండెడు గిన్నెల్ని చింతపండు పెట్టి రుద్దటం ప్రారంభించింది వచ్చిన రోజునే..!తను లేకపోతే మణిదేవి ఎలా చేసుకుంటుందో ఇంత పని అనుకుంటుందామె..!
రాత్రిదాకా పనులు చేసి వంట చేసి తినే సరికల్లా అలసిపోతుంది.తలనొప్పి,కడుపు నొప్పి వచ్చినా తన గురించి ఆలోచించే సమయం ఉండదు.వానాకాలం వస్తే ఆమె పని ఇంకా ఎక్కువ అవుతుంది.
మరోవైపున మణిదేవి పిల్లలు పెద్ద పెరిగిపోతున్నారు.పెద్ద కూతురు మీనా కాలేజి చదువుతోంది.చిన్న కూతురు హైస్కూల్ లోనూ,కొడుకు మిడిల్ స్కూల్ లోను ఉన్నారు.వాళ్ళు చిన్నప్పుడు అహల్య చేతుల్లోనే పెరిగారు.స్నానాలు చేయించడం,టిఫిన్లు పెట్టడం,స్కూల్ కి పంపించడం అంతా అహల్య నే చూసుకునేది.
ఆమె కి పెళ్ళి కాకపోవచ్చును గాని,పిల్లల పెంపకం గురించి చెప్పమంటే కొన్ని గంటలు చెప్పగలదు.పిల్ల మొహం చూసే వాళ్ళ భావాలేమిటో చెప్పగలదు.ఆకలితో ఉన్నారా లేదా అలాంటివి.
"అహల్య...ఇదిగో పిల్లలకి అన్నం తినిపించు" అంటూ మణిదేవి ఆ పని అహల్య కి అప్పజెప్పుతుంది.ఇత్తడి కంచం లో అన్నం,కూర కలిపి ముద్దలు చేసి వాళ్ళకి ఏవో కబుర్లు చెబుతూ తినిపిస్తుంది.కీలుగుర్రం,వృద్ధమాంత్రికురాలు,రాముడు,నలుడు,దమయంతి ...వాళ్ళ గురించిన కథలు చెప్పేది.పిల్లలంతా ఆమె చుట్టూ మూగేవారు.పాటలు పాడి పిల్లల్ని నిద్రబుచ్చేది.నిద్రపోయిన తర్వాత పిల్లలకి నూనె రాసేది.
అహల్య కి చదువురాకపోయినా,చాలా పాటలు,కథలు వినడం వల్లనే నేర్చుకుంది.చావు పాటలు దగ్గరనుంచి అప్పగింతల పాటల వరకు ఆమెకి వచ్చు.కొంతమంది పొరుగు వాళ్ళు ఆమె దగ్గరకి వచ్చి నేర్చుకునేవారు.వంటలు,పచ్చళ్ళు పెట్టడం ఇలాంటివి కూడా..!
మణిదేవి వాళ్ళ అత్తగారు అరవడం తోఅహల్య పరుగుదీసింది.ఇంతలోనే బనమాలి రావడం తో అతని మీద అరిచింది."ఆకులు,వక్కలు తెమ్మని చెప్పానుగదరా,ఎక్కడ చచ్చావు ఇంతసేపు..?' అంటూ తిట్టింది. మార్కెట్ నుంచి కావలసిన సామాన్లు అవీ తేవడం బనమాలి ముఖ్యమైన పని.మాటల్లోపడి అతను మరిచిపోతుంటాడు.మొహంతి గారింటి వైపు చూస్తే అతిథులతో కళకళ లాడుతోంది.అహల్యకి కూడా వెళ్ళాలనిపించి "ఇల్లు ఇప్పుడే ఊడ్చేస్తానమ్మా" అన్నది.
ఒక సంవత్సరం తర్వాత మణిదేవి పెద్ద కూతురి పెళ్ళి జరిగింది.ఆమె మరదలి పెళ్ళి కూడా ఆ వెంటనే జరిగిపోయింది.ఇంత త్వరగా వాళ్ళ పెళ్ళిళ్ళు జరిపోతాయని తను ఊహించలేదు.వాళ్ళకి పెళ్ళి కుదిరినప్పుడు తను ఎంతో సంబరపడింది,ఎందుకంటే ఆ తర్వాత తన పెళ్ళి గురించి ఆలోచిస్తారని..!
ఇప్పటికే అహల్య కి వయసు ముప్ఫై నాలుగో,అయిదో వచ్చాయి.ఇంకా తన జీవితాన్ని ఎప్పుడు బాగు చేస్తుంది మణిదేవి..? తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం..!ఈసారి ఏమైనా సరే ఆ విషయం ప్రస్తావించాలని అనుకుంది.
No comments:
Post a Comment