"గాడ్ ఫాదర్",ఇంగ్లీష్ నవలా సాహిత్యం లో ఎంత పెను సంచలనం సృష్టించిందో ,అంతకు మించి హాలివుడ్ సినిమాగా బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని తిరగరాసింది.అంతే కాదు ,ఆ సినిమా ఇచ్చిన ప్రేరణతో వివిధ భాషల్లో ఎన్ని సినిమాలు తీశారో ఇంకా తీస్తున్నారో లెక్కలేదు.పాపులర్ నవల గా మొదలయి అమెరికన్ సాహిత్య చరిత్ర లో ఒక ప్రత్యేకతరగతికి చెందిన క్లాసిక్ గా ముద్రవేసుకుంది. ఎవరినైన ఆ నవల గురించి చెప్పమంటే అది ఒక మాఫియా ఇతివృత్తమని,న్యూయార్క్ లో అయిదు శక్తివంతమైన కుటుంబాల మధ్య జరిగిన పోరాటమని చెబుతారు.అది నిజమే. అయితే దానికి మించిన నేపథ్యం గాడ్ ఫాదర్ నవల యొక్క సొంతం.కనుకనే ఒక ప్రత్యేకతని సంతరించుకుంది.
బాగా తరచి చూస్తే ఈ 448 పేజీల నవల 1945-55 సంవత్సరాల మధ్య జరిగిన కొన్ని చారిత్రక మలుపుల్ని ఒడుపుగా చిత్రించింది.అప్పటి మానవజీవితాన్ని మన ముందు ఉంచుతుంది.సిసిలీ నుంచి వలస వచ్చిన శరణార్థుల వెతల్ని,పెనుగులాటని కళ్ళకి కడుతుంది. మనిషి లోని సకల స్వభావాల్ని అత్యంత సహజ ధోరణి లో చిత్రించింది. నమ్మకద్రోహం,కుట్రలు,వ్యాపార విస్తరణ లో కుత్తుకలు కత్తిరించే పోటీ,మొనోపలిని సాధించే క్రమం లో ఎత్తుగడలు ఇలాంటివి అన్నీ ఒకవైపు...స్నేహం విలువ,కుటుంబం విలువ,నమ్మిన వారిని ఆదుకునే తత్వం ఇలాంటివి అన్నీ మరో వైపు దీనిలో మనకి కనిపిస్తాయి.ఎంత సహజం గా అంటే మన చుట్టూరానే అవన్నీ జరుగుతున్నాయా అన్నట్లు చదువరి నిమగ్నమవుతాడు.
ఇంతకీ ఈ నవల రాసిన వారు ఎవరు..? ఆయన పేరు మేరియో ప్యూజో. ఈయన కుటుంబం కూడా ఇటలీ లో భాగమైన సిసిలీ నుంచి అమెరికా కి వలస వచ్చి హెల్స్ కిచెన్ అనే ప్రాంతం లో తలదాచుకున్నదే.ఆ ఏరియా అంతా చిన్న సైజు ఇటలీ లాగే ఉంటుంది.వలస వచ్చిన పేద శరణార్థులతో..! మేరియో ప్యూజో ఈ గాడ్ ఫాదర్ రాయడానికి ముందు రెండు చక్కని నవలలు రాశాడు. అవి The Fortunate Pilgrim ఇంకా The Dark Arena. మొదటి నవల లో రైలు రోడ్ నిర్మాణం లో, వలస వచ్చి పనిచేసే కూలీల జీవితాల్ని చిత్రించాడు.ఇది పరోక్షం గా తన తండ్రి జీవితాన్ని,తమ కుటుంబాన్ని ప్రతిబింబించే రచన. దీనికి మంచి పేరైతే వచ్చింది గాని ఆర్థికం గా ఆదుకోలేకపోయింది.అలాగే రెండవ నవల కి కూడా జరిగింది.పాశ్చాత్య దేశాల్లో సంగతి తెలిసిందే గదా...ఒక్క నవల గనక సరిగ్గా జనాల్లోకి వెళ్ళి హిట్ అయితే రచయిత హాయిగా రాయల్టీ తో బతికేయవచ్చు.
తన తల్లి చెప్పిన కొన్ని సంఘటనలు,కొన్ని విన్న సంఘటనలు, Frank Costello, Carlo Gambino అనే గ్యాంగ్ స్టర్ లతో మాటాడిన అనుభవాలు అన్నీ కలిపి సిసిలీ నేపథ్యం తో ఒక చిన్న కథ రాసి ఒక పబ్లిషర్ మిత్రునికి చూపించగా,దీన్ని ఇంకా విస్తరించి రాస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చాడు.దాని ఫలితం గానే గాడ్ ఫాదర్ అనే గొప్ప జనాదరణ పొందిన నవల ఆవిర్భవించింది. 1969 లో మొదటిసారిగా ప్రచురితమైన ఈ నవల,రెండేళ్ళలో 90 లక్షల కాపీలు అమ్ముడైంది. ఇప్పటిదాకా చూసుకుంటే 3 కోట్ల కాపీలు అమ్ముడై ఒక రికార్డ్ సృష్టించింది.ఫిక్షన్ విషయం లో టాప్ టెన్ లో ఒక పుస్తకంగా నిలిచింది.
సరే...మరి ఈ నవల లోని విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుందాము. నవల ప్రారంభం కావడమే ఓ కోర్ట్ సీన్ తో ప్రారంభమవుతుంది. Bonasera అనే వ్యాపారస్తుని కుమార్తె ని కొంతమంది పలుకుబడి గల కుటుంబాలకి చెందిన కుర్రాళ్ళు కొట్టి గాయపరుస్తారు.కోర్ట్ కూడా శిక్ష విధించదు.ఈయన, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు.అప్పుడు గుర్తుకు వస్తుంది తన ఒకనాటి మిత్రుడు Vito Corleone పేరు. తను మాత్రమే ఇలాంటి వాటికి న్యాయం చేయగలడు అని భావిస్తాడు. ఇదే విధం గా ఓ పెద్ద నిర్మాత తో గొడవ పెట్టుకుని దెబ్బతిన్న Johnny Fontanne అనే సినిమా నటుడు, అలాగే తన కాబోయే అల్లుడు కి పౌరసత్వం ఇప్పించాలని Nazorine వివిధ సమస్యలతో Veto Corleone అనబడే గాడ్ ఫాదర్ ని కలవడానికి న్యూయార్క్ లోని ఆయన ఇంటికి వస్తారు. ఆ సమయం లో గాడ్ ఫాదర్ యొక్క కుమార్తె Connie పెళ్ళి జరుగుతూంటుంది.సరిగ్గా ఈ పెళ్ళి జరిగే సీన్ తోనే ఆ సినిమా దర్శకుడు Francis Coppola సినిమా వెర్షన్ ని మొదలుపెడతాడు.
ఈ వ్యక్తి ఎవరో చాలా శక్తిశాలి అని మనకి అనిపిస్తుంది.ఇంకా చదవాలని ఆతృత కలుగుతుంది.ఒక చిత్రకారుడు ఎంతో జాగ్రత్తగా తనకి బహు ఇష్టమైన చిత్రాన్ని చిత్రించినట్లుగా ప్రతి పేజీ సాగుతుంది.అతని గతం ఏమిటి..? ఎందుకని సిసిలీ నుంచి తన చిన్నతనం లో పారిపోయి ఈ అమెరికా దేశానికి వచ్చాడు..? ఎందుకని రైలు రోడ్ నిర్మాణం లో కూలీ గా పని చేశాడు..? ఎందుకని ఓడ లో తనకి కలిసిన Abbandando కుటుంబానికి చెందిన కిరాణా దుఖాణం లో పనిచేశాడు..?అనుకోకుండా Fanucci అనే రౌడీ ఇతడిని బెదిరించడం ఏమిటి..? అతడిని చంపడం తో Vito Corleone కి ఎలా సమాజం లో గౌరవం తో కూడిన భయం పెరిగింది..? ఆ అవకాశాన్ని చిల్లర గొడవలకి కాకుండా ,దూరదృష్టి తో తనదైన వ్యాపార సామ్రాజ్యాన్ని తన మిత్రులతో,బంధువులతో ఎలా విస్తరించాడు..? ఇలా అనేక సంగతులు మనల్ని ముప్పిరిగొని ఊపిరిసలపకుండా చదివేట్టు చేస్తాయి.
ఇక వ్యాపారాల్లో అతని ప్రత్యర్థులు Tattagliya ఇంకా Bargini కుటుంబాల వారు.మిగతావాళ్ళు ఉన్నా, వీళ్ళే ప్రధానంగా గాడ్ ఫాదర్ కుటుంబాన్ని నష్టపరచాలని చూస్తుంటారు.డ్రగ్స్ వ్యాపారం లో తనకి సహకరించడానికి ఒప్పుకోని గాడ్ ఫాదర్ ని Solozzo హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు.కొన్ని రోజులు మంచం మీద పడుకోవలసిన స్థితి ఏర్పడుతుంది.మరి అలాంటి సందర్భం లో ఆయన కొడుకులు Sonny,Fredo,Michael లు ఏ విధం గా ప్రతిస్పందించారు.Michael ఎందుకు ప్రవాసం వెళ్ళిపోవాల్సి వస్తుంది..?మంచం మీది నుంచి లేచిన తరువాత ఏ విధంగా సంప్రదింపులు జరిపి Vito Corleone శాంతిని నెలకొల్పుతాడు..?మళ్ళీ ఏ విధంగా Michael తిరిగివచ్చి,తండ్రికి తగిన కుమారునిగా నిరూపించుకుని మిగతా కుటుంబాల పై ఆధిపత్యం సంపాదించుతాడు,లాస్ వెగాస్ వైపు తమ వ్యాపారాన్ని ఎందుకు మళ్ళించుతాడు...ఇవన్నీ కలిపితే ఈ గాడ్ ఫాదర్ యొక్క కథ గా చెప్పవచ్చు.ఇంకా అనేక పాత్రలుంటాయి.ఏదీ అప్రధానం అనిపించదు.
ఈ నవల లోని అనేక డైలాగ్స్ పలుకుబళ్ళు గా మిగిలిపోయాయి.ఎందుకని ఈ నవల ఇంతగా జనాల్లోకి వెళ్ళిందీ అనుకుంటే,డాన్ గా ఉన్న Vito Corleone లో ప్రతి ఒక్కరు తమకి తెలిసిన ఎవరో ఒకరిని చూస్తారు.అదీ ఆ పాత్ర ప్రత్యేకత.ఇష్టం వచ్చినట్లుగా నచ్చని ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ వెళ్ళడు.ప్రతిమనిషిని సరైన మంచి మాటలతో ఒప్పించు.వారికి కావలసింది ఇవ్వు,నీకు కావలసింది తీసుకో.ఇది ఒక నీతి దీనినుంచి తీసుకోవలసింది. అడ్డంగా వెళ్ళి ఎవరికీ ప్రయోజనం కలగని రీతి లో ప్రవర్తించినప్పుడే డాన్ తన ఇతర శక్తుల్ని ఉపయోగిస్తాడు. మొనాపలీ ని ఏ బిజినెస్ లో అయినా సాధించినపుడే సిండికేట్ లో అందరికీ లాభాలు వస్తాయని,ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తే బిజినెస్ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఆ రోజుల్లోనే ఈ నవల్లో ఓ పాత్ర ద్వారా చెప్పిస్తాడు రచయిత.
దీన్ని సినిమా గా తీసినపుడు అకాడెమీ అవార్డ్ లు,గోల్డెన్ గ్లోబ్ అవార్డులు,ఓ గ్రామీ అవార్డ్ ఇలాంటివి రావడం మాత్రమే కాదు నిర్మాతలకి కనకవర్షం కురిసిందని చెప్పాలి.ఈ సినిమా కి దర్శకునిగా Francis Coppola అనే ఇటలీ మూలాలు ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం ఒక విశేషం.ఎందుకంటే నవల ఇతివృత్తం మొత్తం అమెరికా లోనే చాలా వరకు జరిగినా ప్రధాన పాత్రలన్నీ ఇటలీ లో ఓ ప్రాంతమైన సిసిలీ నుంచి వచ్చినవారై ఉంటారు.వాళ్ళ ఆచారాల్ని ,అలవాట్లని అంత తొందరగా వదులుకోవడానికి ఇష్టబడరు. ఉదాహరణకి పెళ్ళి విషయం లో గాడ్ ఫాదర్ సంప్రదాయవాది గా చెప్పాలి.గాయకుడు Johnny తన భార్య ని వదిలిపెట్టి,వేరే సినిమా నటి తో ఉన్నప్పుడు చీవాట్లు పెడతాడు.కూతురు పెళ్ళి జరిగిన రోజునే ఆసుపత్రి లో డెత్ బెడ్ మీద ఉన్న తన స్నేహితుడు Abbandando ని చూడటానికి వెళతాడు.వాళ్ళు తబ్బిబ్బు అవుతారు.ఎక్కడా సొంత పబ్లిసిటీ లేకుండా తన కార్యకలాపాలు క్రమపద్ధతి లో సాగిస్తుంటాడు.ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు,ప్రతి పాత్ర గురించి..! Consigliere, Caporegime, Cosa Nostra, Omerta ఇలాంటి ఎన్నో ఇటాలియన్ పదాలు మేరియో ప్యూజో పుణ్యమాని ఇంగ్లీష్ చదువరులకు పరిచయం అయ్యాయి. మార్క్ సీల్ అనే రచయిత ఈ నవల గురించి ఇలా అన్నాడు "The God Father wasn't just a film about gangsters and their families, but a metaphor for capitalism in America. It's a work of art that was a blockbuster ."
------ మూర్తి కెవివిఎస్ (7893541003)
( Printed in the Nava Telengana daily, dt.11.07.2022)
No comments:
Post a Comment