Sunday, September 18, 2022

"మెమొయిర్స్ ఆఫ్ ఎ గెయిష"- (ఒక గెయిష యొక్క జ్ఞాపకాలు)

 "మెమొయిర్స్ ఆఫ్ ఎ గెయిష"-  (ఒక గెయిష యొక్క జ్ఞాపకాలు) 


గెయిష అనే పేరు వినగానే మనకి జపాన్ దేశం గుర్తుకు వస్తుంది. ఆట పాటలతో అందచందాలతో తమని పోషించే మగవారిని అలరించి స్వాంతన చేకూర్చే వారి జీవితాలు మనకి ఏ మాత్రం తెలుసు..? చాలా తక్కువనే చెప్పాలి. గెయిష అంటే వెంటనే మనం వేశ్య వంటి ఓ స్త్రీ అనుకుంటాము.అలా కనక భావిస్తే కొద్దిగా పొరబాటు పడినట్లే.అలా అని పూర్తిగా సంసార చట్రం లో ఉంటూ తన జీవితం అలా గడిపేసే వ్యక్తి కూడా కాదు. నిజానికి ఆ మధ్యలో ఉంటుంది ఆమె జీవితం. Memoirs of a Geisha అనే ఈ నవల చదివిన తర్వాత జపాన్ లోని క్యోటో ప్రాంతానికి అందునా Nitta Okia లోకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత అనేక సాంస్కృతిక,సాంఘికాంశాలు మనకి ఎన్నో తెలుస్తుంటాయి.ఈ 428 పేజీలు ఉన్న నవలని అర్థర్ గోల్డెన్ అనే అమెరికన్ రచయిత రాశారు. 1997 లో వెలువడిన ఈ రచన ఎన్నో వాదవివాదాలకి నెలవైంది.  

సరే...మరి గెయిష అంటే ఎవరు..? ఆమె సంగీత,సాహిత్యాలను, నృత్యాన్ని,చిత్రలేఖనాన్ని ఇలాంటి కళల్ని అభ్యసిస్తుంది.ఎలా మర్యాదగా మాట్లాడాలి,ప్రవర్తించాలి ఇలాంటి విషయాల్ని ముఖ్యంగా మగవారి అంతరంగాన్ని బాగా ఎరిగిఉంటుంది. మరి వీటన్నిటిని ఆమెకి ఎవరు నేర్పిస్తారు...? వీటిని నేర్పించడానికి ఆయా గెయిషాలు ఉండే వాడల్లోనే ప్రత్యేకంగా పాఠశాలలు ఉంటాయి.అక్కడ అనుభవజ్ఞులైన బోధకులు ఉంటారు.ఇంకా గెయిషా నిలయాల్లోని సీనియర్లు వీరికి అవసరమైన అన్ని విషయాలు నేర్పిస్తారు.ఒక అప్రెంటిస్ గెయిష పూర్తి స్థాయి గెయిష గా మారడానికి ముందు ఒక సీనియర్ గెయిష వద్ద శిష్యరికం చేయాలి.ఆమెని సాక్షాత్తు తన సోదరి గా స్వీకరించాలి. పూర్తి గెయిష గా మారిన తర్వాత ఆమె కిమోనా కి ఉన్న ఎర్ర కాలర్ ని తెల్ల కాలర్ గా మార్చుతారు.  

మరి మనం నవల యొక్క ఇతివృత్తం లోనికి వెళదామా..? అది జపాన్ లోని ఓ కుగ్రామం,చేపలు పట్టే కుటుంబాలు అక్కడ ఉంటాయి. దాని పేరు Yoroida. సముద్రం ఒడ్డుని ఆనుకున్నట్టుగా ఉండే ఓ చిన్న ఇల్లు.ఆ ఇంటి యజమాని పేరు Sakamoto Minoru, అతను చేపలు పడుతూ జీవిస్తుంటాడు. భార్య మంచం పట్టింది,ఏదో నయం కాని రోగంతో...గొప్ప వైద్యం చేయించే తాహతు లేదు.స్థానికం గా ఉండే వైద్యుడే తనకి వచ్చిన వైద్యం చేస్తూంటాడు. ఎంతో కాలం ఆమె బతకదని వైద్యుడు చెప్పడం తో అతను చింతిస్తుంటాడు.తను కూడా ముసలివాడవుతున్నాడు.శక్తి సన్నగిల్లుతున్నది.తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్దపిల్ల పేరు సట్సూ, చిన్నపిల్ల పేరు చియో చాన్ అయితే ఈమె పేరుని సయోరి గా మార్చుతారు.అదంతా ముందు వస్తుంది,అప్పుడు చూద్దాం.

 ఈయన ప్రస్తుతపు భార్య ని రెండవ సంబంధం గా చేసుకుంటాడు,మొదటి భార్య చనిపోవడం తో..!ఆ గ్రామానికి దగ్గర్లోనే చేపల్ని కొని పైకి అమ్మే ఓ సంస్థ ఉంటుంది. దాని చైర్మన్ పేరు తనకా ఇచిరో, ఈయన ఈ కుటుంబం యొక్క గాధ విని ఓ పని చేస్తాడు.ఆ ఇద్దరు ఆడపిల్లల్ని క్యోటో లో ఉన్న మధ్యవర్తి ద్వారా ఒకియ కి అప్పగిస్తాడు.వాళ్ళ తల్లి,తండ్రి చనిపోయే రోజులకి దగ్గరకి వచ్చారని వాళ్ళయినా ఎక్కడో ఓ చోట మరీ అనాధలుగా కాకుండా బ్రతుకుతారని అలా చేస్తాడు. చియోచాన్ కి ఈ చైర్మన్ అంటే ఎంతో ఇష్టం.చక్కగా మాట్లాడుతుంటాడని. మొత్తానికి అక్క సట్సూ తో కలిసి ఆ తొమ్మిదేళ్ళ చియోచాన్ ,క్యోటో కి వెళుతుంది.అంటే బెక్కో అనే వ్యక్తి తీసుకువెళతాడు.

వెళ్ళిన రోజునే ఆ ఒకియ లో పెద్దావిడ (నవల్లో మదర్ అంటారు) వీళ్ళిద్దర్నీ చూసి చిన్నపిల్ల బాగుంది,మంచి కళ్ళు ఇంకా ఇతర అందచందాలు బాగున్నాయి.శరీరాన్ని పట్టి చూసి నీటి శాతం బాగా ఉంది,ఈ పిల్ల ని గెయిషా ని చేద్దాం ఇక్కడే ఉంచండి అని చెప్పి,పెద్దపిల్ల ని నొక్కి చూసి ఈ అమ్మాయి లో కట్టె శాతం ఎక్కువ ఉంది,బ్రోతల్ వాళ్ళకి అమ్మేయమని చెబుతుంది. తొమ్మిదేళ్ళ ఈ చిన్నమ్మాయి పేరు చియోచాన్ నుంచి సయోరి గా మారుతుంది.సయోరి కి ఓ రూం కేటాయిస్తారు.గెయిష గా మారడానికి అవసరమయ్యే విద్య కోసం ఆ పాఠశాల కి పంపిస్తుంటారు.అక్కడ ఆ అమ్మాయి షమిసెన్ అనే వాయిద్యాన్ని అభ్యసిస్తుంది.అలాగే మిగతావాటిని. అక్కడకి దగ్గర లోనే టోజి ఆలయం ఉంటుంది.ఆ లోపల ఉండే దైవం బుద్ధభగవానుడే.అప్పుడప్పుడు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తూంటుంది.   

ఈ అమ్మాయి తొమ్మిదేళ్ళ ప్రాయం లో ఉంది గదా అందుకని,తాను ఉంటున్న ఇంట్లో ఊడ్చేపని,బజారుకెళ్ళి ఏవైన తెచ్చిపెట్టే పనులు ఇలాంటివి చెబుతుంటారు.ఈమె కి అయ్యే రూం ఖర్చులు,తిండి ఖర్చులు ఇంకా ఇతరత్రా ఖర్చులు అన్నీ మదర్ పొల్లు పోకుండా ఒక బుక్ లో రాస్తూంటుంది.అంటే ఈ అమ్మాయి గెయిషా గా మారిన తర్వాత ఆ డబ్బులు అన్నీ వసూలు చేసుకుంటారు. అంతే కాదు ఆ అమ్మాయికి మొదట కన్నెరికం చేసే వ్యక్తి నుంచి పెద్ద స్థాయి లో డబ్బులు ముడతాయి.ఇక్కడ ఓ విషయం చెప్పాలి. జపనీస్ లో Mizuage అనే మాట ఉంది. దీని అర్థం మన భాషలో కన్నెరికం వంటిదేనని చెప్పాలి.ఒక అమ్మాయిని గెయిషా వృత్తి లో దింపబొయే ముందర ఓ సంరక్షకుని తో ఒప్పందం కుదుర్చుకుంటారు.

ఎవరైతే ఎక్కువ ధర చెల్లించి ఆ అమ్మాయిని మొదటి రాత్రికి పొందుతారో అతడిని "Danna" అని అంటారు. ఆ గెయిష జీవించి ఉన్నంతకాలం ఆమె తిండికి ,అవసరాలకి కావలసిన డబ్బుని అతను క్రమం తప్పక చెల్లించాలి.అయితే అంత మాత్రం చేత అతనికి ఆ గెయిష మీద పూర్తి హక్కులు ఏమీ ఉండవు.ఎప్పుడైనా ఆమె ని సందర్శించి వెళ్ళవచ్చు.అంతే. గెయిష తను ఇష్టపడిన వారితో ఉండవచ్చు,పెళ్ళాడవచ్చు,లేదా ఆ వృత్తిలో నుంచి తొలిగిపోవచ్చు కూడా.ఆమె సంపాదించిన డబ్బు మీద కూడా Danna అనే అతనికి ఏ అధికారం ఉండదు. సయోరి ఉండే ఆ గృహం లోనే హట్సుమొమొ అనే పూర్తి స్థాయి గెయిష ఉంటుంది.

ఆమె కి ఈ అమ్మాయిని చూస్తే మహా అసూయ.ఎందుకంటే సయోరి పెద్ద పెరిగితే తనకన్నా అందగత్తె అవుతుందని ,గెయిష గా పేరూ డబ్బు బాగా గడిస్తుందని హట్సుమొమొ కుళ్ళుకుంటూ నానా చికాకులు పెడుతుంది గాని మమేహ అనే ఇంకో ప్రముఖ గెయిషా సయోరి ని ఆదుకుంటూ ఉంటుంది.మమేహ కి ఒక పెద్ద బిలియనీర్ యొక్క అండ ఉంటుంది.కాబట్టి అంత త్వరగా ఆమె జోలికి ఎవరూ వెళ్ళరు. ఒకసారి సుమో రెజ్లింగ్ జరిగినప్పుడు ఈ మమేహ తో కలిసి సయోరి వెళ్ళగా,అక్కడ నోబూ అనే పెద్ద వ్యాపారి తో పరిచయం అవుతుంది.అతను ఇవామురా ఎలెక్ట్రిక్ కంపెనీ కి చాలా కీలకమైన పార్ట్నర్. ఇంతకీ వస్తే ఆ కంపెనీ తనకా ఇచిరో దే.అతనే చైర్మన్.అంటే ఆ Yorodaina గ్రామం నుంచి ఇక్కడకి వచ్చి వ్యాపారం చేసి ఆ దశకి చేరుకుంటాడు. అతను ఓ డ్రామా కార్యక్రమం లో కలిసినపుడు వదిలేసిన రుమాలు ని తన వద్దనే జ్ఞాపకం గా ఉంచుకుంటుంది.తను గెయిష గా మారిన తర్వాత చైర్మన్ ని అలరించాలని కలలుకంటూంటుంది.

అయితే సయోరికి పదహారేళ్ళు వచ్చిన తర్వాత ఓ డాక్టర్ తో మొదటిరాత్రి కార్యక్రమం జరుగుతుంది.ఆ వచ్చిన డబ్బులు మదర్ తనకి ఇన్నాళ్ళు పెట్టిన ఖర్చులకు గాను ఇచ్చివేస్తుంది.మదర్ కూడా ఈ అమ్మాయిని మంచిగా చూసుకుంటూ అడాప్ట్ చేసుకుంటుంది.అంటే తన తర్వాత ఆ గృహానికి యజమాని కావచ్చును.హట్సుమొమొ దగ్గరున్న అప్రెంటిస్ పంప్కిన్ కి కోపం వచ్చి వెళ్ళిపోతుంది.హట్సుమొమొ ఆగడాలకి చిరాకు లేసి లేచి ఆమెని కూడా మదర్ బయటకి పంపివేస్తుంది. సయోరికి Danna గా ఓ మిలిటరి అధికారి ఉంటాడు. నోబు కోప్పడతాడు తనని ఎంచుకోవచ్చు గదా అని.

రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ప్రభుత్వం గెయిషా గృహాల్ని అన్నీ మూసేయమని ఆర్డర్ వేస్తుంది.ఎందుకంటే సైనికులకి అవసరమయ్యే వివిధ ఉత్పత్తుల్ని మరింత పెంచడానికి ప్రతి పెద్ద బిల్డింగ్ ని ప్రభుత్వం వాడుకుంటుంది.ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది.ఫేక్టరీ లో పనిచేసే శక్తి లేదు వేరే చోటికి పంపించమని చెప్పగా నోబు ఆమెని తనకి తెలిసిన ఓ పల్లె కి ఓ ఇంటిలో పనిచేయడానికి పంపించుతాడు.అక్కడ అయిదు ఏళ్ళు గడుపుతుంది సయోరి.మళ్ళీ క్యోటో కి వచ్చేసరికి స్వరూపం మారిపోతుంది.అమెరికన్ సైనికులు కనబడుతున్నారు.వాళ్ళు గెయిష టీషాపుల్ని క్యాబెరిలుగా మార్చివేశారు అని చింతిస్తుంది. మళ్ళీ నోబు కలుస్తాడు,అతని కంపెనీ యుద్ధ సమయం లో బాగా తింటుంది.సాయం చేయడానికి గాను ఓ మినిస్టర్ ని కలిసినా ప్రయోజనం ఉండదు,చివరికి సయోరి అతడిని ఎంతగానో అలరించి అమామి అనే రిసార్ట్ కి వెళ్ళినపుడు శారీరకం గా కూడా సుఖపెట్టి, నోబు కంపెనీ కి సహాయం చేస్తుంది. దాంతో అది గాడిని పడుతుంది.

ఇంకా కొన్ని మలుపులు తిరుగుతాయి. మొత్తానికి ఇవామురా ఎలెక్ట్రిక్ చైర్మన్ తనకా ఇచిరో తో తన మనసులోని మాట చెబుతుంది.అప్పుడు కొన్ని రహస్యాల్ని చైర్మన్ చెబుతాడు.సయోరి కష్టసమయం లో ఉన్నప్పుడు మమేహ ద్వారా సాయం చేయించింది అతనే అని తెలుస్తుంది. చైర్మన్ ఆమెకి సంరక్షుని గా ఉంటాడు. వ్యాపార పనుల్లో భాగం గా చైర్మన్ అమెరికా వెళ్ళినప్పుడు తనతో సయోరి కూడా వెళుతుంది.ఇక్కడ ఎలాగూ మీ కంపెనీ బ్రాంచ్ పెడుతున్నారుగదా ,నాకు ఓ చిన్న హోటల్ పెట్టుకోవడానికి సహాయం చేయండి ఈ న్యూయార్క్ లోనే ఉండిపోతాను అంటుంది.ఆ విధం గా సయోరి ఒక గెయిష సేవల్ని అందించే చిన్న హోటల్ ని ప్రారంభిస్తుంది. అక్కడికి వచ్చే జపనీస్ అధికారులకి,రాయబారులకి తన సేవలు అందిస్తూంటుంది. అలా ముగుస్తుంది కథ.

ఈ నవల మొత్తం కూడా ఉత్తమ పురుష లో సాగుతుంది.సయోరి తన న్యూయార్క్ లోని అపార్ట్ మెంట్ నుంచి ఈ కథ అంతా జ్ఞాపకాలుగా చెబుతూంటుంది.అప్పటికి చైర్మన్ కూడా కన్ను మూస్తాడు.             చివరి లో ఓ చోట ఇలా అంటుంది. I cannot tell you what it is that guids us in this life;but for me,I fell toward the Charman just as a stone must fall toward the earth.When I cut my lip and met Mr.Tanaka,when my mother died and I was cruelly sold,it was all like a stream that falls over rocky cliffs before it can reach the ocean.Even now that he is gone I have him still,in the richness of my memories. I've lived my life again just telling it to you.

ఈ నవల్లో సయోరి అక్క సట్సూ గురించి పెద్దగా ఉండదు.ఆ బ్రోతల్ హౌస్ నుంచి పారిపోయి ఇంకో వ్యక్తి ని పెళ్ళి చేసుకున్నట్లు చెబుతాడు రచయిత.సయోరి అక్క తో కలిసి పారిపోవాలని చూసినా అది విఫలమౌతుంది.మమేహ ని పోషించే Danna స్థానం లో ఉన్న వ్యక్తి ఆమె ఇంటికి వచ్చినపుడు ఆ గోడ కి తగిలించి ఉన్న Matsudaira Koichi కవిత కనబడటం లేదేమిటి అని అడిగినపుడు జపనీస్ ప్రజల యొక్క కవిత్వం మీది ప్రేమ మనకి అర్థమవుతుంది. సుమో యోధుల మీద జోకులు వేస్తే కూడా వాళ్ళు హర్షించరు.

మినెకొ ఇవసాకి అనే గెయిష ఈ పుస్తక రచయిత పై కోర్ట్ కి వెళ్ళడం తో రచయిత అర్థర్ గోల్డెన్ ఆమెకి కొంత ధనం ప్రైవైట్ గా ఇచ్చి కేసు నుంచి బయటబడ్డాడు. ఎంతో సమాచారం ఇచ్చిన తన పేరు ని రహస్యం గా ఉంచలేదని,అలాగే కొంతమంది పేర్లు మరుగుపరచలేదని ఆమె ఆరోపించింది. మొత్తానికి ఆమె కూడా కొంత సమాచారాన్ని జోడిస్తూ గెయిష-ఏ లైఫ్ అని ఓ పుస్తకాన్ని రాసింది. 2005 వ సంవత్సరం లో అర్థర్ గోల్డెన్ రాసిన ఈ పుస్తకాన్ని ఆధారం గా చేసుకుని ఓ సినిమా తీశారు.దాంట్లో ప్రధాన పాత్రలకి చైనా నటీనటుల్ని పెట్టడం తో అటు చైనా ఇటు జపన్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సినిమా కి మూడు అకాడెమీ అవార్డ్ లు వచ్చాయి. అలాగే ఇతర పురస్కారాలు వచ్చాయి. రచయిత అర్థర్ గోల్డెన్ అమెరికన్ అయినప్పటికి స్వయం గా జపనీస్ భాష లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి.కొలంబియా యూనివర్సిటీ నుంచి జపాన్ చరిత్ర లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అలాగే టోకియో లోని ఒక మేగజైన్ లో కొంతకాలం పనిచేశారు.


----- మూర్తి కెవివిఎస్ (7893541003)       

           (Printed in Nava Telangana daily dt. 22.9.2022

    

No comments:

Post a Comment