Sunday, November 13, 2022

నా శ్రీలంక ప్రయాణ జ్ఞాపకాలు

 2018 వ సంవత్సరం,సెప్టెంబర్ మాసం లో నేను కొంతమంది మిత్రులతో కలిసి శ్రీలంక దేశాన్ని సందర్శించాను. ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి.ఆ తర్వాత కరోనా మహమ్మారి వల్ల ఆ దేశ పర్యటనా రంగం కునారిల్లింది.ఆ తర్వాత ఆ దేశం లో చెలరేగిన ఆర్దికపరమైన,రాజకీయపరమైన కల్లోలం మనల్ని కూడా కలవర పరిచింది.కొంతమంది మిత్రులు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీ అనుభవాలతో ఓ వ్యాసం రాస్తే బాగుంటుందని సూచించారు.అది ఎంతైనా అవసరమైన విషయమని నాకు కూడా అనిపించింది.


శ్రీలంక లో తిరుగుతున్నంతసేపు అది వేరే దేశం లా మనకి అనిపించదు.మన దేశం లోనే ఓ రాష్ట్రం లో ఉన్నామా అనిపిస్తుంది.అయితే అక్కడి గ్రామ ప్రాంతాల్లోని కూడళ్ళలో కనిపించే బుద్ధ భగవానుని విగ్రహాలు చూసినప్పుడు,ఏటవాలుగా ఉండే ఇంటి పైకప్పులు, పరిశుభ్రంగా ఉండే పరిసరాలు, జలపాతాలు,పచ్చని అడవులు ఇవన్నీ చూసినప్పుడు ఏదో తేడా గా ఉందే అనిపిస్తుంది.ఓహో ఇది మన పక్క దేశం కదూ అని భావిస్తాము.శ్రీలంక ప్రజలు ప్రధానం గా శాంతిప్రియులు. భారతదేశాన్ని పెద్దన్న గా భావించే ఆ ప్రజానీకం లో అక్కడి స్వార్ధ రాజకీయ శక్తులు పెడ భావనల్ని ప్రవేశపెట్టాలని చూస్తుంటాయి.   


  కొలొంబో,అనురాధాపుర,జాఫ్నా,కాండీ వంటి ప్రాంతాల్లో పర్యటించాము.అక్కడి సంస్కృతి తో మన దేశానికి గల అనుబంధం చాలా గట్టిది.ఆ విషయం అక్కడి సాధారణ ప్రజలకి కూడా బాగా తెలుసు,కాని మన దేశం లో అది ఎంత మందికి తెలుసు..? కాండీ నగరం లోని దంత మందిరం ని సందర్శించినపుడు ఆ ప్రాంతం లోని జనసామాన్యం తో ముచ్చటించాము. ఈ ప్రాంతానికీ,కళింగ సీమ ని పాలించిన మన పాలకవంశీయులకి ఒక సంబంధం ఉంది.ఇక్కడ కట్టబడిన ప్రఖ్యాత దంత మందిరం లో బుద్ధ భగవానుని యొక్క పన్ను భద్రపరచబడి ఉంది. 


దీన్ని భారత దేశం నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన వారు 4 వ శతాబ్దం లో కళింగ ప్రాంతాన్ని పాలించిన గుహసీవ అనే రాజు యొక్క కుమార్తె హేమ మాలి,దంతసేనుడు. ఆ ఆలయం లో వాళ్ళ పేర్లు ,చిత్రాలు ఇప్పటికీ మనం చూడవచ్చు.విచిత్రం గా వారి గురించి ఇక్కడ మనకి ఎలాంటి వివరాలు పెద్దగా తెలియదు.చాలా చారిత్రక విశేషాలు అలా మరుగున పడిపోయాయి.

కొంతమంది అక్కడి తమిళుల తో మాటాడినప్పుడు ఆ దేశం లో చైనా యొక్క ఆధిపత్యం ఎలా పెరుగుతున్నదీ వివరించారు.తమిళుల రూపాల్లో మార్పు తేవడానికి గాను చైనా దేశీయులు స్థానిక తమిళ యువతులతో పిల్లల్ని కనే ఒక కార్యక్రమం చేపట్టారని తెలిపారు. స్థానిక కొలొంబో విమానాశ్రయం లో మన కరెన్సీ కి ఎక్చేంజ్ దొరకదు. అయితే థాయ్,జపాన్,చైనా కరెన్సీ కి మాత్రం దొరుకుతుంది.సరే...డాలర్ కి తిరుగు లేదనుకోండి.అప్పటికే చైనా పెట్టుబడుల కబంధ హస్తాల్లో శ్రీలంక చిక్కుకున్నట్లు అనిపించింది.సాంస్కృతికం గా మనకి ఎంతో దగ్గరగా ఉండే ఆ దేశం తో రాజకీయ సంబంధాలు అంత ధృడం గా లేవనిపించింది. ఏదైమైనా ఇద్దరు వస్తాదుల మధ్య చిక్కుకున్న కూన లా తోచింది.

జీవనప్రమాణం,ఆరోగ్య విషయాలు,పరిశుభ్రత వంటి విషయాల్లో శ్రీలంక డేటా పరంగా ముందున్నప్పటికి భారీ పరిశ్రమల పరంగా,సైనికంగా,ఎగుమతుల పరంగా మన దేశం పెద్ద స్థాయి లో ఉంటుంది.దాన్ని ఆ ప్రజలు కూడా అంగీకరిస్తారు.ఆ దేశం మొత్తం పర్యటనా రంగం మీద బాగా ఆధారపడి ఉంటుంది.కరోనా సమయం లో బాగా దెబ్బ తిన్న దేశాల్లో అదొకటి.ఎక్కడికి వెళ్ళినా డిసిల్వ,డిసూజా,డికోస్టా ,పెరీరా ,ఫెర్నాండో అనే పోర్చ్ గీసు ఇంటి పేర్లు వీరిలో ఎక్కువ వినిపిస్తుంటాయి.ఆరా తీస్తే వీరిలో బౌద్ధులు కూడా ఉన్నారు. పోర్చ్ గీస్ వాళ్ళు పాలించిన సమయం లో అప్పటి ఆ దేశ సైనికులు స్థానికుల్ని పెళ్ళి చేసుకోవడం తో,తర్వాత సంతానానికి  అవే ఇంటి పేర్లు కొనసాగుతున్నాయి.    

కాండీ నుంచి నువార ఏలియా అనే ఊరికి వచ్చాము.ఆ ఏరియా లో టీ తోటలు,జలపాతాలు,ప్రకృతి శోభ ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి.నిజం చెప్పాలంటే లంక లోని ప్రతి భాగం పచ్చదనం తో నిగ నిగ లాడుతూ ఉంటుంది. అక్కడ ఓ హోటల్ కి రావణ అనే పేరు ఉంది.చదివినపుడు గమ్మత్తుగా అనిపించింది.ఉపాలిక,విజేయ,అశోక,కశ్యప లాంటి పేర్లు కనిపిస్తూంటాయి.ఒక దగ్గరతనం ని ఫీలవుతుంటాము. ఈ నువార ఏలియా లో రావణుడు, సీతమ్మ వారిని ఉంచిన ప్రదేశం ఉంది. ఇక్కడ ఓ ఆలయం ఉంది,ఆ ప్రాంగణం లో ఆంజనేయుడికి కూడా చక్కని విగ్రహాలు ఉన్నాయి. అక్కడ స్ప్రయిట్ కూల్ డ్రింక్ తాగితే 30 రూపాయలు అయింది. అదిక్కడ అప్పుడు 15 రూపాయలు.ఈ వ్యత్యాసం అన్నిట్లోనూ ఉంది.

కొలొంబో కి దగ్గరలోని బండారగామ అనే ప్రాంతం లో ఉన్నప్పుడు ఒక నృత్యాన్ని చూశాము.వెండి నగల్ని ధరించి పురుషులు చేసినది.మన దేశం నుంచే అది కొన్ని వందల ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చిందని చెప్పారు.దానిపేరు కొహోంబో కంకారియా అంటారట. నేను కేరళ లో ఉన్నప్పుడు అనుకున్నాను,ఈ స్లోప్ గా ఉండే ఇళ్ళు,పచ్చదనం,కొబ్బరి చెట్లు,శుభ్రత ఇవన్నీ వెరైటీ గా ఉన్నాయని...కాని వీటి లాంటివే ఈ శ్రీలంక అంతా కనిపిస్తూ మన దేశం తో ఉండే అవినాభావ సంబంధాన్ని నిరూపిస్తున్నాయి.మళ్ళీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు దారిన పడి శ్రీలంక కుదుటబడుతున్నట్లు అనిపిస్తోంది.వారికి శుభమే జరగాలని ఆశిద్దాం..! కొసమెరుపు ఏమిటంటే మేము ఆ దేశం నుంచి వచ్చిన కొన్ని రోజులకి శ్రీలంక పేపర్ ని ఆన్ లైన్ లో చదువుతుంటే రా ఏజెంట్లు దేశం లో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించుతున్నారని   ఓ రాజకీయనాయకుని ఆరోపణ.

--- మూర్తి కెవివిఎస్ (7893541003)     (Printed in the November issue of Visakha Samkrtuthi, Monthly magazine)

No comments:

Post a Comment