Monday, April 15, 2024

తొమ్మిది వందల ఏళ్ళయినా ఆ నిర్మాణం యొక్క వైభవం తగ్గలేదు

 ఒక శిల్పి పేరు మీద ఆలయానికి పేరు రావడం ఓ విచిత్రం. అది వేరే ఎక్కడా మనకి కనబడదు, ఒక్క రామప్ప గుడి విషయం లో తప్పా..!నిజానికి ఈ అపురూపమైన గుడి కట్టించింది రేచర్ల రుద్రుడు. కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుని దగ్గర సేనాని. ప్రస్తుతం అనుకోని విధంగా ఆ చోటకి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి నేను చూసిన కోణం నుంచి రాస్తాను. క్రీ.శ.1213 కల్లా ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయింది.


ఈ ప్రాంగణం లో మూడు ఆలయాలు ఉన్నాయి. రుద్రేశ్వర స్వామి ఆలయం తో పాటు కామేశ్వర ఆలయం,కాటేశ్వర ఆలయం. ఈ చివరి రెండు ఆలయాల కి సంబందించి రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి.కనుక ఆలయం నుంచి తొలగించిన పెద్ద రాతి పలకలను అక్కడి చెట్ల కింద పరిచారు. ముఖ్యంగా కుడి వైపున ఉన్న ఆలయాన్ని పూర్తిగా తొలగించారు. అక్కడి శివలింగాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే ఉంచారు.

అక్కడ ఉన్న వివరాల్ని బట్టి ఆ రోజుల్లో 40 ఏళ్ళ బాటు కట్టారు. రామప్ప గుడి ని మామూలు గుడి లా చూసే వాళ్ళకి ఏమీ అనిపించదు. కాని సావధానంగా అక్కడి గోడల మీద చెక్కిన చిన్న శిల్పాలు,నృత్యకారిణులు,వాయిద్యకారులు ఇంకా ఏనుగులు వంటి జంతువులు లాంటి వాటిని చూస్తే హృదయం ద్రవిస్తుంది. ఎంతో జాగ్రత్తగా ఓ చిత్రకారుడు బొమ్మ వేసినట్లుగా రాతి తో అంత వైవిద్యభరితంగా చెక్కడం గొప్ప విశేషం. 


మొత్తం ఏనుగుల శిల్పాలు (చిన్నవి) దాదాపు అయిదు వందలు పైదాకా ఉంటే ఏ ఒక్కటీ మరో దానిలా ఉండదు.ఎంతో జాగ్రత్తగా గమనిస్తే తప్పా అది తెలియదు. పెద్ద ఏనుగుల శిల్పాల్ని,ఇతర శిల్పాల్ని నిర్దాక్షిణ్యంగా పగలగొట్టారు. ఆ మానవుల గుండెలు మనుషులవా ,జంతువులువా అనిపించింది. శిల్ప చాతుర్యం గురించి ఎంతైనా చెప్పవచ్చు. పునాది నిర్మాణం లో సాండ్ బాక్స్ టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉపయోగించారు. దానివల్లనే 17 వ శతాబ్దం లో వచ్చిన ఓ భూకంపాన్ని కూడా విజయవంతంగా తట్టుకుని నిలిచింది.    

వరంగల్ జిల్లా లో పాలంపేట గ్రామం లో ఉందీ నిర్మాణం. టూరిజం శాఖ వారు కొన్ని కాటేజ్ లు నడుపుతున్నారు. ఏది ఏమైనా రమారమి తొమ్మిదివందల ఏళ్ళపాటు అనేక వైపరీత్యాలకి ఎదురొడ్డి నిలిచిన ఈ నిర్మాణం మన భారతీయ శిల్పుల గొప్పదనానికి ఓ మచ్చుతునక. 

No comments:

Post a Comment