Thursday, May 16, 2024

ఇంటర్ పోల్ ఎలా పనిచేస్తుంది ?

ఇంటర్ పోల్ అనే అంతర్జాతీయ సంస్థ పేరు వింటూంటాం గానీ అది పని చేసే విధానం గురించి చాలా మందికి తెలియదు. దాని పూర్తి పేరు ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ స్థాయి లో జరిగే నేరాలకి సంబంధించి , ప్రపంచం లోని వివిధ సభ్యదేశాల మధ్య వారధి లా పనిచేస్తుంది. డేటాబేస్ ని పంచుకోవడం, నేరగాళ్ళ కి వ్యతిరేకంగా చేపట్టే ఆపరేషన్స్ కి సాయపడటం, పోలీస్ దళాలకి శిక్షణ ఇవ్వడం ఇలాంటి పనులు ఇంటర్ పోల్ నిర్వర్తిస్తుంది. ఇది స్వతంత్ర సంస్థ. ప్రస్తుతం 195 దేశాలు ఈ సంస్థ లో సభ్యులు గా ఉన్నాయి.

ఈ సభ్య దేశాలన్నీ అంతర్జాతీయ నేరాల్ని నిరోధించడం లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ  ఇంకా అవసరమైన అన్ని విషయాల్లో సహకరించుకుంటాయి. ఏ దేశం లో నైనా సరే నేరం చేసి మరో దేశం లో తలదాచుకుంటే వారి గురించి ఇంటర్ పోల్ కి సమాచారం ఇస్తే అలాంటివారిపై రెడ్ నోటీస్ జారీ చేస్తుంది.అదే విధంగా ఎవరైనా అనుమానితుల గురించి అదనపు సమాచారం అడిగినా,వారి కార్యకలాపాల గురించి తెలుసుకోవాలని ఏ సభ్య దేశమైనా అభ్యర్దిస్తే అలాంటి వారిపై  బ్లూ నోటీస్ జారీ చేస్తుంది ఇంటర్ పోల్. ఇక టెర్రరిజం, వ్యవస్థీకృత నేరగాళ్ళ విషయం లో గ్రీన్ నోటీస్ జారీ చేస్తుంది.

 ఎవరైన వ్యక్తులు ఇతర దేశాల్లో తప్పిపోయినా , మోసపోయినా లేదా మోసపోవడానికి అవకాశం ఉన్నా అలాంటి వారిని ట్రేస్ చేయడానికి గాను యెల్లో నోటీస్ జారీ చేస్తారు. గుర్తు తెలియని శవాల విషయం లో బ్లాక్ నోటీస్ ని ప్రకటిస్తుంది. ఇలాంటి నోటీస్ లు ప్రపంచం లోని వివిధ దేశాల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ నోటీస్ ల ఆధారంగా ఇంటర్ పోల్ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం అనేది ఉండదు. ఆయా సభ్య దేశాల్లోని చట్టాల ఆధారంగానే చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ప్రతి సభ్య దేశం లోనూ నేషనల్ సెంట్రల్ బ్యూరో అనే శాఖ ఉంటుంది. అది ఇంటర్ పోల్ తో అనుసంధానమై పనిచేస్తుంది.

అంతర్జాతీయం గా ఇంటర్ పోల్ చేపట్టే ఆపరేషన్ లలో ఆ బ్యూరోకి చెందిన రక్షణాధికారులు పాల్గొంటారు. వివిధ అసైన్ మెంట్ లలో భాగం పంచుకోవడానికి ప్రతి సభ్య దేశం తమ పోలీస్ అధికారుల్ని పంపిస్తుంది.సైబర్ క్రైం, డ్రగ్స్ రవాణా, టెర్రరిజం ఇలా నేరమేదైనా సరే అంతర్జాతీయ కోణం ఉంటే దాన్ని ఇంటర్ పోల్ స్వీకరిస్తుంది. మన దేశం లో సి.బి.ఐ. శాఖ ఇంటర్ పోల్ తో కలిసి పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ దేశం లోని లయోన్ అనే నగరం లో ఉంది.


----- మూర్తి కెవివిఎస్ 

(printed in Telugu prabha daily on 15-5-24)

No comments:

Post a Comment