Saturday, May 25, 2024

బీహార్ నుంచి ఎక్కువ ఐఏఎస్ అధికారులు రావడానికి కారణాలివే !

 



---------------------------------------------------------------------------------

 బీహార్ అనేక రంగాల్లో చాలా వెనుకబడిన రాష్ట్రమనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే మరి అక్కడి నుంచి ఎందుకని ఎక్కువగా ఐఏఎస్ కి సెలెక్ట్ అవుతున్నారు అనే సందేహం కూడా వస్తుంది.అక్కడ కాపీలు ఎక్కువ జరుగుతాయని కొంతమంది, దందా చేసి పరీక్షలు పాసవుతుంటారని ఇంకొంతమంది రకరకాలుగా చెప్పుకోవడం కద్దు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. 1951 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాల్ని చూస్తే, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అత్యంత ఎక్కువగా 717 మంది ఐఏఎస్ ల్ని దేశానికి ఇస్తే, బీహార్ ఆ తర్వాత 452 మందిని తయారు చేసి రెండవ స్థానం లో నిలిచింది.ఆ విజయయాత్ర అలా సాగుతూనే ఉంది.

ఈ రోజున మన దేశం లోని ప్రతి జిల్లాలోనూ ఒక బీహార్ కి చెందిన ఐఏఎస్ అధికారి గాని,ఐపిఎస్ అధికారి గాని ఉంటారు. మరి ఇది ఎలా సాధ్యపడింది ? అది తెలియాలంటే మూలాల్లోకి వెళ్ళాలి. బీహార్ రాష్ట్రం లో పెద్ద పరిశ్రమలు లేవు. మల్టీ నేషనల్ సంస్థలు లేవు. ఎగుమతి చేయదగ్గ వనరులు కూడా లేవు. స్థిరమైన,గౌరవ ప్రదమైన జీవితం కావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయవలసిందే. ప్రతి కుటుంబం తమ పిల్లల్ని ఆ వైపుగా వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. ఉన్న వ్యవసాయ భూముల్ని అమ్మి కూడా పిల్లల్ని చదివిస్తారు. సహజంగానే భూస్వామ్య పెత్తందారీ సమాజం లో ఉండే అధికారం,హోదా వాటి కోసం పరితపించే వారికి వాళ్ళ కళ్ళ ముందు కనబడే ఐఏఎస్ ల వైభవం గొప్పగా కనబడుతుంది.

బీహార్ ప్రజల తెలివితేటల్ని తక్కువ అంచనా వేస్తే పొరబాటే. పాట్నా వంటి నగరం లోకి, దేశం లో ఉండే ప్రతి ముఖ్యమైన పత్రిక అంటే విద్యా,ఉపాధి,కోచింగ్ ఇలాంటి అంశాల్ని వివరించే పత్రికలన్నీ వస్తాయి. ఎడతెరపి లేకుండా అక్కడ యువతరం వాటిని ఫాలో అవుతూ ప్రతి చోట చర్చించుకుంటూనే ఉంటారు. అందుబాటు లో ఉండే ప్రతి అవకాశాన్ని అందిబుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఢిల్లీ లో ఉండే కోచింగ్ సెంటర్లకి తండోపతండాలుగా వస్తుంటారు. ఢిల్లీ లోని ముఖర్జీ నగర్, కమల్ మార్కెట్, విశ్వ మహావిద్యాలయ మెట్రో వంటి ఏరియాలు చూస్తే మినీ బీహార్ మాదిరి గా అనిపిస్తాయి. చాలామంది యువకులు కిక్కిరిసిన రూంస్ లో ఉంటారు.పార్ట్ టైం జాబ్ లు చేస్తూ రోజుకి 16 గంటలు చదువుకుంటూనే ఉంటారు.

పప్పు,ఆలు కూర,అన్నం.అంతే వాళ్ళ ఆహారం. దాల్, భాత్, చోఖా ఉన్నన్ని రోజులూ అదే.అంతకు మించి లగ్జరీ చేసే పరిస్థితి ఉండదు. ఇక్కడికి వచ్చాం కనుక ఏదో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే వెళ్ళాలనే కృతనిశ్చయం వారిది. ఎందుకంటే బీహార్ వెళితే కూరగాయలు అమ్మాలి లేదా వ్యవసాయం చేయాలి. తప్పా వేరే ఉపాధి అవకాశాలు ఉండవు. దక్షిణాది నుంచి సైంటిస్టులు,డాక్టర్లు,ఇంజనీర్లు లాంటి వారు వస్తే, గుజరాత్,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పెద్ద పరిశ్రమలు వస్తుంటాయి.దానికి తగిన పెట్టుబడులు ఉంటాయి. బెంగాల్ వంటి ప్రాంతాలనుంచి వివిధ రంగాలకి సంబందించిన కళాకారులు వస్తుంటారు. కాని బీహార్ లో పరిస్థితులు భిన్నం గా ఉంటాయి.గ్రాడ్యుయేషన్ అయిపోవడం తో ఏదో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ నిమిత్తం బయటకి వచ్చేస్తుంటారు. ఈ రోజుకీ ఎక్కువగా హ్యుమానిటీస్ లో డిగ్రీ చదివేది బీహార్ లోనే !

కాబట్టి యుపిఎస్సి నిర్వహించే సివిల్ సర్విస్ పరీక్షలకీ, ఎసెస్సి నిర్వహించే ఇతర ఉద్యోగాల పరీక్షలకి, రైల్వేస్ కి,బ్యాంక్స్ కి ఒకటేమిటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగం వారి లక్ష్యమే అని చెప్పాలి.మన వాళ్ళకి ప్రత్యేకంగా ఆసక్తి ఉంటే తప్పా సివిల్ సర్విస్ కోచింగ్ కి వెళ్ళరు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే వనరులు మన తెలుగు వారికి ఉన్నాయి. ఈ మధ్య తమిళ వ్యక్తి ఒకాయన మాట్లాడుతూ యూరపు లో ఏ దేశం వెళ్ళినా తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు లేని దేశం కనిపించలేదని చెప్పారు.ఇక ఉత్తర అమెరికా,ఆస్ట్రేలియా గురించి చెప్పేదేముంది.

బీహార్ లో ఓ సామెత ఉంది. ఒక సగటు పంజాబీ వ్యక్తి కొత్త కారు కొనడానికి ఇంకా ఫారిన్ టూర్ వెళ్ళిరావడానికి రెండో ఆలోచన లేకుండా భూమి అమ్ముతాడట కానీ సగటు బీహారీ వ్యక్తి, పిల్లల చదువు కోసం ఎంత కష్టమైన భూమి అమ్ముతాడు అని. ఇంతా చేసి ఇంచుమించు ప్రతి రాష్ట్రం లోనూ ఐఏఎస్ అధికారుల కొరత ఉంది.తెలంగాణా లో 208 మంది అవసరం ఉంటే 194 మంది మాత్రమే ఉన్నారు.అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో 239 మంది కావలసి ఉండగా 194 మంది మాత్రమే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి ప్రతి యేటా 180 మంది ఐఏఎస్ లని, 200 మంది ఐపిఎస్ లని రిక్రూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది.

బీహార్ నుంచి సెలెక్ట్ అయిన ఐఏఎస్ అధికారులు కూడా తమ తర్వాత తరాల వారికి మార్గదర్శనం చేయడం కూడా ఎంతో ఉపయోగపడింది. ఇంకొక విషయం ఏమిటంటే బీహార్ నుంచి వచ్చే ఐఏఎస్ అధికారులు వాళ్ళ రాష్ట్రం లో పనిచేయడానికి పెద్దగా ఇష్టపడరట. కారణం రాజకీయ నాయకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటం ఇంకా ప్రజల నుంచి సహకారం తక్కువగా ఉండటం కారణాలుగా చెబుతారు. నలంద,తక్షశిల లాంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు అవతరించిన బీహార్ రాష్ట్రం అనేక కారణాల వల్ల వెనుకబడినా తన విద్యావైదుష్యాన్ని ప్రస్తుతం మరో రూపం లో ప్రకటిస్తున్నదని చెప్పాలి.


-----  మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003)  

      

No comments:

Post a Comment