కిర్గిజ్ స్థాన్ దేశం లో మన విద్యార్థులు
-------------------------------------------------------
మధ్య ఆసియా లో ఒక చిన్న దేశమైన కిర్గిజ్ స్థాన్ గురించి మనకి తెలిసింది స్వల్పమే. ఇటీవల కాలం లో మన పిల్లలు వైద్య విద్య చదవడానికి అక్కడికి బాగా వెళుతున్నారు. దాంతో కిర్గిజ్ స్థాన్ మనకి సుపరిచితమై పోయింది. అక్కడి భిష్కెక్ నగరం ఇక్కడ మెడిసిన్ చదవడానికి వీల్లేకుండా పోయిన పిల్లలకి ఓ ఆశాకిరణం గా నిలిచింది. మన దేశం లోని మెడికల్ కాలేజ్ లతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు తో వైద్య విద్య లో పట్టా తీసుకోవచ్చు. అంతే కాదు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు ఈ దేశపు చదువు కి గుర్తింపునివ్వడం తో మన విద్యార్థులు అక్కడికి పోటెత్తుతున్నారు. రమారమి 17,000 మంది భారతీయ విద్యార్థులు ఆ దేశం లోని వివిధ పట్టణాల్లో చదువుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
ఎన్నో ఏళ్ళ నుంచి హాయి గా సాగిపోతున్న ఈ ప్రస్థానం లో పంటి కింద రాయి లా ఈ నెల 17,18 తేదీల్లో భిష్కెక్ లో జరిగిన గొడవల తో విద్యార్థుల భవిష్యత్తు చిక్కుల్లో పడింది. మన దేశం నుంచే గాక పాకిస్తాన్ నుంచి కూడా యువత పెద్ద సంఖ్య లో ఇక్కడ చదువుతున్నారు. అలాగే ఈజిప్ట్, అరబ్ దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. కాలేజ్ కేంపస్ లో స్థానిక కిర్గిజ్ విద్యార్థులకి అక్కడే చదువుతూన్న ఈజిప్ట్,అరబ్ విద్యార్థులకి చిన్నగా మొదలైన గొడవ పెద్దదై పోయి దాని రూపం మరో కోణం లోకి మళ్ళింది.
కాలేజ్ లో కిర్గిజ్ విద్యార్థుల్ని అరబ్ విద్యార్థులు బాగా తన్నడం తో , దాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుని కిర్గిజ్ కి చెందిన కాలేజ్ బయటి యువకులు కూడా రంగం లోకి దిగి దొరికిన విదేశీ విద్యార్థుల్ని ముఖ్యంగా పాకిస్తాన్ ,అరబ్ యువత ని టార్గెట్ చేసి తన్నడం జరిగింది. దీంట్లో నలుగురు పాక్ విద్యార్థులు మరణించారు. కొంతమంది భారతీయ విద్యార్థులు కూడా తన్నులు తిన్నారని తెలిసింది.
సమస్య ఇంకా తీవ్ర రూపం దాల్చకముందే అక్కడి ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నది. అటు పాకిస్తాన్ ఇంకా మన ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల్ని మన్నించి విద్యార్థుల్ని వారి దేశాలకి పంపించడానికి చర్యలు తీసుకున్నది. అయినప్పటికి కొన్ని వేల మంది ఒకేసారి ప్రయాణించి రావలసి ఉండడం తో విద్యార్థులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కున్న మాట వాస్తవం. విమానాలు తగినన్ని లేకపోవడం తో టాక్సీల ద్వారా,రైళ్ళ ద్వారా కజకిస్థాన్ లాంటి పక్క దేశాలకి వెళ్ళి,అక్కడనుంచి రావలసి వచ్చింది.
భిష్కెక్ లో జరిగిన గొడవల గురించి విద్యార్థులు తమ ఫేస్ బుక్ ఖాతాల్లో పెట్టడం చేయవద్దని, అలా గనక చేస్తే చర్యలు ఉంటాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. మళ్ళీ కాలెజ్ లు తెరిచేవరకూ ప్రస్తుతానికి ఆన్ లైన్ పద్ధతి లో క్లాస్ లు జరుగుతాయి. అయినా కొంతమంది విద్యార్థులు తమ పేరు చెప్పకుండా అక్కడి బోధనా పద్ధతుల్ని దుయ్యబడుతున్నారు. ప్రాక్టికల్స్ విషయం లో మెరుగ్గా లేవని, బోధించేవారికి ఇంగ్లీష్ రాదని,మెడికల్ సబ్జక్టుల్లోనూ అలాగే నాన్ మెడికల్ సబ్జెక్ట్స్ లోనూ 60 శాతం మార్కులతో తప్పనిసరిగా పాసవ్వాలని నిబంధన పెట్టడం బాగాలేదని వారు వాపోతున్నారు.
తియాన్ షాన్, పామీర్ పర్వత శ్రేణుల నడుమ శాంతియుతంగా ఉండే దేశంగా పేరున్న కిర్గిజ్ స్థాన్, రష్యా లో ఓ భాగం గా ఉన్నప్పటినుంచి మంచి నాణ్యమైన, చవకైన విద్య కి మారు పేరు గా ఉండేది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహోన్నత రచయిత చింగిజ్ ఐత్మతోవ్ పేరు వినని సాహిత్యాభిమానులు ఉండరు. అక్కడి ప్రజలు ఆయన్ని గొప్ప జాతీయ సంపద గా భావిస్తారు. రమారమి 69 లక్షల జనాభా తో అలరారే ఈ బుల్లిదేశం లో మళ్ళీ పరిస్థితులన్నీ చక్కబడాలని , మన దేశ విద్యార్థుల చదువు సక్రమంగా సాగిపోవాలని ఆశిద్దాం.
----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)
(Printed in Telugu Prabha Daily, 29-5-2024)
No comments:
Post a Comment