ఎవరినైనా కుక్క కరించిందన్నప్పుడు లేదా వాటి వల్ల పిల్లలకి హాని కలిగిందన్నప్పుడు మనం కాసేపు సీరియస్ గా వీధికుక్కల్ని తిడతాం. ఆ తర్వాత మరిచిపోయి మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కాని వాటి గురించి నిర్మాణాత్మకంగా మన సమాజం ఆలోచన చేయదు.
ఎవరు ఏమి అనుకున్నా వీధికుక్కలు పల్లె నుంచి మహానగరం దాకా మన జీవితం లో ఓ భాగం.ఎందుకంటే ప్రపంచం లోనే అతి ఎక్కువ వీధికుక్కలు ఉన్న దేశం మనదే మరి. రమారమి 70 మిలియన్ల జనాభా వాటిది.
అలాగే రేబిస్ వ్యాధి తో ఎక్కువగా మరణించేది మన దేశం లోనే అనేది కూడా తెలిసిన విషయమే!మనకి కనిపించే ప్రతి కుక్క హానికరమైనదనే విషయాన్ని కూడా మన మనసులోనుంచి తొలగించుకోవాలి.
వీధికుక్కల్ని బాగా పరిశీలించినప్పుడు తేలిన అంశం ఏమిటంటే వాటి వైపు తిరిగి బెదిరించినపుడు గాని, కవ్వించినట్టుగా వాటి వైపు ఏదైనా విసిరినా అవి వెంటనే ఆత్మరక్షణ కోసం వెంటబడతాయి.అలాంటి పని సాధ్యమైనంతవరకు చేయకూడదు.
ఒక్కోసారి మనం ఏమి చేయకపోయినా అవి మొరుగుతుంటాయి.అంతమాత్రాన అవి కరవడానికి అని కాదు, తన బౌండరీ లోకి ఎవరైనా కొత్తవాళ్ళు వచ్చినప్పుడు అవి అలా చేస్తుంటాయి.సరిగ్గా అలాంటి సమయం లో మనం వాటిని చేతి తో కొట్టడానికి గాని , పరిగెత్తడం గాని చేస్తుంటాం.
అవి అలా చేస్తే మరింత రెచ్చిపోతాయి. అలాంటి సమయం లో మనం వాటి కళ్ళ వైపు చూడకుండా,పరిగెత్తకుండా ,మనం నడుస్తున్న విధంగానే తాపీగా నడుచుకుంటూపోవాలి. అంతేకాదు అలా నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా దగ్గుతూ ముందుకు మెల్లిగా సాగిపొండి,అవి కాసేపు అరుస్తూ వెనక్కి వెళ్ళిపోతాయి.
మన దేశం లో ప్రతి ఒక్కరూ వీధికుక్క సైకాలజీ ఎంతో కొంత తెలుసుకుని తీరవలసిందే! ఎందుకంటే మీరు ఢిల్లీ వెళ్ళినా గల్లీ వెళ్ళినా అవి ప్రతిచోటా ఉంటాయి. ఐపిసి సెక్షన్ 428 మరియు 429 ప్రకారం వాటిని చంపడం నేరం.అలా గనక చేస్తే రెండేళ్ళు జైలు కి పోవలసి ఉంటుంది.
అంతేకాదు అలాంటి కుక్కలకి ఎవరైనా ఆహారం పెడుతున్నా వాళ్ళని ఆటంకపరిస్తే అది కూడా నేరమే!సుప్రీం కోర్ట్ వీధికుక్కల్ని ,వాటికి నోరు లేదన్న కారణంగా నిర్దయ గా ప్రవర్తించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
వీధికుక్కల జీవితం మహా అయితే మూడన్నర ఏళ్ళనునుంచి నాలుగేళ్ళ వరకు ఉంటుంది. ఎందుకంటే వాటికి సరైన ఆహారం లేకపోవడం,వ్యాధులు రావడం వల్ల అంతకి మించి జీవించవు.
మరి వీధికుక్కల్ని పూర్తిగా నియంత్రణ చేసిన దేశం లేదా? ఉంది, అదే నెదర్లాండ్ దేశం. అంటే అక్కడి వీధి లో తిరిగే కుక్కలన్నిటినీ చంపి పారేశారని కాదు.
ఎవరైతే ఖరీదైన కుక్కల్ని షాపుల్లో కొనుక్కొని పెంచుకుంటారో వాటిమీద అక్కడి ప్రభుత్వం విపరీతంగా టాక్స్ లు వేసింది. వీధికుక్కల పిల్లల్ని పెంచుకునే వాళ్ళకి రాయితీలు ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఒక్క కుక్క కూడా తిండీతిప్పలు లేకుండా వీధిలో కనిపించడం లేదు.
అలా వీధికుక్కల సమస్యని సంపూర్ణంగా పరిష్కరించిన దేశంగా నెదర్లాండ్స్ జేజేలు అందుకుంది. నిజానికి మన దేశవాళీ కుక్కలు కూడా వేటికంటే తక్కువ కాదు. కాకపోతే సరైన పోషణ,ఆహారం లేకపోవడం తో అవి పాపం ఈసురోమని అలా బతుకునీడుస్తూంటాయి.
మన దేశం లో ఉన్న ఆలనాపాలనా లేని ఆ మూగజీవులకి మంచి రోజులు రావాలని ఆశిద్దాం. కుక్కల్ని బాగా ప్రేమించే దేశాల్లో అమెరికా,జపాన్,చిలీ,జర్మనీ,కెనడా ముందు వరస లో ఉన్నాయిట.
ఇక మాల్దీవ్స్ లో అయితే ఒక్క కుక్క కూడా లేదు. అసలు ఎక్కడో అడవిలో ఉండే కుక్కల్ని మనిషి తన వేటకి,రక్షణకి,ఇతర అవసరాలకి పనికి వస్తుందనే కొన్ని వేల ఏళ్ళ కిందట మాలిమి చేసుకుని తన ఆవాసం లోకి తెచ్చుకున్నాడు.
అవి ఇలా తామరతంపరగా పెరిగిపొయాయి. విదేశీ బ్రీడ్ లు రావడం తో దేశవాళీ కుక్క వీధి కి తరమబడింది. కనుక వాటిని సానుభూతి తో చూసి సమస్య పరిష్కరించవలసిన బాధ్యత మేధోజీవి గా మనిషి మీదనే ఉన్నది.
ఎప్పుడైనా మీకు వీలైతే ఒక ముద్ద పెట్టండి,మళ్ళీ మీరెప్పుడైనా కనబడినప్పుడు ఎంత జాలిగా,కృతజ్ఞతగా మీ వైపు చూస్తుందో ! మనిషి కళ్ళ తర్వాత అన్ని భావాల్ని ఎంతో గొప్పగా చూపించగలిగేవి కుక్క యొక్క కళ్ళే అని అమెరికన్ రచయిత జాక్ లండన్ అందుకనే కాబోలు అన్నాడు.
----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)
No comments:
Post a Comment