ఈమధ్య మన భారతీయులు ఇంకా చెప్పాలంటే తెలుగు వాళ్ళు పోర్చుగల్ దేశం గురించి బాగా చర్చించుకుంటున్నారు. కేవలం అంతటితోనే సరి పెట్టడం లేదు. వ్యవసాయ రంగం లోనూ ఇంకా రియల్ ఎస్టేట్ రంగం లోనూ మంచి అవకాశాలు ఉన్నాయని అక్కడికి వెళుతున్నారు.
భూమి కొని అక్కడ రకరకాల పంటలు పండించి లాభాలు గడించాలని కొంతమంది వెళుతుంటే ,అక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయడానికి ఇంకా వివిధ అవకాశాలు అంటే ఇతర బిజినెస్ లు,కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేయడానికి కొంతమంది వెళుతున్నారు.
ఇంకొక విశేషం ఏమిటంటే ఆ దేశం లోని ప్రజలు ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లోనూ,పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్న తమ ఇళ్ళని ఖాళీ చేసి ఇతర దేశాలకి వలస పోతున్నారు. దాంతో ఆ ఇళ్ళన్ని బోసిపోయి,అద్దె కి వచ్చే వాళ్ళు లేక,కొనే వాళ్ళు లేక ఈసురోమని ఉంటున్నాయి.
దాదాపు గా ఏడు లక్షల ఇళ్ళు ఇంకా ఇతర నిర్మాణాలు ప్రస్తుతం ఖాళీగా ఉంటే,దాంట్లో లక్షన్నర వరకు ఆ దేశ రాజధాని లిస్బన్ దరిదాపుల్లోనే ఉన్నాయి.అక్కడి ఆర్దిక వ్యవస్థ లో,రియల్ ఎస్టేట్ రంగం లో,ప్రభుత్వ పాలసీ ల్లో వచ్చిన మార్పుల వల్ల గత 12 ఏళ్ళ లో 80 శాతం వరకు నిర్మాణ వ్యయం పెరిగింది. మిగతా యూరపు లోని దేశాలతో పోల్చితే పోర్చుగల్ లో జీవన వ్యయం తక్కువగానే ఉంటుంది.
అమెరికా లోని డబ్బులున్న కుటుంబాలు ఇక్కడకి వలస వస్తున్నాయి.కారణం ఇక్కడి ప్రశాంతమైన కొండల నడుమ జీవితం గడపడానికి. ఇంకా సేద్యం కొరకు భూమి కొండానికి కూడా..! భూముల రేట్లు కూడా చవక. పోర్చుగల్ జనాభా కోటి ముప్ఫైలక్షల మంది పై చిలుకు ఉన్నా ప్రస్తుతం వారిలో చాలామంది ఇతర యూరపు దేశాల్లోకి,అమెరికా కి వలస పోతుండడం తో క్రమేపి తగ్గుతోంది.
ప్రపంచం లో ఇంటి కొరత చాలా తక్కువగా ఉన్న దేశం జపాన్. ప్రతి 34000 మందికి గాను కేవలం ఒక్కరికి మాత్రమే ఇల్లులేని లోటు ఉంది. విదేశీయులు పోర్చుగల్ రావడానికి గాను మరో కారణం ప్రపంచం లోని అతి సురక్షితమైన దేశాల్లో మూడవ స్థానం లో ఉన్నది. దానివల్లనే అక్కడి భూమి కొనడానికి ,స్థిరపడటానికి మన వాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు. రోజువారీ వ్యయం కూడా తక్కువ.ఒక వ్యక్తి నెలకి 1200 యూరోలతో లిస్బన్ లోనూ, పోర్టో లోనూ హాయిగా జీవించవచ్చు.
3000 యూరోలు ఉంటే విలాసవంతంగా ఉండవచ్చు. భారతీయులు 17000 మంది దాకా పోర్చుగల్ లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే నివసిస్తున్నారు. అయితే అక్కడ భూమి లేదా ఇల్లు కొన్న వెంటనే పౌరసత్వం ఇవ్వరు.కనీసం అయిదేళ్ళు గడిచిన తర్వాత పౌరసత్వం కావాలంటే అప్లయ్ చేసుకోవచ్చు. దాంతోపాటే యూరోపియన్ యూనియన్ కి సంబందించిన పాస్ పోర్ట్ కూడా వస్తుంది.
టూరిజం,ఆరోగ్యం, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వాటిలో మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నారు. పోర్చుగల్ దేశం యొక్క చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే చాలా ఘనమైనది. ఆసియా ,ఆఫ్రికా,ఉత్తర అమెరికా ,దక్షిణ అమెరికా ఖండాల్లోని అనేక దేశాల్ని పోర్చుగల్ ఓడించి వలస దేశాలుగా మార్చుకుంది.584 ఏళ్ళపాటు తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకుని క్రమేపి ఒక్కో వలస ని కోల్పోయింది. 1415 నుంచి 1999 వరకు వైభవం అలా సాగింది.
అంతదాకా దేనికి ? మన దేశం లో మొట్టమొదటిగా వ్యాపార కేంద్రాలు తెరిచింది పోర్చుగల్ దేశమే. 1498 లో ఆ దేశానికి చెందిన వాస్కోడగామా కాలికట్ లో అడుగుపెట్టి,క్రమేపి గోవా,డయ్యూ,డామన్,పాంజిం ఇలా అనేక ప్రాంతాల్లో వాళ్ళ పాలన సాగించారు.విజయనగర పాలకుల సాయం తో బీజాపూర్ సుల్తాన్ ఆధీనం లోని గోవా ని జయించి దాన్ని తమ రాజధాని గా చేసుకున్నారు. దానికి ప్రతిగా విజయనగర రాజులకి మేలు అశ్వాల్ని , ఆయుధాల్ని సరఫరా చేసేవారు.
ప్రస్తుతం ప్రపంచం లో పోర్చుగీస్ భాషని 250 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. కారణం వారి ఒకప్పటి వలస దేశాల్లో ఆ భాషకి కలిగిన ప్రాచుర్యం అని చెప్పాలి.అలా జైత్రయాత్ర చేసి ఓ వెలుగు వెలిగిన పోర్చుగల్ దేశం లోకి ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి వ్యవసాయ భూములు,ఇళ్ళు కొని ఓ వెలుగు వెలగడానికి ప్రయత్నించడం కాలం చేసిన గారడీ గా అనిపించడం లేదూ!
----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)
No comments:
Post a Comment