Wednesday, October 31, 2018

నా శ్రీలంక ప్రయాణం (సిగిరియా)



అనురాధపుర నుంచి కొలొంబో వచ్చేదారి లో సిగిరియా అనే ప్రదేశం ఉన్నది.రమారమి 77 కి.మీ. ఉంటుంది.ఈ ప్రదేశాన్ని చక్కని పర్యాటక ప్రదేశం గా మలిచారు.ఊరు అంతా అరణ్యం మధ్యన ఉన్నట్లే ఉంది గాని రోడ్డు సౌకర్యం అదీ బాగానే ఉంది.కొన్ని షాప్ లు,హోటల్ లు అవీ ఉన్నాయి.ఇక్కడ ఉన్న చిన్న హోటల్ లో టీ తాగాను.ఆ హోటల్ కి ఉన్న తెల్లని గోడల మాదిరి గా ఉన్న అట్టల మీద అక్కడకి వచ్చి తిన్నటువంటి కష్టమర్లు తమ అభిప్రాయాల్ని రాశారు.హిందీ తో పాటు ఇంగ్లీష్,ఫ్రెంచ్,డచ్ ఇంకా స్వీడిష్,జపానీస్ లాంటి భాషల్లో రాసి ఉన్నాయి.రకరకాల చేతి రాతలు.ఈ హోటల్ వాళ్ళకి మంచి టేస్ట్ ఉంది అనిపించింది.



ఈ దగ్గర లోనే లయన్ రాక్ అనేది ఉన్నది.చాలా ఎత్తుగా ఉన్న ఒక పెద్ద వెడల్పాటి రాతి మీద ఒక కోట నిర్మించబడి ఉంది.దీనికి చుట్టూరా అనేక మైళ్ళ పరిధి లో నీటి తో నిండిన ప్రాకారాలు ,కందకాలు ఉన్నాయి.రాతి ని బాగా ఉపయోగించడం వల్ల కొన్ని వందల ఏళ్ళు అయినా ఇవన్నీ అలా ఉన్నాయి..పోయినవి పోగా..!పైన రాతి మీద ఉన్న కోటని చూడాలంటే దాదాపుగా 1200 పైన మెట్లు ఎక్కాలి.పిక్కబలం ఉంటే తప్పా అధిరోహించుట కష్టమే.ఈ కోటని 477 -495CE  కాలం లో కశ్యపుడనే రాజు కట్టించాడని చెప్పారు.ఈ కశ్యపుడు రాజ్యాన్ని ఆక్రమించుట కోసం సవతి సోదరుని తో యుద్ధం చేసి దక్షిణ భారత దేశానికి పొయేలా చేశాడు.తండ్రిని చెరసాల లో బంధించాడు.దుర్భేద్యమైన కోట ని నిర్మించాలని సిగిరియా కోట ని కట్టాడు.పైన ఆ పర్వతం పైన స్నానఘట్టాలు,విశాలమైన గదులు కనబడతాయి.వాటితో బాటు గుహలు,రహస్య మార్గాలు ఉన్నాయి.ఒక పెద్ద సిమ్హం యొక్క పాదాలు శిల్పంగా చెక్కారు.



తరవాత కాలం లో 14 వ శతాబ్దం లో ఈ నిర్మాణాన్ని బౌద్ధ ఆరామాలు గా మార్చారు.శ్రీలంక లో బుద్ధ వైభవం బాగ కనబడుతుంది.ఎక్కడ చూసిన ప్రాచీన బౌద్ధ శిల్పాల ,నిర్మాణాల వైనం కళ్ళకి కట్టినట్లు కనబడుతుంది. ఇంత చిన్న భూభాగం లోనే పాతిక వేల పై చిలుకు అవశేషాలు తవ్వినప్పుడల్లా బయటపడ్డాయి.ఇంకా పడుతూనే ఉన్నాయి.ఈ చుట్టుపక్కల ఉన్న జనాలకి కూడా ఎంతో కొంత చరిత్ర తెలుసు.ఈ చిన్న హోటల్ లో ఉన్నప్పుడు ఒక స్థానిక వ్యక్తిని అడగ్గా తనకి తెలిసిన చాలా విశేషాలు చెప్పాడు.



ఈ కశ్యపుడు అనే రాజు కి రావణుడి వంశానికి చెందిన వారిగా ఇక్కడ వారు చెపుతారు.ఇక్కడ ఊర్ల లో కనబడిన షాప్ ల బోర్డు ల మీద ఉపాలి,సంఘమిత్ర,అశోక,అసుర,చానుక ఇలాంటి పేర్లు కనబడ్డాయి.అపభ్రంశం కాబడిన సంస్కృత శబ్దాలు వీరి భాష లో ఎక్కువ అనిపించింది.శ్రీ అని మాట ని సిరి అని విజయ అనే మాటని విజెయ అని ఇలా కొన్ని కొన్ని.సింఘళ భాష మాటాడుతుంటే వినే వారికి భారతీయ భాష లాగానే అనిపిస్తుంది.మనుషుల్లో కూడా బాగా నల్లని వారు ఉన్నారు.చామన చాయ ఉన్నారు.మంచి చాయ ఉన్నవారు ఉన్నారు.ప్రతి చోటా సింఘళ భాష కింద తప్పక తమిళం లో రాయబడి ఉన్నట్లు కనిపించింది.


ఇక్కడకి వలస వచ్చిన తమిళుల్లో రెండు రకాలు ఉన్నారు.ఎప్పుడో చోళ రాజుల సమయం లో వలస వచ్చిన వారు సింఘలీస్ తమిళులు కాగా బ్రిటీష్ వారి హయాం లో ఇక్కడి తేయాకు తోటల్లో పనిచేసేందుకు వచ్చి స్థిరపడిన వారు ఇంకో రకం తమిళులు.రెండవ కోవ కి చెందిన వారినుంచే ఈలం పోరాటం చెలరేగింది.74 శాతం కి పైగా స్థానిక సింఘళీయులు ఉన్నారు.డచ్,బ్రిటీష్ వారి పాలన వల్ల క్రైస్తవ జన ప్రభావం ఆరు శాతం దాకా ఉన్నది.కుల ప్రభావం ఇక్కడి థేర వాద  బౌద్ధ మతం లో కూడా ఉన్నది.అయితే ఇండియా లో ఉన్నంత స్ట్రిక్ట్ గా ఉండదు.

స్త్రీల వస్త్ర ధారణ లో చెప్పాలంటే చీర కట్టు గమ్మత్తు గా ఉన్నది.పొట్ట భాగం కనబడేట్టుగా ఉన్నది.చంద్రికా కుమారతుంగ గుర్తు కి వస్తే చాలు.అర్ధమైపోతుంది.అదే సమయం లో ఫ్రాక్ లు,షర్ట్లు వేసుకున్న స్త్రీలు కూడా చాలా ఎక్కువగానే బయట ఏ  ఊరి లోనైనా కనిపిస్తూనే ఉన్నారు.మళ్ళీ గొడుగు ఒకటి ..వాన ఉన్నా లేకపోయినా..!రూరల్ పావర్టీ బాగా తక్కువ 5.3 శాతం మాత్రమే..!పరిసరాల శుభ్రత బాగా ఉన్నది.ఇంటి నిర్మాణం ఎక్కడ చూసిన కేరళ లో మాదిరి గా వాలుగా ఉండే ఇళ్ళు.చిన్నగా ఉన్నా ఒక వెరైటీ గా ఉన్నాయి.

అసలు వీరికి ఇండియా పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటి అని కొందరు స్థానిక వ్యక్తుల్ని కదిపితే మరీ అంత సానుకూలత లేదు.అలాగని అసహ్యమూ లేదు.అయితే ఇండియా అనేది ఒక అగ్ర దేశం లాంటిది అనే భావం మాత్రం వారి లో ఉన్నట్లు గమనించాను.పైకి చెప్పకపోయినా..!ఇప్పుడు చైనా అనేక ప్రాజెక్టుల తో సాయమందిస్తూ ఈ ద్వీప రాజ్యాన్ని తమ ప్రభావం లోకి తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నది.

No comments:

Post a Comment